ఐటీ సంస్థల కష్టాలు ఎంతవరకు?

* బ్రెగ్జిట్‌ ప్రభావంపైనే మల్లగుల్లాలు
* అమెరికా నుంచీ వీసా బెదిరింపులు
* మరీ భయపడాల్సిన అవసరం లేదంటున్న నిపుణులు

ఈనాడు వాణిజ్య విభాగం: ఐరోపా కూటమి నుంచి బ్రిటన్‌ విడిపోయేందుకు ఆ దేశ పౌరులు ఓటేయడం (బ్రెగ్జిట్‌)తో, ఏర్పడిన ప్రభావాన్ని అంచనా వేయడంలో ఐటీ సంస్థలు నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉండగానే, అమెరికాలోని సంస్థల్లో హెచ్‌1బీ వీసా నిపుణులు ఇప్పటికే 50 శాతం మంది ఉంటే, కొత్తగా తీసుకోకూడదని చట్టసభ సభ్యులు బిల్లు ప్రవేశ పెట్టడం, దేశీయ ఐటీ రంగాన్ని, అమెరికా జీవనంపై ఆశపెట్టుకున్న ఉద్యోగార్థులను కలవర పెడుతోంది. ఐటీ సంస్థలకు వచ్చే ఎగుమతి ఆదాయంలో, అమెరికా, ఐరోపాల వాటా దాదాపు 85 శాతం కావడమే ఇందుకు ప్రధాన కారణం.
బ్రెగ్జిట్‌పై ఓటింగ్‌ అనంతరం ఇప్పటికే బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ అధికారం నుంచి తప్పుకోవడం, కొత్త ప్రధాని థెరెసా బాధ్యతలు స్వీకరించడం జరిగిపోయాయి. ఈమె మళ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుందా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే ఐరోపా నుంచి యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) విడిపోయేందుకు ఇంకా రెండేళ్ల సమయం పడుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, యూకే నుంచీ విడిపోయేందుకు స్కాట్‌లాండ్‌, ఐర్‌లాండ్‌ వంటివి ప్రయత్నిస్తున్నాయి. స్వాతంత్య్రం కోసం వచ్చే ఏడాది ఆరంభంలో, రెండోసారి రెఫరెండం నిర్వహిస్తామని స్కాట్‌లాండ్‌ ప్రకటించింది. ఈ అనిశ్చితుల నేపథ్యంలో ఐటీ బడ్జెట్లను ఐరోపా, యూకే సంస్థలు తగ్గించుకుంటాయని భావిస్తున్నారు. ఈ దేశాల నుంచి సమీప భవిష్యత్తులో భారీ ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు బహు స్వల్పమని ఐటీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత కాంట్రాక్టులను జాగ్రత్తగా చేసుకుంటూ, ముందుకు సాగడమే మిగిలిన అవకాశమని వెల్లడిస్తున్నాయి.
అమెరికాలో ఎన్నికలు వస్తే.. వీసా బెదిరింపులే
ఎన్నికల సందర్భంలో, ప్రజల్లో భావోద్వేగాలు రేగే అంశాలను ప్రస్తావించడంలో ఏ దేశ రాజకీయ నాయకులు అయినా ఒకేలా ప్రవర్తిస్తున్నారు. అమెరికాలో గత కొన్నేళ్లుగా హెచ్‌1బీ వీసాల అంశం, చర్చనీయాంశంగా మారింది. సంస్థల్లో ఉద్యోగాలకు అమెరికాలో తగిన అర్హతలున్న వారు లేకుంటే, విదేశాల నుంచి అత్యున్నత నిపుణులను రప్పించేందుకు ప్రవేశ పెట్టిన హెచ్‌1బీ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని, తమ దేశ పౌరులకు ఉద్యోగావకాశాలను దూరం చేస్తున్నాయని అమెరికాలో కొందరు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మెరుగైన ఉపాధి కల్పించే ఐటీ రంగంలో తమ అవకాశాలను హెచ్‌1బీ వీసాల సాయంతో ఇతర దేశస్తులు తన్నుకు పోతున్నారనే ఆందోళన అమెరికా యువతలో పెరుగుతోంది. ఇప్పుడు దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్నందున, యువత మద్దతు పొందేందుకు అక్కడి డెమొక్రటిక్‌ నేతలు ప్రయత్నిస్తూ, తాజా బిల్లు ప్రవేశ పెట్టారు.
దేశీయ ఐటీ సంస్థల నిర్వహణ వ్యయం పెరిగిపోతుంది
ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్‌, సెనేట్‌ ఆమోదం పొంది, అమెరికా అధ్యక్షుడి సంతకం అయి అమల్లోకి వస్తే .. 50 మంది కంటే ఎక్కువమంది ఉద్యోగులున్న సంస్థలు, తమ సిబ్బందిలో 50 శాతం వరకే హెచ్‌1బీ, ఎల్‌1 వీసాలు కలిగిన వారిని నియమించుకో గలుగుతాయి. ఇప్పటికే భారతీయులను అత్యధికంగా కలిగిన దేశీయ ఐటీ సంస్థలేమీ, కొత్తగా హెచ్‌1బీ నిపుణులను నియమించుకోలేవు.
* గత డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం అమెరికాలో 50 మంది, అంతకంటే ఎక్కువ ఉద్యోగులను కలిగిన దేశీయ సంస్థలు, వారిలో 50 శాతం కంటే ఎక్కువగా హెచ్‌1బీ, ఎల్‌1 వీసా నిపుణులు ఉంటే, కొత్త వీసాలకు భారీగా అదనపు మొత్తాలు వెచ్చించాల్సి వస్తోంది. ప్రతి అదనపు హెచ్‌1బీ వీసా కోసం అదనంగా 4,000 డాలర్లు (సుమారు రూ.2.70 లక్షలు), ఎల్‌1 వీసా కోసం అదనంగా 4,500 డాలర్లు (సుమారు రూ.3 లక్షలు) చెల్లించాల్సి వస్తోంది. 2025 సెప్టెంబరు 30 వరకు ఈ నిబంధనలు అమలు కానున్నాయి. అంటే దేశీయ ఐటీ సంస్థలపై ఏటా 400 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2,700 కోట్ల) భారం పడుతుందని అంచనా.
* ఈ భారమే ఎక్కువనుకుంటే ఇప్పుడు, అసలు నియామకాలే జరపకూడదని తీర్మానం పెట్టడం ఆందోళన కలిగిస్తోంది.
24 లక్షల పోస్టులు ఖాళీ!
అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ ఐటీ సేవల సంస్థలతో పాటు అమెరికా దిగ్గజ కంపెనీలకూ భారత నిపుణుల అవసరం ఎంతో ఉన్న నేపథ్యంలో, సుదీర్ఘ ప్రక్రియ అవసరం అయ్యే ‘హెచ్‌1బీ నిపుణుల నియామక నిరోధ’ బిల్లులు ఆమోదం పొందడం కష్టమనే భావన దేశీయ ఐటీ రంగంలో వ్యక్తం అవుతోంది. 2010లోనూ ఇలాంటి బిల్లు ఆమోదం పొందకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. దేశీయ ఐటీ దిగ్గజ సంస్థలు బహుళజాతి ఐటీ కంపెనీలతో పాటు తయారీ, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా) రంగాల ఖాతాదారులకు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే వీసా భారం పెరగడంతో పాటు, భారతీయులకూ వేతనం అధికమొత్తం ఇవ్వాల్సి వస్తున్నందున, విదేశాల్లో స్థానిక నియామకాలను సంస్థలు పెంచుతున్నాయి. అమెరికా కార్మిక విభాగం అంచనాల ప్రకారమే సైన్సు, సాంకేతికత, ఇంజినీరింగ్‌, లెక్కలు విభాగాల్లో 2018కి 24 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటాయని అంచనా. వీటిల్లో అత్యధికం ఐటీ, కంప్యూటర్‌ రంగానికి చెందినవే. అందువల్ల టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ వంటి దిగ్గజ సంస్థలకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సగం హెచ్‌ 1 బీ వీసాలు మనవే
* భారత్‌లోని కార్యాలయం నుంచీ సిబ్బందిని విదేశాల్లోని తమ కార్యాలయానికి ఐటీ సంస్థలు పంపేందుకు ఎల్‌1 వీసా సరిపోతుంది. ఖాతాదారు స్థలంలో వీరు పనిచేసేందుకు వీలుండదు. ఈ వీసాల్లో దుర్వినియోగం జరిగినందున ఇప్పటికే ఈ నిబంధనలు కఠినతరం చేశారు.
* ఖాతాదారు సూచన మేరకు భారత్‌ నుంచీ నిపుణులను ఐటీ సంస్థలు హెచ్‌1బీ (వర్క్‌ పర్మిట్‌) వీసాపై పంపుతున్నాయి. స్టాఫ్‌ ఆగ్‌మెంటేషన్‌గా పేర్కొనే ఈ విధులకే అత్యధిక కంపెనీలు తమ వారిని పంపుతాయి. ఖాతాదారు సూచనలకు అనుగుణంగా, సిబ్బందిని ఎంపిక చేసి పంపడమే ఐటీ కంపెనీ పని. ఖాతాదారు ఆశించే విధంగా 1-2 సంవత్సరాల పాటు సిబ్బంది ఆయా దేశాలలో పనిచేస్తారు. ప్రస్తుతం హెచ్‌1బీ వీసాలపై ఆయా దేశాల్లో వేల మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు.
* ఇతర దేశాల నిపుణులకు ఏటా 65,000 హెచ్‌1బీ వీసాలు ఇస్తుండగా, ఇందులో 25,000-30,000 దేశీయ సంస్థలే దక్కించుకుంటున్నాయని అంచనా.


Posted on 11-09-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning