ఎప్పటికీ ఐటీ బంగారు బాతే!

* కోతలు 1-3 శాతమే.. అంతకు రెట్టింపు నియామకాలు జరుగుతున్నాయి
* వచ్చే 8 ఏళ్లలో ఐటీలో 35 లక్షల కొత్త కొలువులు
* ఉద్యోగాలకు ఢోకా లేదు భవిష్యత్తు నైపుణ్యాలను అందిపుచ్చుకోండి చాలు
* వర్సిటీల మందగమనమే ఆందోళనకరం
* ‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో నాస్కామ్‌ మాజీ ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి

భారతీయ నిరుద్యోగులకు ఆశల సౌధంగా నిలుస్తున్న ఐటీ రంగంలో చీమ చిటుక్కుమన్నా అటు విద్యార్థులు..ఇటు తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవడం సహజం. అలాంటిది ఉద్యోగాల కోతలంటే..ఇక చెప్పనక్కర్లేదు! కొలువుల్లో కోతలు వాస్తవమని అంగీకరిస్తూనే-ఈ కోతలెందుకో? భారత ఐటీరంగం ముందున్న సవాళ్లేమిటో? నాస్కామ్‌ మాజీ ఛైర్మన్‌, సియాంట్‌ కంపెనీ వ్యవస్థాపకులు..తెలుగు రాష్ట్రాల ఐటీ దిగ్గజం బీవీఆర్‌ మోహన్‌రెడ్డి ‘ఈనాడు’కిచ్చిన ముఖాముఖిలో వివరించారు. బంగారు బాతులాంటి భారత ఐటీ రంగ భవిష్యత్తు భద్రమేనని చెబుతూ.. దాని ముఖచిత్రాన్ని ఇలా ఆవిష్కరించారు.
* ఐటీరంగంలో సంక్షోభం లేదంటున్నారు. మరి సమస్యేంటి?
ఐటీ పరిశ్రమ సంక్షోభాన్ని కాదు...ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కొంటోంది అంతే. ఈ సవాళ్లలో అన్నింటికంటే ముఖ్యమైంది వూహించనంత వేగంగా వస్తున్న సాంకేతిక మార్పు. మనుషులు, యంత్రాలు మాట్లాడుకుంటూ కొత్త సాంకేతిక పరిజ్ఞానం అనుక్షణం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతమున్న సాంకేతికతను వెనక్కినెడుతోంది. ఉదాహరణకు గతంలో ఆటోమొబైల్‌ ఇంజినీరంటే మెకానికల్‌ నుంచి వచ్చేవారు! ఇప్పుడు మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సాఫ్ట్‌వేర్‌...ఇలా అన్నీ నేర్చుకోవాలి. అలాగే గతంలో నేర్చుకునే ఒక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీ 15 ఏళ్లపాటు నడిచేది. ఇప్పుడు నాలుగైదు లాంగ్వేజీలు నేర్చుకున్నా లాభం లేదు. ఇది మన సమస్యే మాత్రమే కాదు. ప్రపంచమంతటా ఇదే సమస్య. కాబట్టి కొత్త విజ్ఞానాన్ని నేర్చుకోవటాన్ని శ్రమ అనుకోకూడదు. దానికి అనుగుణంగా మార్పు చెందాలి. ఈ క్రమంలో ఐటీ రంగ నిపుణులు, కంపెనీలు కొత్త నైపుణ్యాలను అంతే వేగంగా అందిపుచ్చుకోవాల్సి వస్తోంది.
* కొలువుల కోతలో అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాలు, వీసాల ప్రభావం ఏమీ లేదంటారా?
ట్రంప్‌ నిర్ణయాల వల్ల ఇప్పటిదాకా వచ్చిన సమస్యేమీ లేదు. ఐటీ విప్లవం వల్ల మనకే కాదు...అమెరికన్‌ కంపెనీలకు కూడా విపరీతమైన లాభం చేకూరింది. ఆ విషయం ట్రంప్‌కు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి... ప్రమాదం ముంచుకొచ్చే నిర్ణయాలను ఆయన ఇప్పటిదాకా తీసుకోలేదు. ఇక ముందూ తీసుకుంటారని అనుకోను.
* మరి ఐటీ కొలువుల్లో కంపెనీలు కోతెందుకు పెట్టాల్సి వస్తోంది?
ఐటీరంగం ప్రాపంచికమైంది. ఇక్కడ పోటీ కూడా అలాగే ఉంటుంది. ఆ పోటీకి నిలబడే సత్తాగల వారినే కంపెనీలు ఉద్యోగంలో ఉంచుకుంటాయి. అందులో భాగంగా కంపెనీలు ఉద్యోగుల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ వెళ్తాయి. సత్తాలేని వాళ్లను గుర్తించి...వారి సామర్థ్యం, నైపుణ్యాల మెరుగుదలకు తొలుత అవకాశాలు కల్పిస్తాయి. ఈ వెసులుబాటు దాదాపు రెండేళ్లపాటు ఉంటుంది. అయినా పనితీరులో మెరుగుదల కన్పించకపోతే తీసేయటం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదు. ఇదేమీ కొత్త విధానం కాదు. ఏటా ఒకటి నుంచి 3 శాతం మందికి ఉద్వాసన పలకడం ఎప్పట్నుంచో జరుగుతున్న ప్రక్రియే. దేశవ్యాప్తంగా 40 లక్షల ఉద్యోగాల్లో ఈ 1-3 శాతమనేది చాలా ఎక్కువగా కన్పిస్తోందంతే. తీసేసే వాళ్లకంటే రెట్టింపు మందిని కొత్తగా తీసుకుంటున్న అంశం ఎక్కువగా ప్రచారంలోకి రావటం లేదు.
* ఆధునిక సాంకేతికత పట్ల భారత ఐటీ కంపెనీలు ముందుచూపుతో వ్యవహరించని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్న వాదన నిజమేనా?
భారత ఐటీ కంపెనీలకు ముందుచూపు లేదన్న వాదన సరికాదు. ఐదేళ్ల కిందటే మెకెన్సీ సంస్థతో మేం అధ్యయనం చేయించాం. రాబోయే రోజుల్లో 10 లక్షల ఐటీ ఉద్యోగాలు పోతాయి...అదే సమయంలో 19 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని వారు నివేదిక ఇచ్చారు. మేమంతా పెట్టుబడులు పెడుతున్నాం. మార్కెట్లో నిలవాలంటే నిరంతరం అప్‌డేట్‌ కావాల్సిందే. వ్యక్తులకైనా..వ్యవస్థలకైనా...సంస్థలకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి ఆధునిక సాంకేతికతను అందుకోవటంలో మన కంపెనీలు వెనకబడి ఉన్నాయనే వాదనతో ఏకీభవించను. మా సియాంట్‌తోపాటు...దాదాపు చాలా కంపెనీలు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పించే వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తున్నాయి. నాస్కామ్‌ తరఫున కూడా ఈ శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నాం.
* శిక్షణ దిశగా..ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి?
భవిష్యత్‌ నైపుణ్యాల శిక్షణ కోసం నాస్కామ్‌ తరఫున వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి శిక్షణ మొదలుపెట్టాం. వచ్చే మూడు నెలల్లో మరింత లోతైన శిక్షణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. కొత్తగా 55 జాబ్‌రోల్స్‌ను గుర్తించి వాటికి అవసరమైన(ఒక్కోదానికి నాలుగు నైపుణ్యాల చొప్పున) నైపుణ్యాలను మూక్స్‌ (మాసివ్‌ ఆన్‌లైన్‌ ఓపెన్‌ కోర్సులు) ద్వారా నేర్పుతున్నాం. ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో...ఎక్కణ్నుంచైనా నేర్చుకునే ఏర్పాట్లూ చేస్తున్నాం. నేను కూడా ఈ మూక్స్‌ ద్వారా కొత్త నైపుణ్యాల గురించి తెలుసుకుంటున్నా.
* మీ మార్పులకు తగ్గట్లుగా విద్యారంగంలో మార్పులు వస్తున్నాయా?
విద్యారంగంలో మార్పుల వేగం లోపించడమే ఆవేదన కల్గిస్తోంది. నిజానికి ఐటీ రంగ అభివృద్ధిలో పాత్రధారులు నల్గురు. 1. ప్రభుత్వం(విధానపరమైన నిర్ణయాల పరంగా) 2. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు 3. పరిశ్రమలు 4. విద్యార్థులు! ఈ నాలుగుస్తంభాలు కలసికట్టుగా వేటి పాత్రను అవి సరిగ్గా పోషిస్తేనే మనం ముందుకు వెళ్లగలం. ప్రపంచీకరణ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు తొందరగా పాఠ్యాంశాలను మార్చటం లేదు. అందుకే వాళ్ల నిర్ణయాల కోసం ఆగకుండా అవసరమైన కొత్త నైపుణ్యాలను నేర్పించే ఏర్పాట్లను మేమే చేసుకుంటున్నాం.
* వచ్చే పదేళ్లలో భారత ఐటీరంగ భవిష్యత్తు.. వృద్ధి పరంగా, ఉద్యోగాల కల్పన పరంగా ఎలా ఉండొచ్చు?
ఐటీ రంగం ఇప్పటికంటే ఇంకా అద్భుతంగా పురోగమిస్తుంది. ప్రస్తుతం మన దేశ ఐటీరంగ ఎగుమతుల విలువ సుమారు 154 బిలియన్‌ డాలర్లు్ల (10 లక్షల కోట్లు). ఇందులో తెలంగాణ వాటా సుమారు 700-800 కోట్లు. ఆంధ్ర కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. కొత్త సాంకేతికతతో ఐటీ వినియోగ విస్తృతి కూడా పెరుగుతోంది. డిజిటల్‌ లావాదేవీలూ పెరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తు ఇప్పటికంటే ఎంతో ఘనంగా ఉంటుంది. 2025 నాటికి 325-350 బిలియన్‌ డాలర్ల విలువైన వ్యాపారం చేయాలనేది నాస్కామ్‌ లక్ష్యం! ఇక కొలువుల విషయానికొస్తే ప్రస్తుతం 40 లక్షల ఉద్యోగాలున్నాయి. 2025 నాటికి మరో 30-35 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయి. కాబట్టి విద్యార్థులు దిగులు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఐటీ ఉద్యోగాలకు ఢోకా లేదు. కొత్త సాంకేతికతను నేర్చుకోవాలంతే! సవాళ్లనేవి అవకాశాలను పెంచుతున్నాయన్నది గతం నేర్పిన పాఠమే.
* ఐటీ సవాళ్ల నేపథ్యంలో అంకుర పరిశ్రమల పరిస్థితి ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో వీటి భవిష్యత్‌ ఎలా ఉండబోతోంది?
తెలుగు రాష్ట్రాల్లో అంకుర సంస్కృతి అనూహ్యంగా పెరుగుతోంది. ఇది ఆనందించదగ్గ పరిణామం. వాళ్లకాళ్ల మీద వాళ్లు నిలబడే దిశగా రిస్క్‌ తీసుకొని మరీ కొత్త కంపెనీ ఏర్పాటు చేసుకోవటానికి విద్యార్థులు, నిరుద్యోగులు ముందుకు రావటమనేది ఓ సామాజిక మార్పు! ఏపీ ప్రభుత్వం సన్‌రైజ్‌ సిటీ పేరుతో విశాఖలో, తెలంగాణ ప్రభుత్వం టి-హబ్‌ పేరుతో హైదరాబాద్‌లో అంకుర కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఇప్పుడిప్పుడే మెరుగైన సంకేతిక పరిజ్ఞానాన్నీ వాటిలో వాడుతున్నారు. ఈ కొత్త టెక్నాలజీతో వ్యవసాయం, ఆరోగ్యరంగం, విద్య, సుపరిపాలన...తదితర రంగాల్లో విప్లవాత్మక మార్పులు రావటానికి అవకాశాలున్నాయి. రాబోతున్నాయి కూడా! ఉదాహరణకు డ్రోన్‌ల వల్ల పంటలో ఎక్కడ పురుగుందో గుర్తించి.. అక్కడే రసాయనాలను పిచికారీ చేయించొచ్చు. వాట్సప్‌ ద్వారా అత్యున్నత వైద్య సేవల్ని అందించొచ్చు.
Posted on 06-06-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning