ఐటీ ఉద్యోగాలు..భారీగా కోత లేదు!

* కొత్త నియామకాలు తగ్గాయి
* పనితీరు మదింపు ప్రక్రియ మరింత కఠినతరం
* ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకుడు గోపాలకృష్ణన్‌

హైదరాబాద్‌: ఐటీ పరిశ్రమలో కొత్త నియామకాలు, పదోన్నతులకు గల అవకాశాలు గణనీయంగా తగ్గాయని ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకుడు క్రిస్‌ గోపాలకృష్ణన్‌ పేర్కొన్నారు. కంపెనీల వృద్ధి నెమ్మదించినపుడు ఇది సహజమేనని అభిప్రాయపడ్డారు. అయితే భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు వార్తల్లో నిజం లేదని అన్నారు. పరిశ్రమ వృద్ధి తగ్గినప్పుడు.. కొత్త ఉద్యోగుల అవసరం కూడా తగ్గుతుంది. రెండో విషయం ఏమిటంటే, ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం లేనప్పుడు.. పదోన్నతులు ఇచ్చేందుకు గల అవకాశాలు సైతం తగ్గుతాయి. కంపెనీలో ఎటువంటి పురోగతి లేనప్పుడు.. ఉన్నత స్థాయి ఉద్యోగుల అవసరం కూడా తగ్గుతుంది అని పీటీఐకిచ్చిన ముఖాముఖిలో క్రిస్‌ తెలిపారు. భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు మాత్రం లేదని, అయితే పదోన్నతుల ప్రక్రియను కఠినతరం చేయడం ఎప్పుడు సహజంగా జరిగేదేనని చెప్పుకొచ్చారు. పనితీరు మదింపు ప్రక్రియ సైతం మరింత కఠినతరం కానుందని క్రిస్‌ అంచనా వేశారు.
ఇంతకు ముందు జరిగినవే: ఐటీ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు కొత్త అంశం కాదని క్రిస్‌ అన్నారు. 2001లో ఇంటర్నెట్‌ బుడగ పేలినపుడు, 2008లో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తినపుడు కూడా ఇలాంటివి చోటుచేసుకున్నాయని క్రిస్‌ అన్నారు. భారత ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా, ఐరోపాల్లో వృద్ధి తగ్గడం, పరిశ్రమలో బేస్‌ ఎఫెక్ట్‌ భారీగా ప్రభావం చూపడం, వీసా నిబంధనలు కఠినతరం వంటివి ఐటీ పరిశ్రమ నెమ్మదించడానికి కారణాలని అన్నారు.
యూనియన్ల ఏర్పాటు మంచిది కాదు: ఐటీ పరిశ్రమలో ఉద్యోగుల యూనియన్ల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలపై స్పందిస్తూ.. ఐటీ ఉద్యోగులు భారీ మొత్తంలో వేతనాలు అందుకుంటున్నారు. ఉద్యోగాలు మారేందుకు సైతం వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. నా దృష్టిలో యూనియన్ల ఏర్పాటు మంచి ఆలోచన కాదు. ఫ్యాక్టరీలో పనిచేసే వారికి యూనియన్లు అవసరం ఉంటుంది. కానీ ఇది అటువంటిది కాదు. ఉద్యోగులకు ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుంది అని క్రిస్‌ పేర్కొన్నారు.
నిపుణుల కొరత ఉంది: ఇప్పటికీ కృత్రిమ మేధ, మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌పై కొత్త నమూనాలు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి విభాగాల్లో నైపుణ్యాలు కలిగిన వారి కొరత ఉంది. సరైన సాంకేతిక నైపుణ్యాలు కలిగిన వారి కోసం పరిశ్రమ ఎప్పుడు అన్వేషిస్తూనే ఉంటుంది అని క్రిస్‌ తెలిపారు. ఐటీ కంపెనీలకు కీలకమైన రెండు కీలక విపణులు (అమెరికా, ఐరోపా) రక్షణాత్మత ధోరణులు కొనసాగించడంపై మాట్లాడుతూ ‘అన్ని ఆర్థిక వ్యవస్థలు కొత్త ఉద్యోగాలు సృష్టించకుండా వృద్ధి చెందుతున్నాయి అని అన్నారు.

Posted on 06-06-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning