పోస్టులు భర్తీ చేయడం కష్టంగా ఉంది

* తగిన నైపుణ్యం కలిగిన వారే లేరు
* 48% యాజమాన్యాలది ఇదే అభిప్రాయం
* ఉన్నవారికే శిక్షణ ఇచ్చి కొత్త పోస్టుల్లో నియామకం
* మ్యాన్‌ పవర్‌ గ్రూప్‌ సర్వే

దిల్లీ: తగిన అర్హత కలిగిన నిపుణులు లభ్యం కానందున, పోస్టులు భర్తీచేయడం చాలా కష్టంగా ఉందని దేశంలో 48 శాతం యాజమాన్యాలు అభిప్రాయ పడుతున్నాయి. నైపుణ్యాల కొరతపై మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ప్రపంచవ్యాప్తంగా 42,000 యాజమాన్యాల నుంచి అభిప్రాయాలు సేకరించగా, 40 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిపుణుల కొరతపై 2007 తరవాత ఇంతమంది ఇలా పేర్కొనడం ఇప్పుడే.
* దేశీయంగా మరింత అధికంగా 48 శాతం యాజమాన్యాలు నిపుణుల కొరతపై ఆందోళన వ్యక్తం చేశాయి.
* ఆయా పోస్టులకు అవసరమైన భావ వ్యక్తీకరణ నైపుణ్యం అభ్యర్థుల్లో సరిగా ఉండటం లేదని 36 శాతం మంది పేర్కొన్నారు. తాము ఇస్తామన్న మొత్తం కంటే అధిక వేతనాలను అభ్యర్థులు ఆశిస్తున్నారని 34 శాతం మంది తెలిపారు.
* అవసరమైన నిపుణుల కొరత పీడిస్తున్నందున, ఉన్న సిబ్బందిలోనే కొందరికి శిక్షణ ఇచ్చి ఆయా పోస్టుల్లో నియమిస్తున్నామని దేశంలోని 36 శాతం యాజమాన్యాలు వెల్లడించాయి.
* పోస్టులు భర్తీ చేయడం కష్టంగా ఉందని ఆసియా దేశాల్లో 46 శాతం యాజమాన్యాలు తెలిపాయి. జపాన్‌ (86 శాతం), తైవాన్‌ (73 శాతం), హాంకాంగ్‌లో 69 శాతం మంది ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని చైనాలో కేవలం 10 శాతం మందే తెలిపారు.
డిమాండ్‌ ఈ రంగాల్లో
దేశీయంగా ఐటీ నిపుణులు, అకౌంటింగ్‌-ఫైనాన్స్‌ సిబ్బంది, ప్రాజెక్ట్‌-విక్రయ విభాగాల మేనేజర్లు, వినియోగదారు సేవాకేంద్ర ప్రతినిధులు, వినియోగదారు సాంకేతిక సహాయ నిపుణులు, నాణ్యతా నిర్థారణ నిపుణులకు గిరాకీ ఉంది.
* ఐటీ, అకౌంటింగ్‌ నిపుణుల అవసరం క్రమంగా పెరుగుతూనే ఉందని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏజీరావు తెలిపారు. రాబోయే నెలల్లో సాంకేతికత మెరుగుదల, ఆర్థిక వ్యవహారాల్లో మరింత అందుబాటు ప్రక్రియలకు అధిక అవకాశాలు లభిస్తాయని వివరించారు.
* ఆటోమేషన్‌ వల్ల అధిక నైపుణ్యం గల ఉద్యోగాలకు గిరాకీ లభిస్తుందన్నారు. బిగ్‌ డేటా, అనలిటిక్స్‌, మొబిలిటీ, డిజైన్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, కృత్రిమ మేథస్సు వంటి రంగాల్లో అధిక అవకాశాలు, ఆకర్షణీయ వేతనాలు లభిస్తాయని పేర్కొన్నారు.

Posted on 19-10-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning