ఇంజినీరింగ్‌లో.. మీ ఆప్టిట్యూడ్‌ ఎంత?

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు నిర్వహించే ఉన్నతస్థాయి పరీక్షల్లో యూపీఎస్‌సీ నిర్వహించే ఈఎస్‌ఈ (ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌) ఒకటి. 2017 సంవత్సరానికిగానూ దీని విధానం పూర్తిగా మారింది. ఉత్తమ ర్యాంకు సాధించాలంటే మారిన విధానాన్ని ఆకళింపు చేసుకోవడం, తదనుగుణంగా సన్నద్ధమవడం తప్పనిసరి!
దేశంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు నిర్వహించే ఉన్నతస్థాయి పరీక్షల్లో గేట్‌, ఈఎస్‌ఈ ముఖ్యమైనవి. గత ఏడాది వరకూ ఈ రెండు పరీక్షల మధ్య సుమారు 5 నెలల కాలవ్యవధి ఉండేది. దీని వల్లరెండు పరీక్షలకూ సన్నద్ధమవడం సులభంగా ఉండేది. కానీ 2017 నుంచి ఐఈఎస్‌ పరీక్షవిధానం మారింది.
ఈఎస్‌ఈని ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, మౌఖికపరీక్ష అను 3 విభాగాలుగా చేశారు. ప్రిలిమ్స్‌, గేట్‌ సుమారు ఒకే నెల (జనవరి 8 నుంచి ఫిబ్రవరి 7)లో జరగనున్నాయి. కొంతమంది విద్యార్థులకు ఏ ఒక్కటైనా సాధించలేమా అన్న ఆశ ఉంటుంది. మరికొంతమందికి రెండింటినీ సాధించాలనుంటుంది. రెండు పరీక్షలనూ సాధించాలంటే పటిష్ఠమైన ప్రణాళిక చాలా అవసరం. నిర్దిష్టమైన ప్రణాళికతో శ్రమిస్తే ఈ రెండు లక్ష్యాల సాధన అసాధ్యమేమీ కాదు.
జాతీయస్థాయిలో వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, అసిస్టెంట్‌ ఇంజినీరు వంటి ‘గ్రూప్‌-ఎ’ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ ఐఈఎస్‌ను నిర్వహిస్తుంది. సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ విభాగాల్లో ఈ పరీక్ష ఉంటుంది. సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కులు మెయిన్స్‌ రాయడానికి మాత్రమే అర్హత సాధించిపెడతాయి. కానీ ఐఈఎస్‌ ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కులు మెయిన్స్‌ రాయడానికి అర్హత సాధించడంతోపాటు తుది ఎంపికలో కూడా పరిగణనలోకి వస్తాయి.
స్టేజ్‌-1 (ప్రిలిమినరీ) పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. కాలిక్యులేటర్‌లను అనుమతించరు. రుణాత్మక మార్కులు ఉంటాయి.

జీఎస్‌, ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌:
పేపర్‌-1లో అర్హత మార్కులు సాధించాలి. టెక్నికల్‌ సబ్జెక్టుతోపాటు ఈ జనరల్‌స్టడీస్‌ కూడా చాలా కీలకం కానుంది. కాబట్టి ఇప్పటినుంచే దీనిపై శ్రద్ధ వహించడం మంచిది.
జనరల్‌ స్టడీస్‌ అంటే చరిత్ర, భూగోళశాస్త్రం లాంటివి కాకుండా ఆ స్థానంలో ఇంజినీరింగ్‌కు సంబంధించిన అంశాలను చేర్చారు. పేపర్‌-1లోని 200 మార్కులు తుది ర్యాంకులో కీలక పాత్ర పోషిస్తాయి.
మొదటి పేపర్లో ...
వర్తమానాంశాలు
ఇంజినీరింగ్‌ వృత్తిలో ఉన్నవారికి సాంఘిక, సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ వర్తమానాంశాలపై కొంత అవగాహన తప్పనిసరి. వీటికి సంబంధించిన సమాచారం కోసం వార్తాపత్రికలు ప్రతిరోజూ చదవాలి. సంబంధిత మూలాలపై అవగాహన పెంచుకోవాలి.
* భారత్‌లో తయారీ (మేకిన్‌ ఇండియా), ఇటీవల రాజ్యసభలో ఆమోదం పొందిన వస్తువులు, జీఎస్‌టీ బిల్లు, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం మొదలైన వార్తాంశాల పట్ల తగిన అవగాహన, దృక్పథం ఉండాలి.
2 ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌
ఒక సమస్యకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి కేటాయించిన సమయంలో సమర్థంగా సమాధానాన్ని రాబట్టడంలో ఇంజినీరు నైపుణ్యాలను పరీక్షిస్తారు.
* అనలిటికల్‌ ఎబిలిటీ: దీనిలో విద్యార్థి ఆలోచనా సామర్థ్యం, సమాచార సేకరణ, సంక్లిష్ట సమస్యా పరిష్కారం, సరైన నిర్ణయం తీసుకోవడాన్ని పరీక్షిస్తారు. ఈ విభాగం నుంచి ఎక్కువ మార్కులు సాధించాలంటే ఇంటర్మీడియట్‌ జామెట్రీ, త్రికోణమితిలపై పట్టు సాధించాలి. త్రికోణమితిలో ముఖ్యంగా ఎత్తులు, దూరాలపై, జామెట్రీలో వృత్తాలు, త్రిభుజాలపై పట్టు సాధించాలి.
* లాజికల్‌ రీజనింగ్‌: ఈ విభాగం నుంచి సిటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌, నంబర్‌ సిరీస్‌, సరాసరి, రక్తసంబంధాలు, వెన్‌ డయాగ్రమ్‌లు, గడియారాలు, క్యాలెండర్‌, క్యూబ్స్‌ మొదలైనవి సాధన చేయాలి. స్టేట్‌మెంట్స్‌, ఆర్గ్యుమెంట్స్‌, కన్‌క్లూజన్స్‌ చాలా ముఖ్యమైనవి.
3 ఇంజినీరింగ్‌ మేథమేటిక్స్‌ అండ్‌ న్యూమరికల్‌ అనాలిసిస్‌
శుద్ధ, ఇంజినీరింగ్‌ గణితాలకు మధ్య తేడా ఉంది. దీనిని గమనించి సన్నద్ధమవాలి. గేట్‌లో ఉండే గణితానికీ దీనికీ పెద్ద తేడా ఉండదు. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నపత్రాల్లో కాల్‌క్యులేటర్‌ అనుమతించరు. కాబట్టి తదనుగుణంగా సాధన చేయాలి.
మేథమేటిక్స్‌ అన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది. ఒక స్థల వైశాల్యాన్ని దానిలో ఒక చిన్న భాగాన్ని తీసుకుని సమకలనం చేసీ, దూరంగా ఉన్న టవర్‌ ఎత్తును త్రికోణమితి ఉపయోగించీ కనుక్కోవచ్చు.
4 జనరల్‌ ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ డిజైన్‌, డ్రాయింగ్‌, ఇంపార్టెన్స్‌ ఆఫ్‌ సేఫ్టీ
ఒక వాస్తవ సమస్యకు సృజనాత్మక సమాధానం ఇవ్వడమే ఇంజినీరింగ్‌. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కమ్యూనికేషన్‌కు సంబంధించిన ఏ ప్రాజెక్టుకైనా డిజైన్‌ దశ నుంచి అమలుకు సంబంధించి కొన్ని ప్రాథమిక, ప్రధాన దశలుంటాయి. అన్నింటికంటే మించి ప్రభావిత జనాభా భద్రత దృష్టిలో ఉంచుకోవాలి.
5 ప్రొడక్షన్‌, కన్‌స్ట్రక్షన్‌, మెయింటెనెన్స్‌, సర్వీసెస్‌కు సంబంధించిన స్టాండర్డ్స్‌ అండ్‌ క్వాలిటీ ప్రాక్టీసెస్‌
నాణ్యత ప్రమాణాలు పాటించడానికి కొన్ని జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలు ఉంటాయి. వాటికి సంబంధించినదే ఈ సబ్జెక్టు. దీనిలో ఐఎస్‌ఓ 9000, ఐఎస్‌ఓ 9001 వంటి ప్రమాణాలు తెలుసుకోవాలి.
6 బేసిక్స్‌ ఆఫ్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌
ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులను పర్యావరణ ప్రభావ అంచనాల ఆధారంగా చేస్తున్నారు. ఇంజినీరింగ్‌లో ఉన్న ప్రతి వ్యక్తీ పర్యావరణం, జీవావరణాలను దృష్టిలో ఉంచుకుని, ప్రకృతికి హాని కలుగకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఈ సబ్జెక్టు ముఖ్యోద్దేశం.
7 బేసిక్స్‌ ఆఫ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌
ప్రతి ప్రాజెక్టు అమలులో ప్లానింగ్‌, డిజైన్‌, షెడ్యూలింగ్‌, కన్‌స్ట్రక్షన్‌/ ప్రొడక్షన్‌, వనరుల కేటాయింపులకు సంబంధించి అనేక సిద్ధాంతాలున్నాయి. వాటి గురించి ఇది వివరిస్తుంది.
* ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌: ప్రాజెక్టు అనేది నిరంతరంగా చేసే ప్రక్రియ కాదు. ఉదాహరణకు మెట్రోరైలు ప్రాజెక్టు. దీనికంటూ ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయిస్తారు. దీన్ని నిర్వహించడానికి ఏర్పడిన జట్టు, పనైపోయిన వెంటనే విచ్ఛిన్నమవుతుంది. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ నేర్చుకోవడం వల్ల ఒక ప్రాజెక్టుని సమర్థంగా నిర్వహించవచ్చు. దీని ప్రాముఖ్యం తెలియడం వల్లే దీన్ని ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ సిలబస్‌లో చేర్చారు.
8 బేసిక్స్‌ ఆఫ్‌ మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌
నిజజీవితంలో అనేక మెటీరియళ్లను వాడుతుంటాం. వాటికి సంబంధించిన అంశాలపై అవగాహన తప్పనిసరి. ఈ రోజుల్లో ప్రతి ఇంజినీరింగ్‌ విభాగంలో పలు రకాల మెటీరియళ్లు వాడకంలో ఉన్నాయి. కాబట్టి ఒక్కో ఇంజినీరింగ్‌ విద్యార్థి తన విభాగంలో ఏవేవి వాడకంలో ఉన్నాయో, వాటి ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాలి. పలు విభాగాలకు సంబంధించిన మెటీరియళ్లను తన విభాగంలో ఏయే విధాలుగా వాడుతున్నారో కూడా తెలుసుకోవాలి. వీటన్నింటి ప్రాముఖ్యం, ఉపయోగాలను మెటీరియల్‌ సైన్స్‌ అనే సబ్జెక్టులో క్లుప్తంగా పొందుపరిచారు.
మెటీరియల్‌ సైన్స్‌లో మంచి మార్కులు సాధించాలంటే ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్లు ఎలక్ట్రికల్‌ మెటీరియల్‌తోపాటు స్టీల్‌ మిశ్రమలోహం, నానో మెటీరియల్స్‌, సిరామిక్స్‌, కాంపోజిట్స్‌పై అవగాహన పెంచుకోవాలి.
మెకానికల్‌ ఇంజినీర్లు మంచి మార్కులు సాధించాలంటే మెకానికల్‌ మెటీరియళ్లతోపాటు కండక్టింగ్‌, మేగ్నటిక్‌, కాంపోజిట్స్‌, నానో మెటీరియళ్లపైనా అవగాహన పెంచుకోవాలి. సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఉన్నవారు అన్నింటిపైనా అవగాహన సాధించాలి.
9 ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌ (ఐసీటీ) ఆధారిత టూల్స్‌, ఇంజినీరింగ్‌లో అప్లికేషన్స్‌
ఈ- గవర్నెన్స్‌, నెట్‌వర్కింగ్‌, సాంకేతిక ఆధారిత విద్య, డిజిటల్‌ ఇండియా, ఆకర్షణీయ నగరాలు వంటి విషయాలు ఉంటాయి. ఇంజినీరింగ్‌ విద్యార్థులు తమ విభాగంలోనే కాకుండా ఇతర విభాగాల్లోనూ అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. ఇందులో ముఖ్యమైనవి ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ. టెక్నాలజీ అభివృద్ధితోపాటు దానికి సంబంధించి భద్రత అత్యంత ప్రధానం. ఉదా: సైబర్‌ సెక్యూరిటీ, ఫైర్‌వాల్‌, యాంటీవైరస్‌ మొదలైనవి.
ఇందులో మంచి మార్కులు సాధించాలంటే నెట్‌వర్క్స్‌, నెట్‌వర్క్‌ టోపాలాజిస్‌, ఓఎస్‌ఐ లేయర్లు, ఇంటర్నెట్‌, కమ్యూనికేషన్‌ చానల్‌ (వైర్‌, వైర్‌లెస్‌) నెట్‌వర్కింగ్‌ టూల్స్‌, సెక్యూరిటీ, స్టోరేజ్‌ డివైజెస్‌ (సీడీ, డీవీడీ, హార్డ్‌డిస్క్‌) సోషల్‌ నెట్‌వర్క్స్‌ (ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్‌ టాక్‌), సాఫ్ట్‌వేర్లలో తగిన అవగాహన ఉండాలి.
10 ఎథిక్స్‌- వాల్యూస్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెషన్‌
ఒక ఇంజినీరు తన వృత్తిలో కొన్ని విలువలు, నైతికత పాటించవలసి ఉంటుంది. మంచి చెడుల గురించి మాట్లాడేది నీతి (మొరాలిటీ). దీని గురించి చదివే విషయమే ఎథిక్స్‌. ప్రొఫెషన్‌, ప్రొఫెషనల్స్‌కు సంబంధించిన అనేక విషయాలు ఇందులో ఉంటాయి. ఇంజినీరు తీసుకునే ఒక నిర్ణయం తనతోపాటు సంస్థ, సమాజంపై అనేక విధాల ప్రభావం చూపుతుంది.
ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌కు ఎంపికైన అభ్యర్థులు తమ తమ విభాగాల్లో పనిచేసేటపుడు కొన్ని సమస్యలు వస్తాయి. వాటిపై హేతుబద్ధంగా, నైతికంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారో తెలియజేసేదే ఈ సబ్జెక్టు. దీనికి సంబంధించి కూడా కొన్ని సిద్ధాంతాలు, జాతీయ, అంతర్జాతీయ కోడ్స్‌ ఉన్నాయి. జనరల్‌ స్టడీస్‌లో నిర్దేశించిన మొదటి అంశం తప్ప మిగతావి చాలావరకు అభ్యర్థులు తమ 4 సంవత్సరాల బీఈ/ బీటెక్‌లో చదువుతారు. మొదటిదానికి వర్తమాన అంశాలపై తగిన అవగాహన ఉంటే సరిపోతుంది. గతంతో పోలిస్తే ఈ పేపర్‌ చాలా తేలిక. ఉద్యోగంలో చేరిన తరువాత విధి నిర్వహణలో ఈ అంశాలపై అవగాహన ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఉద్యోగ సామర్థ్యం పెరగడంతోపాటు సమాజానికీ, దేశానికీ ఎంతో మేలు.
జనరల్‌ స్టడీస్‌, ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌లో నిర్దేశించిన పది అంశాల నుంచి కనీసం 5% (10 మార్కులు), గరిష్ఠంగా 15% (30 మార్కులు) వరకూ ప్రశ్నలు వస్తాయి.ఈఎస్‌ఈకి సిద్ధమవుతున్న ప్రతీ విద్యార్థీ రకరకాల టెక్నాలజీల్లో వివిధ విభాగాల సమాచారాన్ని తెలుసుకొని ఉండడం చాలా ముఖ్యం.

- వై.వి. గోపాల కృష్ణమూర్తి, సీఎండీ, ACEPosted on 15-08-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning