బ్యాక్‌లాగ్‌ లేకుంటే భవితకు భరోసా

వృత్తివిద్యలు చదివే విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల్లో ఒకటి- కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవటం. అంతకన్నా తీవ్రమైనది- ‘ఇది ఇంజినీరింగ్‌లో షరా మామూలే’ అని సమాధానపరచుకోవడం / అలవాటుపడిపోవడం! కానీ బ్యాక్‌లాగ్‌ వల్ల నష్టాలూ, భవిష్యత్తులో ఎదురయ్యే చిక్కుల గురించి తెలుసుకుంటే ఈ ధోరణి నుంచి బయటపడే వీలుంది!
ప్రతి విద్యార్థికీ తను చదువుల్లో బాగా రాణించాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్‌ కాకూడదనీ ఉంటుంది. ఇంజినీరింగ్‌ వంటి వృత్తి విద్యల్లో ఉన్నవారికైతే ఇది మరీ ఎక్కువ. అయితే అలసత్వం వల్లనో, అవగాహన లోపం వల్లనో కొన్ని సందర్భాల్లో వైఫల్యాలకు గురై ఆ తరువాత చిక్కులపాలవుతుంటారు.
నిజానికి ఎటువంటి పరిస్థితుల్లో ఉత్తీర్ణతకు దూరమవుతారో, తెలుసుకోలేకపోవడం, కొంతమేరకు నిర్లక్ష్యం, నిరాసక్తత ప్రధానకారణాలుగా అర్థం చేసుకోవాలి.
మౌలిక అంశాలపై శ్రద్ధ
ఇంజినీరింగ్‌ వంటి వృత్తివిద్యను అభ్యసించాలంటే మొట్టమొదటగా ఇంజినీరింగ్‌ చదువుపట్ల అభిరుచి ఉండాలి. ఆపైన వృత్తి విద్యలో సెమిస్టర్‌ పద్ధతిలో పరీక్షలు త్వరితగతిన ఉంటాయి కాబట్టి ప్రణాళికబద్ధంగా అధ్యయనం కొనసాగించాలి.
సెమిస్టర్‌లోని సబ్జెక్టుల్లో ఎక్కువగా ఫెయిల్‌ అవ్వడానికి అవకాశాలున్నవాటిని విద్యార్థులు గుర్తించాలి. దీనివల్ల ఆ సబ్జెక్టుపట్ల తగిన జాగరూకత వహించవచ్చు. ఆ సబ్జెక్టుకు సంబంధించిన మౌలిక అంశాలపై ఎక్కువ శ్రద్ధ చూపించాల్సివుంటుంది. తగిన అదనపు సమయాన్ని కేటాయించి, అభ్యసించి బ్యాక్‌లాగ్‌ రాకుండా నివారించవచ్చు.
ఏదైనా సబ్జెక్టులో ఉత్తీర్ణత పొందటానికి కిందివి ప్రధాన కారణాలు:
1. సబ్జెక్టుకు సంబంధించి మౌలికాంశాలపై సరైన పట్టు లేకపోవడం.
2. ఆ పుస్తకం చదవాలంటే నిరాసక్తత కలగడం. ఇటువంటి పరిస్థితి ప్రమాదకారి. ఎందువల్లనంటే- సబ్జెక్టులోని మూలాలపై ఆధారపడి అనేక ఇతర సబ్జెక్టులు పై సెమిస్టర్లలో ఉంటాయి.
ఉదా: మెకానికల్‌ ఇంజినీరింగ్‌ శాఖలో మొదటి సంవత్సరం, మొదటి సెమిస్టర్‌లో ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌ అనే సబ్జెక్టు చదవాల్సి ఉంటుంది. ఈ సబ్జెక్టుపై ఆసక్తి కలిగించుకోకపోతే ఆ లోపం వల్ల ఎన్నో సబ్జెక్టుల్లో నష్టం వాటిల్లే ప్రమాదముంది.
3. ‘ఈ సబ్జెక్టు మా శాఖకు సంబంధించినది కాదు’ అనే అపోహ. ఇంజినీరింగ్‌లో ఒక శాఖకు చెందిన సబ్జెక్టులను మాత్రమే చదివి నేర్చుకుని సఫలమవ్వగలమని భావించటం అత్యాశే. మానవ జీవనం సుఖవంతం, సరళతరం చేయడానికి ఇంజినీరింగ్‌ వృత్తి అత్యావశ్యకం. ఇది నిరాఘాటంగా సాగాలంటే ఇంజినీరింగ్‌లోని వివిధ శాఖల అంతస్సంబంధాల గురించి సంపూర్ణ అవగాహన అభిలషణీయం. వాటి అంతర ఆధారం గురించి తెలిసి ఉండడం, వాటి పరస్పర సహకారం గురించి ప్రాథమికంగానైనా తెలుసుకోవడం అవసరం.
ఉదా: ఒక కంప్యూటర్‌సైన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి మోటార్ల స్వయం నియంత్రణకు సంబంధించిన ప్రోగ్రామ్‌ రాయాలంటే మోటార్‌ పనిచేసే తీరుతెన్నుల గురించి గ్రహించడం అవసరం. ఇంజినీరింగ్‌లో సీఎస్‌ఈ విద్యార్థి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టుపై ‘నా శాఖకు సంబంధించిన సబ్జెక్టు కాదు!’ అన్న కారణాన సరైన శ్రద్ధ చూపకపోతే ఏమవుతుంది? మౌలికాలపై అవగాహనాలోపం వల్ల నిరాసక్తత పెరుగుతుంది; నిర్లిప్తతతో సరిగా చదవక ఫెయిల్‌ అయ్యే అవకాశముంది. ఇతర బ్రాంచీలకు చెందిన సబ్జెక్టుల్లో విద్యార్థులు ఫెయిల్‌ అయిన సందర్భాలు చాలా ఉండడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
4. పరిపూర్ణమైన సంసిద్ధత లోపించినపుడు విద్యార్థులు సబ్జెక్టులోని అన్ని అధ్యాయాల్లోనూ తగినవిధంగా పరీక్షలకు తయారయ్యే అవసరాన్ని అర్థం చేసుకోలేకపోతారు. అలాంటి పరిస్థితుల్లో తమ విజ్ఞతతోనూ, గతంలోని ప్రశ్నపత్రాల ఆధారంతోనూ ముఖ్యమైన అధ్యాయాల్లో తయారై పరీక్షలను రాస్తుంటారు.

ఒక సబ్జెక్టు కష్టమనిపించినపుడు అందులో తయారవడం కొంతమేరకు లోపభూయిష్ఠంగానే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆశించినమేరకు ప్రతిభను ప్రదర్శించలేకపోవడానికి చాలా అవకాశాలుంటాయి.
5. పరీక్షల్లో మూల్యాంకనంపై అవగాహన లోపం. విద్యార్థులకు చాలావరకు మూల్యాంకనం పట్ల అవగాహన లేదనేది నిజం. ఇంజినీరింగ్‌ స్థాయిలో ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలు... విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను ఏ మేరకు అనువర్తనం చేయగలరనేదానిపై ఆధారపడి ఉంటాయి. అంటే- కనీసం కొన్ని ప్రశ్నలకైనా సమాధానాలు సొంతంగా రాయవలసి ఉంటుంది.
కేవలం పుస్తకాల్లో ఉన్న విషయజ్ఞానానికే పరిమితమైతే పరీక్షల్లో ఉత్తీర్ణతకు దూరమయ్యే అవకాశాలుంటాయి. పైగా ఒక సమాధాన ప్రతం మూల్యాంకనం చేయడానికి సమయం ఎక్కువగా ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో విద్యార్థి రాసిన సమాధానంలోని ముఖ్యమైన అంశాల ఆధారంగా మూల్యాంకనం జరగవచ్చు.
సమాధానాన్ని సూటిగా, స్పష్టంగా రాయకుండా వ్యాసరూపంలో రాస్తే, తక్కువ మూల్యాంకనానికి గురై మార్కులు తగ్గిపోయే ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చు.
బ్యాక్‌లాగ్‌ అనివార్యమా?
చాలామంది విద్యార్థుల్లో ‘బ్యాక్‌లాగ్‌ లేకుండా ఇంజినీరింగ్‌ కోర్సు ముగించలేం’ అనే అభిప్రాయం ఉంటోంది. అంటే బీటెక్‌ సమయంలో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్‌ అయినా వెంటవెంటనే ఉత్తీర్ణులై నాలుగేళ్లలో చదువు ముగిస్తే ఇబ్బందులేవీ ఉండవనే ఆలోచన ఉంది. ఈ ఆలోచన చాలావరకు నిజమే అయినా, కొంతమేరకు సరికాదు కూడా!
సాధారణంగా మూడు, నాలుగు సంవత్సరాల్లో ప్రాంగణ నియామకాలకు సంస్థలు కళాశాలలకు వస్తుంటాయి. అందరికీ ఆయా సంస్థలు అవకాశాలు ఇస్తాయి. లేదా బ్యాక్‌లాగ్‌లు ఉన్నా నియామకాలకు అనుమతిస్తారు అనే అపోహలు కొన్ని ఉన్నాయి. ప్రాంగణ నియామకాల్లో పాల్గొనే విద్యార్థులు ఎటువంటి అర్హతలు కలిగివుండాలనే విషయంలో కళాశాల వహించగలిగిన పాత్ర ఏమీ ఉండదు. నియామకాలకు వచ్చే సంస్థలు అర్హతలను నిర్ణయిస్తాయి.
సర్వసాధారణంగా ఎటువంటి బ్యాక్‌లాగ్‌ ఉండకూడదు, 60% బీటెక్‌లో ఉండాలి అనే నిబంధనలతో నియామకాలకు ఇంటర్వ్యూలు కొనసాగిస్తాయి. అయితే కొన్ని ప్రముఖ సంస్థలు 65- 70% కనీస అర్హతగా ప్రకటిస్తే, మరికొన్ని అగ్రశ్రేణి సంస్థలు, బహుళజాతి సంస్థలు గతంలో ఎప్పుడూ ఫెయిల్‌ అయ్యి ఉండకూడదు అనే నిబంధనలు విధిస్తాయి. ఇటువంటివి విధిస్తే అటువంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు రాకపోయే ప్రమాదముంది.
మరికొన్ని సంస్థలైతే ఇంటర్వ్యూ సమయంలో ఎందుకు ఫెయిల్‌ అయ్యారో వివరణలు అడిగే అవకాశముంది. విద్యార్థులు ఇచ్చే వివరణపై వారి వ్యక్తిత్వ, మానసిక పరిపక్వత వంటి కీలకాంశాల మూల్యాంకనం ఉంటుంది.
ఉదా: ఒక ఉద్యోగానికి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారనుకుంటే- ఇందులో ఒక విద్యార్థి ఎప్పుడూ ఫెయిల్‌ అవ్వకుండా 65% మార్కులతోనూ, ఇంకొక అభ్యర్థి కొన్నిసార్లు ఫెయిల్‌ అయినా 70% మార్కులతో ఇంటర్వ్యూను ఎదుర్కొన్నారు. అన్ని అంచెల్లో ఇద్దరు సమ ఉజ్జీలుగా ఉన్నా, మొదటి విద్యార్థికి ఉద్యోగం లభించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.
ఇక్కడ సంస్థ అంచనా ముఖ్యవిషయం- మొదటి విద్యార్థికి ఒక బాధ్యత ఇస్తే (సెమిస్టర్‌లోని అన్ని సబ్జెక్టులు చదివి పాస్‌ కావడం) విఫలమవ్వకుండా సమర్థంగా, సంతృప్తికరంగా నిర్వహించగలడు. రెండో అభ్యర్థి కొన్ని సందర్భాల్లో సంతృప్తికరమైన ప్రతిభ చూపగలిగినప్పటికీ అన్ని సందర్భాల్లోనూ ఆ స్థాయి ప్రతిభ ప్రదర్శించలేకపోవచ్చు. ఇలాంటి అభిప్రాయాలకు రావటానికి బ్యాక్‌లాగ్‌లు ఆస్కారాన్నిస్తాయి.
‘కొన్ని అగ్రశ్రేణి సంస్థలు ‘అభ్యర్థులు గతంలో ఎప్పుడూ ఫెయిలైవుండకూడదు’ అనే నిబంధనలు విధిస్తాయి. అలాంటపుడు బ్యాక్‌లాగ్‌ ఉన్నవారికి ఇబ్బంది. ’
నిరోధించడమెలా?
బ్యాక్‌లాగ్‌లతో పాసైనా ఉద్యోగాలు రావనీ, జీవితం అక్కడితో అంతమైపోతుందనీ కాదు. గతంలో బ్యాక్‌లాగ్‌లు ఉన్నా ఉద్యోగాలు, మంచిస్థాయి, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఉన్నతవిద్య అభ్యసించినవారు ఎందరో ఉన్నారు.
అయితే వీరి పయనంలోని విధివిధానాలను పరిశీలిస్తే ఒక ప్రాథమిక అంశం కనిపిస్తుంది. వీరిలో చాలామందికి ఒకటీ లేదా రెండు బ్యాక్‌లాగ్‌లు మాత్రమే ఉంటాయి. తమ వైఫల్యానికి కుంగకుండా దాన్ని విజయానికి మెట్టుగా వాడుకునివుండటం కనిపిస్తుంది. భవిష్యత్తులో బ్యాక్‌లాగ్‌లు లేకుండా జాగ్రత్త తీసుకుని తమ లోపాలను గుర్తించుకుని దిద్దుబాటు చర్యలకు పూనుకునివుండటం గమనించవచ్చు.
విద్యార్థులు ముఖ్యంగా ఒక విషయాన్ని ఎన్నడూ మరవకూడదు. తాము విఫలమవ్వాలని కోరుకోలేదు, తమ తల్లిదండ్రులు కోరుకోరు, అధ్యాపకులు, కళాశాల వారికీ ఇష్టముండదు. విశ్వవిద్యాలయం కూడా ఫెయిల్‌ చేసే ఉద్దేశంతో పరీక్షలు నిర్వహించదు.
ఎవరికీ ఇష్టంలేని ఈ నివారించదగిన విపత్తు సంభవిస్తోందంటే దానికి విద్యార్థి చదివే పద్ధతిలో కొన్ని సరిదిద్దుకోగలిగిన పొరపాట్లు ఉన్నాయన్నమాటే. నిర్లిప్తత, నిరాసక్తత, ఆత్మవిశ్వాసలోపం లేదా సబ్జెక్టులోని మౌలికాలపై పట్టు లేకపోవడం ఇలాంటి వైఫల్యాలకు కారణమని గుర్తించాలి.
చాలా సబ్జెక్టుల్లో మొదటిసారే ఉత్తీర్ణులు కానివారు కూడా ఉద్యోగాలు తెచ్చుకోగలిగినవారు ఉన్నారు. నిజమే. కానీ వీరు కూడా కాస్త ఆలస్యమైనా తమ లోపాలను గుర్తించినవారే. ఇతరత్రా మెలకువలు పెంచుకుని తద్వారా సఫలమవ్వగలిగారు. లేకపోతే వారికి ఇష్టమైన రంగంలో ఎన్నో పరీక్షలను ఎదుర్కొని, నిరంతర శ్రమతో వైఫల్యాలను అధిగమించారని తెలుసుకోవాలి.
విద్యార్థులు ప్రతిరోజూ కనీసం 2 నుంచి 3 గంటలు తమ పాఠ్యాంశాలను ఆసక్తితో అభ్యాసం చేయటం, నిర్దిష్టమైన ప్రణాళికను అనుసరించటం చేస్తే చాలు... బ్యాక్‌లాగ్‌ అనే భూతం బారినపడకుండా ఉండొచ్చు; రాజీలతో కూడుకున్న భవిష్యజ్జీవితం లభించకుండా తేలిగ్గా దాన్ని నివారించుకోవచ్చు!
ఇవీ నష్టాలు...
బ్యాక్‌లాగ్‌ ఉంటే కలిగే నష్టాలేమిటి అన్న విషయంలో కొన్ని నిర్దిష్టమైన జవాబులు పొందవచ్చు.
* బ్యాక్‌లాగ్‌ వ్యక్తిత్వపరంగా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితిని పెంచుతుంది.
* కొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదముంది.
* ఒక సెమిస్టర్‌లో ఉన్న సబ్జెక్టులకు అదనంగా బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులు కూడా చదవవలసి వస్తుంది. ఈ మానసిక బాధ్యత, ఒత్తిడి తక్కువేమీ కాదు.
* ఎక్కువ బ్యాక్‌లాగ్‌లు ఉంటే ప్రతిరోజూ లేక ఎటువంటి విరామం లేకుండా పరీక్షలు రాయాల్సిన దుస్థితి.
* ఫెయిల్‌ అయిన సబ్జెక్టు మళ్లీ చదవాలంటే మానసికంగా సంసిద్ధత లేకపోవడం, దానివల్ల సరిగా తయారు కాకపోవడం తద్వారా మళ్లీ విఫలమయ్యే ప్రమాదముంది.
* ఫెయిల్‌ అయిన సబ్జెక్టుల్లో పాస్‌ అయితే చాలనే మానసిక నిర్లిప్తతకు అవకాశం ఉంది. దానివల్ల ఈ సబ్జెక్టు ఆధారంగా చదవవలసిన ఇతర సబ్జెక్టులపై సమగ్ర అవగాహన కొరవడే ప్రమాదం ఏర్పడుతుంది.
* నాలుగో సంవత్సరంలో బ్యాక్‌లాగ్‌ వస్తే ప్రాంగణ నియామకాల్లో వచ్చిన ఉద్యోగావకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది.
* కొన్ని ప్రాంగణ నియామకాలకు అర్హత కోల్పోయే ప్రమాదముంది.
* ఫెయిలవ్వడం కేవలం అనుకోనివిధంగా జరిగిందనీ, మరే ఇతర కారణం కాదనీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
* ప్రాంగణేతర నియామకాల్లో పాల్గొనే అవకాశం లభించినా విపరీతమైన పోటీని ఎదుర్కోవలసిన అనారోగ్యకరమైన పరిస్థితి ఉంటుంది.
* అభిరుచి కలిగిన రంగంలో ప్రతిభకు తగిన పారితోషికంతో ఉద్యోగం సంపాదించుకోవడం కష్టం కావొచ్చు.
* అభిరుచి మనస్ఫూర్తిగాలేని రంగంలోనో లేక అంశంలోనో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితిలోకి వెళ్లడం.
* కెరియర్‌ పథంలో ఆశించనమేర పురోగతికి అవరోధం ఏర్పడవచ్చు.

- నీల‌మేఘ శ్యామ్ దేశాయి, లైఫ్‌స్కిల్స్ డెవ‌ల‌ప్‌మెంట్ సెల్‌


Posted on 03-10-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning