కేన్సస్‌లో విద్యార్థుల‌కు ప‌టిష్ఠ భ‌ద్రత‌

* జాత్యంహకార దాడి షాక్‌ నుంచి కోలుకుంటున్న ప్రవాసులు
* అండగా నిలిచిన అమెరికా సమాజం
* ఆ ఘటన దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించిందని అమెరికన్ల భావన

ఫిబ్రవరి 22, 2017.. ప్రపంచవ్యాప్తంగా భారతీయులంతా ఉలిక్కిపడ్డారు. కారణం...స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు ప్రతీకగా భావించే అమెరికాలో తెలుగు యువకులపై ఒక జాత్యహంకారి కాల్పులకు తెగబడ్డ ఘటన. ఈ దాడిలోనే యువ ఇంజినీర్‌ కూచిభొట్ల శ్రీనివాస్‌ మరణించారు. మాదసాని అలోక్‌రెడ్డి అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఒక శ్వేతజాతీయుడు అకారణంగా నిండు ప్రాణాలు తీయడానికి పూనుకున్నాడు. అదే సమయంలో మరో శ్వేతజాతీయుడు ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ అతన్ని నిలువరించడానికి ప్రయత్నించాడు. ద్వేషానికి విచక్షణ ఉండదని, మానవత్వానికి ఎల్లలుండవని ఈ ఉదంతం నిరూపించింది. ఈ సంఘటన అటు అమెరికాలోనూ, ఇటు భారతదేశంలోనూ ప్రకంపనలు సృష్టించింది. ఎన్నో చర్చలకు దారి తీసింది. లక్షల మంది భారతీయ అమెరికన్లలోనూ, విద్యార్థుల్లోనూ అలజడిని, అభద్రతను కలిగించింది. భారత పార్లమెంటు దీనిపై చర్చించింది. అమెరికన్‌ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఇది వారి దేశానికి అప్రతిష్ఠగా భావించారు. ఆలస్యంగా అయినా అమెరికా అధ్యక్షుడే స్పందించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని అమెరికా విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల స్థితిగతులను అధ్యయనం చేయడానికి అమెరికా విదేశాంగ శాఖ మన దేశం నుంచి ఆరుగురు సభ్యుల పాత్రికేయ బృందాన్ని ఆహ్వానించింది. ఆ బృందంలో భాగంగా అమెరికాలో పర్యటించిన ఈనాడు ప్రత్యేక ప్రతినిధి అందిస్తున్న కథనం ఇది.

ఇంజినీరింగ్‌ పూర్తి కాగానే అమెరికాలో ఎం.ఎస్‌. సీటు కోసం ప్రయత్నించాలి. దేవుడి దయవల్ల సీటొచ్చిందా స్థిరపడ్డట్టే! కోర్సు పూర్తి చెయ్యగానే అక్కడే ఉద్యోగం వస్తుంది. ఆ తరువాత ఎంత కష్టపడితే అంత అద్భుతమైన భవిష్యత్తు... చాలా మంది యువత ఆలోచనసరళి ఇలానే ఉంది. నిజానికి అమెరికాకు మన మేధో వలస 1960 నుంచి ప్రారంభం అయింది. వియత్నాం యుద్ధం వల్ల అమెరికాలో వైద్యుల కొరత ఏర్పడింది. దీన్ని పూడ్చుకోవడానికి, అప్పటి ప్రచ్ఛన్న యుద్ధంలో సోవియట్‌ యూనియన్‌పై శాస్త్ర సాంకేతిక రంగాల్లో పై చేయి సాధించడానికి అమెరికా.. ప్రపంచ వ్యాప్తంగా ఇంజినీరింగ్‌, సైన్సుల్లో మేధావులకు ఎర్రతివాచీ పరిచింది. దాన్ని మన వాళ్లు బాగా అందిపుచ్చుకున్నారు. తరువాత 90ల్లో మొదలైన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విప్లవం వల్ల ఈ ధోరణి క్రమేణా బలపడుతూ వచ్చింది. ఎంతగా అంటే అమెరికాలో ఉండే విదేశీ విద్యా సంస్థల్లో చైనాది మొదటి స్థానం అయితే, మనది రెండో స్థానం. అమెరికాలో ఏటా 10.5 లక్షల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. వారిలో భారతీయుల సంఖ్య 1.75 లక్షల వరకూ ఉంటుంది. 2001తో పోలిస్తే భారతీయ విద్యార్థుల సంఖ్య 3.5 రెట్లు పెరిగింది. ఇది మన వాళ్లకు అమెరికా పట్ల ఉన్న మక్కువకు నిదర్శనం. అమెరికాలో విదేశీ విద్యార్థుల్లో మన వాళ్లు 16 శాతం ఉన్నారు. 2014-15తో పోలిస్తే 2015-16లో మన విద్యార్థుల సంఖ్య 24.9 శాతం పెరిగింది. అంతటి రంగుల స్వప్నాల్ని ఆవిష్కరించిన అమెరికా ఇటీవలి పరిణామాలతో అందరినీ ఒక్కసారి ఆలోచనలో పడేసింది.

అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ట్రంప్‌ పదవీ బాధ్యతలు చేపట్టి అప్పటికి నెల రోజులే. సరిగ్గా అప్పుడే జరిగిందీ కేన్సస్‌ కాల్పుల సంఘటన. మనకన్నా మూడున్నర రెట్లు పెద్దదైన అమెరికా మధ్యలో ఉంటుందీ కేన్సస్‌ రాష్ట్రం. దాంతో అక్కడ జరిగిన ఈ దారుణం.. ఆ దేశమంతటిని ఒక కుదుపు కుదిపింది. దీన్ని చూసి జాతి, వర్ణాలతో సంబంధం లేకుండా అమెరికన్‌ సమాజం చలించిపోయింది. ఆ దేశమంతా ఒక్కటై ఈ దుశ్చర్యను ఖండించింది. వివిధ రూపాల్లో నిరసనల్నీ తెలియచేసింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల జరిగిన సంతాప సమావేశాలు, ప్రార్థనలే అందుకు నిదర్శనం. ఎందరో అమెరికన్లు బాధితులకు అండగా నిలిచారు. కూచిభొట్ల శ్రీనివాస్‌ కుటుంబానికి కొద్ది రోజుల్లోనే దాదాపు 12 లక్షల డాలర్లు విరాళంగా సమకూర్చారు. సోషల్‌ మీడియాలో సంతాప సందేశాలకైతే లెక్కే లేదు. ట్రంప్‌ మద్దతుదారులు, అభిమానులు కూడా ఈ దారుణాన్ని ఖండించారు. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక అయితే సంపాదకీయమే రాసింది. చివరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో ఈ దుర్ఘటనను ఖండిస్తూ మాట్లాడాల్సి వచ్చింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకు అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్‌ సర్నా అక్కడి ‘గవర్నర్ల జాతీయ సంఘం’ సభ్యుల గౌరవార్థం ఒక విందు ఇచ్చారు. అమెరికాలోని 50 రాష్ట్రాల గవర్నర్లు ఈ సంఘంలో సభ్యులు. ఈ విందుకు అనూహ్యంగా 25 మంది గవర్నర్లు వారి జీవిత భాగస్వాములతో సహా హాజరయ్యారు. మరికొందరు గవర్నర్లు వారి సీనియర్‌ ప్రతినిధులను పంపారు. ఇంత మంది ఇలా హాజరవ్వడం అరుదని, అమెరికన్లు భారతీయులకు ఇస్తున్న గౌరవానికి ఇది నిదర్శనమని ప్రవాస భారతీయులు హర్షం వెలిబుచ్చారు.

ఓలెత్‌ నగరంలో కాల్పుల దుర్ఘటన రేపిన గాయాలు ఇప్పుడిప్పుడే మానుతున్నాయి. ఈ ఘటనకు వ్యతిరేకంగా వచ్చిన తీవ్ర నిరసనలు, వారికి స్థానిక అమెరికన్ల నుంచి వచ్చిన మద్దతే అందుకు కారణం. ప్యూరింటన్‌ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అమెరికన్‌ ఇయాన్‌ గ్రిలోట్‌ను హీరోగా భావిస్తున్నారు. అతనే నిజమైన అమెరికన్‌ అంటూ కీర్తిస్తున్నారు. అతని చికిత్స కోసం కూడా విరాళాలు వెల్లువెత్తాయి. ‘గోఫండ్‌మి’ వెబ్‌సైట్‌ ద్వారా మూడు నెలల్లో మూడు కోట్ల రూపాయల పైచిలుకు విరాళంగా వచ్చింది. దుర్మరణం పాలయిన కూచిభొట్ల శ్రీనివాస్‌ గౌరవార్థం మార్చి 16వ తేదీని ఇండియన్‌ - అమెరికన్‌ అప్రెసియేషన్‌ డేగా ప్రకటించారు.

యూఎంకేసీలో విద్యార్థుల భద్రతకు పటిష్ఠ ఏర్పాట్లు
మరోవైపు యూనివర్సిటీ ఆఫ్‌ మిసోరీ - కేన్సస్‌ సిటీ (యు.ఎం.కె.సి.) తమ విద్యార్థులకు భద్రతను కల్పించడానికి పలు చర్యల్ని చేపట్టింది. 1929లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయానికి నాణ్యమైన బోధన, సౌకర్యాలు, అవకాశాల పరంగా చాలా మంచి పేరు ఉంది. ఇక్కడ ఏటా 16 వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటారు. వీరిలో 1200 మందికిపైగా భారతీయ విద్యార్థులే. కేన్సస్‌ కాల్పులకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వాటికి విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌, అధికారులు సంపూర్ణంగా సంఘీభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత ఏర్పాట్లను పటిష్ఠం చేశారు. ఫలితంగా తిరిగి మామూలు వాతావరణం నెలకొంటోంది.

విద్యాలయాల్లో ప్రవేశాలు తగ్గాయి
వలస సమాజానికి అమెరికా సమాజం అండగా ఉంటున్న మాట ఎంత వాస్తవమో ట్రంప్‌ ప్రభుత్వ ‘అమెరికా ఫస్ట్‌’ నినాదం, విదేశీయులపై ఆంక్షలు విధించడం వంటివి ఆ దేశ విద్యారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నది అంతే వాస్తవం. అమెరికాలో జరుగుతున్న పరిణామాల కారణంగా 40 శాతం విద్యాలయాల్లో ప్రవేశాలు తగ్గినట్టుగా ‘అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ రిజిస్ట్రార్స్‌’ సంస్థ వర్గాలు వెల్లడించాయి. దీనికి కారణం విదేశీ విద్యార్థులు అమెరికాయేతర దేశాల్ని ఎంచుకుంటుండమే. ప్రభుత్వ విధానాలతో ఆందోళనలో ఉన్న విదేశీ విద్యార్థులు కేన్సస్‌ కాల్పులతో భద్రత విషయంలోనూ సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారని సీటెల్‌ టైమ్స్‌ పేర్కొంది. విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గడానికి భారతదేశంలో పెద్దనోట్ల రద్దు, నగదు లావాదేవీల మీద నియంత్రణలు వంటి ప్రభుత్వ చర్యలూ కొంత వరకూ కారణమని కొందరి విశ్లేషణ.

అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై అక్కడ పర్యటించిన అరుగురు సభ్యుల పాత్రికేయుల బృందంలో ఈనాడు ప్రతినిధిగా సీనియర్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ ఎం. నాగేశ్వరరావు ఉన్నారు. ఆయ‌న అందించిన ప్రత్యేక క‌థ‌న‌మిది.

అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై అక్కడ పర్యటించిన అరుగురు సభ్యుల పాత్రికేయుల బృందంలో ఈనాడు ప్రతినిధిగా సీనియర్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ ఎం. నాగేశ్వరరావు ఉన్నారు. ఆయ‌న అందించిన ప్రత్యేక క‌థ‌న‌మిది.

Posted on 16-06-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning