ఇది ఇంజినీరింగ్‌ పరీక్షా సమయం!

ఇంజినీరింగ్‌ రెండు, మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులు త్వరలో పరీక్షలను ఎదుర్కొనబోతున్నారు. నెలల వ్యవధి నుంచి కొన్ని రోజుల దగ్గరకు వచ్చిన వీటిని సమర్థంగా ఎదుర్కోవటం ముఖ్యం. ఒత్తిడికి గురి కాకుండా సమర్థంగా తయారవ్వడం ఈ తరుణంలో చాలా అవసరం!

విద్యార్థులు మార్కుల శాతం పెంచుకోవడానికి అవకాశమిది. కాస్త ప్రణాళికాబద్ధంగా తయారై సమాధానాలు చక్కగా రాస్తే, గతంలో కన్నా 3-5 శాతం మార్కులు పెరిగే అవకాశాలుంటాయి.
బీటెక్‌లో గతంలో ఎనిమిది ప్రశ్నల్లో ఏదేని అయిదు ప్రశ్నలకు సమాధానం రాయవలసి వచ్చేది. ఇందువల్ల కొన్ని అధ్యాయాలను వదులుకొనే వెసులుబాటు ఉండేది. అయితే పరీక్షా విధానంలో, ప్రశ్నల నాణ్యతలో సంస్కరణలు తెచ్చి మార్పులు చేసిన నేపథ్యంలో ఈ వెసులుబాటు లేకుండాపోయింది.
మారిన ప్రశ్నపత్రం గరిష్ఠంగా 75 మార్కులకు. ప్రశ్నపత్రంలో రెండు భాగాలు. మొదటిభాగం 25 మార్కులకూ, రెండో భాగం 50 మార్కులకూ ఉంటాయి. మొదటి భాగంలో పది ప్రశ్నలుంటాయి. ఇందులో అయిదు ప్రశ్నలకు మూడు మార్కులూ; మిగిలిన ఐదింటికి రెండు మార్కులూ కేటాయించారు. ఈ భాగం ప్రతి విద్యార్థీ తప్పనిసరిగా రాయాలి. సబ్జెక్టులోని మౌలికాంశాలు, నిర్వచనాల ఆధారంగా ఈ ప్రశ్నలుంటాయి.
రెండో భాగంలో అయిదు ప్రశ్నలు 10 మార్కుల మూల్యాంకనంతో ఉంటాయి. అన్ని ప్రశ్నలకూ సమాధానం రాయాలి. ప్రతి అధ్యాయం నుంచీ సమాధానాలు రాయడం తప్పనిసరి. కాకపోతే ప్రతి ప్రశ్నలోనూ ఒకే అధ్యాయం నుంచి రెండు ప్రశ్నలుంటాయి. ఏదేని ఒక ప్రశ్నకు సమాధానం రాయవలసి ఉంటుంది. అంటే ప్రశ్నలకు అంతర్గతంగా ఐచ్ఛికం ఉంటుంది (ఇంటర్నల్‌ చాయిస్‌). అంటే మారిన పద్ధతిలో ప్రతి అధ్యాయం తప్పక చదవాలి అన్నమాట.
సంసిద్ధతకు మెలకువలు
* పరీక్షలకు చివరి నిమిషంలో తయారుకావడం అనేది పద్ధతి కాదు. అందునా బీటెక్‌ లాంటి వృత్తివిద్యలకు ఇది ఏ మాత్రం సరికాదు.
* అన్ని అధ్యాయాలనూ చదవాలి. కొన్నిటిని మాత్రమే చదవడం మనకు మనమే నిరోధకాలు ఏర్పరచుకోవడం అవుతుంది.
* నోట్సు తయారీ అన్నది ఒక ముఖ్యమైన ప్రక్రియ. పాఠ్యపుస్తకాల్లోని అంశాలనూ, అధ్యాపకులు చెప్పిన వివరణలనూ విద్యార్థి తన స్థాయికి కుదించుకుని మదింపు చేసుకుని రాసుకునే చర్య. విద్యార్థి అవగాహనా స్థాయిని కొలిచే కొలబద్దగా నోట్సు తయారీని చూడవచ్చు.
* సొంతంగా తయారుచేసుకున్న నోట్సు చివరి సమయంలో సత్వర సన్నద్ధతకు చాలా ఉపయోగపడుతుంది.
* ప్రతి సబ్జెక్టులోనూ గత నాలుగు/ అయిదు సంవత్సరాల ప్రశ్నపత్రాలు సేకరించి, ప్రశ్నలను అధ్యాయాల వారీగా విభజించి వాటికి సరైన సమాధానాలు తయారుచేసుకోవాలి. వీటిలో తరచుగా ఇచ్చిన ప్రశ్నలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
జవాబులను కంఠతా పట్టడం కన్నా వాటి మౌలికాలను అర్థం చేసుకోవడం సులభం. అవసరమనిపిస్తే ‘మాతృభాష’లోకి అనువాదం చేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
ఈ ప్రశ్నకు సంబంధించిన జ్ఞానం ఆ సబ్జెక్టును అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యం. రెండోది- ఈ ప్రశ్న పునరావృతమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.
* ఇలా సేకరించిన ప్రశ్నలన్నింటి నుంచీ ఆ యూనిట్‌లోని అన్ని అంశాలను నేర్చుకునేందుకు దోహదపడే మూడు నాలుగు ప్రశ్నలను గుర్తించాలి. వీటికి సరైన సమాధానాలు సిద్ధం చేసుకోవడం ఆ అధ్యాయం మొత్తం చదవడంతో సమానం.
* జవాబులను కంఠతా పట్టడం కన్నా వాటి మౌలికాలను అర్థం చేసుకోవడం సులభం. అవసరమనిపిస్తే ‘మాతృభాష’లోకి అనువాదం చేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మొదట్లో ఇది కాస్త శ్రమతో కూడుకున్నదిగా అనిపించినా, త్వరలోనే అలవాటైపోతుంది. అప్పుడు అనువాద అవసరం కూడా రాకపోవచ్చు.
* సాధారణంగా సూత్రాలు, నియమాలు, నిర్వచనాలు మూడు లేక నాలుగు పాయింట్లు ఉండవచ్చు. వీటిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. నిర్వచనాలను మార్చకుండా యథాతథంగా నేర్చుకోవాలి.
* సమీకరణాల్లోని చరరాశుల కొలతలను తప్పక ఉపయోగించాలి. ఉదాహరణకు శక్తికి సంబంధించిన సమీకరణాన్ని సాధిస్తుంటే, శక్తి కొలతను వాడటం తప్పనిసరి.
* జవాబులకు బొమ్మలను వీలైనంతవరకు తప్పనిసరిగా గీయాలి. బొమ్మలను అభ్యాసం చేసి అర్థం చేసుకోవాలి కానీ మననం చేసుకోవడమో, గుర్తుంచుకోవడమో చెయ్యకూడదు.
* సమాధానాల ప్రామాణికతను సిఫారసు చేసిన పాఠ్యపుస్తకాల నుంచే నిర్థారించుకోవడం మేలు.
* ప్రశ్నకు సమాధానం పాయింట్ల రూపంలో రాస్తే బాగుంటుంది. పేపర్లు దిద్దేవారికి సమాధానాలలోని ప్రతి అంశాన్నీ చదివే సమయం దొరకక పోవచ్చు. పాయింట్ల రూపంలో రాసి, ముఖ్యమైన పదాలను అండర్‌లైన్‌ చేస్తే దిద్దేవారి మనసులో మంచి అభిప్రాయాన్ని కలిగించే అవకాశం ఉంది. దీనిద్వారా కొంత లాభం చేకూరకమానదు.
* సమాధానం క్రమపద్ధతిలో ఉండటం చాలా అవసరం. క్రమంలో లేని సమాధానం ఎంత నాణ్యమైనదైనా ఉపకరించకపోయే ప్రమాదం ఉంది.
* మెరుగైన పునశ్చరణ ఎంతో ఉపయోగకారి. అవసరమైతే క్లుప్త రీతిలోనైనా పునశ్చరణ చేసుకోవాలి.
* స్నేహితులతోనూ, అధ్యాపకులతోనూ చర్చించి నాణ్యమైన సమాధానాలను తయారు చేసుకోవాలి. ప్రత్యేకించి సహచరులతో చర్చలు కొన్ని కొత్త విషయాలను నేర్పిస్తాయి.
* టైమ్‌ టేబుల్‌ లేకుండా పైవన్నీ సాధ్యం కాదు. నిర్దిష్టమైన, క్రమబద్ధమైన ప్రణాళిక చేసుకుని తప్పకుండా ఆచరించాలి.
పరీక్షలకు ముందు...
* వ్యాస ప్రశ్నలకూ, ప్రాబ్లమ్స్‌కూ సరైన సమాధానాలు సిద్ధం చేసుకోవాలి.
* మననం చేసుకోవడం, పునశ్చరణ చేసుకోవడం ఎంతో అవసరం. వీటికి తప్పకుండా కొంత సమయం కేటాయించాలి.
* స్థూలమైన సమాధానాలు... చివరి నిమిషంలో మదింపు చేసుకోవడానికి ఉపకరిస్తాయి.
* గత సంవత్సరాల్లో వచ్చిన ప్రశ్నలకు కూడా సంసిద్ధులై ఉండాలి కానీ తయారీ వీటికే పరిమితం కాకూడదు.
* ప్రశ్నకు ఎంతమేరకు సమాధానం రాయాలి అన్నది బాగా తెలియాలంటే ప్రశ్న పూర్తిగా అర్థమవ్వాలి, అర్థం చేసుకోవాలి. మార్కులు ఎన్ని కేటాయించారనే అంశం దీనికి కొలమానం. ఉదాహరణకు మూడు మార్కుల ప్రశ్నకు పదికంటే తక్కువ వాక్యాల్లో సమాధానం ముగించవచ్చు.
* వ్యాసరూప ప్రశ్నలపై సమాధానం రాసేకంటే ముందు ఏమి రాయదలచుకున్నాము అని ముందస్తుగా చిన్న చిన్న పదాల్లో రాసుకోవాలి. కానీ ఈ పదాలను ప్రశ్నపత్రంపై రాయకూడదు. ఆపైన క్రమపద్ధతిలో సూటి సమాధానాలు రాయడానికి ఇది సహకరిస్తుంది.
* అన్ని సమాధానాలు రాశాక వాటిని సరిచూసుకోవాలి. దీని కోసం ప్రత్యేకంగా చివరి పావుగంట వినియోగించుకోవాలి.
Posted on 07-11-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning