పరికరాలకు..'మేఘ' సందేశం !

* ఊహకు అందని అద్భుతాలు 4జీతో సాధ్యం కానున్నాయి

ఇంట్లో లైటు, టీవీ, రిఫ్రిజిరేటర్‌ ఏసీ.. ఇతర పరికరాలు అన్నీ ఆన్‌లోనే ఉన్నాయ్‌! ఆఫీస్‌కి వచ్చిన రాహుల్‌కి తర్వాత గుర్తొచ్చింది. వెంటనే అతను సాఫీగా చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ తీసి.. క్లిక్‌మనిపించాడు. క్షణాల్లో ఇంట్లోని విద్యుత్‌ పరికరాలన్నీ ఆగిపోయాయి! ఇంట్లో పాపకు వేసిన డైపర్‌ తడిసిపోయింది! ఆఫీస్‌లో ఉన్న చిత్రలేఖ ఫోన్‌కు ఓ ట్వీట్‌. వెంటనే ఆమె ఇంట్లో పని మనిషికి ఫోన్‌ చేసి డైపర్‌ మార్పించింది. కారు టైరు పంక్చరైంది! డ్రైవర్‌ ప్రమాదకరంగా నడుపుతున్నాడు అంటూ ఫోన్‌కి ఎస్‌ఎంఎస్‌! క్షణాల్లో ప్రసాద్‌ ఫోన్‌లో కారుకు బ్రేక్‌ వేశాడు.
ఇలా ఊహకు అందని అద్భుతాలు 4జీతో సాధ్యం కానున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ''ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌'' (అంటే అంతర్జాలం ద్వారా అన్ని పరికరాలనూ ఒకదానికి ఒకటి అనుసంధానించడం.. ఆపరేట్‌ చేయడం) విస్తరిస్తుండగా.. 4జీ సేవలు వీటికి మరింత ఊతమివ్వనున్నాయి. ఒకటి రెండేళ్లలో.. స్మార్ట్‌ పరికరాలతో పాటు.. స్మార్ట్‌ ఇళ్లు.. స్మార్ట్‌ వీధులు.. స్మార్ట్‌ నగరాలు కూడా మనకు పరిచయం కానున్నాయి. అంతర్జాలం ద్వారా పరికరాలను ఒకదానికి ఒకటి అనుసంధానించడం.. ఒకదాన్ని మరోదానితో ఆపరేట్‌ చేయడాన్ని ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) అంటారు. కేవలం ఫోన్‌లు, కంప్యూటర్లే కాకుండా ప్రస్తుతం టీవీలు, రిఫ్రిజిరేటర్లు, తదితర గృహోపకరణాలు కూడా స్మార్ట్‌ అయిపోతున్నాయి. అంతర్జాలంతో అనుసంధానించగలిగేలా రూపొందుతున్నాయి. దీంతో ఇంట్లో వైఫై, ఇంటర్నెట్‌తో కనెక్టివిటీ కలిగిన అడాప్టర్ల ద్వారా గృహోపకరణాలు అన్నింటినీ ఫోన్‌కు అనుసంధానించి వాటిని దూర ప్రాంతాల నుంచి కూడా ఆపరేట్‌ చేయొచ్చు. ప్రస్తుతం దాదాపు అన్ని సంస్థలూ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌పై తీవ్రంగా పరిశోధన చేస్తున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్‌ పరికరాలన్నీ ఒకే మీటతో ఆపేయగల పరిస్థితి త్వరలోనే రానుంది.
మరి 4జీ ఎందుకు..
ఇంటర్నెట్‌ ఆప్‌ థింగ్స్‌ ప్రధానం అంతర్జాలం. ఇది ఎంత వేగంగా ఉంటే అంత సులభంగా ఇతర పరికరాలను నిర్వహింవచ్చు. త్రీజీతో పోలిస్తే 4జీ సేవల్లో డేటా వినిమయ వేగం దాదాపు 20 రెట్లు (అంటే సెకన్‌కు 100 ఎంబీ అంతకన్నా) ఎక్కువగా ఉంటుంది. దీంతో ఫోన్‌ నుంచి అంతర్జాలంలో మిగతా పరికరాలను, ఫోన్‌కు అనుసంధానమైన అన్నింటినీ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆపరేట్‌ చేసుకొనే వీలుంటుంది. గతేడాది దాకా దేశంలో 2జీ, 3జీ సేవలే ఉండగా ఇప్పుడు 4జీ కూడా ప్రవేశించింది. ఇది ఎంత విస్తృతమైతే దేశం అంత స్మార్ట్‌గా మారుతుంది. 4జీ వస్తే చాలా రకాల కొత్త సేవలు అందుబాటులోకి వస్తాయి.
విదేశాల్లో పరిస్థితి..!
అమెరికా, బ్రిటన్‌లలో 4జీ సేవలు విస్తృతంగా ఉన్నాయి. దీంతో అక్కడ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కూడా ఎక్కువ అవుతోంది. అక్కడ ఎన్‌టీటీ డొకోమో, స్ప్రింట్‌ నెక్స్‌టెల్‌, వెరిజాన్‌, ఐటీ అండ్‌ టీ వంటి సంస్థలు 4జీ సేవలు ప్రారంభించి అతివేగంగా అంతర్జాలాన్ని తక్కువ ధరకు అందిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా.. 4జీ పరికరాలు ప్రస్తుతం 20 కోట్లు ఉండగా 2016కి 100 కోట్లకు చేరే అవకాశముంది. ఫోర్ట్‌ అండ్‌ సులివాన్‌ రూపొందించిన 'ఎల్టీఈ అవుట్‌లుక్‌' అనే నివేదిక ప్రకారం.. 2012 నుంచి 2017 మధ్యలో భారత్‌లో 4జీ సేవలు 220.5 శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేస్తాయని అంచనా.
4జీ వస్తే ..
* అందుబాటులోకి ఓటీటీ (ఓవర్‌ ద టాప్‌) సేవలు.
* ఆన్‌లైన్‌లో ఉచిత వీడియో కాలింగ్‌ సేవలు.
* ఇప్పటిలా కాల్స్‌కి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
* హెచ్‌డీ వీడియోలు, గ్రాఫిక్‌ గేమ్స్‌, అంతర్జాలంలో విహారం సులభమవుతుంది.
* వీడియో ఆధారిత సేవలు, పనులు పెరుగుతాయి.
గ్రామీణ ప్రాంతాల్లో టెలిమెడిసిన్‌ సేవలు పెరుగుతాయి.
* బృందాలుగా ఆన్‌లైన్‌లో ఆడుకొనే, పని చేసుకొనే వెసులు బాటు నావిగేషన్‌, క్లౌడ్‌కంప్యూటింగ్‌ అవసరాలు పెరుగుతాయి.
* బ్యాంకింగ్‌, ఆరోగ్యం, విద్య, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, మరింత విస్తరిస్తాయి.
* త్రీడీ వీడియోలు, అంతర్జాల ఆధారిత టీవీ సేవలు మెరుగవుతాయి.
రంగంలోకి శామ్‌సంగ్‌
ప్రముఖ గృహోపకరణాల సంస్థ శామ్‌సంగ్‌ ఐఓటీ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో (సీఈఎస్‌)లో స్మార్ట్‌ హోమ్‌ను విడుదల చేసింది. దీన్ని ఏర్పాటు చేసుకొంటే ఫోన్‌లో గుడ్‌నైట్‌, గోయింగ్‌ అవుట్‌ స్విచ్‌లతో ఇంట్లోని పరికరాలు అన్నింటినీ దూరం నుంచే నిర్వహించవచ్చు. ఇంట్లో ఏర్పాటు చేసుకునే కెమేరాలతో ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఫోన్‌లోనే చూడొచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఏసీ, లైట్లు, డిష్‌వాషర్లు, మైక్రోవొవెన్‌, కుక్కర్‌, రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషీన్‌, ఇతర పరికరాలను కూడా ఫోన్‌ ద్వారా దూర ప్రాంతాల నుంచి నిర్వహించొచ్చని అంటున్నారు. కేవలం శామ్‌సంగ్‌ మాత్రమే కాకుండా దాదాపు అన్ని సంస్థలూ ఇలాంటి స్మార్ట్‌ గృహాల దిశగా పరిశోధనలు చేస్తున్నాయి. స్మార్ట్‌ తలుపుల వ్యవస్థ, స్మార్ట్‌ కార్లు కూడా ఈ ఏడాది ఆఖరు లేదా వచ్చే ఏడాది మొదట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

- ఈనాడు ప్రత్యేక విభాగం
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning