యంత్రవిద్యకు మంత్రముగ్ధం 

ఒకప్పుడు ఇంజినీర్‌ అంటే భారీ పరికరాలు, యంత్రాలతో సహవాసం అన్న భావన ఉండేది. కానీ.. మారుతున్న కాలంలో ఇంజినీరింగ్‌లోనూ సౌకర్యవంతమైన కొలువులు అధికమయ్యాయి. అందుకే ఒకప్పుడు పురుషుల ఆధిపత్యం సాగిన ఈ రంగంలో ఇప్పుడు అమ్మాయిలూ రాజ్యమేలుతున్నారు. అన్ని రకాల ఇంజినీరింగ్‌ కోర్సుల్లోనూ యువతుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచంలో ఇంకే దేశంలోనూ లేనంతగా భారత్‌లో మహిళలు ఇంజినీరింగ్‌ విద్యపై మక్కువ చూపుతున్నారు. మన దేశంలో 79 శాతం మంది యువతులు ఇంజినీరింగ్‌ చదవడానికే ఇష్టపడుతున్నారు. గత పదిహేనేళ్లలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరుతున్న అమ్మాయిల సంఖ్య రెండున్నర రెట్లు పెరిగింది.
ఎందుకింత మక్కువ? 
అనేక ఇతర వృత్తుల కంటే మెరుగైన వేతనాలు లభిస్తుండడం. 
సృజనకు అవకాశం ఉండడం. 
కెరీర్‌లో ఎదుగుదలకు అవకాశాలు ఉండడం. 
 పని నేర్చుకుంటూ ఉద్యోగం పొందే అవకాశాలు. 
 నైపుణ్యాలు ఉంటే దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఎక్కడైనా పనిచేయడానికి అవకాశాలు లభిస్తుండడం.

తల్లిదండ్రులదీ అదే మాట 
ప్రపంచంలోని మరే దేశంలో లేనట్లుగా భారత్‌, చైనాలోని యువత ఇంజినీరింగ్‌, సైన్స్‌ కోర్సులకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులూ అటే మొగ్గు చూపుతున్నారు.
మనదేశంలో ఇలా.. 
ఇంజినీరింగ్‌ పట్టభద్రుల్లో సగటున 82 శాతం మందికి ఉద్యోగ నైపుణ్యాలు లేవు 
70 శాతం ఇంజినీరింగ్‌ కాలేజిల్లో నాణ్యమైన విద్య అందించడం లేదు. 
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లలో 81 శాతం మందికి సరైన నైపుణ్యాలు లేవని అధ్యయనాలు చెబుతున్నాయి. 
మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లదీ ఇదే పరిస్థితి. 
‘క్వీన్‌ ఎలిజబెత్‌ ప్రైజ్‌ ఫర్‌ ఇంజినీరింగ్‌’ నివేదిక ప్రకారం భారత్‌లో ప్రతిష్ఠాత్మక కెరీర్లలో ఇంజినీరింగ్‌ది మూడో స్థానం. వైద్యులు మొదటి స్థానంలో, శాస్త్రవేత్తలు రెండో స్థానంలో ఉన్నారు. 
ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే రంగంగానూ రెండో స్థానంలో ఉంది.
ఆశాకిరణం అదే.. 
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, కొరతలకు వచ్చే 20 ఏళ్లలో ఇంజినీరింగ్‌ పరిష్కారం చూపిస్తుందని ప్రపంచదేశాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రత్యేకించి ఇంజినీరింగ్‌ రంగంపై ‘క్వీన్‌ ఎలిజబెత్‌ ప్రైజ్‌ ఫర్‌ ఇంజినీరింగ్‌’ నిర్వహించిన అధ్యయనంలోనూ ఇదే అభిప్రాయం అధికుల నుంచి వ్యక్తమైంది. 
పునరుత్పాదక ఇంధన రంగం అభివృద్ధికి తోడ్పడుతుంది. 
కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌) వంటి అధునాతన కంప్యూటర్‌ సాంకేతికల వ్యాప్తి. 
మౌలిక వసతుల కొరతకు పరిష్కారం చూపించడంలోనూ ఇంజినీరింగ్‌ కీలక పాత్ర పోషించనుంది. 
ఆన్‌లైన్‌ భద్రత 
వాతావరణ మార్పులు 
నివాస గృహాల కొరత సమస్య పరిష్కారానికి కీలకం కానుంది.

ఫీజుల భారం.. అవకాశాల కొరత 
అయితే ఇంజినీరింగ్‌ విద్యపై ఎంతగా మక్కువ చూపుతున్నప్పటికీ అధిక వ్యయం అవుతుందని, కోర్సు పూర్తిచేసిన తరువాత ఉద్యోగావకాశాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నవారూ అంతేస్థాయిలో ఉంటున్నారు. ఈ విషయంలో దక్షిణ కొరియా విద్యార్థుల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంది. భారత్‌లో రుసుముల్లో రాయితీలు వంటివి ఉన్నప్పటికీ ఇంజినీరింగ్‌ విద్యను ఆర్థిక భారంగానే అధికులు చెబుతున్నారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Posted on 21-09-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning