టెలికాంలో 20 లక్షల ఉద్యోగాలు!

దిల్లీ: ఈ ఏడాది టెలికాం రంగమే దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ చెబుతోంది. ఇంటర్నెట్‌ వినియోగం - నగదు రహిత లావాదేవీలు పెరగడం, ప్రభుత్వ సంస్కరణలు కలిసి రానున్నాయని పేర్కొంది. టెలికాం రంగ నైపుణ్య మండలి (టీఎస్‌ఎస్‌సీ)తో కలిసి ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. మొబైల్‌ తయారీ సంస్థలకు 17.60 లక్షల మంది, టెలికాం ఆపరేటర్లకు 3.70 లక్షల మంది ఉద్యోగుల అవసరమున్నట్లు పేర్కొంది.
5జీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచాలని, తద్వారా భారీ స్థాయిలో ఉపాధి కల్పన జరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఈ విభాగంలో 2020-21 నాటికి 9.20 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. 2021 నాటికి మొత్తం టెలికాం రంగంలో 87 లక్షల మందికి పైగా కార్మికుల అవసరం ఉంటుందని అంచనా వేసింది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్‌ (ఐఓటీ), మొబిలిటీ సేవలు, మౌలిక వసతులు, అనుసంధానత (నెట్‌వర్క్‌), విక్రయాలు వంటి విభాగాలకు నిపుణులు అవసరమని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షులు నీతి శర్మ అన్నారు.
కలిసొచ్చే అంశాలు:
* అందుబాటు ధరలో డేటా, స్మార్ట్‌ఫోన్‌లు లభిస్తుండటం
* నెట్‌వర్క్‌ మెరుగుకు టెలికాం సంస్థలు అధికంగా పెట్టుబడులు పెడుతుండటం
* మొబైల్‌ బ్యాంకింగ్‌, వాలెట్ల వినియోగం పెరుగుతుండటం
వీరికి ఎక్కువ గిరాకీ:
* నెట్‌వర్క్‌ ఇంజినీర్లు
* సైబర్‌ భద్రతా నిపుణులు
* సేవల నిపుణులు
* అప్లికేషన్‌ డెవలపర్లు
* సిస్టమ్‌ ఇంజినీర్లు
* సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌
* మొబైల్‌ తయారీ నిపుణులు
* కాల్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్స్‌

Posted on 19-01-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning