తొలి ఏడాదే ఇంటర్న్‌షిప్‌!

ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు ఉంటాయా? ఆ అవకాశమే ఉండదని చాలామంది భావిస్తుంటారు. కానీ వాస్తవం వేరు! సాంకేతికేతర రంగాల్లో వీరికి ఇంటర్న్‌షిప్‌ చేసే వీలుంది. ఇవి కెరియర్‌కి అన్ని రకాలుగానూ ప్రయోజనం కల్పిస్తాయి.

ఆర్తి ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని. భవిష్యత్తులో తన కెరియర్‌కు అవసరమైన కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడంతోపాటు మంచి సీవీని తయారుచేసుకోవడానికి తోడ్పడే ఇంటర్న్‌షిప్‌ కోసం చూస్తోంది. సాంకేతిక నైపుణ్యాలు, ప్రావీణ్యం ఉండవు కాబట్టి మొదటి సంవత్సరం విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లు పొందలేరని ఆమె స్నేహితులూ, సీనియర్లూ చెప్పారు. అయినా ఆర్తి తన ప్రయత్నాన్ని ఆపలేదు. చివరకు తన మొదటి సంవత్సరంలోనే రెండు ఇంటర్న్‌షిప్‌లను పొందింది. తన ఐదో సెమిస్టర్‌కల్లా ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తూ, ఒక స్టార్టప్‌ కంపనీలో ఇంటర్న్‌షిప్‌ కూడా చేస్తోంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తయేసరికి చాలా ప్రాజెక్టుల్లో పనిచేసింది. వాటిల్లో తన కళాశాల వెబ్‌సైట్‌ కూడా ఉంది.
మొదటి సంవత్సరం విద్యార్థులకు సాంకేతికేతర విభాగాల్లో చాలా ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉంటాయి. ఆర్తి లాంటి చాలామంది విద్యార్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. చాలా ఇంటర్న్‌షిప్‌లు ఇంటి వద్దనుంచే చేసే (వర్క్‌ ఫ్రం హోం)వి ఉన్నాయి. వీటిని కేవలం వేసవి సెలవుల్లోనే కాకుండా, సెమిస్టర్‌లు చదువుతున్నపుడూ చేయవచ్చు. ఇంటర్న్‌షిప్‌లు లభించే కొన్ని ముఖ్యమైన విభాగాలు..
* సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌
మంచి భావప్రసరణ నైపుణ్యాలు ఉండి, కొత్త వ్యక్తులతో కలిసి మాట్లాడే ఆసక్తి ఉంటే ఈ ఇంటర్న్‌షిప్‌ ద్వారా వ్యాపార సామ్రాజ్యం గురించిన ప్రాథమిక అనుభవాన్ని పొందవచ్చు. దీని ద్వారా కళాశాల ఫెస్ట్‌లకు స్పాన్సర్‌షిప్‌ హెడ్‌గా ఉండే అవకాశాలూ మెరుగవుతాయి. ఇది అదనంగా అభ్యర్థి తమ సాఫ్ట్‌ స్కిల్స్‌ను సానబెట్టుకోవడానికీ, భవిష్యత్తులో ఎంబీఏ చేయాలనుకుంటే తమను తాము సంసిద్ధం చేసుకోవడంలోనూ తోడ్పడతాయి.
* కంటెంట్‌ రైటింగ్‌
కథలు/ కథనాలు రాయడం (పరీక్షల్లోనే కాదు) ఇష్టమా? పాఠశాల మ్యాగజీన్‌కు ఎడిటర్‌ లేదా సొంత బ్లాగు లేదా ఫేస్‌బుక్‌ పేజీని నిర్వహించడం లాంటివి చేశారా? అయితే కంటెంట్‌ రైటింగ్‌ ఇంటర్న్‌షిప్‌ డబ్బులు చెల్లిస్తూ.. రాత నైపుణ్యాలను మెరుగుపర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నుంచి ఇన్ఫోగ్రాఫ్రిక్స్‌ వరకూ కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంతోపాటు భిన్నశ్రేణి రంగాలు పరిచయమవుతాయి. ఇది కళాశాల మ్యాగజీన్‌కు చీఫ్‌ ఎడిటర్‌/ మీడియా అధికార ప్రతినిధి అవడానికీ తోడ్పడుతుంది.
* గ్రాఫిక్‌ డిజైనింగ్‌
డూడుల్స్‌/ స్కెచ్‌లు వేయడం మీకిష్టమా? ఫొటోషాప్‌ గురించి కొంత పరిజ్ఞానముందా? వివిధ లోగోలను లేదా వెబ్‌సైను గమనిస్తూ, వాటిని ఇంకా మెరుగ్గా చేయగలరో ఆలోచిస్తూ ఉంటారా? మంచి డిజైనింగ్‌ పరిజ్ఞానముందని భావిస్తే, మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఎన్నో అవకాశాలున్నాయి. అధిక ఆదరణ ఉన్న గ్రాఫిక్‌ డిజైన్‌లో కొత్త కెరియర్‌ను ఎంచుకునే అవకాశమూ ఉంటుంది.
* ప్రోగ్రామింగ్‌
కోడింగ్‌ రాయగల చాతుర్యముందా? కంప్యూటర్ల ప్రపంచాన్ని ఇష్టపడతారా? అయితే మీరు దరఖాస్తు చేసుకోవడానికి చాలా రకాల వ్యక్తిగత వెబ్‌ అండ్‌ మొబైల్‌ ఆప్‌ డెవలప్‌మెంట్‌ ఇంటర్న్‌షిప్‌లు ఉన్నాయి. నిజ వాతావరణంలో పనిచేస్తూ కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకోవడమేకాక, అందులో నిష్ణాతులవవచ్చు.
* ఎన్‌జీవో
దిగజారుతున్న మన సమాజం పట్ల కలత చెందుతున్నారా? మార్పుతేగలిగే నమ్మకముందా? నిజానికి ఒక ఎన్‌జీవోలో ఇంటర్న్‌షిప్‌ చేయడం ద్వారా మీరు మార్పు తేగలరు. ఎన్‌జీవోలో ఇంటర్న్‌షిప్‌ చేయడం ద్వారా సమాజ తీరును అర్థం చేసుకోవడమే కాక మానవజాతి అభివృద్ధికీ తోడ్పడగలరు. ఇందుకుగానూ మీరు ఏదైనా ఆశ్రమంలో పనిచేయవచ్చు లేదా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యాబోధన చేయవచ్చు. ఇంకా ప్రముఖ సంఘసేవకులతో పనిచేయవచ్చు; రచనల ద్వారా జాగృతం చేయవచ్చు.
కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని అమితాసక్తి ఉంటే, ఇంటర్న్‌లో భాగంగా ఒక స్టార్టప్‌ కంపెనీని స్థాపించవచ్చు. అనేక ప్రాజెక్టులను ప్రారంభదశ నుంచి చేయడం మొదలుపెట్టవచ్చు. మొదటి సంవత్సరంలోనే ఇంటర్న్‌షిప్‌ చేయడం ద్వారా అనుభవం పొందడంతోపాటు తరగతిలో లభించని విషయాలను నేర్చుకునే, తయారుచేసే వీలు కలుగుతుంది. విద్యార్థుల్లో ప్రత్యేక గుర్తింపును కూడా పొందవచ్చు.
మంచి భావప్రసరణ నైపుణ్యాలు ఉండి, కొత్త వ్యక్తులతో కలిసి మాట్లాడే ఆసక్తి ఉంటే సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఇంటర్న్‌షిప్‌ ద్వారా వ్యాపార సామ్రాజ్యం గురించిన ప్రాథమిక అనుభవాన్ని పొందవచ్చు.

- సురేష్ అగ‌ర్వాల్, సీఈఓ, ఇంట‌ర్న్‌శాల


Posted on 19-09-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning