గేట్‌ పోటీకి తుది మెరుగులు

ఇంజినీరింగ్‌ పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే ‘గేట్‌’ వివిధ విభాగాల్లో త్వరలో జరగబోతోంది. ఇప్పటివరకూ కొనసాగించిన సన్నద్ధత ఫలించేలా అన్నివిధాలా తుది మెరుగులు దిద్దుకోవాల్సిన తరుణమిది!
గేట్‌-2017 పరీక్షకు ఇంకా కొద్దిరోజులే సమయం మిగిలి ఉంది. ఈ తుది సమయపు సాధన మంచి స్కోరు సాధించుకోవటానికి అత్యంత కీలకం. ఈ సమయంలో ఎలా సాధన చేయాలో చూద్దాం.
* గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌) స్కోరును బట్టి వివిధ ఐఐటీలు, ఐఐఎన్‌సీ బెంగళూరు, ఎన్‌ఐటీలు, ఇతర విశ్వవిద్యాలయాల్లో ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్‌/పీహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశంతోపాటు నెలవారీ 12,400 రూపాయల ఉపకార వేతనం లభిస్తుంది. * ’టు స్కోరు ఆధారంగా వివిధ మహారత్న, మినీ రత్న, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. * కొత్తగా ఈ సంవత్సరం నుంచి డీఆర్‌డీఓ, బీఎస్‌ఎన్‌ఎల్‌ (జేటీవో) కూడా తమ సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు గేట్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
జాగ్రత్త పడాల్సిన విషయాలు
* గేట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న కారణంగా ప్రశ్నపత్రాలను వివిధ సెట్లుగా రూపొందిస్తున్నారు. అందుకని అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం లభిస్తోంది. అందుకని ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయకుండా అన్నిటిలో ప్రతి అధ్యాయాన్నీ చదవాలి.
* కొన్ని అధ్యాయాలు కఠినంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇందులో ప్రశ్నలు కూడా అయిదారు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి.
* సబ్జెక్టు మీద పూర్తిగా పట్టులేనివారు, పరీక్ష సమయం చాలా దగ్గర పడినందున ఈ కఠిన అంశాలపై ఎక్కువ సమయం కేటాయించడం ఆచరణీయం కాదు.
* గత ప్రశ్నపత్రాలనుంచి దాదాపు 25 శాతం ప్రశ్నలు పునరావృతమవుతాయి. వీటికోసం సుమారు 20 సంవత్సరాల ప్రశ్నపత్రాలను సాధన చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
* సృజనాత్మకంగా, పరిశోధనాత్మకంగా ఉన్న ప్రశ్నల కోసం మౌలికాంశాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, సివిల్‌ సర్వీసెస్‌ ప్రశ్నలు చాలావరకూ గేట్‌లో అడుగుతుంటారు. వీటిని గేట్‌ సిలబస్‌కు అనుగుణంగా సాధన చేయాలి.
* కొన్ని ప్రశ్నలకు పూర్తి సమాచారం ఇవ్వరు. తార్కికంగా ఆలోచించి వాటికి సమాధానం రాబట్టాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు ప్రామాణిక గ్రంథాల్లోని అభ్యాస ప్రశ్నల్లో ఉంటాయి. న్యూమరికల్‌ ప్రశ్నల సమాధానాలు సమయపాలనను దృష్టిలో పెట్టుకుని సాధన చేయాలి.
వర్చువల్‌ కాలిక్యులేటర్‌తో...
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష అయిన ప్రస్తుత గేట్‌లో సాంప్రదాయిక కాలిక్యులేటర్లను అనుమతించరు. వర్చువల్‌ కాలిక్యులేటర్‌తోనే సంఖ్యా సంబంధిత ప్రశ్నలను పరిష్కరించాలి. ఈ కాలిక్యులేటర్‌తో కొన్ని హయ్యర్‌ ఆర్డర్‌ ఈక్వేషన్లను చేయలేము. అలాంటి ప్రశ్నలను మెథడ్‌ ఆఫ్‌ సబ్‌స్టిట్యూట్‌ లేదా ఎలిమినేషన్‌ పద్ధతిలో వర్చువల్‌ కీపాడ్‌ ఉపయోగించాలి. అందుకని ఈ విషయంలో తగిన జాగ్రత్తలూ, సరిపడ సాధనా చేయాలి. లేనట్లయితే సబ్జెక్టులో నిష్ణాతులు కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. దీనికోసం ఆన్‌లైన్‌లో నిర్వహించే నాలుగు/ ఐదు పూర్తి నమూనా ప్రశ్నపత్రాలు తప్పనిసరిగా రాయాలి.
విజయం సాధించాలంటే...
* గేట్‌కు వ్యవధి చాలా తక్కువగా ఉన్న కారణంగా రోజుకు కనీసం 8-10 గంటల తయారీ అవసరం. సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం.
* 10% సమయాన్ని ప్రాథమిక అంశాలపై, 80% సమయం పరీక్షలోపు దృష్టి పెట్టాల్సిన అంశాలపై, చివరి 10% సమయం కఠినమైన అంశాలపై వెచ్చించాలి.
* పరీక్షలో ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానం రాయడం కష్టం. మూడు గంటల వ్యవధిలో ఎన్ని ప్రశ్నలు, ఏ ప్రశ్నలు రాస్తే ఎన్ని మార్కులు సాధించగలమనేది నిర్ణయించుకోవాలి. సన్నద్ధమయ్యే సమయంలో కూడా ఇదే సూత్రాలు పాటించాలి.
* గ్రూప్‌-1లోని ఒక మార్కు ప్రశ్నలను త్వరగా చేయాలి. చాలావరకు ఈ విభాగంలో థియరీకి సంబంధించిన మౌలికాంశాలపై ప్రశ్నలు వస్తాయి. రుణాత్మక మార్కులతో జాగ్రత్త. జవాబు తెలియకున్నా అంచనా వేసి గుర్తించడం వల్ల ఒక్కోసారి నష్టం జరుగుతుంది.
* ఇప్పటివరకూ ఎన్నడూ చదవని కొత్త విషయాలను వదిలివేయడం మంచిది. ఇప్పటివరకూ సాధన చేసిన విషయాలనే పునశ్చరణ చేయాలి.
* ప్రతి సబ్జెక్టుకూ సంబంధించి అభ్యర్థులు షార్ట్‌ నోట్స్‌ తయారు చేసుకుని ఉంటారు. వాటితో పాటు ముఖ్యమైన ఫార్ములాలూ, వాటికి సంబంధించిన కొన్ని మాదిరి ప్రశ్నలూ సాధన చేయాలి. కఠినమైన అంశాలను రెండు మూడుసార్లు మననం చేసుకోవాలి.
* పునశ్చరణతోపాటు ఆన్‌లైన్లో నిర్వహించే మాదిరి ప్రశ్నపత్రాలకు జవాబులు రాయడం వల్ల సమగ్ర అవగాహన లేని కొన్ని అంశాలను కొంతవరకూ మెరుగుపరచుకునే వీలుంది.
* ప్రతిరోజూ రెండు సబ్జెక్టులు తీసుకోవాలి. నిత్యం మ్యాథ్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ సబ్జెక్టుల కోసం కొంత సమయం కేటాయిస్తే మంచి ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది.
కఠినమని ఆందోళన వద్దు
* నమూనా పరీక్షలు రాస్తున్నప్పుడే తగిన మెలకువలు పాటించాలి. పరీక్షలో సాధారణంగా మొదటి ప్రశ్నలు కొంత కఠినంగా ఉంటాయి. ఆందోళన పడకూడదు. మొత్తం పేపర్‌ కఠినంగా అనిపించినప్పటికీ కంగారు అనవసరం. గేట్‌ స్కోరు కేవలం సహ అభ్యర్థుల సాపేక్ష ప్రతిభపై ఆధారపడి ఉంటుందని మర్చిపోకూడదు.
* గేట్‌లో 2016లో మొత్తం వంద మార్కులకు 65-75 మార్కులు సాధించినవారు కూడా ఉత్తమ ర్యాంకులను తెచ్చుకున్నారు. మంచి సంస్థల్లో ప్రవేశం పొందారు. * గత ఏడాది న్యూమరికల్‌ ప్రశ్నలు (ఖాళీలను సరైన అంకెతో పూరించడం) వచ్చాయి. అందుకే వీటిపై తగిన శ్రద్ధ అవసరం. సమాధానం పక్కన యూనిట్లు జాగ్రత్తగా గమనించాలి * న్యూమరికల్‌ సమాధాన ప్రశ్నలకు సమాధానాలు దగ్గరలోని స్థాయిలో ఇవ్వవచ్చు.
ఉదాహరణకు: సరైన సమాధానం 18.44 అనుకుందాం. 18.43 నుంచి 18.45 మధ్యలో సమాధానం రాసినా స్వీకరించి మార్కులు ఇస్తారు. ఈ విషయాన్ని పరీక్ష కేంద్రంలో మరవకూడదు. ఈ న్యూమరికల్‌ ప్రశ్నల సంగతికొస్తే వీటికి ఆప్షన్లుండవు. సరైన సమాధానాన్ని మౌస్‌, వర్చువల్‌ కీ ప్యాడ్‌ ఉపయోగించి సమాధానం గుర్తించాలి. వీటికి రుణాత్మక మార్కులుండవు. * బహుళైచ్ఛిక ప్రశ్నల విషయంలో ఒక మౌలికాంశాన్నీ, ఒక ఫార్ములానీ విద్యార్థి ఎన్ని విధాల తప్పు చేయవచ్చో, ఎన్నిరకాల సమాధానాలు వస్తాయో వూహించి ప్రశ్నపత్ర రూపకర్తలు ఆప్షన్లు ఇస్తారు. వచ్చిన సమాధానం కనపడగానే వెంటనే గుర్తించవద్దు. ఒక్క క్షణం మిగతా ఆప్షన్లను కూడా పరిశీలించి చూడాలి. * ఎన్ని ప్రశ్నలకు ప్రయత్నించామనేదానికంటే ఎన్నిటికి సరైన సమాధానాలు రాశామనేదే ముఖ్యం. సమయపాలన చాలా ముఖ్యం. ఏదో ఒక ప్రశ్న సమాధానానికే ఎక్కువ సమయం కేటాయించవద్దు. జవాబు రాయాల్సినవి ఇంక ఎన్నో ఉన్నాయని మరవకూడదు.

Posted on 23-01-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning