కొలువు కొట్టాలంటే 'నింజా'లవ్వండి!

* భిన్న సాంకేతికతల్లో నైపుణ్యాలు అవసరం
* డిజిటల్ నైపుణ్యాలకు పెరిగిన గిరాకీ
* ఈనాడుతో టీసీఎస్ టెక్నాలజీ బిజినెస్ యూనిట్ గ్లోబల్ హెడ్ రాజన్న

ఈనాడు, హైదరాబాద్: ఐరోపాలో ఆర్థిక మాంద్యం.. అమెరికాలో రాజకీయ నిర్ణయాలు..దూసుకొస్తున్న ఆటోమేషన్.. ఇలా ఆర్థికంగా, రాజకీయంగా, సాంకేతికంగా ఏ పరిణామం సంభవించినా మన ఐటీ రంగంలో ఓ ఉలికిపాటు! కారణం దేశంలో అత్యధికంగా ఉద్యోగాల్ని కల్పిస్తున్నది ఐటీరంగమే కాబట్టి! తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకతో ఉద్యోగాలు ఊడిపోతున్నాయనే ఆందోళన మొదలైంది! ఆ కంపెనీ అంతమందిని తీసేసిందంటే.. ఈ కంపెనీ ఇంతమందిని తీసేస్తోందంటూ ఆవేదన! ప్రస్తుతం వేలల్లో పోతున్న ఉద్యోగాలకు రాబోయే కొన్ని సంవత్సరాల్లో లక్షల్లో కోత పడుతుందని మరికొందరి భవిష్యవాణి! నిజంగానే ఐటీరంగం సంక్షోభంలో ఉందా? ఐటీ ఉద్యోగాలు తరిగిపోబోతున్నాయా? ఇక ఆశలు వదులుకోవాల్సిందేనా? తాజాగా ఉద్యోగాల్లో కోత ఎందుకు? ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నవారేం చేయాలి? సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న ప్రస్తుత విద్యార్థులేం చేయాలి? ఐటీ రంగంతో సంబంధమున్నవారిలో, వారి కుటుంబాల్లో.. ఇంజినీరింగ్ విద్యార్థుల్లో.. అనేకమందిలో తలెత్తుతున్న ప్రశ్నలివి! ఈ ఆసక్తికర ప్రశ్నలకు 'ఈనాడుకిచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో భారతీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) టెక్నాలజీ బిజినెస్ విభాగం గ్లోబల్ అధిపతి, వైస్‌ప్రెసిడెంట్ వి.రాజన్న సమాధానాలిచ్చారు.
తాజాగా తలెత్తిన సంక్షోభం ఎంత తీవ్రమైంది?
చాలామంది భావిస్తున్నట్లు ఇది సంక్షోభమేమీ కాదు. కొలువులు పోతున్నాయ్.. పోతున్నాయంటున్నారుగదా.. ఎన్ని పోయాయి? ఉన్న కొలువుల్లో పోయినవాటి శాతమెంత? తెలుగు రాష్ట్రానే తీసుకుంటే సుమారు 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులుంటే 10,000 కూడా తగ్గాయో లేదో! ఇది ఏటా జరిగేదే! ఐటీ అనేది మనదేశంలో అన్ని రంగాలకంటే ఎక్కువగా ఉద్యోగాలను సృష్టిస్తోంది. ఈ ఏడాది కూడా లక్షన్నరకు పైగా కొత్తకొలువుల్ని దేశవ్యాప్తంగా ఐటీరంగం సృష్టించింది. కాబట్టి దీన్ని సంక్షోభం అనటం సరికాదు.
మరి సమస్య ఎక్కడుంది?
ఐటీ వినియోగదారులు మరింత విలువను కోరుకుంటున్నారు. అందుకే ఆటోమేషన్ వచ్చింది. దానికి తగ్గట్లుగా సాంకేతిక వేగంగా మారుతోంది. తదనుగుణంగా కొలువులకు కావల్సిన నైపుణ్యాలు కూడా మారుతున్నాయి. డిజిటల్ నైపుణ్యాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. నైపుణ్యాలకు నిరుడున్న డిమాండ్ వేరు. ఈ ఏడాది డిమాండ్ వేరు! ఇది నిరంతరం మారుతూ వస్తోంది. అయితే ఈ మార్పున్నింటిలోనూ అంతస్సూత్రం ఒకటుంది! ప్రతి మార్పులోనూ ఓ డిజిటల్ అంశముంది. కాబట్టి కొత్త నైపుణ్యాలకు డిమాండ్ ఉంది. మొబిలిటీ అప్లికేషన్లు, క్లౌడ్, డాటా సైన్స్ (అనలటిక్స్), ఆటోమేషన్, ఎజైల్ మెథడాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), రొబోటిక్ ప్రాసెస్ ఆఫ్ ఆటోమేషన్ (ఆర్‌పీఏ), పెగాకు (బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్), సైబర్ సెక్యూరిటీ, డాటా సైంటిస్ట్, క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లకు విపరీతమైన డిమాండ్. రూబీ ఆన్ రెయిన్స్, పైథాన్ ప్రోగ్రాం, క్లౌడ్ ప్రోగ్రాంలకు, ఎగ్‌ప్లాంట్ లాంగ్వేజీకి, గిలెట్‌కు డిమాండ్ ఉంది. డాటా సైంటిస్టుల్ని ఇప్పుడంటే ఇప్పుడు తీసుకుంటాం! ప్రతి ఒక్కరూ క్లౌడ్‌ను వాడుకుంటున్నారు. కాబట్టి క్లౌడ్ టెక్నాలజీ నైపుణ్యాలకు డిమాండ్ ఉంటుంది. ఎంతసేపూ జావా, సీ++లనే చేసుకుంటూ కూర్చుంటామంటే కుదరదు. ఎంతవేగంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు.. కొత్త సాంకేతికతను నేర్చుకుంటున్నారనేది కీలకం! దాన్నిబట్టే కొలువు ఆధారపడి ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవాల్సిందేంంటే నిరంతరం కొత్త సాంకేతికతను నేర్చుకోవటం చాలాచాలా కీలకం! క్లౌడ్; మొబిలిటీ; సోషల్, డాటా సైన్సెస్‌లకు పదేళ్లదాకా ఢోకా ఉండకపోవచ్చు.
ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు తగ్గిపోవట్లేదా?
నిజమే.. ఇన్నాళ్లూ చాలామంది చేసిన పనికి ఆటోమేషన్ వల్ల అంతమంది ఇక అవసరం లేదు. అలాగని ఆటేమేషన్‌ను చూసి అందోళన అవసరం లేదు. ఇది ఒక దారి మూస్తే.. మరోవైపు కొత్త నైపుణ్యాలు నేర్చుకునేవారికి సాంకేతికత సరికొత్తగా అనేకదారులు తెరుస్తోంది. నైపుణ్యమున్నవారికి ఢోకా లేదు. కొత్త నైపుణ్యాలను ఎలా నేర్చుకుంటున్నారు.. ఎంత వేగంగా నేర్చుకుంటున్నారనేదే కీలకం! వ్యక్తులకే కాకుండా సంస్థలకు కూడా కొత్త నైపుణ్యాలను నేర్పే వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవటం అత్యంత ఆవశ్యకం! రోజుకో.. నెలకో కొత్త టెక్నాలజీ వస్తోంది. అంతకుముందు మీకు ఏ సబ్జెక్ట్‌లో పట్టుందో చూసేవారు. ఉదాహరణకు జావాలో బలంగా ఉన్నారా.. మరోటా అని చూసేవారు. కానీ ఇప్పుడు జావా కావాలి.. సీ+++, పైథాన్.. ఇలా ప్రతిదీ ఎంతోకొంత తెలిసి ఉందా లేదా అని చూస్తున్నారు. దీన్నే 'నింజా డెవలపర్స్ అంటారు! డిజిటల్‌లో కొత్తగా వస్తున్నవన్నీ మన విద్యార్థులకు రానివేమీ కావు. నేర్చుకోవటమే ఆలస్యం! అనవసరంగా ఆందోళన చెందకుండా నైపుణ్యాలు నేర్చుకోండి. వేగంగా నేర్చుకున్నవారు విజేతలవుతారు! నింజా డెవలపర్స్, నింజా ప్రోగ్రామర్స్‌కు (భిన్నసాంకేతికతల్లో నైపుణ్యాలున్నవారు.. లోతుగా కాకున్నా) కొలువుల్లో డిమాండ్ ఉంది. ఉంటుంది. డిజిటల్‌లో మూడింటికి విపరీతమైన డిమాండ్ ఉంది. 1. క్లౌడ్ 2. అనలటిక్స్ 3. యూజర్ ఇంటర్‌ఫేస్.
మన చదువులు అందుకనుగుణంగా ఉంటున్నాయా?
ఐటీ రంగంలో పరిశ్రమకు-విద్యావ్యవస్థకు బంధం అద్భుతంగా ఉందననుగాని.. బాగానే ఉందని చెప్పగలను. ఇవాళ మనదేశంలో ఐటీరంగం బాగా సాగుతోందంటే ఈ విశ్వవిద్యాలయాలు సృష్టించిన విద్యార్థులతోనే! కాబట్టి వారిని పూర్తిగా తప్పుపట్టలేం. మార్పులకు అనుగుణంగా టీసీఎస్ వివిధ విశ్వవిద్యాలయాలతో కలసి పనిచేస్తోంది. కరికులమ్‌లలో మార్పులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోంది. వరంగల్ ఎన్ఐటీని దక్షిణాదికి శిక్షణిచ్చే ఐసీటీ కేంద్రంగా గుర్తించారు. టాస్క్ కూడా చాలా చేస్తోంది. వీటన్నింటినీ కాలేజీలు ఉపయోగించుకోవాలి. మా టీసీఎస్ తరఫున రిమోట్ ఇంటర్న్‌షిప్‌లు ఆరంభించాం. ఇందులో విద్యార్థులు ప్రాజెక్టును కాలేజీలోనే చేస్తారు. కాలేజీలో ఉండే గైడ్‌కు అదనంగా టీసీఎస్ నుంచి నిపుణులు అండగా ఉంటారు. అందరికీ ఇక్కడ మా కార్యాలయంలో ఇంటర్న్‌షిప్ ఇవ్వలేం కాబట్టి.. ఈ ఏర్పాటు చేశాం. ప్రాజెక్టుకు అవసరమైన కొత్త టెక్నాలజీని ఆ కాలేజీ అధ్యాపకులకు, సిబ్బందికి నేర్పిస్తున్నాం. నాలుగో సంవత్సరం ఆరంభంలో ఈ ఇంటర్న్‌షిప్ మొదలవుతుంది. రెండు రాష్ట్రాల్లో 10 కాలేజీల్లో దీన్ని ప్రాథమికంగా ఆరంభించాం. అలాగే విద్యార్థులు కూడా కాలేజీలే అన్నీ నేర్పుతాయనుకోవద్దు. ఆన్‌లైన్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు.
మరి విద్యార్థులేం చేయాలి?
ఐటీ రంగంలో ప్రస్తుత పరిస్థితులను చూసి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అమెరికా హెచ్-1బి వీసాల ప్రభావం కాసింత ఉంటుంది. ఇది వాస్తవం. అయితే.. మనం గతంలో మాదిరిగా అమెరికా మార్కెట్‌పై మనం ఎక్కువగా ఆధారపడటం లేదు. అమెరికా తర్వాత ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ జపాన్ ఉంది. ఐరోపా, ఆసియా ఫసిఫిక్.. ఇలా చాలా దేశాలకు విస్తరిస్తున్నాం. కాబట్టి ఆందోళన చెందుతూ కూర్చునేకంటే.. సామర్థాలను పెంచుకోవటంపై దృష్టిపెట్టడం మంచిది!
1. విద్యార్థులు- సర్కూట్ బ్రాంచి.. (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌స) వారైనా; నాన్ సర్కూట్ బ్రాంచి (మెకానికల్, సివిల్...) లేదా కంప్యూటర్‌సైన్స్, ఐటీ బ్రాంచీలవారైనా రెండుమూడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజీల్లో నైపుణ్యం సంపాదించండి. ఉదాహరణకు ఇప్పుడు పైథాన్‌కు మంచి డిమాండ్ ఉంది. దీనికి అదనంగా ఒకట్రెండు కోర్ సబ్జెక్ట్‌ల్లో సత్తా సాధించండి. కంప్యూటర్‌సైన్స్ వారైతే డాటా మేనేజ్‌మెంట్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇలా! ఐపీ ప్రోగ్రామింగ్‌కు డిమాండ్ ఉంది.
2. ఎక్కడైనా పనిచేయటానికి సిద్ధంగా ఉండండి. ఇంత జీతమైతేనే చేస్తా.. ఇక్కడైతేనే చేస్తా.. అని భీష్మించుకోకుండా చేయాలి. వచ్చిన అవకాశాన్ని అందుకొని మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. మీ సత్తా పెంచుకుంటే జీతాలవే పెరుగుతాయి. ఎందుకంటే ఐటీ రంగం గ్లోబల్‌రంగం!
3. సాఫ్ట్‌స్కిల్స్.. కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పదిమందితో కలసి పనిచేయటం; వేగంగా నేర్చుకోవటం; ఇవన్నీ అలవరచుకోవాలి.
ఈ మూడూ ఉన్నవారికి కొలువులకు కొదువ లేదు.
పదేళ్లలో మన దేశంలో ఐటీ రంగం పరిస్థితి ఎలా ఉండొచ్చు?
ఏది జరిగినా కంపెనీలకు, సమాజానికి టెక్నాలజీ- ఐటీ సేవలు అవసరం! వాటి తీరు మారుతుందంతే! రైల్వే కూడా కొత్త టెక్నాలజీని ఆరంభించబోతోంది. ఐటీ సాయం లేని జీఎస్‌టీని ఊహించలేం. పదేళ్ల కిందట పాస్‌పోర్ట్ తీసుకోవాలంటే పొద్దుపొడవక ముందు నుంచి లైన్లో నిల్చోవాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కారణం ఐటీ! పుట్టిన తేదీ ధ్రువపత్రం తీసుకోవాలంటే గతంలో రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు 15 నిమిషాల్లో మీ చేతిలో ఉంటోంది. తెలంగాణ, ఆంధ్రల్లో 400 పౌరసేవల్ని ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అమెరికాలో కూడా సోషల్ సెక్యూరిటీ నెంబర్ 15 నిమిషాల్లోపు రాదు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో 15 నిమిషాల్లోపు పుట్టినతేదీ ధ్రువపత్రం వినియోగదారుడికి అందుతుంది. కారణం- ఐటీ! ఆ వేగాన్ని, అదనపు విలువనూ వినియోగదారుడు కోరుకుంటున్నాడు కాబట్టే సరికొత్త నైపుణ్యాలూ ప ట్టుకొస్తున్నాయి. వాటికి డిమాండ్ పెరుగుతోంది. అవి నేర్చుకున్నవారికి ఢోకాలేదు.
అంటే ఐటీ రంగం కొలువుల సృష్టిలో ముందుంటుందనుకోవచ్చా?
టెక్నాలజీకి డిమాండ్ తగ్గదు కాబట్టి... ఐటీ రంగమే ఉద్యోగాలు సృష్టిందనుకోవటం సరికాదు. వృద్ధిలో ఓ సమతౌల్యం ఉండాలి. చైనాది సమతుల అభివృద్ధి! ఐటీ రంగం ఒక్కటే కాకుండా.. తయారీ రంగం, ఆరోగ్యరంగం, ఇతర రంగాల్లోనూ ఉద్యోగాల కల్పన, పెట్టుబడులున్నాయక్కడ! కానీ మనదేశంలో ఐటీరంగం ఒక్కటే భారీగా ఉద్యోగాల్ని కల్పిస్తోంది. ఎక్కువరోజులు ఇలా ఐటీ మాత్రమే నిరుద్యోగ సమస్యను తీర్చుకుంటూ ఉండలేదు. ఇప్పటిదాకా ఉన్న అభివృద్ధి వేగం ఐటీరంగంలో వచ్చే పదేళ్లలో కూడా ఉంటుందని ఆశించటం.. భారీగా ఉద్యోగాలను సృష్టించాలని ఆశించటం సరికాదు. తయారీరంగం, లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో పెట్టుబడులు రావాలి. ఫార్మా, ఆతిథ్యరంగం, హెల్త్‌కేర్, తయారీ రంగాల్లో పెట్టుబడులు రావాలి. మేకిన్ ఇండియా కారణంగా కాసింత ఆశావహ వాతావరణం కనిపిస్తోంది. పెట్టుబడులు వస్తున్నాయిప్పుడిప్పుడే! రాష్ట్రాలు కూడా చొరవ చూపుతున్నాయి. మేకిన్ ఇండియా, స్మార్ట్‌సిటీలు కొత్త కొలువుల్ని సృష్టిస్తాయనిపిస్తోంది. వీటిని అందిపుచ్చుకోవటానికి కూడా నైపుణ్యాలు కావాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఇంజినీరింగ్‌నే చదువు అనుకోకుండా మిగిలిన కోర్సులవైపూ చూడాలి. చదువంటే ఇంజినీరింగ్ ఒక్కటే కాదు.
బస్‌లో కూర్చొని కూడా నేర్చుకునేలా...
టీసీఎస్‌లో డిజిటలైజేషన్ విప్లవం వచ్చేదాకా ఆగకుండా ముందే లక్షమంది సిబ్బందికి డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణివ్వాలని నిర్ణయించుకున్నాం. డిమాండ్ ఉన్నా లేకున్నా ఈ శిక్షణ ఇవ్వాలనుకున్నాం. ఇలా క్రమంగా 2 లక్షల మందికి డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణిచ్చాం. మా సిబ్బంది ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ఏదో ఓ డిజిటల్ నైపుణ్యముంది. ఈ శిక్షణ తరగతి గదుల్లో కూర్చోబెట్టి చేయలేదు. అలాచేస్తే సంవత్సరాలు పడుతుంది. అంత సమయం లేదు. అందుకే.. నైపుణ్యాలను పంచుకొనే క్లౌడ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాం. ఆఫీస్‌లో ఉన్నప్పుడు నేర్చుకోవచ్చు.. ఇంట్లో ఉన్నప్పుడు నేర్చుకోవచ్చు. అంతేకాదు.. ఇంటినుంచి ఆఫీస్‌కు వస్తుంటే బస్సు ప్రయాణంలో కూడా నేర్చుకోవచ్చు! అలా డిజైన్ చేశాం! కొన్నినెలల్లో ఈ ప్రక్రియ ముగిసింది. అందుకే నేర్చుకోవటం చాలా ముఖ్యం.
Posted on 0 27-05-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning