కొలువు మార్గం

* వచ్చేస్తున్న కార్పొరేట్ కంపెనీలు
* సామర్థ్యాలు పెంచుకుంటేనే ఉద్యోగం
* మారిన నియామకాల శైలి

* ఈ విద్యా సంవత్సరం చివరి సీజన్‌లో దాదాపు 25 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టీసీఎస్ సంస్థ ప్రకటించింది.
* ఇప్పటికే టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు మరికొన్ని ఆఫ్ క్యాంపస్ ఉద్యోగుల నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇంజినీరింగ్ కళాశాలలకు సమాచారమిచ్చాయి.
* మరో 20 ఏళ్ల వరకూ ప్రాజెక్టుల నిర్వహణకు ఢోకా లేదని, దీని కోసం తమ అవసరాలకు తగ్గట్లుగా ఫలితాలు చూపే సామర్థ్యమున్న ప్రతిభావంతులు దొరికితే..ఎంతమందినైనా నియామకం చేసుకుంటామని ఎల్అండ్‌టీ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
* అవకాశాలు చాలా ఉన్నాయని, ఆ స్థాయిలో ప్రతిభ ప్రదర్శించే విద్యార్థులే లేరని, ఎవరినో ఒకరిని మూస విధానంలో అనుసరించడమే నేటి తరం విద్యార్థుల్లో ఎక్కువ మందికి మంచి అవకాశాలు దక్కకుండా చేస్తోందని, ఐబీఎం కీలక అధికారి ఒకరు వెల్లడించారు. సృజనాత్మకత, సంబంధిత సబ్జెక్టులో ప్రతిభ, సమన్వయ మెలకువలు ప్రదర్శించే యువతకు అత్యుత్తమ స్థాయి కల్పించేందుకు ఐబీఎం వంటి సంస్థలన్నీ సిద్ధంగా ఉన్నాయని సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు.
* 10 వేల మంది విద్యార్థులకు ఉపయుక్తం జిల్లాలో మొత్తం 40 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ఈ ఏడాది సుమారు10 వేల మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలతో బయటకు వెళ్లనున్నారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఆశాజనకంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈనెల మొదటి వారం నుంచి మార్చి నెలాఖరు వరకు వివిధ ఉద్యోగ మేళాలు నిర్వహించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు కళాశాలకు ప్రాథమిక సమాచారం ఇచ్చాయి.
సమర్థులకే అందలం
మళ్లీ కొలువుల సందడి ప్రారంభమైంది. మూడేళ్లుగా ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యం స్థాయిలను ప్రశ్నార్థకంగా చూస్తూ అతి తక్కువ అవకాశాలు అందించిన సాఫ్ట్‌వేర్ రంగం మళ్లీ కొలువుల జాతర ప్రారంభించేందుకు సిద్ధమవుతోందన్న సమాచారం ఇంజినీరింగ్ విద్యార్థులు, విద్యా సంస్థలను వూరిస్తోంది. పలు ఉత్తరాది సంస్థలతో పాటు బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలకు చెందిన సంస్థలూ కొత్త నియామకాలకు ఆసక్తి చూపుతున్నాయి. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అని నల్గొండ పరిధిలోని చర్లపల్లి నిట్స్ కళాశాల ఉద్యోగ నియామకాధికారి బి.శ్రీను తెలిపారు.

మారిన కంపెనీల శైలి
గతంలో మాదిరిగా ఇబ్బడిముబ్బడిగా నియామకాలు జరుగవని, విద్యార్థుల స్థాయి...సామర్థ్యాలను బట్టే ఈ దఫా ఎంపికలు జరుగుతాయని పరిశ్రమ వర్గాలు గట్టిగా చెబుతుండడం గమనించాల్సిన విషయం.
* కేవలం పట్టా కోసమో, పర్సంటేజీ కోసమో చదివే విద్యార్థులకు ఈ నియామక ప్రక్రియలో పెద్దగా దక్కదేమీ ఉండదని, సబ్జెక్టులో చక్కటి పట్టుండి.. భాష, సమన్వయం చేసుకొంటూ..నిర్ధేశిత
* లక్ష్యాన్ని సాధించే యువతకు మాత్రం చక్కటి భవిష్యత్తు ఖాయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
* నియామక ప్రక్రియ ఆశించే ఉద్యోగార్థి తరగతుల వారీగా ఏటికేడు ఉత్తీర్ణతకు సంబంధించి స్థిరమైన ప్రగతి సాధించారా..లేదా.. అన్నదీ పరిశీలిస్తారని చెబుతున్నారు.
* వీటితో పాటు ఉద్యోగార్థి పాటించే క్రమశిక్షణనూ ప్రధాన్య అంశంగా పరిగణించనున్నారని అంటున్నారు.
* తామాశించే సామర్థ్యమున్న అభ్యర్థి గ్రామాల్లోనే కాదు.. అడవిలో ఉన్నా తీసుకుంటామని చెబుతుండడాన్ని బట్టి పరిశ్రమకు ఇప్పుడున్న అవసరం ఏలా ఉందో.. అర్థం చేసుకోవచ్చు.

విద్యార్థులో 'నై'పుణ్యం

ఒకప్పుడు మన విద్యార్థులంటే అత్యుత్సాహం ప్రదర్శించిన సాఫ్ట్‌వేర్ పరిశ్రమ వర్గాలు...కొన్నేళ్లుగా ఇక్కడి ఇంజినీరింగ్ విద్యార్థులంటే అంత ఆసక్తి ప్రదర్శించడం లేదు. కారణం.. మన యువత ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా ఉండడం లేదనేది దీనికి కారణం. కేవలం 15 నుంచి 18 శాతం మంది విద్యార్థులు మాత్రమే సంస్థల అవసరాలకు తగిన సామర్థ్యం, ప్రతిభతో ఉన్నారంటున్నారు.

క్రమశిక్షణారాహిత్యం...

ఇక్కడి విద్యార్థుల్లో క్రమశిక్షణారాహిత్యం స్పష్టంగా ఉందని ఎత్తిచూపుతున్నారు. కళాశాలలోమాదిరిగానే కుర్రతనం చేష్టలు చూపిస్తున్నారని అంటున్నారు. ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదివి, ఇంజినీరింగ్‌కు తమిళనాడు, కర్ణాటకు వెళ్లిన విద్యార్థుల్లో ఆ శాతం తక్కువగా ఉందని విశ్లేషకులుచెబుతున్నారు. సంస్థ క్రమశిక్షణా రాహిత్యాన్ని భరించొద్దని చెప్పారు.

నాలుగు లక్షణాలే ముఖ్యం
విద్యార్థులను ఎంపిక చేసే ముందు ప్రధానంగా నాలుగు లక్షణాలను పరిశీలిస్తామని ఇన్ఫోసిస్ క్యాంపస్ కనెక్ట్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధీర్‌రెడ్డిఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు.
1. ప్రధానంగా ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచి చదివినా సదరు సబ్జెక్టుల్లో సమస్యల పరిష్కార నైపుణ్యత ఎంతమేరకు ఉందో పరిశీలిస్తారు.
2. తర్వాత ఆంగ్లభాషా నైపుణ్యం ఎలా ఉందన్నది చూస్తారు.
3. బృందంలో ఒకరిగా పని చేసేందుకు, సమస్యలు ఎదురైనప్పుడు...నష్టాల దశ నుంచి లాభాల దశకు తీసుకొచ్చేందుకు గ్లోబల్ ఆలోచనా విధానం ఏ మేరకు ఉందో చూస్తామన్నారు.
4. చివరిగా విద్యార్థిలో నాణ్యత, ఆర్టిప్యులేషన్ లక్షణాలను పరిశీలిస్తామన్నారు.

భవిష్యత్తు బాగుంటుంది
డాలర్‌తో రూపాయి మారకపు విలువ పడిపోవడం వల్ల మార్కెట్ వూపందుకుంటోంది. 2014 భవిష్యత్తు బాగుంటుంది. రెండు నెలల క్రితం ప్రకటించిన అన్ని సంస్థల ఫలితాలు ఎంతో బాగున్నాయని విన్నాం. ఆ మేరకు ఈ ఏడాది దక్షణ భారతదేశంలో నియామకాలు ఆశాజనకంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు. విద్యార్థులు కష్టపడి చదివి కొలువుల సాధనకు కృషి చేయాలి.

- కె.మాధవి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్....

ద్విగుణీకృతమైన అవకాశాలు

గత ఏడాది భారతీయ ఐటీ దిగ్గజాలు 35 వేల మందికి మాత్రమే నియామకాలు చేశాయని ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలింది. గత ఏడాది త్రైమాసికంలో సంస్థలన్నీ మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో ఈసారి 60 వేల మంది వరకు కొత్తగా నియమించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. జనవరి నుంచి మార్చి వరకు నియామకాల ప్రక్రియ కొనసాగే అవకాశముంది.

- బి.శ్రీను, ఉద్యోగ నియామకాధికారి.

ఉద్యోగాలకు కొదవలేదు
సాఫ్ట్‌వేర్ రంగంలో అవకాశాలకు కొదవలేదు. మరో 20 ఏళ్లదాకా ఎల్అండ్‌టీ సంస్థకు అవసరమైనన్నీ ప్రాజెక్టులున్నాయని సంస్థ ఇటీవల ప్రకటించింది. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండి..పనిలో నేర్పరితనం గల లక్షణాలుంటే కచ్చితంగా ఎంపికవుతారు.అభ్యర్థుల అకాడమిక్ ట్రాక్ రికార్డు స్థిరంగా, ప్రగతిశీలకంగా ఉండటం అవసరం.

- పి.లచ్చిరెడ్డి, ప్రొఫెసర్...
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning