మెప్పించే సెమినార్‌కు ముందస్తు కసరత్తు

ఇంజినీరింగ్‌ విద్యార్థులు తమ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్‌లో సాంకేతిక (టెక్నికల్‌) సెమినార్‌ ఇవ్వాల్సివుంటుంది. దీని ప్రాధాన్యం గుర్తించి తగినవిధంగా సిద్ధమై ప్రతిభ చూపితే బహుళ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కెరియర్‌ దిశగా ముందుకు సాగిపోవచ్చు!
విద్యార్థులు తమ బ్రాంచికి సంబంధించిన, అనుబంధం ఉన్న సాంకేతికపరమైన అంశాన్ని సెమినార్‌కు ఎంచుకోవాలి. దానిపై అధ్యాపక బృందం ముందు, తోటివిద్యార్థుల ముందు విశ్లేషణాత్మకంగా చర్చించి, వివరణ ఇవ్వవలసి ఉంటుంది. తన దృక్కోణాన్ని సమర్థించే, సందర్భోచితమైన ఉదాహరణలను కూడా చెప్పాల్సివుంటుంది.
ఇటువంటి సెమినార్లలో పూర్వానుభవం లేకపోతే, చూసేవారి ముందు అందులోనూ అధ్యాపకుల ముందు మాట్లాడటం సవాలుగానే ఉంటుంది. అందుకే మెప్పించేలా సెమినార్‌ ఇవ్వడానికి ముందస్తు తయారీ చాలా అవసరం. ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణతను 1% మేరకు పెంచగల ఈ సెమినార్‌ను కేవలం మార్కుల దృష్టితోనే కాకుండా విజ్ఞాన వికాసానికీ, తమ శాఖ అంశాలలో నైపుణ్యాలూ మెలకువలూ మెరుగుపరుచుకోవడానికీ, భావవ్యక్తీకరణ పెంచుకోవడానికీ సాధనంగా చూడాలి. ఉద్యోగ ఇంటర్వ్యూల్లో కూడా సముచిత ప్రతిభను కనబరచటానికి ఇది ఉపయోగపడుతుంది.
చిన్న బృందం సమక్షంలో వక్త తాను తెలుసుకున్న, పరిశోధించిన విషయాలను చర్చకు ఉపయోగపడేలా ప్రసంగించడమే ‘సెమినార్‌’ అని నిర్వచించవచ్చు. సాధారణంగా కళాశాల స్థాయిలో విద్యార్థులూ, అధ్యాపకులూ బృంద సభ్యులుగా ఉంటారు. విద్యార్థి తనకు నచ్చిన అంశంలో విషయసేకరణ చేసి తయారై పవర్‌పాయింట్‌ ద్వారా కానీ, ఇతర మార్గాల ద్వారా కానీ వివరిస్తుంటాడు. ఈ ప్రక్రియలో అందరికీ ఉపయోగం ఉంటుంది.

అంశాన్ని ఎలా ఎంచుకోవాలి
సెమినార్‌ జయప్రదం కావాలంటే ప్రాథమికంగా ఆ అంశంపై అభిరుచి ఉండాలి. అభిరుచి ఉన్న అంశంపై ప్రత్యేక శ్రద్ధతో తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభావశీలంగా సెమినార్‌ ఇవ్వడం సాధ్యమౌతుంది. అంశం ఎన్నుకోవడంలో ఈ అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి.
* ఆంగ్లం మాట్లాడటంలో అనర్గళ నైపుణ్యం అవసరం లేకపోయినా, భావవ్యక్తీకరణకు అవసరమైన భాషను ప్రయోగించగల సామర్థ్యం అవసరం.
* సెమినార్‌లో పాల్గొనేవారి పట్ల అవగాహన అవసరం. బీటెక్‌ స్థాయిలోని టెక్నికల్‌ సెమినార్‌లలో ఉపోద్ఘాతం, సంబంధిత ప్రచురణల అవలోకనం, ప్రయోగ ఫలితాలు, సాంకేతిక వివరాలు అనే నాలుగు అంశాలపై సమతూకం పాటించాలి. వినేవారు కూడా సాంకేతిక ప్రజ్ఞ, పరిజ్ఞానాలు ఉన్నవారు కాబట్టి ఉపోద్ఘాతం నిడివి తక్కువగా ఉండాలి. అలాగే ప్రచురణల అవలోకనం కూడా కొంతమేరకు కుదించాలి. ఎక్కువ సమయం సాంకేతిక వివరాల విశదీకరణకు కేటాయించాలి.
* ప్రేక్షకులు ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశముందో వూహించి వాటికి జవాబులు సిద్ధం చేసుకుంటే ఎంతో మేలు.
* ప్రేక్షకులతో సంభాషించాలి. అంటే స్వగతంగా చెప్పకున్నట్లు ఉండకూడదు. స్పష్టంగా, అందరికీ వినిపించేలా చెప్పాలి.
* సెమినార్‌ ఇస్తున్న అంశంపై తగిన అవగాహనను ప్రదర్శించాలి.
* పవర్‌ పాయింట్‌ సహాయంతో చెపుతుంటే... స్లైడ్‌లో లేని అంశాలు వీలైనంత కుదించి మాట్లాడటం మంచిది.
* స్లైడ్‌లు వీలైనంత క్లుప్తంగా ఉండాలి.
* అవసరమైతే చిత్రాలు, గ్రాఫ్‌ల ద్వారా విశదీకరించాలి. ‘ఒక చిత్రం వంద పదాలకన్నా మిన్న’ అన్న సూక్తి ఇక్కడ వర్తిస్తుంది.
* స్లైడ్‌లలోని పాఠ్యం సరైన ఫాంట్‌లో ఉండాలి.
* కేటాయించిన సమయానికి మించకుండా ఉండేటట్లు చూసుకోవడం అవసరం.

కొన్ని జాగ్రత్తలు
సెమినార్‌ సాఫల్యం ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటుంది. చర్చా విషయం, శీర్షిక, ఇతివృత్తం, వివరాలు, వివరణ, అన్వయం, వాచికం, విపులీకరణ, స్థూలీకరణల సమతౌల్యం, భావవ్యక్తీకరణ వంటివి.
1. సాధారణంగా సమకాలీన పరిశోధనాంశాలపై విద్యార్థులు సెమినార్‌ ఇవ్వాలని అధ్యాపకులు ఆశిస్తారు. కాబట్టి పరిశోధనలకు సంబంధించిన, లేదా సమకాలీన నూతన సాంకేతిక ఉత్పత్తులను గుర్తించి వాటిని వివరించే అంశాలను ఎన్నుకోవడం ఉత్తమం.
2. ఎన్నుకున్న అంశంపై అదనపు సమాచార సేకరణ సమగ్రంగా చెయ్యాలి. నిజనిర్ధారణ వివరణలు (Case Studies)ఉంటే తప్పకుండా సేకరించాలి. వాటిని గురించి చర్చించాలి.
3. విద్యార్థి తనకు అభిరుచి కలిగి, ఉత్సాహపరిచే అంశం ఎన్నుకుంటే ప్రదర్శన అభినందనీయంగా ఉంటుంది.
4. అందరికీ అవగాహన ఉన్న అంశం తీసుకున్నప్పుడు తగిన జాగ్రత్త వహించాలి. అటువంటివి ఎన్నుకోవడంలో కొన్ని సౌకర్యాలుంటే కొన్ని కష్టాలూ లేకపోలేదు. అందరికీ తెలిసినదైతే ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే అవకాశం పుష్కలంగా ఉండి స్ఫూర్తిదాయకమైన సెమినార్‌ ఇవ్వవచ్చు. అయితే చాలా విపులమైన చర్చకూ, కొంతమేరకు బాగా లోతైన ప్రశ్నలకూ సమాధానాలు ఇవ్వవలసిరావొచ్చు. ఇలాంటి పరిస్థితులు ప్రతికూలంగా మారుతుంటాయి.
5. ఎన్నుకున్న అంశం నిర్దిష్టమైన విషయం గురించి చర్చించేదిగా ఉంటే మంచిది. అందువల్ల విద్యార్థి సెమినార్‌ కచ్చితమైన దిశలో సాగుతూ ప్రత్యేక అంశాలమీద కేంద్రీకృతమై, ప్రేక్షకులకు కూడా ఆసక్తికరంగా మారుతుంది.
ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థి ‘వాట్సాప్‌ ఎలా పనిచేస్తుంది?’ అనే సమకాలీన అంశం తీసుకున్నాడనుకుందాం. ఆ విద్యార్థి వాట్సాప్‌ సందేశాలు ఎలా పంపాలో చెప్పడం మొదలుపెడితే, అందరికీ తెలిసిన ఈ విషయం ఎవ్వరిలోనూ ఆసక్తి కలిగించదు. అదే విద్యార్థి ‘వాట్సాప్‌ ఏ సాంకేతిక సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది? ఆయా సూత్రాలు ఎలా అనుసంధానం అవుతాయి?’ అనే సాంకేతిక వివరాలు పంచుకుంటే ఉపయోగకరమే కాకుండా, నలుగురి మెప్పూ పొందవచ్చు.
6. ప్రేక్షకుల ఆసక్తికి అగ్రపీఠం ఇవ్వాలి. ఎంచుకున్న అంశం అధునాతనం, సమకాలీనం అయినా కూడా సమాచార సేకరణ, విషయ విపులీకరణం సరిగ్గా లేకనో, క్రమపద్ధతిని పాటించలేకపోవడంవల్లనో అనాసక్తి రేకెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కేవలం సాంకేతిక అంశం ఎంచుకోవడంతోనే సరిపెట్టుకోకుండా సమగ్ర విషయం సేకరించి, క్రమం తప్పకుండా పంచుకోవడం తప్పనిసరి.
7. ముందస్తు అభ్యాసం చాలా ఉపకరిస్తుంది. ఎంచుకొన్న అంశాన్ని చక్కగా పరిశోధించి, పూర్తి వివరాలు సేకరించాలి. చక్కని పవర్‌ పాయింట్‌ తయారుచేసుకోవడమే కాకుండా మిత్రులకూ, సన్నిహితులకూ రెండు మూడుసార్లు ప్రదర్శన ఇవ్వడం మంచిది. దీనివల్ల సబ్జెక్టుపై పట్టు, ప్రదర్శనకు సంబంధించిన మెలకువలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
8. సేకరించిన అంశం బీటెక్‌ స్థాయిలోని ఏ సబ్జెక్టు, ఏ అధ్యాయం, ఏ మూలాంశంపై ఆధారపడి ఉన్నదో విస్పష్టంగా ప్రేక్షకుల దృష్టికి తేవాలి.
9 ఇంతకుపూర్వం పెద్ద సమూహాలలో ప్రసంగించిన అనుభవం లేకపోతే కొంత ఇబ్బందిగా ఉండి, ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న బృందాలకు ముందస్తుగా ప్రదర్శించి కొంత ధైర్యం తెచ్చుకోవచ్చు.

ప్రజెంటేషన్‌: మెలకువలు
ముందస్తు తయారీ ఎంత అవసరమో సెమినార్‌ ఇస్తున్నప్పుడు కూడా తగిన జాగ్రత్తలు అంతే అవసరం. అప్పుడే విజయవంతంగా సెమినార్‌ ఇవ్వగలుగుతారు. ఈ సూచనలు పాటిస్తే మంచిది:
* సెమినార్‌ ప్రదర్శన స్థలానికి కనీసం 15 నిమిషాల ముందు చేరుకుని అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
* ప్రొజెక్టర్‌, కంప్యూటర్‌ తయారుచేసుకొన్న పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ సంసిద్ధం చేసుకొని పవర్‌ పాయింట్‌లోని పాయింట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయో లేదో సరిచూసుకోవాలి.
* సెమినార్‌కి సంప్రదాయ దుస్తులు వేసుకోవాలి. జీన్స్‌, టీ-షర్ట్‌ వంటివి వేసుకోకపోవడం మంచిది.
* సెమినార్‌ ఇస్తుండగా అంతరాయాలు ఏర్పడవచ్చు. ఏదేని స్లైడ్‌ వద్ద ఇబ్బందిగా ఇరుక్కుపోయినట్లు అనిపిస్తే లేదా ఏదేని స్లైడ్‌ తప్పించినట్లు అనిపిస్తే ఒత్తిడికి లోనవ్వకుండా ముందుకు సాగిపోవాలి. ఎక్కువ ఒత్తిడికి లోనైతే మొత్తం ప్రదర్శనే సరిగ్గా ఇవ్వలేకపోవచ్చు.
* వీలైనంతవరకు సెమినార్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో ఇస్తే మంచిది. ఈ సమయం సెమినార్లకు మంచి సమయమనీ; వక్త, ప్రేక్షకులూ ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారనీ పరిశోధనల్లో రుజువయింది.
* సెమినార్‌ ముగిసిన వెంటనే లేదా కాస్త విరామం తరువాత తన ప్రదర్శన గురించి సూచనప్రాయంగానైనా అభిప్రాయం సేకరించాలి.

కేవలం మార్కులే కాదు...
సెమినార్లు మార్కులతోపాటు మరెన్నో ఇతర ఉపయోగాలను అందిస్తాయి.
* సాధారణంగా ఎన్నో రోజులు అవసరమయ్యే విషయసేకరణ త్వరగా ఎలా చేయవచ్చో గ్రహించవచ్చు.
* ఇతర విద్యార్థులు కూడా సెమినార్లు వినడానికి వస్తారు కాబట్టి సుహృద్భావ వాతావరణం ఎలా నెలకొల్పాలో తెలుసుకోవచ్చు.
* అధ్యాపక, విద్యార్థి బృందం ముందు ధైర్యంగా మాట్లాడే అవకాశం లభించడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. భవిష్యత్తులో అన్ని సందర్భాలలో విశ్వాసంతో అడుగు ముందుకు వెయ్యవచ్చు.
* చొరవ తీసుకొని చురుకుగా ఎలా ఉండవచ్చో అనుభవపూర్వకంగా తెలుస్తుంది.
* బీటెక్‌లోని సబ్జెక్టులకూ, సమకాలీన పరిశోధనలకూ మధ్య వారధి కట్టి అనుసంధానం చేసే మెలకువలను నేర్చుకోవచ్చు.
* నచ్చిన అంశంలో అదనపు విషయసేకరణ, విజ్ఞాన సముపార్జన సార్థకమయ్యేలా ఎలా చెయ్యవచ్చో నేర్చుకోవచ్చు.
* స్వేచ్ఛాపూరిత భావ ప్రకటనా సామర్థ్యం పెంచుకోవచ్చు.
* తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం ఎలా పంచుకోవచ్చో తెలుస్తుంది.
* ఎంతమేరకు సమాచారం పంచుకోవచ్చో తెలుస్తుంది.
* ఇంటర్వ్యూల సమయంలో ధైర్యంగా జవాబులు ఇవ్వవచ్చు. బీటెక్‌లో నాలుగో సంవత్సరం అంటే త్వరలోనే ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగం చెయ్యడం వంటి జీవితపు ముఖ్య ఘట్టం మొదలవుతుంది. దానిలో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, భావ ప్రకటనా సామర్థ్యం, సాంకేతికంగా మెరుగైన ప్రదర్శన అవసరం. వీటి సాధనకు ఉపయోగపడే సాంకేతిక సెమినార్‌ విద్యార్థులకు సువర్ణావకాశం. దీని ద్వారా వీలైనంత ఎక్కువ లబ్ధి పొందగలగాలి.

విద్యార్థి తనకు పరిచయమున్న సాంకేతిక అంశంలో ఆలోచనలు మెరుగుపరుచుకోవడానికీ, ఇతరుల అనుభవం నుంచి ఉపయుక్తమైన విషయసేకరణ చెయ్యడానికీ సెమినార్లు ఉపయోగపడతాయి. పరిజ్ఞానం పెంపొందించుకోవడం, తెలియని/ దృష్టి సారించని కోణంలో ఆలోచించడం, సందిగ్ధతలు తొలగించుకోవడం... ఇవన్నీ ప్రయోజనాలే.


Posted on 16-01-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning