ప్రపంచంలో బెస్ట్ ఎంబీఏ స్పెష‌లైజేష‌న్లు

ఇంజినీరింగ్‌లో వివిధ బ్రాంచీలు ఉన్నట్లే ఎంబీఏలోనూ ప‌లు స్పెష‌లైజేష‌న్లు ఉన్నాయి. ఎక్కువ మందికి మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, హెచ్ఆర్‌, ఐటీ..త‌దిత‌ర స్పెష‌లైజేష‌న్లపై అవ‌గాహ‌న ఉంటుంది. అయితే ప్రపంచ‌వ్యాప్తంగా చూసుకుంటే ఎంబీఏలో వంద‌ల సంఖ్యలో స్పెష‌లైజేష‌న్లు ఉన్నాయి. వీటిలో కొన్ని విశ్వవ్యాప్త ఆద‌ర‌ణ‌కు నోచుకున్నాయి. డిమాండ్ ఉన్న స్పెష‌లైజేష‌న్లతోపాటు ఆ స్పెష‌లైజేష‌న్ ఎవ‌రికి న‌ప్పుతుంది, అది చ‌దివిన‌వారికి ఎలాంటి హోదాలు సొంత‌మ‌వుతాయి..త‌దిత‌ర‌ వివ‌రాలు తెలుసుకుందాం.

ప్రపంచంలో ఎక్కువ డిమాండ్ ఉన్న, ఎక్కువ మంది విద్యార్థులు మొద‌టి ప్రాధాన్యమిస్తున్న, ఆక‌ర్షణీయ వేత‌నం అందిస్తోన్న కోర్సు ఎంబీఏ. అయితే ఈ కోర్సులో చేరిన‌ విద్యార్థులు ప్రవేశం పొందిన త‌ర్వాత ఆలోచించేది.. ఏ స్పెష‌లైజేష‌న్ తీసుకోవాల‌నే. వ్యక్తిగ‌త ఆస‌క్తి, డిగ్రీలో చ‌దివిన స‌బ్జెక్టులు, ప్రస్తుత డిమాండ్ వీట‌న్నింటినీ విశ్లేషించుకుని స్పెష‌లైజేష‌న్ ఎంచుకోవాలి. న‌చ్చిన స్పెష‌లైజేష‌న్‌ను, మెచ్చిన సంస్థలో చ‌దివితే కెరీర్ జీవితానికి తిరుగులేన‌ట్టే. ప్రస్తుతం గిరాకీ ఎక్కువ‌గా ఉన్న స్పెష‌లైజేష‌న్లు ఇవీ...

ఫైనాన్స్‌
ఎంబీఏ స్పెష‌లైజేష‌న్లలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మందిని ఆక‌ర్షిస్తోన్నది, డిమాండ్ ఉన్నది ఫైనాన్స్‌. పెట్టుబ‌డులు, క్యాపిట‌ల్ మార్కెట్‌, అకౌంటింగ్‌..త‌దిత‌ర అంశాల్లో ఆస‌క్తి ఉన్నవాళ్లు ఫైనాన్స్‌ను స్పెష‌లైజేష‌న్‌గా ఎంచుకోవ‌చ్చు. బీకాం విద్యార్థులైతే నిస్పందేహంగా ఈ స్పెష‌లైజేష‌న్‌వైపు మొగ్గు చూప‌వ‌చ్చు. ఈ స్పెష‌లైజేష‌న్ చ‌దివిన‌వాళ్లు ఫైనాన్షియ‌ల్ ఎన‌లిస్ట్‌, ఇన్వెస్టిమెంట్ బ్యాంక‌ర్‌, ఫైనాన్స్ మేనేజ‌ర్ హోదాల్లో రాణిస్తారు.

ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్
చిన్న సంస్థతో మొద‌లుపెట్టి, దాన్ని ప్రపంచ‌వ్యాప్తంగా విస్తరించ‌డ‌మే ఎంట‌ర్‌ప్రెన్యూర్ల లక్ష్యం. వ్యాపారం దిశ‌గా అడుగులేయాల‌నుకున్నవాళ్లు, సృజ‌న‌శీలురు ఈ స్పెష‌లైజేష‌న్‌ను ఎంచుకోవ‌చ్చు. ఈ స్పెష‌లైజేష‌న్ చ‌దివిన‌వాళ్లకు వ్యాపార‌ మెల‌కువ‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. ఇటీవ‌ల కాలంలో ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ప్రాధాన్యం పెరిగింది. ఎక్కువ‌శాతం యువ‌త సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి దాన్ని విస్తరించాల‌ని కోరుకుంటోంది. ఈ త‌ర‌హా ఆలోచ‌న‌లు ఉన్నవారంతా ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స్పెష‌లైజేష‌న్ ద్వారా ప్రాథ‌మికాంశాల‌పై అవ‌గాహ‌న పెంపొందించుకోవ‌చ్చు.

మార్కెటింగ్
మాట‌కారికి మార్కెటింగ్‌కి మించిన స్పెష‌లైజేష‌న్ మ‌రొక‌టి లేదు. మాట‌ల‌తో ఎదుటివారిని మంత్రముగ్ధుల‌ను చేయ‌గ‌లిగే నేర్పరిత‌నం ఉన్నవాళ్లు మార్కెటింగ్ కెరీర్‌లో దూసుకుపోవ‌చ్చు. ప్రపంచ‌వ్యాప్తంగా కొత్త సంస్థలు, ఉత్పత్తులు ఆవిర్భవిస్తున్నందువ‌ల్ల మార్కెటింగ్ లో అవ‌కాశాలు గ‌ణ‌నీయం. అలాగే కెరీర్ ప్రారంభంలో కొంచెం శ్రమిస్తే త‌క్కువ వ్యవ‌ధిలోనే ఉన్నత స్థాయుల‌ను అందుకోవ‌డ‌మూ ఖాయ‌మే. ఉత్పత్తుల అమ్మకాల‌పైనే కంపెనీల భ‌విష్యత్తు ఆధార‌ప‌డి ఉంటుంది. అందువ‌ల్ల మార్కెటింగ్‌లో మెల‌కువ‌లు ఒంట‌బ‌బ‌డితే ఆకాశ‌మే హ‌ద్దు. మార్కెటింగ్ మేనేజ‌ర్‌, సేల్స్ మేనేజ‌ర్‌, ప్రొడ‌క్ట్ మేనేజ‌ర్‌, బ్రాండ్ మేనేజ‌ర్‌, రీసెర్చ్ ఎన‌లిస్ట్‌..హోదాల‌తో ఉద్యోగాలుంటాయి.

ఇన్ఫర్మేష‌న్ సిస్టమ్స్‌...
ఇప్పుడంతా ఆన్‌లైన్‌లోనే. డిజిట‌ల్ హ‌వా న‌డుస్తోంది. అందువ‌ల్ల మేనేజేరియ‌ల్ స్థాయిలో ఐటీ ప్రొఫెష‌న్లకు డిమాండ్ ఏర్పడింది. స‌మాచారాన్ని భ‌ద్రప‌ర్చడం, నిర్వహ‌ణ‌, దాన్ని సులువుగా ఉప‌యోగించుకోగ‌లగ‌డం, విశ్లేషించ‌డం, స‌మ‌ర్థ స‌మాచార వ్యవ‌స్థను రూపొందించ‌డం..ఇవ‌న్నీ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్టమ్స్‌లో భాగంగా ఉంటాయి. కంపెనీ ఏ రంగంలో సేవ‌లందిస్తోన్నప్పటికీ ఇన్ఫర్మేష‌న్ సిస్టమ్స్‌పై ప‌ట్టున్నవాళ్లు అనివార్యం. ఇంజినీరింగ్ బ్యాక్‌ గ్రౌండ్ విద్యార్థులు, కంప్యూట‌ర్, ఐటీల‌పై అవ‌గాహ‌న ఉన్నవాళ్లు ఎంబీఏలో ఇన్ఫర్మేస‌న్ సిస్టమ్స్‌ను స్పెష‌లైజేష‌న్‌గా తీసుకుని రాణించ‌గ‌ల‌రు. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ మేనేజ‌ర్‌, చీఫ్ ఇన్ఫర్మేష‌న్ మేనేజ‌ర్‌, డేటా ప్రాసెసింగ్ మేనేజ‌ర్‌, ఐటీ ఆర్కిటెక్ట్ హోదాలు వీరికి కేటాయిస్తారు.

ఇంట‌ర్నేష‌న‌ల్ మేనేజ్‌మెంట్
ఇటీవ‌లికాలంలో వెలుగులోకి వ‌చ్చిన స్పెష‌లైజేష‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మేనేజ్‌మెంట్‌. ప్రపంచీక‌ర‌ణ ప్రభావంతో బ‌హుళ‌జాతి సంస్థలు ప్రతిదేశంలోనూ విస్తరిస్తున్నాయి. అందువ‌ల్ల ఆయా సంస్థల ఉద్యోగుల‌కు ప్రపంచ వ్యాప్త అవ‌గాహ‌న త‌ప్పనిస‌రిగా మారింది. ఇంట‌ర్నేష‌న‌ల్ మేనేజ్‌మెంట్‌లో ప్రపంచ స్థాయి వ‌ర్తక స‌మ‌ర్థ నిర్వహ‌ణ‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. ఉద్యోగి ఒకచోట ఉంటూ వివిధ ప్రాంతాలు, దేశాల్లో ఉన్న శాఖ‌ల‌ను ప‌ర్యవేక్షించాలి. విదేశాల్లో ప‌నిచేయడానికి ఆస‌క్తి ఉన్నవాళ్లు ఇంట‌ర్నేష‌న‌ల్ మేనేజ్‌మెంట్ స్పెష‌లైజేష‌న్ తీసుకోవ‌చ్చు. వీరు భిన్న సంస్కృతులు, భాష‌ల‌పై అవ‌గాహ‌న పెంపొందించుకోవాలి. ప్రయాణాలు చేయ‌డానికీ సిద్ధప‌డాలి. ఇంట‌ర్నేష‌న‌ల్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌, ఇంపోర్ట్‌/ఎక్స్‌పోర్ట్ ఏజెంట్‌, ఇన్వెస్టిమెంట్ అడ్వైజ‌ర్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్ అండ్ క‌స్టమ్స్‌ మేనేజ‌ర్ హోదాల్లో రాణిస్తారు.

ఆప‌రేష‌న్స్ మేనేజ్‌మెంట్‌
సంస్థల ఉత్పత్తుల త‌యారీ నుంచి వినియోగ‌దారుల‌కు స‌ర‌ఫ‌రా చేసేవ‌ర‌కు అన్ని బాధ్యత‌లూ నిర్వహించేవాళ్లే ఆప‌రేష‌న్స్ మేనేజ‌ర్లు. ఎలాంటి స‌మ‌స్యలు లేకుండా ఉత్పత్తి బ‌య‌ట‌కు తీసుకురావ‌డం, అవ‌రోధాలు లేకుండా వినియోగ‌దారుల చెంత‌కు చేర్చడం వీరి నైపుణ్యంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. ఒక‌వేళ మ‌ధ్యలో ఇబ్బందులు వ‌స్తే వాటిని అధిగ‌మించే బాధ్యత కూడా వీరిదే. అందువ‌ల్ల నిర్వహ‌ణ సామ‌ర్థ్యం, స‌మ‌స్య ప‌రిష్కార నైపుణ్యం ఉన్నవాళ్లు ఆప‌రేష‌న్స్ మేనేజ్‌మెంట్‌ను స్పెష‌లైజేష‌న్‌గా తీసుకోవ‌చ్చు. ప్రస్తుతం ప్రతి ఉత్పత్తి కంపెనీలోనూ ఆప‌రేష‌న్స్ కీల‌క శాఖ‌గా వెలుగొందుతోంది. బ‌హుళ‌జాతి సంస్థల ఉత్పత్తుల‌ను ప్రపంచ న‌లుమూల‌ల‌కూ చేర‌వేసే బాధ్యత ఆప‌రేష‌న్స్ విభాగానిదే. స‌ప్లై చైన్ మేనేజ‌ర్‌, ఆప‌రేష‌న్స్ మేనేజ‌ర్‌, లాజిస్టిక్స్ మేనేజ‌ర్‌, ఆప‌రేష‌న్స్ క‌న్సల్టెంట్‌..త‌దిత‌ర హోదాలు వీరికి ద‌క్కుతాయి.

కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ
ఇటీవ‌లి కాలంలో ఎంబీఏలోనూ కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్‌) ఒక స్పెష‌లైజేష‌న్‌గా వెలుగొందుతోంది. సీఎస్ఆర్ ద్వారా కంపెనీల బ్రాండ్ విస్తర‌ణ‌కు అవ‌కాశ‌మేర్పుడుతుంది. అందువ‌ల్ల సంస్థల‌న్నీ సీఎస్ఆర్‌కి ప్రాధాన్యమిస్తున్నాయి. సేవ రూపంలో సంస్థ పేరు, ప్రతిష్టల‌ను జ‌న బాహుళ్యానికి ప‌రిచయం చేసుకుంటున్నాయి. సేవ‌చేయాల‌నుకునే స్వభావం ఉన్నవాళ్లు సీఎస్ఆర్‌ను స్పెష‌లైజేష‌న్‌గా తీసుకుంటే జీతం పొందుతూ అవ‌స‌ర‌మైన‌వారికి స‌హాయ‌ప‌డ‌వ‌చ్చు. వీరికి ప్రొగ్రామ్ మేనేజ‌ర్‌, సీఎస్ఆర్ మేనేజ‌ర్ హోదాలు కేటాయిస్తారు.

ప్రముఖ మేనేజ్‌మెంట్ సంస్థలు
హార్వార్డ్ బిజినెస్ స్కూల్ www.hbs.edu
స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ గ్రాడ్యుయేట్ స్కూల్ www.gsb.stanford.edu
లండ‌న్ బిజినెస్ స్కూల్ www.london.edu
కొలంబియా బిజినెస్ స్కూల్ www.columbia.edu
ఇన్‌సీడ్ www.insead.edu/campuses/asia
జడ్జ్ బిజినెస్ స్కూల్ www.jbs.cam.ac.uk
స‌యీద్ బిజినెస్ స్కూల్ www.sbs.ox.ac.uk
ఎంఐటీ www.mitsloan.mit.edu


Posted on 25-08-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning