భవితకు పునాది... ప్రాజెక్టులతో నాంది

సిద్ధాంతాలపై పట్టు, వాటి అమలుకు సంబంధించిన మెలకువల్లో సమప్రవేశం పెంచుకోవటం ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఎంతో అవసరం. దీనికి దోహదపడేవి మినీ, మేజర్‌ ప్రాజెక్టులు. భావి ఉద్యోగపర్వానికి ఇవి తగిన ప్రాతిపదికను ఏర్పరుస్తాయని చెప్పవచ్చు!

ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్లో ఉన్నవారు వేసవి విరామ కాలంలో మినీ ప్రాజెక్టులు చేయడానికి తయారీ ఇప్పటినుంచే మొదలుపెట్టాలి.నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్‌ విద్యార్థులు మూడో సంవత్సరంలో చేసిన మినీ ప్రాజెక్టుకు తుది మెరుగులు దిద్దాల్సివుంటుంది. నాలుగో సంవత్సరంలో ముఖ్య (మేజర్‌) ప్రాజక్టును చేసి ఈ రెండు ప్రాజెక్టులనూ విశ్వవిద్యాలయ ఎగ్జామినర్‌ ఎదుట ప్రదర్శించటానికి తయారు కావాలి. సాంకేతిక విద్యారంగంలో సబ్జెక్టులతో సమానంగా విద్యార్థులు చేసే ప్రాజెక్టులకు ప్రాముఖ్యం ఉంది. విద్యార్థులు బృందంగా ఏర్పడి వీటిని ఎంచుకుని చేయాల్సివుంటుంది. దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు కనీసం రెండు ప్రాజెక్టులు చేయాల్సివుంటుంది... మూడో సంవత్సరం ముగిశాక వేసవిలో, నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్లో.

మొదటిదానికి గరిష్ఠంగా 50 మార్కులుంటే రెండోదానికి 200 మార్కులుంటాయి. ఐతే ఈ రెండు ప్రాజెక్టుల సంబంధిత పరీక్ష, ప్రదర్శన/నిరూపణ నాలుగో సంవత్సరంలోనే జరుగుతుంది. అంటే మూడో సంవత్సరం వేసవి సెలవుల్లో చేసిన ప్రాజెక్టును ఏడాది పాటు గుర్తుంచుకోవాలన్నమాట! బీటెక్‌ స్థాయిలో ప్రాజెక్టులు చేయాలంటే 400-450 గంటల వ్యవధి అవసరమవుతుంది. ఐతే నాలుగో సంవత్సరంలో 250-300 గంటల సమయం మాత్రమే లభిస్తుంది. మూడు సబ్జెక్టులు, టెక్నికల్‌ సెమినార్‌, కాంప్రహెన్సివ్‌ వైవా లాంటివి కూడా ఉండటం మూలాన సెమిస్టర్లో ఉన్న సమయాన్ని వీటికి కూడా కేటాయించాల్సివుంటుందని గుర్తుంచుకోవాలి.

ప్రాజెక్టులోని వివిధ దశలు, వాటికి అవసరమైన సమయం ఇంచుమించు ఇలా ఉంటుంది.
* సమస్య గుర్తింపు, నిర్థారణ: 40-50 గంటలు
* సమాచార అవలోకనం: 100-150 గంటలు
* కోరుకున్నది నిర్దేశం: 20-25 గంటలు
* రచన, అమలు: 150-175 గంటలు
* నివేదిక తయారీ: 50 గంటలు

అవసరమైన సమయం నాలుగో సంవత్సరంలో లభించదు కాబట్టి ప్రాజెక్టును రెండు భాగాలుగా చేసుకోవాలి. మొదటి మూడు అంశాలవరకూ మూడో సంవత్సరంలో ముగించి, మొదటి నివేదిక సమర్పించాలి. కావలసిన శిక్షణ పొంది మిగిలిన ప్రాజెక్టు పని నాలుగో సంవత్సరంలో చేయడం ఉత్తమమైన పద్ధతి. దీనిలో ఒక నాణ్యమైన ప్రాజెక్టు చేయవచ్చు. ఒకే ప్రాజెక్టు చేయడం వల్ల మూల్యాంకనం సమయంలో సులభమవుతుంది. ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూ సమయంలో ఇదెంతో ఉపయోగం. అలా కానిపక్షంలో రెండు విడివిడి ప్రాజెక్టులు చేసే వీలూ ఉంది. అలాంటి సందర్భంలో ఒకే సంస్థలో రెండుసార్లు ప్రాజెక్టు చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే రెండు అంశాల్లో కూడా ప్రాజెక్టు చేయవచ్చు.

ఎంచుకునేదెలా?
ప్రాజెక్టును ఎంచుకోవడం కొంత కష్టంతో కూడుకున్నది. ఏ రంగంలో చేయాలి? ఎంతమంది కలిసి చేయడానికి వీలుంటుంది? తగిన మార్గదర్శకత్వం లభిస్తుందా? విభాగం తరఫున ఎంత సహకారం ఉండొచ్చు? ఇలాంటి ప్రశ్నలకు నిర్దిష్ట సమాధానాలు రాబట్టుకోవాలి. సాధారణంగా బృందాల్లో భాగస్వామిగా ప్రాజెక్టు చేస్తే మేలు. దీనివల్ల బృందంలో మెలగడం అలవడటమే కాకుండా ఇంటర్వ్యూల్లో మనమీద సదభిప్రాయం కలుగుతుంది. బృందచర్చల ద్వారా సంప్రదింపు అలవాటవుతుంది. స్వయం నిర్ణయ పద్ధతిలో ప్రాజెక్టును ఎంచుకోవచ్చు. మరొక పద్ధతి గ్రంథాలయంలో కానీ, అంతర్జాలంలో కానీ ప్రచురిత పరిశోధనల్లో అంశాలను ప్రాజెక్టులుగా చేయడం. ఇది ఉన్నతశ్రేణి ప్రాజెక్టు అని చెప్పవచ్చు. ఇవి బీటెక్‌ స్థాయికి మించకుండా చూసుకోవాలి. అధ్యాపకులు తమ రంగంలో ప్రాజెక్టులకు అవకాశం ఉన్న అంశాలను పట్టికగా తయారుచేసి అందించటం మరో రకం. ఆ పట్టికలో విద్యార్థుల బృందాలు తమకు నచ్చిన అంశంలో, అధ్యాపకుల నిర్దేశనంలో ప్రాజెక్టు చేయటం మంచిది. ఈ విధానంలో అధ్యాపకుల సంపూర్ణ సహకారం పొందే అవకాశాలు ఎక్కువ. ఇది అన్ని మార్గాల్లోకీ క్షేమకరమైనది. అంతర్జాల సహాయంతో కొన్ని ప్రాజెక్టులను వెతికి వాటిని చేయడం మరో పద్ధతి. అయితే మేధోచౌర్యం లాంటివాటికి దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎక్కడ చేస్తే బాగుంటుంది?
ప్రభుత్వ సంస్థల్లో ప్రాజెక్టులు చేస్తే మంచి పేరు వస్తుందనే అపోహలో కొందరు విద్యార్థులుంటారు. సాధారణంగా ప్రభుత్వం చేసే ప్రాజెక్టులు చాలా పెద్దవీ, దీర్ఘకాలికమైనవీ అయివుంటాయి. పైగా మార్గదర్శనం చేయాల్సిన సూపర్‌వైజర్లు బహుళ బాధ్యతల పనిఒత్తిడితో ఉంటారు. వీరి సమయం చాలా విలువైనది. ఇంజినీరింగ్‌ స్థాయిలో రెండు లేదా మూడు నెలలు మాత్రమే వచ్చే విద్యార్థులకు వీరు తమ సమయాన్ని కేటాయించడం కొంత కష్టమే. అలాంటపుడు విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కోవలసిరావొచ్చు. పైగా ప్రాజెక్టు విలువ ఎంత పెద్ద సంస్థలో చేశాం అన్న అంశం మీద ఆధారపడివుండదు. ఎంత మంచి ప్రాజెక్టు చేశాము అనే అంశం కూడా ముఖ్యం కాదు. దాన్ని ఎంత నవీనంగా చేశాం, అందులో మన వంతు కృషి ఎంత అనేవే ప్రధానం! కాబట్టి ప్రాజెక్టు మనం చేయడానికి పూర్తి అవకాశం ఇస్తూ సమయోచిత నిర్దేశం, సహాయ సహకారాలు అందించే సంస్థ ఎంత చిన్నదైనా మంచిదే. కొన్నిసార్లు చిన్న సంస్థల్లో నేర్చుకోవడానికి అధికంగా అవకాశం ఉంటుంది. ఏ ప్రాజెక్టు చేశాము అనేదానికంటే చేసిన ప్రాజెక్టు ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, ఎంత నేర్చుకున్నాం అనేవాటికి ప్రాధాన్యం.

కళాశాలలను విద్యార్థుల భవిత తయారుచేసే కేంద్రాలుగా చూస్తే వాటిలో కూడా కొన్ని సమస్యలుంటాయి. ఆ సమస్యలకు ప్రాజెక్టుల రూపంలో సమాధానాలు కనుక్కుంటే అలాంటి ప్రాజెక్టు కూడా ఒక రియల్‌టైమ్‌ ప్రాజెక్టే అవుతుంది. కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు కళాశాల రవాణా వ్యవస్థను కంప్యూటరీకరించవచ్చు. అది రాష్ట్ర రవాణా సంస్థ స్థాయిలో చేసిన ప్రాజెక్టుకు ఏమాత్రం తీసిపోకపోవచ్చు. అలాగే వివిధ యంత్రాల మరమ్మతు ప్రణాళికను కంప్యూటర్‌ ద్వారా చేస్తే అది వారు చదివిన విద్యాసంస్థకు కానుకగా ఇవ్వవచ్చు. ఎలక్ట్రికల్‌ రంగ విద్యార్థులు కళాశాలలోని విద్యుత్‌ వినియోగం ఆదాకు సంబంధించి ప్రాజెక్టు చేయవచ్చు. అది కళాశాలకు ఉపయోగపడటమే కాకుండా పరిశ్రమలో చేసిన అనుభవానికి ఏమాత్రం తీసిపోదు. అలాగే ఇతర బ్రాంచిల విద్యార్థులు కూడా తమ కళాశాలకు ఉపయోగపడే ప్రాజెక్టులు చేయవచ్చు. పరిశ్రమల్లో ప్రాజెక్టులు చేస్తే మరొక రకమైన అనుభవం వస్తుంది. కొత్త వాతావరణం, పరిశ్రమ పని విధానం, పోకడల గురించి ప్రత్యక్ష అవగాహన ఏర్పడుతుంది. ఎక్కడ చేసినా, ప్రాజెక్టులో లీనమై చేస్తే నాణ్యమైన ఫలితం వస్తుంది; సంతృప్తి లభిస్తుంది.

కొన్ని అపోహలు
కొందరు విద్యార్థుల్లో ప్రాజెక్టుల గురించి కొన్ని అపోహలున్నాయి. వాస్తవాలు గ్రహించి వాటిని తొలగించుకోవాలి.
* ప్రాజెక్టులు పరిశ్రమల్లోనూ, ప్రభుత్వ సంస్థల్లోనూ మాత్రమే చేస్తే విలువ ఉంటుందనేది సరికాదు. సొంతంగా చేసే అవకాశమున్న ప్రతిచోటా మంచిదే.
* ప్రాజెక్టు ఒక్కరే చేయవచ్చు అనేది తప్పు కాకపోయినా సరికాదు. ప్రాజెక్టులు సబ్జెక్టుల్లో ఉన్న అంశాలతో పాటు మనలోని ఇతర గుణాలకూ, లక్షణాలకూ కూడా పరీక్షలే. బృందంగా పనిచేయడం, బృంద సభ్యుడుగా ప్రవర్తన, కాలనిర్వహణ సామర్థ్యం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించే తత్వం, పరిజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునే తత్వం, ఇతరులకు సహకరించే నైజం వంటివి కూడా మూల్యాంకనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒంటరిగా ప్రాజెక్టులు చేయాలనే ఆలోచన రానీయొద్దు.
* అవసరమైన నైపుణ్యాలు ప్రాజెక్టు చేసేటప్పుడు నేర్చుకోవచ్చు అనేది కూడా సరికాదు. ఈ ధోరణి కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగంలోని విద్యార్థుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
ఉదాహరణకు.. ‘ప్రాజెక్టు జావాలో చేస్తే జావాను ప్రాజెక్టు సమయంలో నేర్చుకోవచ్చులే’ అనే ఆలోచన. దీన్ని ఆసరా చేసుకుని కొన్ని శిక్షణ సంస్థలు పుట్టగొడుగులుగా పుట్టుకొచ్చి విద్యార్థులను మభ్యపెడుతున్నాయి. తక్కువ ఫీజు అని ప్రలోభపెట్టి ప్రాజెక్టు కాలంలో సింహభాగం జావా చెప్పి చివర్లో తూతూమంత్రంగా ప్రాజెక్టు గురించి క్లుప్తంగా వివరిస్తున్నాయి. దాహం వేసినపుడు నీటికోసం బావి తవ్వకూడదు కదా! అలాగే ప్రాజెక్టుకు అవసరమైన నైపుణ్యాలను ముందే నేర్చుకునివుండాలి.
Posted on 26-12-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning