ఆలోచనలే ‘అంకుర’మై..

* ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఇంజినీరింగ్‌ విద్యార్థులు
ఈనాడు - అమరావతి: ప్రజల అవసరాలే వారి అంకుర పరిశ్రమలకు ముడిసరుకుగా మారాయి. ఓ వైపు ఇంజినీరింగ్‌ చదువుతూనే వ్యాపారరంగం వైపు అడుగులు వేసేలా చేశాయి. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఐవోటీ ప్రదర్శనలో ఈ అంకుర పరిశ్రమలకు సంబంధించిన స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇస్త్రీవాలాలమంటూ...వ్యాపారాన్ని ఒడిసిపట్టేశారు..
ఇంటివద్దకే లాండ్రీ సేవల పేరిట ఓ వినూత్న వ్యాపారానికి శ్రీకారం చుట్టారు సురవరపు శ్రీరామ్‌, వక్కలగడ్డ శ్రీకాంత్‌, ధనుంజయ్‌ రాజన్‌, డబ్బీరు సాయిరామ్‌ తదితరులు. నగరంలోని వేర్వేరు కళాశాలల్లో ఇంజినీరింగ్‌ చదువుతున్న వీరు మరో ముగ్గురితో కలిసి ఇస్త్రీవాలాడాట్‌కామ్‌ పేరిట విజయవాడ కేంద్రంగా అంకుర పరిశ్రమను నెలకొల్పారు. రూ.3 లక్షల పెట్టుబడిని సమకూర్చుకుని దుస్తులు ఉతికే యంత్రాలు, ఇస్త్రీ చేసే యంత్రాలను కొనుగోలు చేశారు. www.isthriwala.com వెబ్‌సైట్‌ ద్వారా, ఫోన్‌లలో లాండ్రీ సేవల కోసం ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించారు. దుస్తులను సేకరించడం, వాటిని ఉతికి, ఇస్త్రీ చేయించి తిరిగి మూడు రోజుల వ్యవధిలో వినియోగదారుడి ఇంటికి చేర్చడం వీరి ప్రధాన వ్యాపారం. డ్రైవాష్‌, కెమికల్‌ వాష్‌ వంటి విభిన్నరకాల సేవలను అందిస్తున్నారు. వేగంగా అవసరమైతే ఎక్స్‌ప్రెస్‌ లాండ్రీ సర్వీసులనూ అందిస్తారు. గతేడాది ఏప్రిల్‌లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం రూ.10 లక్షల మేర టర్నోవర్‌ సాధించారు. సంస్థ సేవలను తాజాగా హైదరాబాద్‌లోనూ ప్రారంభించారు.
డ్రోన్ల తయారీతో...దూసుకెళ్తూ: సువిశాలమైన వ్యవసాయ క్షేత్రాల్లో క్రిమిసంహారక మందులు చల్లేందుకు, పైరుకు నష్టం వాటిల్లకుండా పై భాగం నుంచే పురుగు మందులను పిచికారీ చేసేందుకు డ్రోన్‌ సాంకేతికతను వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి ఓ వ్యాపారానికి నాంది పలికారు..ఇంజినీరింగ్‌ విద్యార్థి ఏ.గోపిరాజ, అతని మిత్రులు బాలసుబ్రమణ్యం, మనోజ్‌కుమార్‌, సూర్యచరణ్‌, దిలీప్‌ తదితరులు. ‘‘ఫోపిల్‌ టెక్నాలజీస్‌’’ పేరిట ఓ అంకుర సంస్థను ప్రారంభించారు. రూ.లక్ష వరకూ సమకూర్చుకున్నారు. ఈ మొత్తానికి కేఎల్‌యూలోని సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఇంక్యూబేషన్‌ కేంద్రం నుంచి మరో రూ.లక్ష ప్రొత్సాహాక నిధి అందింది. ఆరు నెలలపాటు శ్రమించి అగ్రికల్చరల్‌ పెస్టిసైడ్‌ స్ప్రేయింగ్‌ డ్రోన్‌ను తయారు చేశారు. అత్యవసర సమయాల్లో మందులను, ప్రథమ చికిత్స పరికరాలను చేరవేసేందుకు గాను అంబులెన్సు డ్రోన్లను, వర్షంలోనూ పనిచేసే డ్రోన్లను తయారు చేశారు. ఆర్డర్లు వస్తే తయారీ ప్రారంభించనున్నట్లు ఫోపిల్స్‌ టెక్నాలజీస్‌ సీఎండీ ఏ.గోపిరాజా వివరించారు.


Posted on 25-08-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning