బీటెక్‌ ఒక్కటే బువ్వ పెట్టదు

* ప్రత్యేక నైపుణ్యాలు కావాలి
* కళాశాలలోనే కోడింగ్‌ నేర్చుకోవాలి
* శిక్షణ ఇచ్చేందుకు సంస్థలు సిద్ధంగా లేవు
* ఉద్యోగాల కోతను భూతద్దంలో చూపిస్తున్నారు
* యూనియన్లు ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు లభించవు
* ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్‌ పాయ్‌

హైదరాబాద్‌: ఐటీ పరిశ్రమలో నియామకాల తీరు మారుతోంది. డిజిటల్‌ విప్లవంతో కొత్త నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల అవసరం పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయంగా వస్తున్న ఇంజినీరింగ్‌ పట్టాలతో ఉద్యోగం సంపాదించడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉద్యోగార్థులకు బీటెక్‌ పట్టా మాత్రమే ఉంటే సరిపోదని, ఐటీ సంస్థలు ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న వారిని కోరుకుంటున్నాయని ఇన్ఫోసిస్‌ మాజీ ముఖ్యఆర్థికాధికారి (సీఎఫ్‌ఓ) టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ అన్నారు. వివిధ అంశాలపై ఆయన ఏమన్నారంటే..
ఆ రోజులు పోయాయ్‌..
విద్యార్థులకు ఇచ్చే సలహా ఒకటే. కేవలం బీటెక్‌తోనే సరిపెట్టుకోకండి. ఎంటెక్‌ చేయడంతోపాటు ప్రత్యేక నైపుణ్యాలను పెంచుకోండి. అదనంగా సమయాన్ని వెచ్చించి కోడింగ్‌లో ప్రతిభావంతులుకండి. కొంత అనుభవాన్ని గడించండి. తగిన నైపుణ్యాలు లేని వారిని తీసుకుని వారికి ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చేందుకు సంస్థలు సుముఖంగా లేవు. ఇందుకోసం ధనాన్ని, సమయాన్ని వృథా చేయడానికి అవి ఇష్టపడటం లేదు. మీకు కోడింగ్‌ రాయడంలో మంచి నైపుణ్యం ఉంటే సంస్థలు ఉద్యోగం ఇస్తాయి.
అవన్నీ అభూత కల్పనలు..:
ఐటీ రంగంలో ఉద్యోగాల తొలగింపుపై వస్తున్న వార్తలన్నీ అభూత కల్పనలే. అనవరంగా పెద్దగా చూపిస్తూ భయాలు పెంచుతున్నారు. వాస్తవ గణాంకాలు చూస్తే ఇది అబద్ధమని తెలుస్తుంది. ప్రతి ఏడాది పనితీరు ఆధారంగా 1-2 శాతం మందిని తొలగించడం ఎక్కడైనా సాధరణంగా జరిగేదే. సరిగా పని చేయని వారిని ఎవరు మాత్రం ఉద్యోగంలో ఉంచుకుంటారు.
ఫ్రెషర్స్‌ వేతనాలు పెరగంది ఇందుకే..
గత కొద్ది కాలంగా ఫ్రెషర్స్‌ వేతనాలు పెరగడం లేదు. ఇదో భాదాకరమైన కథ. ఐటీ పరిశ్రమ వేగవంతమైన వృద్ధిని సాధించక పోవడమే ఇందుకు కారణం. ఈ ఏడాది 2% వృద్ధి రేటును మాత్రమే నమోదైంది. గతంలో ఇది 3-4 శాతంగా ఉండేది. దీంతో ఉద్యోగాలు తగ్గడం ఉద్యోగార్థుల సంఖ్య పెరగడంతో వేతనాలు పెరగడం లేదు.
* ఐటీ రంగంలో కొందరు ఉద్యోగ సంఘాలు (యూనియన్లు) ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటికి ఎవరూ మద్దతు ఇవ్వరు. అటువంటి వారితో పోయే వారికి ఉద్యోగాలు లభించవు.
అన్ని ఉద్యోగాలు ఏ దేశమూ ఇవ్వలేదు..
మనం దేశంలో ఏడాదికి దాదాపు 10 లక్షల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు కళాశాలల నుంచి వస్తున్నారు. ఈ ఏడాది ఐటీ రంగంలో 1.5-1.60 లక్షల మందికి ఉపాధి దొరకొచ్చు. పట్టాపట్టుకుని వచ్చిన ప్రతివారికీ సంస్థలు ఇవ్వలేవు. 10 లక్షల మందికి ప్రపంచంలో ఏ దేశమూ ఉపాధి కల్పించ లేదు. చివరకు చైనా అయినా సరే.

Posted on 08-06-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning