కొత్త ఉద్యోగాలకు 4 విధానాలు

* డేటా అనలటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసెంటర్స్, ఓపెన్ డేటా
* ఆవిష్కరించిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్
* 'యాంత్రీకరణ'ను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు

ఈనాడు, హైదరాబాద్: యాంత్రీకరణ(ఆటోమేషన్), రోబోటిక్స్‌ల కారణంగా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని ఆందోళన చెందుతున్న వేళ... ఆ భయాన్ని దూరం చేస్తూ, కొత్త కొలువులకు బాటలు వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్న డేటా రంగాన్ని ప్రోత్సహిస్తూ నాలుగు సమాచార సాంకేతిక విధానాలకు శ్రీకారం చుట్టుంది. ప్రపంచ ఐటీ రంగంలో ప్రస్తుతం అందరినోటా విన్పిస్తున్న 'డేటా మంత్రాన్ని ఆచరణలో పెట్టేందుకు వీలుగా... దేశంలోనే తొలిసారిగా డేటా అనలటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సెంటర్స్, ఓపెన్ డేటాలపై కార్యాచరణ ప్రణాళికలను పారిశ్రామిక దిగ్గజాలు, విద్యారంగ ప్రముఖుల సమక్షంలో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గురువారం(సెప్టెంబరు 15) ఆవిష్కరించారు. ఆయా రంగాల్లోని కొన్ని కంపెనీలతో కలసి పనిచేయటానికి ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. గురువారం ఆవిష్కరించిన నాలుగు విధానాలు... వాటి ప్రభావాలు క్లుప్తంగా...
1. సైబర్ సెక్యూరిటీ విధానం
ప్రపంచవ్యాప్తంగా ఐటీ, ఐటీ ఆధారిత సేవలకు సవాలు విసురుతున్నది సైబర్ చౌర్యం. దీన్ని నివారించి, భద్రత కల్పించేదే సైబర్ సెక్యూరిటీ. ఒకరకంగా చెప్పాలంటే సైబర్ రంగంలో శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసు బలగమిది! ఇందులో నిపుణులకు గిరాకీ ఎక్కువే! ఈ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించటం, నిపుణులను తయారు చేసి సురక్షిత సైబర్ వాతావరణాన్ని కల్పించటం లక్ష్యం.
* సైబర్ భద్రత గురించి అందరికీ అవగాహన కల్పిస్తారు.
* సైబర్ నేరాలను నిరోధించటానికి చట్టపరమైన ప్రణాళికను రూపొందించి... సంస్థలను ఏర్పాటు చేస్తారు. అవసరమైన నిపుణులను తయారు చేస్తారు. ఇందుకోసం కొత్త కోర్సులు ఆరంభిస్తారు.
* ఈ రంగంలో అంకుర పరిశ్రమలను, ఉత్పత్తులను ప్రోత్సహిస్తారు.
* సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేస్తారు.
* సైబర్ సెక్యూరిటీకి సంబంధించి టాస్క్ ద్వారా సర్టిఫికెట్ కోర్సులు. యూనివర్సిటీల ద్వారా మాస్టర్స్, డిగ్రీ, డిప్లొమా కోర్సులు.
ప్రయోజనం: ఈ రంగానికి ప్రోత్సాహం వల్ల సైబర్ నేరాల కట్టడితోపాటు... ప్రపంచవ్యాప్తంగా సైబర్ భద్రత రంగంలో తలెత్తుతున్న ఉపాధిని అందుకునే అవకాశం స్థానిక యువతరానికి లభిస్తుంది.
2. డేటా అనలటిక్స్
దుకాణాల్లో, షాపింగ్ మాల్స్‌లో మనం చేసే కొనుగోళ్లు, కొనకున్నా చూసి వదిలేసినవీ... బడుల్లో నమోదులు... వివిధ సర్వేల్లో కళ్ళముందు కన్పించే అంకెలు... ఇలా ప్రతిదీ సమాచారమే! వాటిని విశ్లేషిస్తే కంపెనీలకు, ప్రభుత్వానికి లాభాలు బోలెడు. అదే ఇప్పుడు డేటా అనలటిక్స్‌గా... ప్రతి రంగంలోనూ ప్రాధాన్యాంశమై నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల ఉద్యోగాలకు వేదికవుతోంది. ఈ రంగంలోని కంపెనీలను ఆకర్షించేలా... ఉద్యోగాలకు నిపుణులను తయారు చేసేలా వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు.
* సకల సదుపాయాలతో హైదరాబాద్‌లో డేటా అనలటిక్స్ పార్క్ ఏర్పాటు.
* డేటా సైన్సెస్‌లో శిక్షణనిచ్చి నిపుణును తయారు చేయడం.
* ఈ రంగంలో ముందుకొచ్చే అంకురాలకు, మధ్య, సూక్ష్మస్థాయి పరిశ్రమలకు ప్రోత్సాహం. వారి ఉత్పత్తుల కోసం ఓ వాణిజ్య విభాగం ఏర్పాటు.
* స్మార్ట్ పాలనకు వీలుగా... ప్రభుత్వానికి కూడా ఉపయోగపడేలా డేటా విశ్లేషణ విభాగం ఏర్పాటు.
ప్రయోజనం: ఐటీరంగంలో ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్న అనలటిక్స్ కంపెనీలు ఇక్కడికి రావటానికి.... అందులో వస్తున్న ఉద్యోగాలు అందుకోవటంలో యువతరానికి దోహదపడుతుంది.
3. డేటా సెంటర్లు
డేటా సేకరణ, విశ్లేషణ ఒకెత్త్తెతే... దాన్ని నిక్షిప్తం చేయడం మరో భారీ అంశం. మారుతున్న చట్టాల ప్రకారం... ఏ భౌగోళిక ప్రాంతంలోని డేటా అక్కడే ఉండాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో డేటా సెంటర్లు కీలకం కాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ విధానాల్లో డేటాసెంటర్లకు ప్రాధాన్యం పెరిగింది. అందుకే... తెలంగాణలో డేటాసెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నారు. ముందుకు వచ్చే కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తారు. తక్కువ ధరకు భూమి కేటాయిస్తారు. హైస్పీడ్ ఇంటర్నెట్, నిరంతర నీరు, ఇంధన సరఫరా... తదితరాలు సబ్సిడీ ధరలకు అందిస్తారు.
ప్రయోజనం: డేటాసెంటర్లకు కావల్సిన హార్డ్‌వేర్ తయారీ స్థానికంగా పుంజుకునే అవకాశముంది. ఇది సూక్ష్మ, మధ్యతరగతి కంపెనీలకు ప్రోత్సాహకరం. తద్వారా ఉపాధికి అవకాశం.
4. ఓపెన్ డేటా
ప్రభుత్వం వద్ద దస్త్రాల్లో దాగున్న సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచే ఈ రకమైన విధానం తీసుకొస్తున్న రెండోరాష్ట్రం తెలంగాణ. పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో... సుపరిపాలన అందించటంలో, అభివృద్ధిలో, సంక్షేమంలో ఈ విధానం కీలక మార్పులకు కారణమవుతుంది. రాష్ట్రస్థాయి నుంచి పంచాయతీలదాకా సమాచార విశ్లేషణ జరుగుతుంది.
ప్రయోజనం: సమాచారాన్ని సరైన విధంగా క్రోడీకరించి, విశ్లేషించటం వల్ల సమస్యల పరిష్కారానికి వీలవుతుంది. ఉదాహరణకు... జీహెచ్ఎంసీలో రోజూ చాలా ఫిర్యాదులొస్తాయి. వాటిలో హైదరాబాద్‌లోని ఒక ప్రాంతం నుంచి పదేపదే ఫిర్యాదులొస్తున్నట్లయితే... అన్నిసార్లు అక్కడి నుంచే ఎందుకు వస్తుందో చూసి.... దానిపై యంత్రాంగమంతా దృష్టిసారించి శాశ్వత పరిష్కారం చూపిస్తుంది.
ప్రపంచానికి హైదరాబాద్ వేదికవుతోంది: కేటీఆర్
"యాంత్రీకరణ, రోబోటిక్స్ కారణంగా ఉద్యోగాలు తగ్గిపోతాయని ఆందోళన చెందుతూ కూర్చుంటే లాభం లేదు. వాటి ప్రభావం పడని రంగాలను వెతుక్కోవాలి. ఆయా రంగాల్లో పనిచేసేలా.... మన యువతరం ప్రపంచస్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుకోవాలి. మేమిప్పుడు అదే చేస్తున్నాం. ఆధునిక రంగాలకు హైదరాబాద్‌ను ప్రపంచానికి వేదికగా మారుస్తున్నాం. మరో రెండునెలల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)-స్మార్ట్ టెక్నాలజీస్; ఈ-వేస్ట్‌మేనేజ్‌మెంట్ రంగాలపై రెండు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నాం" అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గురువారం నాలుగు కొత్త విధానాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ''డేటా అనలటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సెంటర్లు, ఓపెన్ డేటా... ఇవన్నీ కూడా ఆటోమేషన్ ప్రభావం అంతగా ఉండని రంగాలే కాకుండా... ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు పుట్టుకొస్తున్న రంగాలు! వీటిలో తెలంగాణ ముందుండాలని భావించి ఈ విధానాలు తీసుకొస్తున్నాం. అలాగని మాకు తోచింది చేయటం లేదు... పారిశ్రామికవేత్తలతో... నిపుణులతో... చర్చించి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను, తలెత్తుతున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించాం. ప్రపంచానికి సవాలు విసురుతున్న సైబర్ సెక్యూరిటీకి... అవసరంగా మారిన డాటా అనలటిక్స్, డాటా సెంటర్లకు హైదరాబాద్‌ను వేదికగా మార్చాలనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో యుద్ధాలు సైబర్‌రంగంలోనే జరుగుతాయని ప్రధానమంత్రి సైతం పదేపదే హెచ్చరిస్తున్నారు. దీన్ని నివారించే నిపుణులకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ ఉంది. ఎక్కడి సమాచారం అక్కడి భౌగోళిక ప్రాంతంలోనే దాచాల్సిన అవసరం రాబోతోంది. మునుముందు 'క్లౌడ్ నేలకు దిగక తప్పదు. డేటా సెంటర్లు కీలకం అవుతాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఉద్యోగాల్లో భవిష్యత్ గిరాకీకి తగ్గట్లుగా నిపుణులను తయారు చేయబోతున్నాం. ఇందుకు వీలుగా విశ్వవిద్యాలయాల్లోనూ పాఠ్యప్రణాళికల్లో మార్పులు తెస్తాం. వినూత్నతలో... ఆవిష్కరణల్లో తెలంగాణను ముందుంచుతాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో... సిస్కో ఇండియా అధ్యక్షుడు దినేశ్ మల్కాని, నాస్కామ్ ఉపాధ్యక్షుడు కె.ఎస్.విశ్వనాథన్, ఇంటెల్ సెక్యూరిటీ దక్షిణాసియా ఎండీ ఆనంద్ రామ్మూర్తి, కంట్రోల్ఎస్ సీఎండీ పి.శ్రీధర్‌రెడ్డి, నల్సార్ ఉపకులపతి ఆచార్య ఫైజాన్ ముస్తఫా, జేఎన్‌టీయూ హైదరాబాద్ ఉపకులపతి ఆచార్య ఎ.వేణుగోపాలరెడ్డి, హైసియా అధ్యక్షుడు రంగాపోతుల, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, సయంట్ సీఎండీ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఈవో రమా వేదశ్రీ, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సొసైటీ కార్యదర్శి భరణి ఆరోల్ తదితరులు పాల్గొన్నారు.

Posted on 16-09-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning