సాఫ్ట్‌వేర్‌ను దాటి... ‘ఆటోమోటివ్‌’లోకి

* హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత జెడ్‌ఎఫ్‌ సంస్థ
* తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
* 2,500 మందికి ప్రత్యక్ష ఉపాధి
* జనవరి 1 నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు

ఈనాడు - హైదరాబాద్‌: ఇప్పటిదాకా సాఫ్ట్‌వేర్‌, దాని అనుబంధ రంగాల్లో ప్రపంచ దేశాలకు, సంస్థలకు సేవలు అందించడంలో కీలకంగా మారిన హైదరాబాద్‌... ఇకపై వాహనాల రూపకల్పన, తయారీ (ఆటోమోటివ్‌) రంగంలోనూ తన ముద్ర వేయబోతోంది. త్వరలోనే వస్తాయనుకుంటున్న డ్రైవర్‌ రహిత వాహనాలకు... నిరాటంక ట్రాఫిక్‌ వ్యవస్థలకు... ప్రమాదాల్లేని రవాణా సాంకేతికతల రూపకల్పనకు హైదరాబాద్‌ వేదిక కాబోతోంది. ఈ దిశగా సెప్టెంబరు 8న మరో కీలక మైలురాయి పడింది. ఆటోమోటివ్‌ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జెడ్‌ఎఫ్‌ సంస్థ భారత్‌లో తన తొలి సాంకేతిక వైజ్ఞానికాభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో లాంఛనంగా ఆరంభించింది. ఐటీ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో భారత్‌లో జెడ్‌ఎఫ్‌ సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షురాలు, ఎగ్జిక్యూటివ్‌ లీడ్‌ మమత చామర్తి, తెలంగాణ ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌లు ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఐరోపా బయట సంస్థను ఏర్పాటుచేస్తున్న అతిపెద్ద సాంకేతిక కేంద్రం ఇదేనని సమాచారం. జెడ్‌ఎఫ్‌... ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమోటివ్‌ సరఫరాదారు. మెకానికల్‌ ఉత్పత్తులను డిజిటలైజ్‌ చేసి, స్మార్ట్‌ వాహనాలతో ప్రయాణాలను సుఖవంతం, ప్రమాద రహితం చేసేందుకు ఈ సంస్థ పరిశోధనలు సాగిస్తోంది. గచ్చిబౌలిలో వచ్చే జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ఆరంభించనుంది. 2020 నాటికి ఇక్కడ 2,500 మందికి ప్రత్యక్షంగా ఉపాధినందిస్తుంది. 1915లో జర్మనీలో కారు విభాగాల తయారీ కేంద్రంగా ఏర్పాటైన జెడ్‌ఎఫ్‌ సంస్థ తర్వాత 40 దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో లక్షా నలభై వేలమంది ఉద్యోగులున్నారు. భారత్‌లో 28 సాంకేతికేతర కేంద్రాలున్నాయి. ఈ కొత్త సాంకేతిక కేంద్రాన్ని పూర్తిగా ఎలక్ట్రానిక్‌ ఎంబెడెడ్‌ సాఫ్ట్‌వేర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌కు కేటాయించారు. ఆటోమోటివ్‌ రంగంలో సాధించాలనుకుంటున్న అత్యాధునిక సాంకేతికతలకు ఈ కేంద్రం వేదికయ్యే అవకాశముంది.
స్మార్ట్‌ కార్లకు హైదరాబాద్‌ వూపిరి: జయేశ్‌ రంజన్‌
ఈ సందర్భంగా ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ... ‘‘ప్రపంచంలోని ప్రతి కంపెనీకీ హైదరాబాద్‌ తప్పనిసరి గమ్యస్థానంగా మారుతోంది. ఆటోమోటివ్‌ రంగంలోనూ ఇక మీదట హార్డ్‌వేర్‌కంటే సాఫ్ట్‌వేర్‌ ప్రాధాన్యంవహించబోతోంది. అత్యంతమేధో వ్యవస్థలు, స్మార్ట్‌ సంధానాలతో వాహనాలు, రవాణా మారబోతోంది. వాటికి హైదరాబాద్‌లోని జెడ్‌ఎఫ్‌ సాంకేతిక కేంద్రం వూపిరిపోస్తుందని ఆశిస్తున్నా’’ అని అన్నారు.
ఇది సరికొత్త ఆరంభం: మంత్రి కేటీఆర్‌
ఇప్పటిదాకా స్వచ్ఛమైన ఐటీ కేంద్రంగా సాగుతున్న ఈ ముత్యాల నగరంలో జెడ్‌ఎఫ్‌ తన రాకతో సరికొత్త ముగ్గు వేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆటోమోటివ్‌ సంస్థ తన సాంకేతిక కేంద్రాన్ని భారత్‌లో... అదీ హైదరాబాద్‌లో నెలకొల్పాలని నిర్ణయించటం నిజంగా ఆనందదాయకం. ఇకపై ఆటోమోటివ్‌ రంగానికీ హైదరాబాద్‌ వేదిక కాబోతోందనటానికి ఇది సూచిక. ఇక్కడెంతో ప్రతిభ మీకు అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి 2500 మందికి ఉపాధినిస్తానంటున్నారు. ఇక్కడి పరిస్థితులు... ప్రతిభావంతుల్ని చూశాక మీరే ఆ సంఖ్యను కచ్చితంగా పెంచుకుంటారు. ‘ఇంజినీరింగ్‌ సేవల విధానం’ తీసుకొస్తాం. జెడ్‌ఎఫ్‌కు ప్రభుత్వంనుంచి సహకారం ఉంటుంది.
స్థానిక ప్రతిభకు ప్రోత్సాహం: స్టిఫాన్‌ సోమర్‌, సీఈవో
‘‘ఉద్గారాల్లేని... ప్రమాదాల్లేని వాహనాలు... రవాణావ్యవస్థ మా ఆశయం. ఆ దిశగా ఆటోమోటివ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ను డిజిటలైజ్‌ చేస్తున్నాం. భారత్‌లో ప్రతిభకు కొదువ లేదు. మా లక్ష్యసాధనలో వారికి అవకాశాలు కల్పిస్తాం.’’
ఇదీ జెడ్‌ఎఫ్‌...
* ఏటా 30 బిలియన్‌ యూరోల (సుమారు రూ.2.25 లక్షల కోట్లు) విలువైన విక్రయాలు.
* 40 దేశాల్లో 230 కేంద్రాలు
* సుమారు లక్షా 40 వేల మంది ఉద్యోగులు. భారత్‌లో సుమారు 12 వేల మంది.
* హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్‌ ఎంబెడెడ్‌ సాఫ్ట్‌వేర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌కు పెద్దపీట. 2,500 మందికి ఉపాధి. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అవకాశం.


Posted on 09-09-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning