హైదరాబాద్‌లో భారీ డాటా అనలటిక్స్‌ పార్క్‌

* దేశంలోనే తొలిసారిగా... అనుగుణంగా ‘ఇంజినీరింగ్‌’
* పాఠ్య ప్రణాళికలోనూ మార్పులు
* పర్యవేక్షణకు రాష్ట్ర చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి
* తెలంగాణ ఐటీశాఖ కొత్త విధానం

ఈనాడు - హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్ల రంగంగా వృద్ధి చెందుతూ ఉద్యోగాల కల్పనలో విపరీతమైన గిరాకీ ఉన్న డాటా అనలటిక్స్‌కు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. దేశవిదేశాల్లోని డాటా అనలటిక్స్‌ కంపెనీలను ఆకర్షించటానికి ఈ రంగంలో వెల్లువెత్తుతున్న ఉద్యోగాలను రాష్ట్ర యువతరం అందుకునేలా చేయటానికి కొత్త విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో భారీ డాటా అనలటిక్స్‌ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది బుద్వేల్‌లో ఏర్పాటయ్యే అవకాశముందని సమాచారం. జాతీయస్థాయిలో అనలటిక్స్‌కు ఇది కేంద్రమవుతుందని భావిస్తున్నారు. భారీస్థాయి కంపెనీల నుంచి చిన్న కంపెనీల దాకా ప్రతి ఒక్కరికీ అవసరమైన, ఉపయోగపడే రీతిలో డాటా అనలటిక్స్‌కు సంబంధించిన అన్ని సదుపాయాలు, ప్రయోగశాలలు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అంతేగాకుండా ఈ కేంద్రం కార్యకలాపాలను విస్తరించటానికి వీలుగా డాటాఎంట్రీ, డాటా పరిశీలనల కోసం రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా డాటా అనలటిక్స్‌ పార్క్‌లను ఏర్పాటు చేస్తారు. తద్వారా ఈ కేంద్రాల్లో స్థానికంగా యువతకు సాంకేతికేతర స్థాయిలో కూడా ఉపాధి లభిస్తుంది. ఈ ఉపాధి అవకాశాలను అందుకునేందుకు వీలుగా ముందే తెలంగాణ నైపుణ్య విజ్ఞానాభివృద్ధి సంస్థ (టాస్క్‌) ద్వారా ద్వితీయశ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తారు. డాటా అనలటిక్స్‌లోని ఉన్నతస్థాయి ఉద్యోగాలకు అనువైన వాతావరణాన్ని తయారు చేసే బాధ్యత కూడా టాస్క్‌పైనే ప్రభుత్వం ఉంచుతోంది. డాటా అనలటిక్స్‌, డాటా సైంటిస్ట్‌లు, డాటా మైనింగ్‌ నిపుణుల ఉద్యోగాలను రాష్ట్ర యువతరం అందిపుచ్చుకునేలా టాస్క్‌ ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ రంగానికి సంబంధిన అంశాలతో ఇంజినీరింగ్‌ పాఠ్యప్రణాళికలో కూడా మార్పులు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ మూడు, నాలుగు సంవత్సరాల పాఠ్యప్రణాళికను అనలటిక్స్‌లో అందివచ్చే ఉపాధి అవకాశాలకు అనుగుణంగా మారుస్తారు. టాస్క్‌ ద్వారా ఈ మార్పులు, శిక్షణ చేపడతారు. తద్వారా డాటా అనలటిక్స్‌ నిపుణులను టాస్క్‌ ద్వారా తయారు చేసి కంపెనీలకు అందిస్తారు. కంపెనీలకు, మార్కెట్‌కు మధ్య నిపుణులను అందించే నోడల్‌ ఏజన్సీలా టాస్క్‌ వ్యవహరిస్తుంది. టీహబ్‌లో కూడా ఈ రంగానికి సంబంధించిన అంకుర సంస్థలను ప్రోత్సహిస్తారు. డాటా పార్క్‌తోపాటు నాస్కామ్‌తో కలసి హైదరాబాద్‌లో అనలటిక్స్‌పై సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీని ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
కొత్త విభాగం ఏర్పాటు:
అనేక ప్రైవేటు కంపెనీలు తమ మార్కెట్‌ వ్యూహాలకు డాటా అనలటిక్స్‌పై ఆధారపడుతున్నాయి. కేవలం ప్రైవేటు రంగానికే కాకుండా ప్రభుత్వ పాలనకు కూడా ఈ అనలటిక్స్‌ను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ రంగానికి తోడుగా ఓపెన్‌ డాటా విధానాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు. సర్వేలు, గణాంకాలు, ప్రభుత్వ సమీక్షలు, దరఖాస్తులు.. తదితరాల రూపంలో కుప్పలు తెప్పలుగా వచ్చే సమాచారాన్ని సరిగ్గా విశ్లేషించి పాలనను మెరుగు పర్చటానికి ఉపయోగిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం తెలంగాణ డాటా అనలటిక్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేస్తుంది. పర్యవేక్షణకు రాష్ట్ర చీఫ్‌ సమాచార అధికారిని నియమించబోతున్నారు. సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లో జరిగే సదస్సులో ఈ విధానంపై వివరాలను వెల్లడిస్తారు. సైబర్‌ సెక్యూరిటీ, డాటా సెంటర్లు, ఓపెన్‌ డాటా విధానాలను కూడా ప్రకటిస్తారు.
ఉపాధి అవకాశాలు అపారం - జయేశ్‌ రంజన్‌, తెలంగాణ ఐటీశాఖ కార్యదర్శి
‘ఐటీరంగంలో ప్రపంచవ్యాప్తంగా జోరుమీదున్నది డాటా అనలటిక్స్‌. ఉపాధి అవకాశాలు కూడా ఇందులో చాలా వస్తున్నాయి. ఇప్పటిదాకా బెంగళూరు, గుర్గావ్‌ల్లో అనలటిక్స్‌ నిపుణులు ఎక్కువగా ఉన్నారు. ఐటీ సాంకేతిక నిపుణులను ప్రపంచానికి అందివ్వటంలో ముందున్న హైదరాబాద్‌ ఇక మీదట డాటా అనలటిక్స్‌లోనూ అగ్రస్థానంలో నిలవబోతోంది. మన యువతరం స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇందులోని ఉపాధి అవకాశాలను అందుకునేలా ప్రణాళిక రూపొందించాం.’

Posted on 13-09-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning