టీహబ్‌-2కు కేంద్రం సై!

* నవంబరు 5న భూమిపూజ
* రూ.160 కోట్లతో 3 లక్షల చదరపు అడుగుల్లో
* దేశంలోనే తొలి భారీ అంకుర కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి ముఖచిత్రంగా మారిన అంకుర కేంద్రం టీ-హబ్‌ మరో సరికొత్త రూపు సంతరించుకుంటోంది. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా దేశంలోనే అతిపెద్ద అంకుర కేంద్రంగా టీ-హబ్‌ రెండో దశకు రంగం సిద్ధమైంది. రూ.160 కోట్లతో 3లక్షల చదరపు అడుగుల స్థలంలో నిర్మించనున్న ఈ టీహబ్‌-2కు కేంద్రం కూడా సహకారం అందించేందుకు లాంఛనంగా అంగీకరించినట్లు తెలిసింది. అంటే రూ.160 కోట్ల వ్యయంలో కేంద్రం, రాష్ట్రం చెరిసగం భరించి ఈ ప్రతిష్ఠాత్మక అంకుర కేంద్రాన్ని నిర్మించబోతున్నాయి. నవంబరు 5న సైబరాబాద్‌లోని రాయదుర్గం వద్ద టీ హబ్‌-2కు భూమి పూజ చేయబోతున్నారు. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి హాజరయ్యే అవకాశముంది. 2018లో హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వబోతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ నాటికి దీన్ని ఆరంభించేలా... 18నెలల్లో సిద్ధం చేయబోతున్నారు. తెలంగాణ ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఈవిషయాన్ని ధ్రువీకరించారు.
దేశంలోనే అత్యుత్తమైనదిగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ళ, రతన్‌ టాటాలాంటి దిగ్గజాలతో ప్రశంసలందుకున్న ప్రస్తుత టీహబ్‌ కంటే ఈ ప్రతిపాదిత టీహబ్‌-2 భారీగా ఉండబోతోంది. ప్రస్తుత టీహబ్‌ 70వేల చదరపు అడుగుల్లో ఉండగా... కొత్తది 3లక్షల చదరపు అడుగులు ఉండబోతోంది. పాత దాంట్లో 800 మందికి చోటుండగా... కొత్త హబ్‌ను 4 వేల మందికి వీలుగా నిర్మిస్తున్నారు. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ఉండే అన్నిరకాలైన సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. విశ్లేషకులకు(అనలిస్టులు) కూడా ఇక్కడ చోటు కల్పిస్తున్నారు. తద్వారా అంకుర ఆలోచనల్లో బలముందా లేదా... అది నిలదొక్కుకుంటుందా లేదా అన్నది కూడా వారు విశ్లేషించి చెబుతారు.
విదేశీయులకు, భారతీయులకు కూడా టీహబ్‌-2 వారధిగా నిలుస్తుంది. విదేశీ అంకుర సంస్థలు కూడా ఇక్కడికి వచ్చేలా ఈకేంద్రంలో ‘ఇండియా గేట్‌వే’ పేరిట ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా విదేశీ సంస్థలు ఇక్కడి నుంచి తమ సంస్థలను భారత్‌లో నమోదు చేసుకోవచ్చు. అలాగే మన సంస్థలకు కూడా విదేశాల్లోని అంకుర కేంద్రాలు, సంస్థలతో అనుసంధానం కోసం ఏర్పాట్లుంటాయి. విద్య తదితర రంగాల్లో ఉన్నట్లే అంకురాలకు సంబంధించి ఇక్కడివారిని విదేశాలకు పంపటం... విదేశీ సంస్థలను ఇక్కడికి తీసుకురావటంలాంటి కార్యక్రమాలూ చేపడతారు. ఇందుకు వీలుగా... ముందే సింగపూర్‌, యూకే, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌లాంటి దేశాల్లో టీహబ్‌ ఔట్‌పోస్టులను ఏర్పాటు చేయబోతున్నారు.
వసతులన్నీ ఒకేచోట
‘‘ఇప్పటిదాకా టీహబ్‌లో కేవలం అంకుర సంస్థలకు మాత్రమే స్థానం కల్పించగలుగుతున్నాం. వెంచర్‌ కేపిటలిస్టుల(వీసీ)తో అప్పుడప్పుడు సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నాం. ఇప్పుడు నిర్మించబోయే టీ హబ్‌-2లో వెంచర్‌ కేపిటలిస్టులు, మార్గదర్శకుల (మెంటార్లు)తోపాటు... అంకుర సంస్థలకు కావల్సిన అన్ని రకాల సదుపాయాలు ఒకేచోట అందుబాటులో ఉంటాయి. వీటి కోసం మరోచోటికి వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదు.’’
- జయేశ్‌రంజన్‌, తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి
Posted on 01-10-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning