కంపెనీలకు మీ సత్తా తెలియజెప్పేస్తాయ్‌!

* ఆన్‌లైన్‌లో అంచనా టెస్టుల జోరు
* ఇంజినీరింగ్‌ విద్యార్థులే లక్ష్యం
* క్యాంపస్‌కు ఆవల నియామకాలకు కంపెనీల కొత్త ఒరవడి

ఈనాడు - హైదరాబాద్‌: ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం దక్కలేదు? ప్రత్యామ్నాయం ఏమిటి?.. మీరు తెలివైన విద్యార్థి అయినా ద్వితీయ, తృతీయ శ్రేణి కళాశాలల్లో చేరడం వల్ల ప్రాంగణ నియామకాలకు కంపెనీలు రాలేదు? మరి మీకు ఉద్యోగం లభించే మార్గమేంటి?.. ఈ ప్రశ్నలకు సమాధానం ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలని అందరికీ తెలుసు. వీటికి వేలమంది హాజరవుతూ ఉండటంతో ఎంపిక ప్రక్రియ కంపెనీలకు భారమవుతోంది. దీనికి పరిష్కారంగా ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ టెస్టులు పుట్టుకొచ్చాయి. ఇంజినీరింగ్‌ విద్యార్థులే లక్ష్యంగా ఈ పరీక్షల నిర్వహణ దేశవ్యాప్తంగా జోరందుకుంటోంది.
ఇంజినీరింగ్‌ విద్యార్థులు చివరి సంవత్సరంలోకి వచ్చారంటే ఆలోచనలు ప్రాంగణ నియామకాల చుట్టూ తిరగటం సహజం. ఏటా 10-15శాతం విద్యార్థులే వీటిల్లో ఉద్యోగాలకు ఎంపికవుతారు. ఈసారి ఆ శాతం సగానికి తగ్గే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే పలు సాఫ్ట్‌వేర్‌ సంస్థలు కళాశాలలకు సమాచారం ఇచ్చాయి. ఇప్పటివరకు వారు ఎంపిక చేసుకున్న సంఖ్య అదే విషయాన్ని స్పష్టంచేస్తోంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 50వేల మంది ఎంపికకు దూరంగా మిగిలిపోతున్న పరిస్థితి. ప్రాంగణ నియామకాల్లో ఎంపిక కాని వారి కోసం, అలాగే ఎంపికైన వారంతా ఆయా కంపెనీల్లో చేరకపోతే.. అవసరార్థం ఉద్యోగులను తీసుకునేందుకు కళాశాల ప్రాంగణాల బయట నియామకాలు జరుపుతుంటాయి.
ఉభయ తారకం..: ప్రాంగణం బయట నియామకాలకు ఏ కళాశాల విద్యార్థులైనా, ఏ సంవత్సరం ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన వారైనా రావొచ్చు. ఫలితంగా 50మంది ఉద్యోగులు అవసరమైనా వేల మందికి పరీక్ష నిర్వహించి, ఎంపిక చేసుకోవడం కంపెనీలకు కష్టమవుతోంది. దీన్ని తగ్గించేందుకు ఆన్‌లైన్‌ అంచనా పరీక్షలు(అసెస్‌మెంట్‌ టెస్టులు) తెరపైకి వచ్చాయి. అంటే సమస్యలను పరిష్కరించే సామర్థ్యం(ఆప్టిట్యూడ్‌ టెస్టు)తో పాటు, సాంకేతిక నైపుణ్యాన్ని పరీక్షించే ప్రశ్నల ద్వారా విద్యార్థుల సత్తాను ఈ పరీక్షలు లెక్కిస్తాయి.. ఇలాంటి పరీక్షలను కొన్ని సంస్థలు ప్రత్యేకంగా నిర్వహిస్తూ రూ.600-800 వరకు రుసుముగా తీసుకుంటున్నాయి. ఇలాంటి పరీక్షల ద్వారా తెలివైన విద్యార్థులు క్యాంపస్‌కు ఆవల జరిపే నియామకాల్లో పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి కళాశాలల్లో చేరిన ప్రతిభగల, ప్రతిభను మెరుగుపరుచుకున్న వారికి ప్రయోజనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
లక్షల మంది పోటీ: అంచనా పరీక్షల నిర్వహణకు దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో ప్రైవేట్‌ సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రముఖ సంస్థ యాస్పైరింగ్‌ మైండ్స్‌ యామ్‌క్యాట్‌ పేరిట ఆన్‌లైన్‌ పరీక్షలు జరుపుతోంది. ఈలిట్మస్‌, కో క్యూబ్స్‌ వంటి సంస్థలు ఈ పరీక్షల నిర్వహణలో పేరుపొందాయి. న్యాక్‌టెక్‌ పేరిట నాస్కామ్‌ సైతం పరీక్షను నిర్వహిస్తోంది. అందులో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, సాంకేతికత తదితర సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. లాజికల్‌ పరీక్ష తర్వాత అభ్యర్థుల స్కోర్‌ను ఆయా కంపెనీలకు పంపిస్తాయి. వాటిని పరిశీలించి అభ్యర్థులను ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలకు పరిమిత సంఖ్యలో ఆహ్వానిస్తున్నాయి. ఫలితంగా కంపెనీలకు సమయం ఆదా అవుతుంది. ఈ పరీక్షలను తెలంగాణ రాష్ట్రం నుంచే ఏటా 30వేల మంది రాస్తున్నట్లు నిపుణుల అంచనా. దేశవ్యాప్తంగా ఆ సంఖ్య లక్షల్లో ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి కళాశాలల్లో తక్కువ ర్యాంకు వచ్చిన వారు చేరుతుంటారు. కాబట్టి బీటెక్‌ తొలి ఏడాది నుంచే వారికి ఆన్‌లైన్‌ అంచనా పరీక్షల పరంగా శిక్షణ లభిస్తే మేలు జరుగుతుందని శిక్షణ నిపుణుడు వెంకట్‌ కాంచనపల్లి అభిప్రాయపడ్డారు.
Posted on 04-11-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning