ఐఐటీ, ఐఐఎంలూ గుర్తింపునిస్తాయ్‌

* వాటికి న్యాక్‌ తరహా అధికారాలు

ఈనాడు - హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలకు ఇక ఐఐటీలు, ఐఐఎంలూ గుర్తింపు ఇవ్వనున్నాయి. ఇప్పటివరకూ వీటికి నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కమిటీ (న్యాక్‌) మాత్రమే అక్రెడిటేషన్‌ ఇచ్చేది. ఈ కమిటీకి ఉన్న అధికారాలను ఐఐటీలు, ఐఐఎంలకూ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ ఆమోదం తెలిపింది. ఇటీవల దిల్లీలో జరిగిన ఐఐటీ కౌన్సిల్‌ పలు నిర్ణయాలు తీసుకుంది. కౌన్సిల్‌ తీర్మానాల కాపీని ‘ఈనాడు’ సంపాదించింది. ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ తదితర కళాశాలల్లో ఎంత మేరకు మౌలిక వసతులున్నాయో గుర్తించేందుకు న్యాక్‌ ఆయా విద్యాసంస్థలను తనిఖీ చేసి ఏడు రకాల గ్రేడ్లు ఇస్తున్న విషయం తెలిసిందే. న్యాక్‌ గ్రేడింగ్‌ ఉంటే ఆ విద్యాసంస్థ కొంత వరకు నాణ్యతాప్రమాణాలను పాటిస్తోందని భావించవచ్చు. న్యాక్‌ మాదిరిగానే ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఐఐటీలు, మేనేజ్‌మెంట్‌ కళాశాలలకు ఐఐఎంలు ఇక గుర్తింపు ఇవ్వొచ్చు. న్యాక్‌కున్న అధికారాలను ఎంపిక చేసిన ఐఐటీలు, ఐఐఎంలకు కూడా అప్పగించేందుకు ఐఐటీ కౌన్సిల్‌ ఛైర్మన్‌, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి జావడేకర్‌ ఆమోదం తెలిపారు. అంటే ఇక నుంచి ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కళాశాలలు గుర్తింపు కోసం న్యాక్‌తోపాటు ఐఐటీలు, ఐఐఎంలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిష్ఠాత్మక సంస్థలు గుర్తింపు ఇస్తే ఆ విద్యాసంస్థ ప్రతిష్ఠ పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రపంచ ర్యాంకింగ్‌ కోసం ‘విశ్వజీత్‌’
ఇప్పటి వరకు ప్రపంచస్థాయి ర్యాంకింగ్‌లో టాప్‌-100లో భారత్‌కు చెందిన ఒక్క విద్యాసంస్థ కూడా స్థానం సంపాదించలేదు. నాణ్యతాప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వజీత్‌ అనే ప్రాజెక్టును రూపొందించింది. దానికి ఐఐటీ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. పాత ఐఐటీలైన ఐఐటీ ఢిల్లీ, బొంబాయి, మద్రాస్‌, ఖరగ్‌పూర్‌, కాన్పూర్‌, రూర్కీ, గువాహటిలను బలోపేతం చేసి టాప్‌-100 ర్యాంకింగ్‌లో నిలపాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అందుకు ఏ ఐఐటీకి ఏం కావాలో ప్రతిపాదనలు పంపించాలని కౌన్సిల్‌ సూచించింది.
ప్రాథమిక నైపుణ్యాలపై శిక్షణ: ఇక నుంచి అన్ని ఐఐటీలూ బీటెక్‌ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలతో పాటు విలువల గురించి మూడు వారాల శిక్షణ ఇవ్వనున్నాయి. ఐఐటీ బెనారస్‌ ఇస్తున్న శిక్షణను అన్ని చోట్లా అమలు చేయాలని కౌన్సిల్‌ నిర్ణయించింది.
మరి కొన్ని నిర్ణయాలివీ..
* ఐఐటీ పూర్వ విద్యార్థులు, ఐఐటీలతో కలిసి పరిశ్రమల అవసరాల మేరకు స్వల్ప కాలిక కోర్సులు అందిస్తారు.
* ఐఐటీల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ సీట్లను ఇప్పుడున్న 72వేల నుంచి 2020నాటికి లక్షకు పెంచాలని నిర్ణయించారు. ఏయే సంస్థల్లో ఏ సీట్లు పెంచుకోవాలో కసరత్తు చేయాలి.
* ఐఐటీల్లో విదేశీ బోధకులను తీసుకోవాలని నిర్ణయించారు. అందుకు ఐఐటీ పూర్వ విద్యార్థుల సంఘాలు ఆయా ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ పూర్తి చేస్తున్న ఐఐటీలకు పనికివచ్చే విదేశీ విద్యార్థులను గుర్తించాలి.
* ఐఐటీల్లో బీటెక్‌ కోర్సుల్లో బాలికల ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు (జేఏబీ)ఐఐటీ మండి సంచాలకుడు తిమోతీ గాన్‌సాల్వెస్‌ ఛైర్మన్‌గా ఒకకమిటీని నియమించింది. బీటెక్‌లో బాలికలు చేరేందుకు వీలున్నమార్గాలను ఆయన ఆధ్వర్యంలోని ఈ కమిటీ సూచిస్తుంది.


Posted on 21-10-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning