క్లౌడ్‌ కొలువు సులువు

* రానున్న రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు
* తెలంగాణ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో వినూత్న శిక్షణ
* ప్రపంచ ప్రఖ్యాత ‘సేల్స్‌ఫోర్స్‌’తో టాస్క్‌ ఒప్పందం

ఈనాడు - హైదరాబాద్‌: ఒరాకిల్‌, ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌లాంటి కంపెనీలతో ఒప్పందం చేసుకొని విద్యార్థులను ఉద్యోగాలకు సన్నద్ధం చేస్తున్న తెలంగాణ నైపుణ్య విజ్ఞానాభివృద్ధి సంస్థ (టాస్క్‌) ఆ దిశగా మరో కీలకమైన అడుగు ముందుకేసింది. ప్రపంచవ్యాప్తంగా 2020 నాటికి క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో దాదాపు 20 లక్షల కొలువులు అవసరమవుతాయి. వీటికి తెలంగాణ యువతను సిద్ధం చేసేందుకు టాస్క్‌ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సంబంధిత వినియోగదారుల సేవల రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికా కంపెనీ సేల్స్‌ఫోర్స్‌ సంస్థతో నవంబర్ 14న ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ సమక్షంలో టాస్క్‌ సీఈవో సుజీవ్‌ నాయర్‌, సేల్స్‌ఫోర్స్‌ విశ్వవిద్యాలయ ప్రతినిధి నాగరత్నం ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో సేల్స్‌ఫోర్స్‌ తమ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సాంకేతికతలో తెలంగాణలోని ఇంజినీరింగ్‌ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ఇప్పటిదాకా ఆసియాలో సింగపూర్‌, మలేసియాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేల్స్‌ఫోర్స్‌ భారత్‌లో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేల కంపెనీలు సేల్స్‌ఫోర్స్‌ సాఫ్ట్‌వేర్‌నే వాడతాయి. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి పనిచేస్తున్న సేల్స్‌ఫోర్స్‌ కంపెనీ ఇటీవలే అమెరికా అవతల తమ అతిపెద్ద సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. తాజాగా తెలంగాణ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి కూడా ముందుకు రావడం విశేషం.
తొలిదశలో 2వేల మందికి
తొలిదశలో తెలంగాణలో రెండు వేల మంది విద్యార్థులు, 100 మంది అధ్యాపకులకు శిక్షణ ఇస్తారని టాస్క్‌ సీఈవో సుజీవ్‌ నాయర్‌ తెలిపారు. టాస్క్‌ దగ్గర నమోదైన ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులు ఎవరైనా ఈ శిక్షణ పొందడానికి అర్హులే. అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌, ప్రోగ్రామెటిక్‌ డెవలప్‌మెంట్లలో కోర్సులు నిర్వహిస్తారు. సేల్స్‌ఫోర్స్‌కు చెందిన శిక్షకులు వచ్చి శిక్షణ ఇస్తారు. తర్వాత ఈ- లర్నింగ్‌ పద్ధతిలోనూ శిక్షణ కొనసాగుతుంది. ఈ మొత్తం కోర్సులను 30 నిమిషాల నిడివిగల చిన్నచిన్న భాగాలుగా (మాడ్యూల్స్‌గా) విభజించి అందుబాటులో ఉంచుతున్నారు. విద్యార్థులు ఎక్కడినుంచైనా వీటిని నేర్చుకోవచ్చు. ఒక్కో మాడ్యూల్‌ పూర్తి చేయగానే విద్యార్థులకు బ్యాడ్జి (సర్టిఫికెట్‌) ఇస్తారు. ఎన్ని ఎక్కువ బ్యాడ్జిలు సంపాదిస్తే అంతగా ఉద్యోగార్హత పెరుగుతుంది.
విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి -సుజీవ్‌ నాయర్‌, టాస్క్‌ సీఈవో
వినియోగదారుల సంబంధాల నిర్వహణలో ప్రపంచ ప్రఖ్యాత సేల్స్‌ఫోర్స్‌తో ఒప్పందం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగంలో ఉద్యోగాలు అందుకునే అవకాశాలు పెరుగుతాయి. సేల్స్‌ఫోర్స్‌ కోర్సు తయారు చేసిన తీరు ఎంతో సులభతరంగా, విద్యార్థులు ఆడుతూపాడుతూ నేర్చుకునేలా ఉంది.
సేల్స్‌ఫోర్స్‌ నైపుణ్యముంటే కొలువు సులువు - నాగరత్నం, సారా ఫ్రాంక్లిన్‌, సేల్స్‌ఫోర్స్‌ విశ్వవిద్యాలయం ప్రతినిధులు
సేల్స్‌ఫోర్స్‌ నైపుణ్యాలున్నవారికి ప్రపంచ మార్కెట్‌లో గిరాకీ ఉంది. 2020 నాటికి క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో ఈ అవసరమున్నవారి సంఖ్య దాదాపు 1.9 లక్షల దాకా ఉంటుందని అంచనా. టాస్క్‌ ద్వారా తెలంగాణ విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పడానికి ఉత్సాహంగా ఉన్నాం.

Posted on 15-11-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning