స్కైప్‌ ఇంటర్వ్యూ సక్సెస్‌ కావాలంటే...?

సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందడంతో ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలను కూడా ఫోన్‌ లేదా వీడియో కాల్‌ ద్వారా పూర్తి చేస్తున్నాయి. అభ్యర్థులకు ప్రయాణ భారాన్ని తగ్గించడానికి, తమ సమయాన్ని ఆదా చేసుకోవడానికి రిక్రూటర్లు ఎక్కువగా స్కైప్‌ ఇంటర్వ్యూలను ఎంచుకుంటున్నారు. ఉద్యోగార్థులు స్కైప్‌ ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి ఉపయోగపడే కొన్ని సూత్రాలు...

వ్యక్తిగత ఇంటర్వ్యూలాగే వస్త్రధారణ...
స్కైప్‌ ఇంటర్వ్యూలో మీరు నేరుగా ఇంటర్వ్యూ చేసే వారి ముందు హాజరు కాకపోయినా వస్త్రధారణ విషయంలో జాగ్రత్త వహించాలి. చక్కగా స్నానం చేసి, మీకు బాగా సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ధరించడం మేలు. కొత్త ప్రయోగాలు, ఫ్యాషన్లు ప్రయత్నించకండి. మీరు ఏ కంపెనీ ఇంటర్వ్యూకు హాజరు కాబోతున్నారో దాని వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్‌ పేజ్‌, ట్విటర్‌ అకౌంట్లను గమనిస్తే ఆ కంపెనీ ఉద్యోగుల వస్త్రధారణ, ప్రవర్తన ఎలా ఉంటాయో అర్థమవుతుంది. మీరు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకి హాజరైతే ఎలా తయారవుతారో స్కైప్‌ ఇంటర్వ్యూకి కూడా అలాగే ఉండాలి.
పరిసరాలు కూడా....
మీ ఇంటర్వ్యూ ఫోన్‌లో లేదా వీడియోకాల్‌లో జరుగుతున్నట్లయితే మీరున్న ప్రదేశం నిశ్శబ్దంగా, శుభ్రంగా ఉండాలి. మీకు సంబంధించిన వస్తువులను ఆ గదిలో గజిబిజిగా పడేయకండి. మీ వెనుక (బ్యాక్‌గ్రౌండ్‌)తెల్లటి తెరలాంటిది ఏర్పాటు చేసుకోండి. అలాగే మీ డెస్క్‌టాప్‌ నీట్‌గా ఉండాలి. మీ మెబైల్‌ ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో ఉంచండి. తలుపులున్న గదిలో అయితే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి అలా ఏర్పాటు చేసుకోండి.
ముందస్తు సాధన అవసరం...
ఇదే మీకు మెదటి వీడియో కాల్‌ అయితే ఎక్కడ చూడాలి? చేతులు ఎలా ఉంచుకోవాలి? ఎంత గట్టిగా మాట్లాడితే వినిపిస్తుంది లాంటి సందేహాలు తలెత్తుతాయి. అలాంటప్పుడు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఒకసారి వీడియోకాల్‌లో మాట్లాడటం ద్వారా ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం- మీ సంభాషనలు రికార్డు చేయండి. ఈ విశ్లేషణ ఆధారంగా స్కైప్‌ ఇంటర్వ్యూను తేలికగా పూర్తి చేయగలరనే ధీమా వచ్చే వరకు సాధన చేయండి.
ముఖంపై చిరునవ్వు..
ముఖాముఖి ఇంటర్వ్యూలో మాదిరే స్కైప్‌ ఇంటర్వ్యూలో కూడా ముఖంపై చిరునవ్వు చాలా అవసరం. వీడియోకాల్‌ కొనసాగుతున్నంతసేపు మీ ముఖంపై చిరునవ్వును చెదరనివ్వకండి. ఇంటర్వ్యూ చేసే వారికి మీపై ఒక మంచి అభిప్రాయం ఏర్పడటానికి అవకాశం ఇచ్చేది మీ నవ్వే.
సాంకేతిక సమస్యా...?
మీరు స్కైప్‌ ఇంటర్యూలో వున్న సమయంలో ఏవైనా సాంకేతికపరమైన సమస్యలు తలెత్తవచ్చు. బలహీనమైన నెట్‌ కనెక్షన్‌, అంతరాయాలు, మాట సరిగా వినిపించకపోవడం లాంటి ఇబ్బందులు రావొచ్చు. అలాంటి పరిస్థితి ఎదురైతే ‘ఎక్స్‌క్యూజ్‌ మీ’ అంటే సరిపోతుంది. ఇంటర్వ్యూ చేసే వారు అర్థం చేసుకోగలరు. ఆ సమస్యను సరిచేస్తున్నంత సేపు స్నేహపూర్వకంగా, నిశ్శబ్దంగా ఉండండి. ఒకవేళ అది పరిష్కారం కాకపోతె మరోసారి ఇంటర్వ్యూకి అవకాశం ఇవ్వమని అభ్యర్థించండి.
సూటిగా చూడండి...
వెబ్‌కామ్‌ వైపు నేరుగా చూస్తూ మాట్లాడండి. స్క్రీన్‌ లేదా నేలను చూస్తూ మాట్లాడటం మంచి పద్ధతి కాదు. మీ లాప్‌టాప్‌ని పుస్తకాలు లేదా ఎత్తయిన వస్తువుల మీద ఉంచడం ద్వారా కెమెరాను మీ ముఖానికి సరిపోయే ఎత్తులో అమర్చుకోవచ్చు.
స్పందించండి...
వినడంపై శ్రద్ద వహించండి. అవతలి వారికి మీరు వింటున్నట్టు తెలియడం చాలా ముఖ్యం. వింటున్నట్లు తెలిపే శబ్దం, ఉదాహరణకు ‘ఎస్‌’ లాంటివి మీ నుంచి వస్తే ఇంటర్వ్యూ చేసే వారికి మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారని, తమ మాటలు వినిపిస్తున్నాయని అర్థం అవుతుంది. ఇంకో విషయం- ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా సంభాషణ సజావుగా జరుగుతోందని, మీరు వింటూ ఉన్నారని ఇంటర్వ్యూ చేసేవారికి తెలియజేయడానికి ఇది చాలా అవసరం.
హెడ్‌ ఫోన్‌...
మీకు మైక్‌ ఉన్న హెడ్‌ఫోన్‌ ఉంటే స్కైప్‌ ఇంటర్వ్యూ సమయంలో అది ఉపయోగించండి. మీ మాట మరింత స్పష్టంగా అవతలి వారికి వినిపించడానికి తోడ్పడుతుంది. వారేమంటున్నది మీకు కూడా బాగా అర్థమవుతుంది.
ఇవి చాలా ముఖ్యం...!
* చదవడానికి, గుర్తుంచుకోవడానికి కష్టంగా ఉండే పేరు లేదా చిన్నప్పటి ముద్దు పేరును యూజర్‌ నేమ్‌గా ఉంచకండి. మీ పేరు స్పష్టంగా తెలిసేలా ఉన్న యూజర్‌ నేమ్‌ ఉపయోగించడం మంచి పద్ధతి.
* గందరగోళానికి తావు లేకుండా అవతలి వారు అడిగే ప్రశ్నను స్పష్టంగా విన్నాకే జవాబు చెప్పాలి. తద్వారా మీరు శ్రద్ధగా వింటున్నారని ఇంటర్వ్యూ చేసేవారికి అర్థమవుతుంది.
* అత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనిపించడం చాలా ముఖ్యం. తడబాటుకు లోనవకుండా ప్రశాంతంగా ఇంటర్వ్యూ పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
* ఇంటర్వ్యూ ముగియగానే కృతజ్ఞతలు (థ్యాంక్స్‌) చెప్పడం మర్చిపోకండి.
నో చెప్పకండి..!
ఇంటర్వ్యూ చేసేవారు మిమ్మల్ని స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూ చేస్తామంటే ‘నాకు స్కైప్‌ లేదు’, ‘ఇంటర్నెట్‌ కనెక్షన్‌ స్లోగా ఉంది ’, ‘ఫోన్‌లోనే ఇంటర్వ్యూ చేయండి’ లాంటి సమాధానాలు ఇవ్వకండి. అలా అన్నారంటే మీ ఇంటర్వ్యూలో మొదటి ప్రశ్నకు ‘నో’ అని జవాబు చెప్పినట్లే. స్కైప్‌ ఉపయోగించడం అనేది ఇప్పుడు సర్వ సాధారణంగా మారింది. కాబట్టి స్కైప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, అకౌంట్‌ క్రియేట్‌ చేసి ఉంచుకోండి. ఇంటర్వ్యూ చేసేవారు స్కైప్‌లో ఇంటర్వ్యూకి సిద్ధమేనా అని అడిగితే వెంటనే మీ అకౌంట్‌ వివరాలను మెయిల్‌ చేయండి.
Posted on 18-10-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning