ప్రాంగణ ప్రభ తగ్గినట్లేనా..

* మారిన పరిశ్రమ.. నైపుణ్యాల కొరతే కారణం
* సిద్ధం కాలేకపోతున్న కాలేజీలు
* చిన్న కంపెనీల వైపు చూడండి

ఈనాడు - హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌లో ఏ విభాగంలో (సివిల్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌) చేరినా.. అధికశాతం ఇంజినీరింగ్‌ విద్యార్థుల లక్ష్యం మాత్రం ఒక్కటే.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం. అందుకోసమే కంపెనీలు ప్రాంగణ నియామకాలకు వచ్చే కాలేజీల్లో మాత్రమే చదివేందుకు ఇష్టపడతారు. కాలేజీలు కూడా విద్యార్థులను ఆకర్షించడానికి ప్రాంగణ నియామకాలనే చూపుతాయి. అయిదారేళ్ల క్రితం కంపెనీలు ప్రాంగణాలకు వెళ్లి వేల సంఖ్యలో కొత్త ఉద్యోగులను (ఫ్రెషర్లు) నియమించుకునేవి. పెద్ద కంపెనీలు ముందుగా ఈ నియామకాల ప్రణాళికలను కూడా వెల్లడించేవి. సాధారణంగా ఇంజినీరింగ్‌ కాలేజీల్లో అక్టోబరు నుంచి ఇవి ప్రారంభమవుతాయి. ఇవి జనవరి, ఫిబ్రవరి వరకూ కొనసాగుతాయి.
బెంచే కంపెనీల బలం: ఏడెనిమిదేళ్ల క్రితం కంపెనీలు ప్రాజెక్టులను సంపాదించడానికి బెంచ్‌ని చూపించేవి. కొన్ని కంపెనీల్లో మొత్తం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో 30-40 శాతం మంది బెంచ్‌పైనే ఉండేవారు. కంపెనీలు ప్రాంగణ నియామకాలు చేపట్టి కొత్తగా నియమించిన ఉద్యోగులకు ఒకటి రెండేళ్లపాటు పెద్దగా పని చెప్పేవారు కాదు. వీరంతా బెంచ్‌పైనే ఉండేవారు. నియామకాల సమయంలో వారికి సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాలు ఉన్నాయా లేదా అని పరిశీలించే కంటే.. హేతుబద్ధ ఆలోచన విధానం (లాజికల్‌ థింకింగ్‌) ఉందా అన్న కోణంలో పరిశీలించి ఉద్యోగాలు ఇచ్చేవారు. కంపెనీలో చేరిన తర్వాత వారికి శిక్షణ ఇచ్చేవారు. విద్యార్థులు కూడా ఆఫర్లు ఇచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరాలా లేక పై చదువులకు వెళ్లాలా అని ఆలోచించేవారు. ఆఫర్లు పొందిన వారిలో దాదాపు సగానికి సగం మంది వచ్చి చేరేవారు కాదు. అందుకని కంపెనీలు కాలేజీలకు వెళ్లి భారీ సంఖ్యలో ప్రాంగణ నియామకాలు జరిపేవి. అయిదారేళ్ల క్రితం ప్రోగ్రామర్లు, సాంకేతిక మద్దతు సేవల (టెక్నికల్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌) కోసం ఒక్క ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లోనే వివిధ కంపెనీలు దాదాపు లక్ష మందిని నియమించుకునేవని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మారుతున్న ముఖచిత్రం..
సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో వస్తున్న మార్పులు ప్రాంగణ నియామకాలను తగ్గిస్తున్నాయి. గతంలో నిపుణులు చేసే ప్రోగ్రామింగ్‌ కోడింగ్‌ ఇప్పుడు ఆటోమేషన్‌ అయింది. దీంతో కిందిస్థాయిలో ఎక్కువమంది నిపుణుల అవసరం లేకుండా పోయింది. కృతిమ మేధ, రోబోటిక్స్‌, డేటా విశ్లేషణ, ఐఓటీ, వర్చువల్‌ రియాలిటీ వంటి డిజిటిల్‌ సాంకేతిక పరిజ్ఞానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో డిజిటల్‌ పరిజ్ఞానాల్లో నైపుణ్యాలున్న విద్యార్థులు కాలేజీల్లో లభించకపోవడంతో కంపెనీలు ప్రాంగణ నియామకాల ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్నాయి. ఉన్న ఉద్యోగులకే డిజిటల్‌ పరిజ్ఞానాల్లో శిక్షణ ఇచ్చి వారిని వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీలు సున్న బెంచ్‌ విధానంలోకి వచ్చాయి. ‘పని ఉంటేనే ఉద్యోగి’ విధానంలో అవసరమైనప్పుడు ప్రాంగణేతర మార్గాల ద్వారా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కంపెనీలోని ఉద్యోగుల సహకారాన్ని తీసుకుంటున్నాయి. దీంతో గత రెండేళ్లగా ప్రాంగణ నియామకాలు బాగా తగ్గాయని.. భవిష్యత్తులో మరింత తగ్గొచ్చని సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
భవిష్యత్‌ అగమ్యమే...
దేశంలో దాదాపు 16 లక్షల ఇంజినీరింగ్‌ సీట్లు ఉన్నాయి. ఇందులో కేవలం 50 శాతం మాత్రమే భర్తీ అవుతున్నాయి. దీంతో ఆర్థికంగా ఇంజినీరింగ్‌ కాలేజీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, విదర్భ వంటి ప్రాంతాల్లో అనేక ఇంజినీరింగ్‌ కాలేజీలు మూతపడుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంజినీరింగ్‌ కాలేజీలు డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోలేక పోతున్నాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను మార్చలేకపోతున్నాయి. డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాల్లో బోధన చేయగల ఉపాధ్యాయుల కొరత చాలా ఎక్కువగా ఉంది. దీంతో డిజిటల్‌ నైపుణ్యాలున్న విద్యార్థులను కోరుకుంటున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ప్రాంగణ నియామకాలకు ఆసక్తి చూపడం లేదు. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో జరిగే ప్రాంగణ నియామకాల్లో కూడా 15-20 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం లేదు. అవసరం లేకపోతే.. ఒక్కరిని కూడా తీసుకోవడానికి కంపెనీలు ఇష్టపడడం లేదు. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో ప్రాంగణ నియామకాల గురించి కంపెనీలు మర్చిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

-రాహుల్‌ పట్వర్థన్‌, ఎన్‌ఐఐటీ సీఈఓ

డిజిటల్‌పై దృష్టి పెట్టాలి...
రెండు మూడేళ్ల నుంచి ప్రాంగణ నియామకాలు తగ్గుతున్నాయి. అంతక్రితం సాంకేతిక విద్యార్థులతోపాటు ఇంజినీరింగేతర విద్యార్థుల నియామకాలు కూడా బాగా ఉండేవి. పరిశ్రమ మారుతోంది కాబట్టి నియామకాలు తగ్గుతాయి. విద్యార్థులు డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాలతోపాటు జర్మనీ, స్పానిష్‌, ఫ్రెంచ్‌ వంటి భాషల్లో పట్టు సాధిస్తే ఇతర దేశాలకు వెళ్లే అవకాశాలు పెరుగుతాయి.
- కె.వి.అచలపతి, డైరెక్టర్‌, ధన్వంతరి

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ చిన్న కంపెనీలూ ప్రధానమే
గతంలో మాదిరిగా ప్రస్తుతం ఐటీ పరిశ్రమకు భారీగా నైపుణ్యాలు ఉన్న నిపుణుల అవసరం లేదు. గతంలో సీనియర్లను తొలగించిన మేరకు కలిగే ప్రయోజనానికి అనుగుణంగా కంపెనీలు కొత్త వారిని నియమించుకునేవి. ఇప్పుడు ఆ విధంగా చేయడం లేదు. అయితే.. కాలేజీలు పెద్ద కంపెనీల వైపే చూడాల్సిన అవసరం లేదు. చిన్న కంపెనీలు, అంకుర కంపెనీలపై దృష్టి పెట్టొచ్చు. ఒక పెద్ద కంపెనీకి బదులు.. 10 చిన్న కంపెనీలు, అంకుర కంపెనీలను ఆకర్షించగలిగితే.. ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.
-జి.ఆర్‌.రెడ్డి, వ్యవస్థాపకుడు, హ్యూసిస్‌ కన్సల్టింగ్Posted on 11-06-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning