ప్రతిభకే ఉద్యోగ విజయం!

* ప్రాంగణ ఎంపికల తీరు మారింది
* కంపెనీల వడపోత తీవ్రమైంది
* తట్టుకుని నిలబడాలంటే సత్తా ఉండాల్సిందే
* సంప్రదాయబద్ధ చదువులకు చరమగీతం పాడాల్సిందే

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ చదివేది.. దానికి అనుబంధమైన కొలువు సాధించడానికా..! లేక షాపింగ్‌మాళ్లు, బీపీవో, కాల్‌సెంటర్లలో చేరడానికా... అనే విషయాన్ని ప్రతి విద్యార్థి కచ్చితంగా ఆలోచించాల్సిన సమయమిది. ఏటా ఇంజినీరింగ్‌లో చేరుతున్న విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఆశించిన ఉద్యోగాల్ని సాధించలేక విఫలమవుతున్నారు. దొరికిన కొలువులో చేరిపోతూ నెట్టుకొస్తున్నారు. ఏటా బీటెక్‌లో చేరే విద్యార్థులు తెలంగాణ వ్యాప్తంగా 55 వేల నుంచి 60 వేల మంది ఉంటున్నారు. 95 శాతం ఉత్తీర్ణతతో కొలువులకు సై అంటున్నారు. మారిన ప్రాంగణ ఎంపికల తీరుకు తగ్గట్టుగా ఈ విద్యార్థులు సంసిద్ధులై ఉన్నారా? కంపెనీల వడపోతని తట్టుకోవడం ఎలా? ఇలాంటి అంశాలపై విద్యార్థులకే కాదు తల్లిదండ్రులకూ ఆందోళన ఎక్కువైపోతోంది. ప్రతిభకే ఉద్యోగ విజయం అనేది నేటి వాస్తవం..దీనిపై ‘ఈనాడు’ విశ్లేషణ ఇది...
తెలంగాణ రాష్ట్రంలో చదువులకు వేదిక హైదరాబాద్‌. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోనే ఇంజినీరింగ్‌ కళాశాలలు ఎక్కువగా నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో ఎక్కువ మంది విద్యార్థులు నగరంలోనే ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతాల తర్వాత వరంగల్‌లోనే ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఎక్కువ.. ప్రాంగణ ఎంపికలు బాగున్నా... పేరొందిన కంపెనీల్లో కొలువు సాధించడం మాత్రం కష్టమవుతోంది. తత్ఫలితంగా ఏటా ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థుల్లో ఎక్కువ మంది మంచి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించలేకపోవడం కలవరపరిచే అంశం. మరో వైపు ఏటా ఇంజినీరింగ్‌ పూర్తిచేసి బయటకొస్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగిపోయి విపరీతమైన పోటీ ఏర్పడుతోంది.
తాజా విద్యార్థులకు డిమాండు
నేడు అన్ని బహుళ జాతి సంస్థల (ఎంఎన్‌సీ) ప్రాంగణ ఎంపికల ద్వారా తాజా విద్యార్థులను తీసుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నాయి. వీరితో తక్కువ జీతాలకే పనిచేయించుకోవడంతో పాటూ వారికి అవసరమైన విధంగా శిక్షణ ఇచ్చుకునేందుకు వీరైతే అనువుగా ఉంటారని భావించి వీరి వైపు మొగ్గుచూపుతున్నాయి. ఎంటెక్‌ చేసిన వారికంటే బీటెక్‌ వారికే చాలా సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి.
తెలంగాణలో వాస్తవ పరిస్థితి ఇదీ..
హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 150 సుమారు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. హైదరాబాద్‌ మినహాయిస్తే తెలంగాణలో సుమారు 40 మాత్రమే ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 190 వరకు ప్రభుత్వం, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రాంగణ ఎంపికల్లో కొలువులు దక్కుతున్నా... పేరొందిన కంపెనీలో ఉద్యోగ లక్ష్యం మాత్రం ఏ కొద్దిమందికో నెరవేరుతోంది. మంచి జీతం ఇచ్చే కంపెనీల్లో కొలువులకు తీవ్ర పోటీ ఉంటోంది. పోటీ ప్రపంచంలో కొలువులను చేజిక్కించుకోవాలంటే.. సంప్రదాయబద్ధ చదువులకు చరమగీతం పలికి.. వినూత్నంగా విద్యార్థులు ఆలోచించి తొలి ఏడాది నుంచే కసరత్తు ప్రారంభించాల్సి ఉందని.. తరగతి గదిని దాటి వెళ్లినప్పుడు నిలదొక్కుకునేందుకు పుష్కలంగా అవకాశాలు ఎదురొస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
వడపోత పెరిగిపోయింది..
కొలువులు తక్కువగా ఉండి.. విద్యార్థుల మధ్య విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో వడపోత కోసం కంపెనీలు చాలా మార్గాలను ఎంచుకుంటున్నాయి. సైకో మెట్రిక్స్‌, ఉన్నతస్థాయిలో గణితంపై పట్టు, సంజ్ఞాత్మక నైపుణ్యాలు (కాగ్నెటివ్‌ స్కిల్స్‌), ఆంగ్లంపై పూర్తిస్థాయిలో పట్టున్న వారి కోసం వెతుకుతున్నాయి. ఇప్పటివరకూ సంప్రదాయ బద్ధమైన చదువులతో నెట్టుకొస్తున్న 90 శాతం విద్యార్థులు ఈ వడపోతలో పక్కకు వెళ్లిపోతున్నారు. ఈ తరుణంలో వీటన్నింటిపై పట్టు సాధించిన. వారికే ఉద్యోగ దారులు తెరుచుకుంటున్నాయి.
గణితంపై పట్టుంటేనే సాధ్యం..
సంజ్ఞాత్మక నైపుణ్యం, సైకోమెట్రిక్స్‌ వంటి వాటిపై విద్యార్థులకు పూర్తి పట్టుండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. ఈ రెండింపై పట్టుసాధించాలంటే గణితంలో విద్యార్థులు తిరుగులేకుండా ఉండాలి. ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య కంటే ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్లు ఎక్కువైపోవడంతో ఎదురిచ్చి మరీ విద్యార్థులను చేర్చుకునేవి ఎక్కువైపోయాయి. కేవలం 20 శాతం కళాశాలలు తప్ప.. మిగతా వాటన్నింటి పరిస్థితీ ఇంతే. ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థికి కచ్చితంగా గణితంపై పట్టుండాల్సిందే.
కంపెనీల కొత్త ఎత్తుగడ..
గతంలో ప్రాంగణ ఎంపికల కోసం వచ్చే సంస్థలకు ఎవరైనా సూచన చేస్తే ఒకరిద్దరు విద్యార్థులను తీసుకునేవి... ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎవరు చెప్పినా తీసుకోవడం లేదు. విద్యారి సత్తాను బట్టే ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. దీనికి కేవలం ఇంజినీరింగ్‌ సబ్జెక్టులపై పట్టుంటే చాలదు. సదరు కంపెనీ అవసరాలకు తగ్గట్టుగా సిద్ధమై ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. కొద్దిగా శిక్షణ ఇస్తే.. చాలు దూసుకెళ్లిపోతారనే వారినే ఎంచుకుంటున్నాయి. ఇలాంటి విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరమూ ఉండదనే కోణంలో సంస్థలు ఆలోచిస్తున్నాయి. వ్యయ నియంత్రణకు (కాస్ట్‌ కటింగ్‌) ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి.. ప్రాంగణ ఎంపికలో ఎంపికైన విద్యార్థులు నేరుగా వచ్చి కొలువు చేసుకుపోయేలా ఉండాలని కోరుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్ల నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రాంగణ ఎంపికలకు వచ్చిన 90 శాతం సంస్థలు ఇదే పంథాను అనుసరించాయి.
చాలా కఠినమైన ఆంగ్లం..
ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రాంగణ ఎంపికల్లో కొలువు సాధించాలంటే ఆంగ్లంతో ఆడుకోవాల్సిందే. ప్రస్తుతం మామూలు ఆంగ్లం ఉంటే.. వారి వైపు కూడా కంపెనీలు చూడడం లేదు. చాలా కఠినమైన ఆంగ్లం కోరుకుంటున్నాయి. అందుకే తొలి ఏడాది నుంచి నిత్యం ఆంగ్లంపై సాధన చేస్తూనే ఉండాలి. జీవితంలో ఇదో ప్రధానభాగమనే అంశాన్ని గుర్తించాలి. ప్రస్తుతం 70శాతం మంది విద్యార్థులు ఆంగ్లంలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఉండడంతో అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు.
విద్యార్థి ఏం చేయాలి..
ఇంజినీరింగ్‌లో చేరిన మొదటి ఏడాదే తాము అంతవరకూ చదువుకున్నది అసలు చదువే కాదనే విషయం విద్యార్థులు గుర్తిస్తారు. వీరు అయోమయంలో పడకుండా.. తాము గతంలో బట్టీ పట్టి పూర్తిచేసిన 7, 8, 9, 10వ తరగతికి చెందిన ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, గణితం పాఠ్యపుస్తకాలను అర్థం చేసుకుని మళ్లీ సొంతంగా చదువుకోవాలి. మొదటి ఏడాదిలోనే ఈ పని చేయాలి. వీటిపై పట్టుసాధించిన తర్వాతే.. వారికి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చెప్పే ప్రాథమిక అంశాలు అర్థమవుతాయి. గణితం, సైన్స్‌, ఇంజినీరింగ్‌ మధ్య సంబంధమూ అవగతమవుతుంది. ఇలా చేసిన వారు మాత్రమే ఇంజినీర్లుగా ఎదుగుతారు. లేదంటే.. ఇంజినీరింగ్‌ పట్టా ఉన్నవారిగా మాత్రమే ఉండిపోతారు. కొలువు సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా పూర్తి ఇంజినీరింగ్‌పై అవగాహన, ప్రోగ్రామింగ్‌పై పట్టు, సంజ్ఞాత్మక నైపుణ్యాలు, ఆంగ్లంపై పూర్తిపట్టు సాధించాలి. ఏ కంపెనీలో కొలువు కోసం వెళ్తున్నారో.. వారి అవసరాలేంటి, ఏ సాంకేతికత వాడుతున్నారనేవి తెలుసుకోవాలి. దానికి సంబంధించిన అంశాలపై పట్టుసాధించాలి. ఏ సంస్థ గురించి తెలుసుకోవాలన్నా.. ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉంటాయి. ఇంజినీరింగ్‌ నాలుగేళ్లలోనూ స్వయం సాధన అనేది లేకుంటే.. పోటీ ప్రపంచంలో నిలబడలేరు. కేవలం తరగతి గదిలో చెప్పింది వినేసి.. పరీక్ష రాసి బయటకొస్తే.. సంస్థలకు బయటే ఉండిపోతారు.
తల్లిదండ్రులేం గుర్తించాలి..?
విద్యార్థుల కంటే తల్లిదండ్రులు ప్రధానంగా ఓ విషయం గుర్తుంచుకోవాలి. గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో బలహీనంగా ఉన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంజినీరింగ్‌లో చేర్చకూడదు. ప్రస్తుతం ఉన్న బట్టీ పట్టే విధానంలో చదువులు పూర్తిచేసుకుని వస్తున్న విద్యార్థులే 90 శాతానికి పైగా ఉంటున్నారు. వీరంతా ఇంటర్‌ వరకూ బట్టీ పట్టి పరీక్షలు రాసి.. వచ్చినవారే. వీరు ఇంజినీరింగ్‌లో చేరిన తర్వాత అంతా అయోమయంగా ఉంటుంది. తొలి ఏడాదిలోనే ఆసక్తి లేకపోతే.. వారు మిగతా నాలుగేళ్లూ అనాసక్తిగానే చదువును కొనసాగిస్తారు. ఒకవేళ ఇంజినీరింగ్‌లో ఇప్పటికే చేర్చినవారైతే.. వెంటనే కళ్లు తెరిచి.. వారికి ఏఏ అంశాలపై పట్టుండాలనేది తెలుసుకుని తర్ఫీదు ఇవ్వడం ద్వారా తప్పును కొంత వరకూ సరిదిద్దుకోవచ్చు.
ప్రస్తుతం భారీగా తగ్గిపోయి..
భారతదేశపు ఆర్థిక వ్యవస్థలో సేవలు, వస్తు వినిమయ, ఉత్పాదక రంగాలు కలిపి 55 శాతం ఉండగా.. 45 శాతం సాఫ్ట్‌వేర్‌ రంగం పాత్ర ఉంది. అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన పరిమాణామాల నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ రంగంపై ప్రతికూల ప్రభావం పడింది. ఉద్యోగాలు భారీగా తగ్గిపోయాయి. మనపై దాని ప్రభావం నేరుగా పడింది. గతంలో 80-90 శాతం ప్రాంగణ ఎంపికలు జరిగే కళాలల్లో ప్రస్తుతం 40 శాతం లోపు పడిపోయాయి. 40 శాతం ప్రాంగణ నియామకాలు జరిగే కళాశాలల్లో పరిస్థితి 10శాతం లోపునకు పడిపోయింది. ఫలితంగా విద్యార్థుల మధ్య పోటీ తీవ్రంగా మారిపోయింది. విభిన్నంగా ఆలోచించి అన్ని అంశాలపై పట్టుసాధించిన విద్యార్థులే నెగ్గుకు రాగలుగుతున్నారు. మనిషి చేసే పనులన్నింటినీ యంత్రాలతో చేయించుకునే పరిస్థితి పెరగడంతో ఈ రంగంలో కొలువులు తగ్గుతున్నాయి. ఇదే సమయంలో ఐవోటీ, బిగ్‌డాటా, డాటా ఎనలిస్ట్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి వాటిలో ప్రస్తుతం కొలువులు పెరుగుతున్నాయి. వీటిపై పట్టు సాధించిన విద్యార్థులు సులువుగా కొలువులు సాధిస్తున్నారు.
ప్రాంగణం దాటిన వారు 5శాతమే..
కళాశాల ప్రాంగణ ఎంపికల్లో కొలువులు సాధించలేని విద్యార్థులు బయటకొచ్చి కొలువుల కోసం ప్రయత్నించడం ప్రస్తుతం ఇబ్బందికరంగానే మారుతోంది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకే చెప్పి.. కొత్తవారిని చూడాలని సూచిస్తున్నాయి. సదరు ఉద్యోగులు తమకు తెలిసిన వారిని తీసుకుంటుంటారు. కేవలం అభ్యర్థులను సూచించడం (రిఫరెన్స్‌)ల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ప్రాంగణ ఎంపికలో కొలువులు సాధించలేకపోతున్న వారిలో కేవలం ఐదు శాతమే సాఫ్ట్‌వేర్‌, ఇంజినీరింగ్‌ అనుబంధ కొలువుల్లో స్థిరపడుతున్నారు. ఐదు శాతం మంది పైచదువుల కోసం వెళ్లిపోతున్నారు. మిగతా వారంతా.. చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు.
సంస్థల వరకూ వెళ్లాలంటే..
పాఠ్యపుస్తకాల్లోని అంశాలపైనా ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పూర్తిగా పట్టుండాలి. కొలువులు ఇచ్చే సంస్థల వరకూ వెళ్లి అవకాశాన్ని కోరాటంటే.. ఇంజినీరింగ్‌లో వచ్చే పర్సంటేజీ మార్కులుండాల్సిందే. కొన్ని సంస్థలు 80 శాతం, మరికొన్ని 70 శాతం మార్కులుంటేనే మౌఖిక పరీక్షలకు హాజరవ్వాలని కంపెనీలు సూచిస్తున్నాయి. అందుకే సంస్థల వరకూ చేరాలంటే.. కచ్చితంగా పరీక్షల మార్కులూ ప్రధానమే. ఇతర నైపుణ్యాలపై దృష్టి సారించి.. అసలు విషయాన్ని మరచిపోయే విద్యార్థులు ఈ సంగతీ గుర్తుంచుకోవాలి.
ఏడాది ఖాళీగా ఉండిపోతే..
ఇంజినీరింగ్‌ విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ప్రాంగణ ఎంపికల్లో కొలువును సాధించాలి. లేకుంటే.. బయటకొచ్చాక ఏడాదిలోగా ఉద్యోగం వెతుక్కోవాలి. అప్పటివరకూ కంపెనీలు విద్యార్థిని తాజాగానే గుర్తిస్తాయి. ఏడాది దాటిన తర్వాత విద్యార్థులకు అవకాశాలు సన్నగిల్లిపోతాయి. అందుకే చాలామంది ఏ కొలువూ దొరక్క.. పెద్దపెద్ద షాపింగ్‌మాళ్లు, బీపీవో, కాల్‌సెంటర్‌ కొలువుల్లో చేరిపోతున్నారు. చివరికి ప్యూన్‌ ఉద్యోగం పడినా.. వందల మంది ఇంజినీరింగ్‌ పట్టభద్రులు పోటీపడే పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తోంది.
కళాశాలలేం నేర్పాలి..
ప్రాంగణ ఎంపికల కోసం వస్తున్న కంపెనీలు ఏమున్నాయి. వాటికి ఎలాంటి అవసరాలున్నాయి. ఏఏ సాంకేతికతను ఆశిస్తున్నాయి. విద్యార్థులు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాయి.. వంటి అన్ని విషయాలపైనా పట్టుసాధించాలి. సదరు కంపెనీల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తున్న కళాశాలల విద్యార్థులు మాత్రమే ప్రస్తుతం విజయవంతమవుతున్నారు. కళాశాలలు గతంలో మాదిరిగా ఏదో సాఫ్ట్‌స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నాం, ఆంగ్లంలో ప్రాథమిక పరిజ్ఞానం నేర్పిస్తున్నామంటే.. చాలదు. ఇలాంటి కళాశాలల విద్యార్థులు పోటీలో నిలబడలేరు. అందుకే కంపెనీలకు అనుగుణంగా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే పద్ధతిని ఆశ్రయించాల్సిన సమయమిది. ప్రస్తుతం ప్రాంగణ ఎంపికలకు వస్తున్న సంస్థల అవసరాలకు తగ్గట్టుగా, విద్యార్థులకు లోతుగా తర్ఫీదు ఇస్తున్న కళాశాలలు రాష్ట్రవ్యాప్తంగా వెతికిచూసినా.. కేవలం ఐదు శాతానికి మించి లేవు. మిగతా అన్ని కళాశాలలూ మూసధోరణిలోనే నేటికీ సాగుతున్నాయి. గతంలో మాదిరిగానే.. పాఠ్యపుస్తకాల్లోని అంశాలకు అదనంగా, కొంచెం ఆంగ్లం, సాఫ్ట్‌స్కిల్స్‌ను నేర్పించి విద్యార్థులను బయటకు వదిలేస్తున్నాయి. ఇలాంటి కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమకు తాముగా సాధన చేస్తే విజయం సాధించేందుకు అవకాశముంటుంది.
మైత్రీవనం వెళ్లాల్సిన పనేలేదు..
కళాశాలలో నేర్పించనివి కొత్తగా.. మైత్రీవనం విశ్వవిద్యాలయంలో నేర్పించేదేమీ ఉండదు. విద్యార్థులు కళాశాలలో ఉన్నప్పుడు జాలీగా గడిపేస్తూ.. కొత్తగా మళ్లీ జావా, సీఎస్‌, డాట్‌నెట్‌, సి వంటివి నేర్చుకుంటూ ఉంటారు. అదేదో కళాశాలలో ఉన్నప్పుడే హాయిగా నేర్చుకుంటే మళ్లీ అక్కడ కోర్సుల్లో తర్ఫీదు పొందాల్సిన అవసరం ఉండదు. అక్కడ శిక్షణ పొందుతూ పేపర్లలో పడే కొలువుల కోసం దరఖాస్తులు చేసుకుంటూ ఏళ్ల తరబడి గడిపేస్తున్న విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉంటోంది.
ఉద్యోగ మేళాల లోగుట్టు..
ఓ పది కంపెనీల పేర్లతో ఉద్యోగ మేళాలంటూ కళాశాలల్లో నిర్వహిస్తున్న వాటిలో 95 శాతం కేవలం విద్యార్థుల నుంచి వసూలు చేసే ప్రవేశ రుసుము కోసమే.. వీటివల్ల విద్యార్థులకు వచ్చే కొలువులు శూన్యం. ఎక్కడో ఒకటీ అరా తప్ప కొలువులు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వచ్చినా.. ఇంజినీరింగ్‌ చదువుతో సంబంధం లేకుండా బీపీవో, కాల్‌సెంటర్లు వంటివే ఉంటున్నాయి. ఒకవేళ నిజంగా కొలువులు ఇచ్చే జాబ్‌మేళాలైతే.. విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించే పరీక్షలు పెట్టాలి. కనీసం నాలుగు వేల మంది విద్యార్థులొస్తే.. వారికి కంప్యూటర్‌ పరిజ్ఞానం, సాఫ్ట్‌వేర్‌ వంటివి పరీక్షించాలంటే.. వెయ్యి కంప్యూటర్లుండాలి. ఇదేదీ జరగదు. కనీసం రాతపరీక్ష సైతం నిర్వహించడం లేదు.. కంపెనీలు రూ.200 నుంచి రూ.400 వరకూ ప్రవేశ రుసుము అంటూ వసూలు చేస్తాయి. ఉద్యోగ మేళా నిర్వహణ కోసం రూ.5 లక్షలు ఖర్చయినా, కనీసం నాలుగువేల మంది విద్యార్థులు హాజరైతే.. రూ.16 లక్షలు ప్రవేశ రుసుమే వస్తుంది. అంటే.. రూ.11 లక్షలు లాభం. బహిరంగ ఉద్యోగ మేళాల అసలు గుట్టు ఇదే.
ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి.. - సురేష్‌కుమార్‌, ప్లేస్‌మెంట్స్‌ అధికారి, జేఎన్‌టీయూహెచ్
ఈ పోటీ ప్రపంచంలో కొలువులకు పోటీ బాగా పెరిగింది. విద్యార్థులు ఎంత చదివినా కొలువులు దక్కని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అందరికంటే ఏదో ఒక ప్రత్యేక అర్హత సాధించడం ముఖ్యం. సాఫ్ట్‌ స్కిల్స్‌తో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి ప్రాధాన్యం దక్కుతోంది. ఉదాహరణకు ఇద్దరు విద్యార్థులకు విద్యార్హతలు సమానంగా ఉన్నప్పుడు రక్తదానం చేసిన ధ్రువపత్రాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సంఘటనలు కలిసొస్తాయి. అన్ని అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్న కంపెనీల అవసరాలను గుర్తించి వాటిల్లో ప్రావీణ్యం పొందాలి.Posted on 26-10-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning