సగటు విద్యార్థినే... అయినా సాధించా!

అఖిలభారత స్థాయిలో గేట్‌లో ఈసీఈ బ్రాంచి నుంచి ప్రథమ ర్యాంకు సాధించిన ఘనత సాయి ప్రమోద్‌రెడ్డిది. మొదటిసారి ‘గేట్‌’లో 1209 ర్యాంకు వచ్చింది. దాంతో సంతృప్తి చెందలేదతడు. పట్టుదలతో, కసితో కృషి చేశాడు. ఈసారి జాతీయస్థాయిలో ఏకంగా ఒకటో ర్యాంకు లభించింది. హైదరాబాద్‌కు చెందిన ఇతడు తన విజయ ప్రస్థానాన్ని ‘చదువు’తో ఇలా పంచుకున్నాడు!

గేట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలంటే.. గొప్ప తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు. కష్టపడే స్వభావం మాత్రం ఉండాలి. నా విషయమే చూస్తే.. ఎన్‌ఐటీ కాలికట్‌లో ఇంజినీరింగ్‌ (ఈసీఈ) చదివాను. కానీ సగటు విద్యార్థినే. 66.8 శాతం మార్కులే వచ్చాయి నాకు. మరి గేట్‌లో మంచి ర్యాంకు వచ్చింది కదా?
గేట్‌ ఫలితాల్లో మొదటి 50 ర్యాంకుల్లో ఏదో ఒకటి వస్తుందని వూహించా. కానీ ప్రథమ ర్యాంకును వూహించనే లేదు. సంతోషకరమైన షాక్‌ నిజంగా! క్లిష్టమైన ప్రశ్నపత్రం వచ్చినందున ‘నార్మలైజేషన్‌’ ద్వారా 5 మార్కులు కలిశాయి. అనుకున్నదానికంటే నా ర్యాంకు మెరుగుపడటానికి కారణం ఇది!
ప్రస్తుతం నేను ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసుకు సిద్ధమవుతున్నాను. ఇలాంటి లక్ష్యాలు ఉన్నపుడు గేట్‌ కానీ, ఇలాంటి ఇతర పరీక్షలు గానీ విద్యార్థులు రాస్తుండాల్సిందే. నిశ్చయంగా ఈ అనుభవం ఉపయోగపడుతుంది.
ఎలా మొదలైంది?
నా ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం అయిపోయాక హైదరాబాద్‌లోని ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీలో షార్ట్‌ టర్మ్‌ శిక్షణలో చేరాను. రెండున్నర నెలల ఈ కోచింగ్‌ తర్వాత సంస్థ మెటీరియల్‌ను అభ్యాసం చేశాను. అప్పుడు గేట్‌ రాస్తే 1209 ర్యాంకు వచ్చింది. ఇది తీసివెయ్యదగ్గ ర్యాంకు కాకపోవచ్చు కానీ, గొప్ప ర్యాంకు కూడా కాదు కదా? మరో పక్క కళాశాలలో మార్కుల శాతం మెరుగ్గా ఉన్నవారికి ప్రాంగణ నియామకాలు వచ్చాయి. ఈ పరిణామాలు నాలో పట్టుదల పెంచాయి. దీంతో నా దృష్టిని సన్నద్ధతపై కేంద్రీకరించాను.
చదివింది ఒక ఎత్తు అయితే... పరీక్షలో ప్రతిభను ప్రదర్శించటం మరో ఎత్తు. ఈ విషయంలో ఏమాత్రం తడబడకుండా గరిష్ఠంగా స్కోరు చేయటానికి ఆన్‌లైన్‌ టెస్ట్‌ సిరీస్‌ చాలా ఉపయోగం. గేట్‌ రెండోసారి రాసినప్పుడు ఆన్‌లైన్‌ టెస్టులను బాగా ఉపయోగించుకున్నాను. ఈ ఆన్‌లైన్‌ పరీక్షలు చాప్టర్‌వైజ్‌గా 20, సబ్జెక్టువారీగా 40, మాక్‌ గ్రాండ్‌ టెస్టులు మరో 20 ఉంటాయి. మొత్తం 72 టెస్టుల్లో మూడు తప్ప మిగిలిన 69 టెస్టులూ రాశాను. వచ్చిన సందేహాలను ఆ టెస్ట్‌ సిరీస్‌లోనే అందుబాటులో ఉన్న వీడియో సొల్యూషన్స్‌ ద్వారా నివృత్తి చేసుకున్నాను.
గేట్‌ రాసేవారందరూ శిక్షణ తీసుకోవాలని ఏమీ లేదు. కాకపోతే శిక్షణ వల్ల సమయం ఆదా అవుతుంది. తరగతిలో వేరే విషయాలపై కాకుండా అధ్యాపకులు చెప్పే విషయాలపైనే దృష్టి సారించాలి. బోధించిన అంశాలను షార్ట్‌ (మైక్రో) నోట్స్‌ రాసుకోవటం, సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చుకోవటం చేస్తే పునాది పటిష్ఠంగా ఉంటుంది. రాసుకున్న నోట్సును ఇంటికి వెళ్ళాక పునశ్చరణ (రివిజన్‌) చేసుకోవాలి.
‘ప్రాబ్లమ్స్‌ను వీలైనన్ని అభ్యాసం చేయాలి. గత సంవత్సరాల ప్రాబ్లమ్స్‌ను సాధన చేయటం చాలా ఉపయోగకరం. ప్రశ్నలను స్పష్టతతో చదవాలి. సగం సగం చదవకూడదు. అప్పుడే ఏ మెథడ్‌ అప్లై చేయాలో తెలుస్తుంది.’
ప్రాబ్లమ్స్‌ను వీలైనన్ని అభ్యాసం చేయాలి. గత సంవత్సరాల ప్రాబ్లమ్స్‌ను సాధన చేయటం చాలా ఉపయోగకరం. ప్రశ్నలను స్పష్టతతో చదవాలి. సగం సగం చదవకూడదు. అప్పుడే ఏ మెథడ్‌ అప్లై చేయాలో తెలుస్తుంది. ఆత్మవిశ్వాసం కూడా లభిస్తుంది.
అన్ని సబ్జెక్టుల్లో పరిజ్ఞానం పెంచుకోవాలి. ముఖ్యంగా ఈసీఈలో మ్యాథ్స్‌పై చాలా పట్టు ఉండాలి. ఇంగ్లిష్‌ విషయానికొస్తే రోజూ ఆంగ్ల దినపత్రిక చదివితే సరిపోతుంది. ఆప్టిట్యూడ్‌ కోసం షార్ట్‌కట్స్‌ నేర్చుకోవాలి.
గేట్‌ కష్టమైన పరీక్ష అనే అభిప్రాయం సంగతికొస్తే... మనకు కష్టం అయితే అందరికీ అలాగే ఉంటుంది కదా? ఈ ఆలోచనాధోరణి అలవాటు చేసుకోవాలి. థియరీ చదువుతుంటే ఏమైనా విసుగు కలగవచ్చేమో కానీ, ప్లాబ్లమ్స్‌ చేస్తూ వాటికి సరైన సమాధానాలు కనుక్కోగలుగుతుంటే ఉత్సాహం వస్తుంది. ప్రేరణా కలుగుతుంది. దీంతో విజయవంతంగా సన్నద్ధత కొనసాగించవచ్చు. ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్ష రాస్తే మంచి ర్యాంకుకు ఢోకా ఉండదు!


Posted on 3-04-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning