ఐటీలో మెరిపించే పీజీ!

అంతర్జాతీయ విద్యను అభ్యసించాలంటే విదేశాలకు వెళ్ళాలని చాలామంది భావిస్తారు. కానీ దాదాపు అదే ప్రమాణాలతో ఓ పీజీ కోర్సు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ప్రపంచస్థాయి ఇంజినీర్లను రూపొందించే లక్ష్యంతో 16 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ‘ఎంఎస్‌ఐటీ’ ప్రత్యేకతలేమిటి? దీని ప్రవేశపరీక్షకు ఎలా సన్నద్ధం కావాలి?

అమెరికాలోని కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయ సహకారంతో నడుస్తున్న మాస్టరాఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎంఎస్‌ఐటీ) రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. ఇంజినీరింగ్‌ విద్య నాణ్యత పెంచే ఉద్దేశంతో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కన్సార్టియం ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ (CIHL) ఏర్పాటయింది. దీని ఆధ్వర్యంలో ప్రామాణిక విద్యాబోధనతో ఈ కోర్సు కొనసాగుతోంది. ప్రస్తుతం బీటెక్‌ పూర్తిచేసిన 90 శాతం మంది విద్యార్థులకు ప్రోగ్రామింగ్‌, సమస్యా పరిష్కార నైపుణ్యాలు లేవని చాలా ఐటీ సంస్థలు చెపుతున్నాయి. ఒక సమస్య ఇచ్చి దాని ప్రోగ్రామ్‌ రాసి కంపైల్‌ చేసి అవుట్‌పుట్‌ రాబట్టగలిగేవారు అరుదుగా దొరుకుతున్నారనేది ఆ సంస్థల అనుభవం. ఈ లోటును సులువుగా తీర్చగల ప్రోగ్రాం ఎంఎస్‌ఐటీ. దీనిలో సిద్ధాంత పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్స్‌ మీద కూడా ఎక్కువ దృష్టి సారిస్తారు. ప్రతి భావననూ (కాన్సెప్ట్‌) ఆచరణాత్మక విధానంలో బోధిస్తారు. దీనివల్ల విద్యార్థులు తాము నేర్చుకున్నదాన్ని మరిచిపోయే అవకాశం తక్కువ. అలాగే ప్రతి కోర్సులో కాన్సెప్టులు నేర్చుకుంటూ ఒక ప్రాజెక్టును పూర్తిచేస్తారు. దీనివల్ల విద్యార్థులకు దాదాపు రియల్‌టైమ్‌ ప్రాజెక్టు ఎలా చేయాలో అవగాహన వస్తుంది. ఈ కోర్సులో కాలానికి అనుగుణంగా కరిక్యులమ్‌ను మారుస్తారు. అడ్వాన్స్‌డ్‌ కోర్సులైన ఆండ్రాయిడ్‌, డేటా ఎనలిటిక్స్‌, క్లౌడ్‌, ఐఓటీ మొదలైనవి బోధిస్తారు. బేసిక్స్‌ నుంచి మొదలుకొని అడ్వాన్స్‌డ్‌ కోర్సులు బోధించే కోర్సు దేశంలోనే చాలా అరుదు.

ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సాఫ్ట్‌స్కిల్స్‌కు అధిక ప్రాధాన్యం లభిస్తోంది. విద్యార్థులు ఎంతటి ప్రతిభావంతులైనా తమ సామర్థ్యాన్ని గురించి సరిగా వ్యక్తపరచలేకపోతే ఉపయోగం ఉండదు. అందుకని ఈ కోర్సులో సాఫ్ట్‌స్కిల్స్‌కు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో విదేశీ విద్యాభ్యాసం ప్రతికూలంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశాలకు వెళ్ళాలని భావిస్తూ సందిగ్ధంలో ఉన్నవారు ఈ కోర్సును ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. విదేశీ విద్యాభ్యాసంతో పోలిస్తే దీనికయ్యే ఖర్చు కూడా తక్కువే. ఇంజినీరింగ్‌లో నాణ్యమైన ఇంటర్న్‌షిప్‌లూ, ప్రాజెక్టులూ కీలకం. వాటికోసం ప్రసిద్ధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ‘ఆచరణ ద్వారా అభ్యాసం’ (Learning by doing) అనే బోధనా పద్ధతిని ఈ కోర్సు అమలుచేస్తోంది. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు కాన్సెప్టులను సంపూర్ణంగా ఆకళించుకుని, వాటి ఆచరణను గ్రహించగలుగుతారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయం (సీఎంయూ), ఇతర సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాల డిజిటల్‌ లెక్చర్లు, ప్రతి పది మంది విద్యార్థులకు ఒక మెంటర్‌... ఈ ప్రోగ్రాంలో కొన్ని విశేషాలు. వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ల ద్వారా పరిశ్రమతో అనుసంధానం ఏర్పడి విద్యార్థులు చక్కని అనుభవం సాధించగలుగుతున్నారు. ఎంచుకున్న సంస్థ, విద్యార్థుల నైపుణ్యాలను బట్టి ఇంటర్న్‌షిప్‌ కాలంలో స్టైపెండ్‌ వస్తోంది. కంపెనీలు ప్రత్యేకంగా ఆశిస్తున్న భాషాసామర్థ్యాల నైపుణ్యాల శిక్షణను కూడా జోడించి ఎంఎస్‌ఐటీ విద్యార్థులను ఉద్యోగ సంసిద్ధులుగా మలుస్తున్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఈ ప్రోగ్రాంలో స్పెషలైజేషన్లను అందిస్తున్నారు. అవి- కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, ఈ-బిజినెస్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, డాటా ఎనలిటిక్స్‌ అండ్‌ డేటా విజువలైజేషన్‌, మొబైల్‌ టెక్నాలజీస్‌. ఈ కోర్సును అభ్యసించినవారు ఐటీ పరిశ్రమలో గణనీయంగా రాణిస్తున్నారు. కొందరు సొంతంగా కంపెనీలు కూడా ప్రారంభించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా నిలదొక్కుకుంటున్నారు.

ప్రవేశం ఎలా?
గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ GAT అనే ప్రవేశపరీక్ష ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలుంటాయి. వాక్‌ ఇన్‌ ఎంట్రన్స్‌ ద్వారా ఏ గురు, శుక్ర, శని, ఆదివారాల్లోనైనా అభ్యర్థులు పరీక్షకు హాజరుకావొచ్చు. మార్చి 16 నుంచి మొదలైన ఈ వాకిన్స్‌ మే 20 వరకూ జరుగుతాయి. బీటెక్‌/ బీఈ అన్ని బ్రాంచిలవారూ ఈ పీజీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ నెట్‌ వర్క్స్‌, ఈ-బిజినెస్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, డేటా ఎనలిటిక్స్‌ అండ్‌ డేటా విజువలైజేషన్‌, మొబైల్‌ టెక్నాలజీస్‌లో స్పెషలైజేషన్లు ఎంఎస్‌ఐటీలో ఉన్నాయి. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, కాకినాడ, అనంతపురం, విశాఖపట్నం, తిరుపతిల్లో గ్యాట్‌ జరుగుతుంది. వాక్‌ ఇన్‌ టెస్టులను హైదరాబాద్‌లో ఎడ్యుక్విటీ కెరియర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోనూ, కాకినాడలో ఎంఎస్‌ఐటీ లెర్నింగ్‌ సెంటర్లోనూ నిర్వహిస్తారు. గ్యాట్‌ ర్యాంకుల ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.
* జులై 2014 తర్వాత జీఆర్‌ఈ రాసి 301/3.0 స్కోరు తెచ్చుకున్నవారికి ప్రవేశపరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది.
* ప్రిపరేటరీ కోర్సు ఫీజు రూ. 10,000.
* వార్షిక ఫీజు రూ.1.50 లక్షలు.
* ఐఐఐటీ హెచ్‌లో వార్షిక ఫీజు: రూ.2 లక్షలు

ముఖ్యమైన తేదీలు
* వాక్‌ ఇన్‌ ఎంట్రన్స్‌: మార్చి 16- మే 20, 2017 వరకూ
* దరఖాస్తుల సమర్పణ గడువు: మే 15, 2017
* GAT ప్రారంభం: మే 21, 2017
* ఫలితాలు: జూన్‌ 1, 2017
* కౌన్సెలింగ్‌ ఆరంభం: జూన్‌ 12, 2017
* ఎంఎస్‌ఐటీ మెయిన్‌ కోర్సు ఆరంభం: జులై 15, 2017
ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్లో www.msitprogram.net దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఐఐఐటీ క్యాంపస్‌లో ఉన్న ఎంఎస్‌ఐటీ డీన్‌ను సంప్రదించవచ్చు.
* ఫోన్‌: 7799834583
* enquiries2016@msitprogram.net

ఎక్కడ ఎన్ని సీట్లు?
ఎంఎస్‌ఐటీ 5 కేంద్రాల్లో అందుబాటులో ఉంది. ఒక్కో కేంద్రంలో సీట్లు- ఐఐఐటీ హైదరాబాద్‌: 110, జేఎన్‌టీయూ హైదరాబాద్‌: 100, జేఎన్‌టీయూ కాకినాడ: 50, జేఎన్‌టీయూ అనంతపురం: 50,ఎస్‌వీయూ, తిరుపతి: 50 ఐఐఐటీ, జేఎన్‌టీయూ (హైదరాబాద్‌), ఎస్‌వీయూ, తిరుపతి, అనంతపురాల్లో రెసిడెన్షియల్‌ ప్రోగ్రాంగా అందిస్తున్నారు.
రెండేళ్ల ఈ కోర్సులో ప్రతి ఏడాదినీ 6 మినీ సెమిస్టర్లుగా విభజిస్తారు. ఒక్కో మినీ సెమిస్టర్‌ వ్యవధి 8 వారాలు. మొదటి ఏడాదిలో ఐటీ, సాఫ్ట్‌స్కిల్స్‌కు సంబంధించి 5 మినీ సెమిస్టర్లూ, ఒక ప్రాక్టికమ్‌ మినీ సెమిస్టరూ ఉంటాయి. రెండో సంవత్సరంలో ఐటీకి సంబంధించి 3 మినీ సెమిస్టర్లూ, 3 ప్రాక్టికమ్‌ మినీ సెమిస్లర్లూ ఉంటాయి.
సిద్ధాంత పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్స్‌ మీద కూడా ఎక్కువ దృష్టి సారిస్తారు. ప్రతి భావననూ (కాన్సెప్ట్‌) ఆచరణాత్మక విధానంలో బోధిస్తారు. దీనివల్ల విద్యార్థులు తాము నేర్చుకున్నదాన్ని మరిచిపోయే అవకాశం తక్కువ. కాన్సెప్టులు నేర్చుకుంటూ ఒక ప్రాజెక్టును పూర్తిచేస్తారు. దీనివల్ల విద్యార్థులకు దాదాపు రియల్‌టైమ్‌ ప్రాజెక్టు ఎలా చేయాలో అవగాహన వస్తుంది.

నూరుశాతం ఉపాధి
2001లో ప్రారంభించిన ఈ కోర్సులో చేరిన విద్యార్థులు దాదాపు అందరూ ప్లేస్‌మెంట్‌ సాధిస్తున్నారు. ఇంటర్న్‌షిప్‌ కూడా అందరికీ వస్తోంది. ఇంటర్న్‌షిప్‌ పొందిన విద్యార్థులకు రూ. 10 వేల నుంచి రూ.40 వేల వరకూ కంపెనీలు ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరం తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ప్రారంభిస్తున్నాము. ఇక్కడ కూడా ఐఐటీహెచ్‌, జేఎన్‌టీయూల తరహాలోనే బోధన, ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ విద్యాసంవత్సరంలో ఐటీ పరిశ్రమకు అనుగుణంగా కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టబోతున్నాము.
- ప్రొ. మేడా శ్రీనివాసరావు, డీన్‌, సీఐహెచ్‌ఎల్‌

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష
గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (గ్యాట్‌) అనేది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ఈ ఆన్‌లైన్‌ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. దీనిలో 90 బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఒక వ్యాసం (10 మార్కులకు పేపర్‌ మీద రాయాలి) ఉంటాయి. గ్యాట్‌లో మూడు ప్రధాన విభాగాలు- క్రిటికల్‌ రీడింగ్‌, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, ఎస్సే రైటింగ్‌ ఉంటాయి. అర గంట సైకోమెట్రిక్‌ అసెస్‌మెంట్‌ ఉంటుంది. దీనిలో ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, ఇన్నొవేటివ్‌, కాన్సెప్చువల్‌ థింకింగ్‌, లెర్నబిలిటీ, టీమ్‌ వర్క్‌ ఎబిలిటీని పరీక్షిస్తారు. విద్యార్థి పాఠశాల/ఉన్నతపాఠశాల రోజుల నుంచి 12వ తరగతి వరకూ ఏం నేర్చుకున్నాడనేది గ్యాట్‌ లెక్కలోకి తీసుకుంటుంది. అందుకని దీనికి చదవడం కంటే సాధన చాలా ముఖ్యం. వివిధ వెబ్‌సైట్లు, పుస్తకాల ద్వారా నమూనా టెస్టులను అభ్యాసం చేయటం మేలు.
www.practiceaptitudetests.com, www.indiabix.com వెబ్‌సైట్లు అభ్యర్థులకు ఉపయోగపడతాయి.

గ్యాట్‌కు పనికొచ్చే రిఫరెన్స్‌ పుస్తకాలు:
1) బ్యారన్స్‌ స్ట్రాటజీస్‌ అండ్‌ ప్రాక్టీస్‌ ఫర్‌ ద న్యూ PSAT/NMSQT by Barron
2) ఏ మోడర్న్‌ అప్రోచ్‌ టు వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ బై డా. ఆర్‌ఎస్‌ అగర్వాల్‌
3) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ బై ఆర్‌ఎస్‌ అగర్వాల్‌
4) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఫర్‌ కాంపిటిటివ్‌ ఎగ్జామ్స్‌ బై త్రిష్ణాస్‌

ప్లేస్‌మెంట్లు ఎంతమందికి?
ఎంఎస్‌ఐటీ విద్యార్థులు దాదాపు నూరుశాతం ప్లేస్‌మెంట్లను ఏటా సాధిస్తున్నారు. 2014-16లో దాదాపు నూరుశాతం నియామకాలను ఎంఎస్‌ఐటీ ఇక్కడి విద్యార్థులు పొందారు. ఐఐఐటీ హైదరాబాద్‌లో 74/74 మందీ, జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో 46/47 మందికీ, జేఎన్‌టీయూ కాకినాడలో 19/21 మందికీ, జేఎన్‌టీయూ అనంతపురంలో 6/6 మందికీ ఉద్యోగాలు లభించాయి. ఎంఎస్‌ఐటీ 2015-17 బ్యాచ్‌ విద్యార్థుల్లో ఐఐఐటీ హైదరాబాద్‌లో 98/103 మంది; జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో 49/62 మంది; జేఎన్‌టీయూ కాకినాడలో 17/26 మంది, జేఎన్‌టీయూ అనంతపురంలో 6/6 మంది ఉద్యోగాలు పొందారు. టెరా డేటా, అమెజాన్‌, టీసీఎస్‌, ఐబీఎం, ఐఎస్‌ఎల్‌, ఒరాకిల్‌, జీఈ హెల్త్‌కేర్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, జోహో, ఐడియా బైట్స్‌ మొదలైన ఎన్నో సంస్థలు ఎంఎస్‌ఐటీ ప్లేస్‌మెంట్లలో పాల్గొన్నాయి.


Posted on 0 1-05-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning