దేశాల‌వారీ అత్యుత్తమ మేనేజ్‌మెంట్ స్కూళ్లు

ఉన్నత చ‌దువుల నిమిత్తం విదేశీ బాటప‌ట్టే విద్యార్థుల్లో ఎక్కువ మంది చేరేది మేనేజ్‌మెంట్ కోర్సుల్లోనే. అవ‌కాశాలు విస్తృతంగా ల‌భించ‌డం, విశ్వవ్యాప్త ఆద‌ర‌ణ, ఆక‌ర్షణీయ వేత‌నాలు ఇవ‌న్నీ ఎంబీఏ కోర్సుకు డిమాండ్‌ పెంచుతున్నాయి. దీంతో విద్యార్థులు, నియామ‌క సంస్థలు, ప‌రిశ్రమ వ‌ర్గాల‌కు స‌రైన స‌మాచారం అందించ‌డానికి ఏటా ఫైనాన్షియ‌ల్ టైమ్స్‌, క్యూఎస్ వ‌ర‌ల్డ్‌...లాంటివి టాప్ బిజినెస్ స్కూళ్ల (బీ స్కూల్స్) వివ‌రాలు ప్రక‌టిస్తున్నాయి. వీటిద్వారా బీ స్కూల్స్ మ‌ధ్య ఆరోగ్యక‌ర‌మైన పోటీ పెరుగుతోంది. విదేశాల్లో ఎంబీఏ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు దేశాల‌వారీ అత్యుత్తమ మేనేజ్‌మెంట్‌ క‌ళాశాల‌ల వివ‌రాలు తెలుసుకోవ‌డం ముఖ్యం.

యూఎస్ఎ
ఇంజినీరింగ్‌లోనే కాదు మేనేజ్‌మెంట్ విద్యలోనూ అమెరికాదే అగ్రస్థానం. ప్రపంచంలో ప్రసిద్ధ బీ స్కూళ్లలో ఎక్కువ శాతం యూఎస్‌లోనే ఉన్నాయి. మేనేజ్‌మెంట్ క‌ళాశాల‌ల స‌ర్వే ఏ సంస్థ చేప‌ట్టిన‌ప్పటికీ అగ్రస్థానంలో హార్వార్డ్‌, స్టాన్‌ఫోర్డ్ పేర్లే ద‌ర్శన‌మిస్తాయి. వీటిలో ఎందులోనైనా ఎంబీఏ కోర్సు పూర్తిచేసిన‌వాళ్లు ఏడాదికి ల‌క్షా ఎన‌భై వేల యూఎస్ డాల‌ర్ల వేత‌న ప్యాకేజీ సొంతం చేసుకోవ‌చ్చు. అయితే ప్రవేశం అంత సులువేం కాదు. జీమ్యాట్‌లో క‌నీసం 730కి పైగా స్కోర్ సాధించిన‌వాళ్లే విఖ్యాత హార్వార్డ్‌, స్టాన్‌ఫోర్డ్ గ‌డ‌ప‌తొక్కగ‌ల‌రు. ఇవే కాకుండా ప్రపంచంలో టాప్‌-100 బీ స్కూళ్లలో 30కిపైగా అమెరికా ఖాతాలోనే ఉన్నాయి. అయితే భార‌త్‌లో ఉన్నట్లు డిగ్రీ చ‌దివిన త‌ర్వాత నేరుగా ఎంబీఏ కోర్సులో చేర‌డం యూఎస్‌లో సాధ్యం కాదు. ప‌లు ప్రముఖ యూనివ‌ర్సిటీలు జీమ్యాట్ స్కోర్‌తోపాటు క‌నీసం రెండు మూడేళ్ల ప‌ని అనుభ‌వానికి ప్రాధాన్యమిస్తున్నాయి. అలాగే అమెరికాలో పేరున్న ఏ యూనివ‌ర్సిటీలో ఎంబీఏ చేయాల‌న్నా జీమ్యాట్‌లో 700కు పైగా స్కోర్ సాధించ‌డం త‌ప్పనిస‌రి.

ప్రముఖ మేనేజ్‌మెంట్ సంస్థలు
హార్వార్డ్ బిజినెస్ స్కూల్ www.hbs.edu
స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ గ్రాడ్యుయేట్ స్కూల్ www.gsb.stanford.edu
కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ www.kellogg.northwestern.edu
చికాగో యూనివ‌ర్సిటీ (బూత్ బిజినెస్ స్కూల్‌) www.chicagobooth.edu
ట‌క్ స్కూల్ ఆఫ్ బిజినెస్ www.tuck.dartmouth.edu
పెనిసిల్వేనియా యూనివ‌ర్సిటీ- వార్థన్ www.upenn.edu
కొలంబియా బిజినెస్ స్కూల్ www.columbia.edu

యూకే
టాప్ బిజినెస్ స్కూళ్ల విష‌యంలో యూఎస్ త‌ర్వాత స్థానం యూకేదే. విఖ్యాత ఆక్స్‌ఫ‌ర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాల‌యాలు విద్యార్థుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. అలాగే ఇక్కడున్న లండ‌న్ బిజినెస్ స్కూల్ హార్వార్డ్‌, స్టాన్‌ఫోర్డ్ ల‌తో పోటీప‌డుతోంది. కొన్ని స‌ర్వేల్లో నెంబర్ 2 స్థానం ఎల్‌బీఎస్‌దే. ఇక్కడ చ‌దివిన‌వారికి ఏడాదికి ల‌క్షా పాతిక వేల డాల‌ర్ల వేత‌నం ద‌క్కుతోంది. ఈ సంస్థలో సీటు రావాలంటే జీమ్యాట్‌లో 700కు పైగా స్కోర్ సాధించాల్సిందే అయితే అమెరికాలో ఉన్నట్లు యూకే విశ్వవిద్యాల‌యాలు కూడా ఎంబీఏ ప్రవేశాల‌కు స్కోర్‌తోపాటు పని అనుభ‌వానికి ప్రాధాన్యమిస్తున్నాయి. విద్యార్థులు మేనేజ్‌మెంట్ విద్యలో యూకేకు ప్రాధాన్యమివ్వడానికి మ‌రో కార‌ణం ఇక్కడి ప‌లు యూనివ‌ర్సిటీలు ఏడాది కోర్సును అందించ‌డ‌మే. కొన్ని మాత్రం 15 నెల‌లు, 18 నెల‌లు ఇలా..రెండేళ్లలోపే కోర్సు పూర్తి చేస్తున్నాయి. అదే అమెరికాలో అయితే రెండేళ్లు చ‌ద‌వాల్సిందే. స్వల్ప సంఖ్యలో యూఎస్ విశ్వవిద్యాల‌యాలు 21 నెల‌ల వ్యవ‌ధితో ఎంబీఏ కోర్సు నిర్వహిస్తున్నాయి.

టాప్ బిజినెస్ స్కూల్స్‌
లండ‌న్ బిజినెస్ స్కూల్ www.london.edu
జడ్జ్ బిజినెస్ స్కూల్ www.jbs.cam.ac.uk
స‌యీద్ బిజినెస్ స్కూల్ www.sbs.ox.ac.uk
ఇంపీరియ‌ల్ కాలేజ్ బిజినెస్ స్కూల్ wwwf.imperial.ac.uk/business-school
అలియాన్స్ మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ www.mbs.ac.uk/

ఆస్ట్రేలియా
యూఎస్‌, యూకేల త‌ర్వాత ఎక్కువ మంది విదేశీ విద్యార్థుల‌ను ఆక‌ర్షిస్తోన్న దేశం ఆస్ట్రేలియా. ఇక్కడ నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థుల‌కు అనుకూల ప‌రిస్థితులు ఉన్నాయి. అయితే యూఎస్‌, యూకేల మాదిరి ఆస్ట్రేల‌యా విశ్వవిద్యాల‌యాలు కూడా ఎంబీఏ చ‌దువుల‌కు ప‌ని అనుభ‌వానికి ప్రాధాన్యమిస్తున్నాయి. ఆయా స్పెష‌లైజేష‌న్ బ‌ట్టి రెండేళ్ల నుంచి అయిదేళ్ల అనుభ‌వాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నాయి. జీమ్యాట్‌లో 550 ఆపైన స్కోర్ సాధించిన‌వాళ్లు ప్రముఖ బీ స్కూళ్లలో ప్రవేశం పొంద‌వ‌చ్చు. కొన్ని సంస్థలు ఏడాది, మ‌రికొన్ని 16 నెల‌లు, రెండేళ్ల వ్యవ‌ధితో ఎంబీఏ కోర్సు అందిస్తున్నాయి.

ప్రముఖ సంస్థలు
క్వీన్స్‌ల్యాండ్ యూనివ‌ర్సిటీ బిజినెస్ స్కూల్ www.business.uq.edu.au/
మాక్వారీ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ స్కూల్ www.mgsm.edu.au/
మెల్‌బోర్న్ బిజినెస్ స్కూల్ https://mbs.edu/
ఏజీఎస్ఎం యూఎన్ఎన్‌డ‌బ్ల్యూ బిజినెస్ స్కూల్ www.business.unsw.edu.au/agsm/programs
మోనాస్ బిజినెస్ స్కూల్ https://business.monash.edu/

కెన‌డా
ఎంబీఏ విద్యార్థుల‌కు ఉద్యోగాల క‌ల్పన‌లో కెన‌డా మెరుగ్గా ఉండ‌డంతో ఎక్కువ మంది విద్యార్థులు ఈ దేశానికి ప్రాధాన్యమిస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏడాది, 16 నెల‌లు, రెండేళ్ల వ్యవ‌ధితో ప‌లు ఎంబీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూఎస్‌తో పోల్చుకుంటే ఈ దేశంలో ఫీజులు స్వల్పమే. త‌క్కువ ధ‌ర‌కు నాణ్యమైన విద్య కెన‌డాలో ల‌భిస్తుంది. కెన‌డాలో రోట్మాన్ మేనేజ్‌మెంట్ స్కూల్ ప్రసిద్ధి. ఈ సంస్థలో సీటు రావాలంటే జీమ్యాట్‌లో 675 స్కోర్ త‌ప్పనిస‌రి.

టాప్ మేనేజ్‌మెంట్ సంస్థలు
రోట్మాన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ www.rotman.utoronto.ca/
ఐవీఈవై బిజినెస్ స్కూల్ www.ivey.uwo.ca/
సౌడ‌ర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ www.sauder.ubc.ca/
డెస్యుటెల్స్ ఫ్యాక‌ల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ www.mcgill.ca/desautels/desautels-faculty-management
హెచ్ఈసీ మోంట్రియ‌ల్ www.hec.ca/en/

సింగ‌పూర్‌
ఆర్థిక, ప‌ర్యాట‌క రంగాల్లో సింగ‌పూర్ ప్రగ‌తిప‌థంలో దూసుకుపోతోంది. విఖ్యాత కంపెనీల కార్యాల‌యాలెన్నో ఈ దేశంలో ఉన్నాయి. భ‌విష్యత్తులో మ‌రింత‌గా అభివృద్ధి చెంద‌డానికీ సింగ‌పూర్‌లో అవ‌కాశాలు పుష్కలం. విద్యారంగంలోనూ ఈ దేశం ఉన్నత ప్రమాణాల‌తో దూసుకుపోతోంది. ఫైనాన్షియ‌ల్ టైమ్స్ ర్యాంకింగ్‌లో ఇక్కడి నాన్యంగ్ టెక్నలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ (ఎన్‌టీయూ) విశ్వవ్యాప్తంగా 37వ స్థానం పొందింది. ఎంబీఏలో విస్తృత స్పెష‌లైజేష‌న్లు అందించ‌డం సింగ‌పూర్‌ ప్రత్యేక‌త‌. ఎంబీఏ(ఏవియేష‌న్‌), ఎంబీఏ(ఏషియ‌న్ బిజినెస్‌)..ఇలా విభిన్న స్పెష‌లైజేష‌న్లు ఈ దేశంలో చ‌దువుకోవ‌చ్చు. ఇక్కడి ఎంబీఏ కోర్సులు ఏడాది, రెండేళ్ల వ్యవ‌ధితో అందిస్తున్నారు.

ప్రముఖ బిజినెస్ స్కూళ్లు
నాన్యంగ్ టెక్నలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ (ఎన్‌టీయూ) www.ntu.edu.sg/
నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ సింగ‌పూర్ www.nus.edu.sg/
ఇన్‌సీడ్ www.insead.edu/campuses/asia
సింగ‌పూర్ మేనేజ్‌మెంట్ యూనివ‌ర్సిటీ www.smu.edu.sg/


Posted on 19-08-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning