‘గేట్‌’ గెలిచే గుట్టు ఏది?

గేట్‌- 2017లో తెలుగు విద్యార్థులు గణనీయ విజయాలు సాధించారు. ఈ ప్రేరణతో ఇకపై విజయ పరంపర కొనసాగించదలిచినవారు గేట్‌పై ప్రాచుర్యంలో ఉన్న కొన్ని అపోహలను తొలగించుకోవాలి. అప్పుడే సన్నద్ధత మెరుగుపడుతుంది; మంచి ర్యాంకు సొంతమవుతుంది. విఫలమైనవారికీ ఇది మార్గదర్శకమే!

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) అనేది ఇంజినీరింగ్‌ సబ్జెక్టులపై విద్యార్థులకున్న అవగాహనను పరీక్షిస్తుంది. కేవలం ఇంజినీరింగ్‌ సబ్జెక్టులే కాకుండా మేథమేటిక్స్‌, రీజనింగ్‌, ఆంగ్లభాషల్లో కనీస పరిజ్ఞానం, జనరల్‌ ఆప్టిట్యూడ్‌పై పట్టు కూడా అవసరం.
అభ్యర్థి నుంచి ‘గేట్‌’ ఏం ఆశిస్తుందో మొదట పరిశీలించాలి. దీనిలో సాధారణంగా ప్రాథమికాంశాల నుంచి ఒక మార్కు ప్రశ్నలు, అప్లికేషన్ల నుంచి రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి అభ్యర్థి వీటికి అనుగుణంగా సాధన చేయాలి. న్యూమరికల్‌ ప్రశ్నలను సరిగా పూరించడానికి ఎక్కువ సాధన చేయాలి.
ఆప్టిట్యూడ్‌, మ్యాథ్స్‌తో పాటు మూడు నాలుగు సబ్జెక్టుల్లో పట్టు సాధిస్తే ఎన్‌ఐటీల్లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఐఐటీల్లో అవకాశం రావాలంటే అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలి. సరైన సమాధానాన్ని సమయపాలనతో రాబట్టగలగడం ప్రధాన విజయరహస్యం!
సరైన సమయమేది?
ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరంలో విద్యార్థిపై రొటీన్‌ సబ్జెక్టులతోపాటు ప్రాజెక్ట్‌ వర్క్‌, సెమినార్లు, ప్రాంగణ నియామకాల ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరంలో కంటే మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో గేట్‌ సన్నద్ధత మొదలుపెడితే ఎంతో శ్రేయస్కరం.
మూడో సంవత్సరంలో రోజుకు 2 నుంచి 3 గంటలు కేవలం గేట్‌ సిలబస్‌పైనే ప్రణాళికబద్ధంగా సన్నద్ధమవాలి. ఆఖరి సంవత్సరం పునశ్చరణ, నమూనా ప్రశ్నపత్రాల సాధన, సందేహ నివృత్తిపై దృష్టి సారించాలి.
ముందుగా ప్రారంభించాలి
* ఆఖరి సంవత్సరంలో సన్నద్ధత మొదలెడితే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
* ముఖ్యంగా మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో మొదలెడితే క్రమబద్ధమైన సన్నద్ధతకు తగిన సమయం దొరుకుతుంది.
* కళాశాల అకడమిక్స్‌, ప్రాంగణ నియామకాలకు ఉపయోగకరం.
* ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష కూడా సులభమవుతుంది.
* వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లోని నియామకాల్లో విజయం తథ్యం.
* సబ్జెక్టుపై పట్టు రావడం వల్ల నిజమైన ఇంజినీర్‌గా పేరు తెచ్చుకోవచ్చు.
కారణాలివే!
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాతం గేట్‌లో ఉత్తీర్ణతతోపాటు మంచి ర్యాంకులు సాధించడానికి కింది కారణాలను చెప్పుకోవచ్చు.
* పరీక్ష, దాని ఉపయోగాలపై విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో పెరిగిన అవగాహన. ప్రసార మాధ్యమాల పాత్ర కూడా దీనిలో ఉంది.
* తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న అనుకూల వాతావరణం. పెరిగిన పోటీతత్వం.
* ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పెరిగిన ప్రమాణాలు, కళాశాల అధ్యాపకుల సానుకూల దృక్పథం. * ప్రణాళికబద్ధమైన శిక్షణ సంస్థల తర్ఫీదు * కొంతవరకు అమెరికా నూతన విద్య, ఉపాధి, వలస విధానాలు లాంటి అంశాలు... ఇవన్నీ తోడ్పడ్డాయి.
అన్నీ అపోహలే
1. సిలబస్‌ చాలా అధికం: ఇది వాస్తవం కాదు. నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్‌లో విద్యార్థులు చదివే సిలబస్‌తో పోలిస్తే, గేట్‌ సిలబస్‌ 60% మాత్రమే. మొత్తం ఇంజినీరింగ్‌ బ్రాంచికి సంబంధించిన మూలాలు, నూతన పోకడలు మాత్రమే సిలబస్‌లో ఉంటాయి. ఒక పెద్ద కొండ సైతం రోజుకో బండ తొలిస్తే కొంతకాలానికి మటుమాయం అవుతుంది. రోజుకు రెండు నుంచి మూడు గంటలు ఒక్కో కాన్సెప్టు అర్థం చేసుకుంటూ ముందుకుపోతే ఒక సంవత్సరంలో పూర్తిగా అర్థం చేసుకోవచ్చు.
2. భారీ పోటీ: ఐఐటీల్లో గత 20 సంవత్సరాల అడ్మిషన్లు, ప్రభుత్వరంగ సంస్థల్లో నియామకాలు పరిశీలిస్తే నూటికి కనీసం 70 మార్కులు సాధిస్తే కచ్చితంగా లక్ష్యాన్ని సాధించవచ్చు (ఇది మొదటి పది ర్యాంకులకు సాధారణంగా వర్తించదు). కాబట్టి ఎన్ని లక్షలమంది పోటీపడుతున్నారు అనేది అసంబద్ధం. గట్టి ప్రయత్నంతో 70+ మార్కులు సాధించగలిగితే పోటీ గురించి మర్చిపోవచ్చు.
3. చాలా కఠినం: ఒక కళాశాలలో ఒక సెక్షన్‌లో 60 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో ఒక విద్యార్థి ఫెయిల్‌ అయ్యాడనుకుందాం. ఉత్తీర్ణులైన విద్యార్థుల అభిప్రాయాన్ని అడిగితే పరీక్ష సులభంగా ఉందంటారు. విఫలమైన విద్యార్థిని అడిగితే కఠినం అంటారు. కాబట్టి విజేతల నుంచి ప్రేరణ పొంది, ఓడినవారు ఎందుకు అలా అయ్యారో తెలుసుకోవాలి. అప్పుడు కఠినం అనే పదాన్ని మెదడు నుంచి తొలగించవచ్చు.
4. కొందరికే అవకాశం: ‘ఐఐటీ, ఎన్‌ఐటీల విద్యార్థులే గేట్‌లో ఉత్తీర్ణులవుతారు, గ్రామీణ నేపథ్యమున్నవారికి కష్టం’ అనే అభిప్రాయం ఉంది. ఇది తప్పు. గత విజేతల వివరాలను పరిశీలిస్తే 90% మంది సాధారణ కళాశాలల నుంచి వచ్చినవారే. ఎంతోమంది ఇంటర్మీడియట్‌ వరకు మాతృభాష చదివిన గ్రామీణ నేపథ్యం కలిగినవారే. కాబట్టి, పేదరికం గేట్‌ ఉత్తీర్ణతకు అడ్డే కాదు.
5. మెరిట్‌ ఉంటేనే విజయం: బీటెక్‌ మెరిట్‌ విద్యార్థులే విజయం సాధిస్తారనే వాదనలో కూడా నిజం లేదు. సంవత్సరంపాటు ఏకాగ్రత, కఠిన చిత్తంతో కృషి చేసి, గొప్ప ర్యాంకులు సాధించిన బీటెక్‌ సాధారణ, ద్వితీయ శ్రేణి విద్యార్థులు అనేకమంది ఉన్నారు.
6. ఏడాది తయారీ అవసరం: గేట్‌లో నెగ్గాలంటే ఇంజినీరింగ్‌ తర్వాత కనీసం ఒక సంవత్సరం పూర్తిగా చదవాలని కొందరంటారు. ఇది కూడా అపోహే. ఈ సంవత్సరం విజేతల్లో దాదాపు 40% మంది ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం విద్యార్థులే.
7. రోజుకు 10 గంటలు చదవాలి: ఇది కూడా పూర్తి నిజం కాదు. ఎన్ని గంటలు చదివారనేది ముఖ్యం కాదు. ఎంత ఏకాగ్రతతో చదివారనేది ప్రధానం. ఎంత చదివారనేది కాదు. ఏం చదివారు? ఎలా అర్థం చేసుకున్నారు? ఎంత సాధన, ఎన్నిసార్లు పునశ్చరణ చేశారనేది ముఖ్యం.
8. కేవలం ఎంటెక్‌ కోసమే!: గేట్‌ ఎంటెక్‌ చదవటం కోసం మాత్రమే రాయాలనీ, దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదనీ కొందరు అపోహ పడుతుంటారు. వాస్తవం వేరు. ఇది ఉన్నత విద్యాసంస్థల్లో ఎంఈ/ ఎంఎస్‌/ ఎంటెక్‌/ పీహెచ్‌డీలకు మాత్రమే కాదు. అనేక మహారత్న, మినీరత్న, ప్రభుత్వరంగ సంస్థల్లో నియామకాలతోపాటు పరిశోధనాత్మక సంస్థలకు కూడా ఉపయోగపడుతుంది.
ఒకసారి గేట్‌కు నిబద్ధతతో సన్నద్ధమైతే అది ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్షతోపాటు అనేక రాష్ట్రప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఉపయోగపడుతుంది. సాఫ్ట్‌వేర్‌ సంస్థలతోపాటు ప్రొడక్ట్‌ బేస్‌డ్‌ సంస్థల నియామకాలకు కూడా ఇది ప్రయోజనకరం.

- వై.వి. గోపాల‌కృష్ణమూర్తి, ఏస్ ఇంజ‌నీరింగ్ అకాడ‌మీ


Posted on 3-04-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning