కోల్‌ ఇండియాలో కొలువులు

ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు శుభవార్త! మనదేశంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పాదక సంస్థ ‘కోల్‌ ఇండియా లిమిటెడ్‌’ 1319 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. దరఖాస్తు వ్యవధి కొద్దిరోజులే ఉంది; పరీక్షకు రెండు నెలల సమయం ఉంది. ఆసక్తి ఉన్నవారు వెంటనే కార్యాచరణలోకి దిగటం తక్షణ కర్తవ్యం!

‘మహారత్న’ సంస్థగా పేరుపొందిన కోల్‌ ఇండియా దేశంలోని 8 రాష్ట్రాలలో (పశ్చిమ బంగ, ఝార్ఖండ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, అసోం) తన కార్యకలాపాలను విస్తరించింది. ఈ సంస్థలో సుమారు 3.2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశంలో విద్యుదుత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న, ఈ సంస్థలో ఉద్యోగం చేయడం గౌరవప్రద విషయం.
ఉత్సాహవంతులైన ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు చక్కటి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది ఈ సంస్థ.
కోల్‌ ఇండియా లిమిటెడ్‌ బొగ్గు ఉత్పాదకతలో ప్రపంచంలోనే పెద్ద కంపెనీ. మనదేశ బొగ్గు ఉత్పత్తి మొత్తంలో 84% ఈ సంస్థ నుంచే ఉత్పత్తి అవుతోంది.
దేశంలోని మొత్తం విద్యుత్‌ ఉత్పత్తిలో సుమారుగా 72% విద్యుత్‌ ఉత్పత్తి చేయటానికి ఈ సంస్థ సహకరిస్తోంది.
ఈ సంస్థ 1319 ఖాళీలతో వివిధ రకాలైన ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంజినీరింగ్‌లో పట్టభద్రులైన నిరుద్యోగ, చిరుద్యోగులకు ఇది ఒక సువర్ణావకాశం.

పరీక్ష విధానం
ఈ పోస్టుల నియామకం కోసం రాత పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. దీన్ని 91 పట్టణాల్లో నిర్వహించనున్నారు. ఆ ప్రదేశాల వివరాలను ఆన్‌లైన్‌ దరఖాస్తు పత్రంలో పొందుపరిచారు. పరీక్షను రాయదలచినవారు పరీక్ష కేంద్రంగా రెండు పట్టణాలను ఎంచుకోవలసి ఉంటుంది.
ప్రతి పేపరులో 100 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు.
తప్పుగా సమాధానం గుర్తిస్తే రుణాత్మక మార్కులు లేవు. కాబట్టి తెలియని ప్రశ్నలకు వూహించీ, ఎలిమినేషన్‌ పద్ధతి ఉపయోగించీ జవాబులు గుర్తించవచ్చు.
కనీస ఉత్తీర్ణత మార్కులు: జనరల్‌ కేటగిరి వారు ప్రతి పేపర్‌లో 40 మార్కులు తెచ్చుకోవాల్సివుంటుంది. ఓబీసీ వారికి ప్రతి పేపర్‌లో 35 మార్కులు; ఎస్సీ,ఎస్టీ పీడబ్ల్యూడీ వారికి ప్రతి పేపర్‌లో 30 మార్కులు రావాలి.
వ్యక్తిగత ఇంటర్వ్యూ: ఖాళీల ఆధారంగా ఒక్క పోస్టుకు 1: 3 నిష్పత్తిలో మౌఖిక పరీక్షకు ఎంపిక చేస్తారు. ఈ పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపికైనవారి వివరాలను కోల్‌ ఇండియా వెబ్‌సైట్‌లో ఉంచుతారు.

ఆన్‌లైన్‌ పరీక్షలు
ఈ పోస్టుల దరఖాస్తుదారులు వివిధ సంస్థలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ టెస్ట్‌ సిరీస్‌లను రాయడం మంచిది. అది పరీక్ష సన్నద్ధతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా ప్రశ్నపత్రాలు ఏవిధంగా ఉండవచ్చు అనే అవగాహన అభ్యర్థులకు లభిస్తుంది. తాము చేసిన సాధన పరీక్ష రాయడానికి సరిపోతుందో లేదో స్పష్టమవుతుంది.
పరీక్ష సమయంలో...
* పరీక్షా కేంద్రానికి అరగంట ముందు చేరుకోవాలి.
* కాలిక్యులేటర్‌లు, సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి ఉండకపోవచ్చు.
* పరీక్ష గరిష్ఠ సమయం 3 గంటలు
* ఈ పరీక్షకు 2 నెలల కాల వ్యవధి ఉన్నందున రోజుకు 6 నుంచి 8 గంటల సాధన అవసరం.
* పేపర్‌ 1, పేపర్‌ 2లు సమాన ప్రాధాన్యంతో ఉన్నందున సమయాన్ని రెండు పేపర్లకూ సమానంగా కేటాయించుకోవటం మేలు.
* ఈ కీలక సమయంలో విలువైన సమయపు వృథాను నిరోధించాలి. టీవీ, సినిమాలు, యూట్యూబ్‌ చూడటం, ఫేస్‌బుక్‌ వాడటం, వాట్సాప్‌ల్లో చాటింగులూ మానివేయడం ఎంతైనా మంచిది. వీలైతే సెల్‌ఫోన్‌ కూడా స్విచాఫ్‌ చేసుకోవడం మేలు.
* పరీక్ష సమయం దగ్గరపడుతున్నకొద్దీ విద్యార్థులు ఆందోళనకూ, ఒత్తిడికీ గురి అవుతుంటారు. దీన్ని అధిగమించడానికి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా కనీసం అరగంట యోగా/ధ్యానం/చిన్నపాటి వ్యాయామం చేస్తే ఒత్తిడి నుంచి దూరం కావొచ్చు.
* పరీక్ష రాయటానికి ముందు ప్రశాంతత ముఖ్యం. సరిగా సిద్ధం కాలేదనో, మరో కారణం వల్లనో ఆందోళన చెందవద్దు.
* పరీక్ష కేంద్రానికి వెళ్ళటానికి ముందు ఏమీ చదవకపోవడం మంచిది.

ఏ పేపర్‌ ఎలా?
పేపర్‌-1
జనరల్‌ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్‌లో జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, సైన్స్‌, ఎకానమీ, వర్తమాన అంశాల మీద ప్రశ్నలు అడుగుతారు. ప్రస్తుత ఐఈఎస్‌, గేట్‌ పరీక్షల్లో ఈ సిలబస్‌ లేదు. ఈ పేపర్‌ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. పేపర్‌-1, పేపర్‌-2 వెయిటేజి సమానం ఉన్నందున టెక్నికల్‌ పేపర్‌తో సమానంగా ఈ పేపర్‌ను కూడా సాధన చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులకు జనరల్‌ నాలెడ్జ్‌ / అవేర్‌నెస్‌, హిస్టరీ, పాలిటీ, ఎకానమీల మీద అంతగా అవగాహన ఉండదు. కాబట్టి ఈ పేపర్‌ సన్నద్ధత విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.

జనరల్‌ స్టడీస్‌కు ఉపయోగపడే పుస్తకాలు:
* స్పెక్ట్రమ్‌ సైన్స్‌ పుస్తకాలు లైఫ్‌సైన్సుకు సంబంధించి ఎంతగానో ఉపయోగపడతాయి.
* ఏదైనా ప్రామాణిక జనరల్‌ స్టడీస్‌ బుక్‌.
* వర్తమాన అంశాల కోసం కాంపిటీషన్‌ విజర్డ్‌ వంటి మాసపత్రిక, హిందూ వంటి ప్రముఖ వార్తాపత్రికలు చదవాలి.

నమూనా ప్రశ్నలు
1. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశపు స్థానం?
ఎ) 5వ స్థానం బి) 4వ స్థానం సి) 3వ స్థానం డి) 2వ స్థానం
జవాబు: సి (3వ స్థానం)
2. భారతదేశ 68వ గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న దేశ అధినేత పేరు?
ఎ) మహ్మద్‌ జాయెద్‌ ఆల్‌ నహ్యాన్‌ బి) మహ్మద్‌ సుల్తాన్‌ ఆల్‌ నహ్యాన్‌
సి) ఫ్రాంకోయిస్‌ హాలెండి డి) వాంగ్‌చూక్‌
జవాబు: ఎ (మహ్మద్‌ జాయెద్‌ ఆల్‌ నహ్యాన్‌)
3. భారతదేశంలో ఎక్కువగా విద్యుచ్ఛక్తి ఈ కింది మార్గం ద్వారా వస్తుంది?
ఎ) థర్మల్‌ బి) జలవిద్యుచ్ఛక్తి
సి) అణువిద్యుచ్ఛక్తి డి) పవన విద్యుచ్ఛక్తి
జవాబు: ఎ (థర్మల్‌)

రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ:
కోడింగ్‌ డీ కోడింగ్‌, క్లాసిఫికేషన్‌, ఎనాలజీ, బ్లడ్‌ రిలేషన్స్‌, డైరెక్షన్లు, నిష్పత్తి, శాతాలు, క్లాక్స్‌, క్యాలెండర్‌లు, పని, కాలం వంటి అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి.
జనరల్‌ ఇంగ్లిషు: ఇంగ్లిష్‌పై పట్టులేనివారూ, తెలుగు మీడియం విద్యార్థులూ తగిన జాగ్రత్త వహించాలి. వ్యాకరణం, అర్థాలు, వ్యతిరేక పదాలు, వాక్యపూరణం, కాంప్రహెన్సివ్‌ ప్యాసేజీలు సాధన చేయాలి. English by Wren and martin చాలా ఉపయోగపడుతుంది. పదో తరగతి ఇంగ్లిష్‌ గ్రామర్‌, ఇతర బేసిక్‌ గ్రామర్‌ల నుంచి ప్రశ్నలు అడగవచ్చు. అంటే ప్రిపొజిషన్స్‌, ఆర్టికల్స్‌, వాక్యాలను సరిచేయటం మొదలైనవి అడగడానికి ఆస్కారం ఉంది.

పేపర్‌-2:
అభ్యర్థి సంబంధిత కోర్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టుకు సంబంధించి ఉంటుంది. దీనికి గత సంవత్సర ప్రశ్నపత్రాలు, గేట్‌, ఐఈఎస్‌లలో అడిగిన సంబంధిత ప్రశ్నలు సాధన చేయడం ఎంతో మేలు. ప్రాథమికాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. ఆశావహులు వివిధ సంస్థలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ టెస్ట్‌ సిరీస్‌లను రాయడం మంచిది. అది పరీక్ష సన్నద్ధతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా ప్రశ్నపత్రాలు ఏవిధంగా ఉండవచ్చు అనే అవగాహన లభిస్తుంది. చేసిన సాధన
పరీక్ష రాయడానికి సరిపోతుందో లేదో స్పష్టమవుతుంది. పూర్తి వివరాలను కోల్‌ ఇండియా వెబ్‌సైట్‌లో చూడవచ్చు. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులకు ఎంపికైనవారికి రూ. 20,600/- నుంచి రూ. 46,500/- జీతభత్యాలుగా లభిస్తాయి. సుమారుగా 6 లక్షల నుంచి 7 లక్షల రూపాయిల ప్యాకేజి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ
* అర్హత గల అభ్యర్థులు www.coalindia.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నమోదు చేసుకోవాల్సివుంటుంది. దరఖాస్తు చేసేటప్పుడు తప్పిదాలు దొర్లకుండా చూసుకోవాలి. లేకపోతే దరఖాస్తు తిరస్కరణకు గురికావొచ్చు.
* విద్యార్హతలు: B.E/B.Tech (ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, మైనింగ్‌, కెమికల్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌)
* వయసు: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయః పరిమితి 30 సం॥లు. ఎస్సీ, ఎస్టీ 5 సం॥లు, ఓబీసీ 3 సం॥ల వయసు సడలింపు ఉంటుంది.
* పరీక్ష రుసుము: జనరల్‌ / ఓబిసీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు రుసుము కింద రూ. 1000/- చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, కోల్‌ఇండియా లిమిటెడ్‌ ఉద్యోగులు దరఖాస్తు ఫీజు మినహాయింపు పొందవచ్చు.
* ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది.


Posted on 23-01-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning