అమెరికానే నా ఇల్లు

* ఇక్కడి సమాజం ఆదరణతో కోలుకున్నా
* ఈనాడు ప్రత్యేక ప్రతినిధితో మాదసాని అలోక్‌

ఓ వైపు రాజకీయ నేతల విద్వేషపూరిత ప్రసంగాలు.. మరో వైపు ఆ ప్రసంగాలతో ప్రేరేపితమయ్యారా అన్నట్లు కొంతమంది ఉన్మాదులు ప్రత్యేకించి ఒక వర్గంపై చేసే దాడులు.. ఏ సమాజన్నైనా తీవ్రంగా కలవర పరిచే అంశం. అమెరికాలోని కేన్సస్‌లో తెలుగు యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్‌ను శ్వేతజాతీయుడొకరు జాత్యహంకార దాడితో పొట్టనబెట్టుకున్నప్పుడు అక్కడి భారతీయ సమాజం ఇలాగే భీతిల్లింది. అమెరికా ఉద్యోగాలను విదేశీయులు కొల్లగొట్టుకు పోతున్నారని రెచ్చగొట్టే విధంగా రాజకీయనాయకులు చేసిన ప్రసంగాలు, వీసా సమస్యలు, దాడి యత్నాలు వంటివి అప్పటికే ప్రవాస భారతీయులను కలవరపెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశంలోని సభ్యసమాజం, మేధావులు అండగా నిలబడి, విద్వేషానికి అమెరికాలో స్థానం లేదని భరోసా ఇచ్చారు. దీంతో ఆనాడు మనసుకైన గాయం నుంచి కేన్సస్‌లోని భారతీయులు క్రమంగా కోలుకుంటున్నారు. అలా కోలుకున్న వారిలో మాదసాని అలోక్‌ ఒకరు. ఉన్మాది కాల్పుల్లో ఆప్తమిత్రుడు, అత్యంత మృదుస్వభావి అయిన సహోద్యోగి కూచిభొట్ల శ్రీనివాస్‌ మరణించడం.. ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉందంటున్న ఆయన.. ఆ సంఘటనతో భారత్‌ వెళ్లిపోదామనుకున్నానని వెల్లడించారు. అయినప్పటికీ.. ఇక్కడి వారి ఆదరణ చూసిన తర్వాత ఇప్పుడు ఆ ఆలోచన లేనే లేదని ‘ఈనాడు’కు ఇచ్చిన ముఖాముఖిలో స్పష్టంచేశారు. అలోక్‌తోపాటు.. భారతీయ విద్యార్థులు, విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో ఈనాడు ప్రత్యేక ప్రతినిధి మాట్లాడారు. ఆ వివరాలు..

* అమెరికా ఎప్పుడొచ్చారు?
అలోక్‌: హైదరాబాద్‌లోని వాసవీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాక 2006 జులైలో మిసోరీ కేన్సస్‌ సిటీ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్‌. చేయడానికి అమెరికా వచ్చాను. 2008లో రాక్వెల్‌ కాలిన్స్‌ సంస్థలో ఉద్యోగంలో చేరాను. 2014 నుంచి కేన్సస్‌ నగరంలోనే గార్మిన్‌ బహుళజాతి సంస్థలో పని చేస్తున్నాను.
* కూచిభొట్ల శ్రీనివాస్‌ మీకు ఎప్పటి నుంచి పరిచయం?
అమెరికా వచ్చాకే. 2008లో ఇద్దరం కలసి రాక్వెల్‌లో ఉద్యోగాల్లో చేరాం. తరువాత ఇద్దరం కలిసే గార్మిన్‌ సంస్థలో చేరాం.
* ఈ సంఘటన జరిగాక మీకు ఏమనిపించింది? భారతదేశం వెళ్లిపోవాలనుకున్నారా?
కళ్లముందే శ్రీనివాస్‌ అలా కూలిపోవడంతో తీవ్రమైన షాక్‌కి గురయ్యాను. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. నాకేమైందో కూడా తెలియలేదు. కుటుంబ సభ్యులు కొన్నిరోజుల పాటు నరకం అనుభవించారు. సంఘటనకు ముందు భారతీయులు, అమెరికన్లు వేర్వేరు అని ఎప్పుడూ అనిపించలేదు. నేను పరాయివాడిని అన్న భావన కూడా ఏనాడూ కలగలేదు. ఈ దుర్ఘటనతో ఒక్కసారిగా నిస్తేజం ఆవరించింది. భారత్‌ వెళ్లిపోతే బాగుంటుంది అన్న భావన నాకు కలగలేదు అంటే అది అబద్ధమే. కానీ ఇక్కడి ప్రవాస భారతీయులు, అమెరికన్‌ స్నేహితులు, కంపెనీ యాజమాన్యం, సహచరుల ఆదరణ చూసిన తర్వాత ఇప్పుడు నాకు ఆ ఆలోచన లేదు. అమెరికానే నా ఇల్లు. ఇక్కడే ఉంటాను.

* తోటి భారతీయుల స్పందన ఏమిటి?
సంఘటన తర్వాత ప్రవాసులు ముఖ్యంగా కేన్సస్‌ చుట్టుపక్కల వారు చాలా భయపడ్డారు. తమకూ ఇలాంటి సంఘటన ఎదురవుతుందేమోనని అనుక్షణం కలవరపడ్డారు. హోటల్‌కి వెళ్లాలంటే కూడా భయపడిపోయారు. కానీ అమెరికన్‌ సమాజం సకాలంలో ఇచ్చిన ఆసరాతో అతి త్వరగా సాధారణ స్థితి నెలకొంటోంది. జాగ్రత్తలు తీసుకుంటూనే ఎవరి పనులు వారు నిర్భయంగా చేసుకుంటున్నారు.
* మీరు ఇంత త్వరగా కోలుకుని సాధారణ విధులు నిర్వహించుకోవడానికి ఎవరెవరు ఎలా దోహదపడ్డారు?
స్థానికంగా ఉన్న భారతీయులందరూ ఒక కుటుంబంగా కలిసిపోయి సంఘీభావం ప్రకటించారు. ఇరుగుపొరుగు భారతీయులు దాదాపు ప్రతిరోజూ పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి అండదండలతో నేను వేరే దేశంలో ఉన్నానన్న భావన కలగలేదు. జరిగింది జాత్యహంకార ఘటనే అయినా అమెరికన్లు అందించిన మద్దతు మరువలేనిది. ఘటనా స్థలంలోనే వారు గొప్పగా స్పందించారు. మమ్మల్ని కాపాడి తీవ్రంగా గాయపడిన వ్యక్తి శ్వేత జాతీయుడే. ‘దాడి చేసిన వ్యక్తి పిచ్చివాడు. అతని మాటల్ని పట్టించుకోవద్దు. మీరు మా వాళ్లే’ అని రెస్టారెంటులో ఉన్న కొందరు చెప్పారు. మా బిల్లు కూడా వాళ్లే చెల్లించారు. ఆస్పత్రిలోనూ, ఆ తర్వాతా భారతీయులు, అమెరికన్లు అందించిన అండదండల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలా ఉన్నారని ఇప్పటికీ వందల మంది మెసేజ్‌లు పంపిస్తున్నారు. డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌కి వెళ్తే తెలియని వారు కూడా గుర్తుపట్టి నా క్షేమ సమాచారాల గురించి వాకబు చేస్తున్నారు.
* అసలు ఆరోజు ఏం జరిగింది?
అది అనూహ్యంగా జరిగిన సంఘటన. అతన్ని మేం చూడటం అదే మొదటిసారి. నేరుగా వచ్చి మా పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించాడు. బెదిరించాడు. మాకున్న వివేకంతో మౌనంగానే ఉన్నాం. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే కాల్పులకు తెగబడ్డాడు. చుట్టుపక్కల అందరూ చూస్తూనే ఉన్నారు. రెండు సీసీ కెమేరాలున్నాయి. పోలీసులు వాటి దృశ్యాలని తీసుకున్నారు. సాక్ష్యాధారాలు సేకరించారు. అతను మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడో ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. కోర్టు విచారణలో అన్నీ బయటికి వస్తాయన్న నమ్మకం నాకుంది. ఆ రోజు దుండగుడితో మేం వాదించామని, పార్కింగ్‌ స్థలంలో ఘర్షణ జరిగిందని కొందరు వదంతులు వ్యాపింపచేయడం బాధ కలిగించింది.
* మీరు అలాంటి బార్‌కి వెళ్లడం తప్పని, అందువల్లే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని కొందరు అంటున్నారు?
సోషల్‌ డ్రింకింగ్‌ అమెరికాలో సర్వసాధారణం. అందరూ చేస్తారు. సంఘటన అక్కడ జరిగింది కాబట్టి అలా అంటున్నారు. ఇంకెక్కడైనా జరగవచ్చు. సంఘటనకూ ఆ బార్‌కీ సంబంధం లేదు. తాగడం కూడా కారణం కాదు.
* ప్రవాస భారతీయులు, భారతీయ విద్యార్థులు దీన్నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమైనా ఉందా?
అన్ని చోట్లా సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ప్రత్యేకంగా ఏవీ అవసరం లేదు. ఈ ఒక్క సంఘటన వల్ల బెంబేలెత్తి పోకూడదు. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. అమెరికా అందిస్తున్న అద్భుత అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి. ఇక్కడికి ఎందుకొచ్చామో, తల్లిదండ్రులు మనమీద ఎలాంటి నమ్మకాలు, ఆశలు పెట్టుకున్నారో నిరంతరం గుర్తుపెట్టుకోవాలి.
* కూచిభొట్ల కుటుంబం ఎలా ఉంది?
శ్రీనివాస్‌ భార్య సునయన చాలా ధైర్యశాలి. తనకు జరిగిన నష్టం పూడ్చలేనిది. ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నారు. అమెరికాలోనే ఉన్నారు. ఆమెతో అప్పుడప్పుడూ మాట్లాడుతూనే ఉన్నా. అందరూ కలసిమెలసి సామరస్యంగా ఉండాలనుకునే స్వభావం తనది. వ్యవస్థపై వ్యతిరేక భావనలు లేవు. శ్రీనివాస్‌ సోదరుడితో కూడా మాట్లాడుతూనే ఉన్నాను.
* మీ అమ్మానాన్నలు ఏమంటున్నారు?
మొదట్లో చాలా ఆందోళనపడ్డారు. ఏం జరగబోతోందోనని భయపడ్డారు. ఇక్కడ ప్రజల స్పందన చూశాక వారికి భరోసా కలిగింది. అమెరికా నుంచి రావద్దని వాళ్లే అంటున్నారు. దుమ్ము ధూళి వల్ల ఇండియాలో ఉన్నప్పుడు చాలా బాధ పడేవాడిని డస్ట్‌ ఎలర్జీ ఉండేది. అమెరికా వచ్చాక ఒక్కసారి కూడా అనారోగ్యం పాలవ్వలేదు.
* కుటుంబంతో గడపడానికైనా త్వరలో భారత్‌ వస్తారా?
రావాలనే ఉంది కానీ ఇప్పుడు రాలేను. త్వరలో తండ్రిని కాబోతున్నాను. ఇప్పుడు ప్రయాణాలు చేసే అవకాశం లేదు.

చాలా బాధపడుతున్నాం - లియో ఇ. మోర్టన్‌ (ఛాన్సలర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మిసోరీ - కేన్సస్‌ సిటీ)
88 ఏళ్ల చరిత్ర కలిగిన మా విశ్వవిద్యాలయంలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ. కేన్సస్‌ సిటీ ఇంజినీరింగ్‌ పరిశ్రమలకు నెలవు. అమెరికాలో నాలుగో అతి పెద్ద ఇంజినీరింగ్‌ కంపెనీ ఇక్కడే ఉంది. అంకుర పరిశ్రమలకు కూడా కేన్సస్‌ పెట్టింది పేరు. కేన్సస్‌ నగరం హెల్త్‌ కేర్‌ ఇంజినీరింగ్‌ పరిశ్రమల కేంద్రం. దానికి తగినట్లుగానే యు.ఎం.కె.సి. అనేక కోర్సుల్ని, పరిశోధనా కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఇంటర్న్‌షిప్స్‌ ఎక్కువ లభిస్తాయి. ఇందువల్ల కూడా ఎక్కువమంది విదేశీ విద్యార్థులు ఇక్కడ చేరడానికి ఇష్టపడతారు. సైన్స్‌, టెక్నాలజీ కోర్సులు భారతీయ విద్యార్థులకు అయస్కాంతం లాంటివి. కేన్సస్‌ కాల్పుల ఘటన భారతీయుల్నే కాదు, మమ్మల్నీ ఎంతో కలచివేసింది. దుర్ఘటనకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు యావత్‌ విశ్వవిద్యాలయం అన్ని విధాలుగా సంఘీభావం ప్రకటించింది. భారతీయ విద్యార్థుల ఆందోళనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. విద్యార్థులకు పూర్తి రక్షణ కల్పిస్తున్నాం.
ఏ ఇబ్బందీ లేదు - సాయినాథ్‌ (భారతీయ విద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు, యూఎంకేసీ)
1200 మందికి పైగా భారతీయులు ఇక్కడ చదువుకుంటున్నారు. కాల్పులు జరిగినప్పుడు భయపడ్డాం. ఇప్పుడు బాగానే ఉంది. చదువుకోవడానికి, నేర్చుకోవడానికి అమెరికా ఉత్తమ దేశం. స్వదేశంలో మాదిరే దాండియా నృత్యం, హోలీ పండగలను ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాం. సగానికి సగం విద్యార్థులు విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోనే నివాసం ఉంటున్నారు. మా అమ్మానాన్నలు మొదట్లో ఆందోళన చెందినా ఇప్పుడు నిబ్బరంగా ఉన్నారు. నా స్నేహితులు చాలామంది శ్వేతజాతీయులే. కూచిభొట్లను చంపింది తెల్లవాడే. ఆ ఘటనలో ప్యూరింటన్‌ను అడ్డుకోవడానికి తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా ప్రయత్నించిందీ శ్వేతజాతీయులే కాబట్టి రంగుని బట్టి నిర్ణయానికి రాకూడదు.
అధికారులే భరోసా కల్పించారు - నితిన్‌ భండారీ (యూఎంకేసీ విద్యార్థి)
కూచిభొట్ల సంఘటన జరిగిన కొన్నాళ్లకు క్యాంపస్‌లో మరో ఘటన విద్యార్థుల్ని భయపెట్టింది. మా బస్టాప్‌లో ఒక సిక్కు విద్యార్థిపై దాడి చేయడానికి కొందరు ప్రయత్నించారు. అతను తప్పించుకుని వచ్చేశాడు. ఆ విషయం తెలియగానే క్యాంపస్‌ పోలీసులు ఆ సిక్కు విద్యార్థికి భద్రత కల్పించారు. విశ్వవిద్యాలయ అధికారుల స్పందన మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఇక్కడ నా భవిష్యత్తు బాగుంటుందనే విశ్వాసంతోనే ఉన్నాను.
మా విశ్వవిద్యాలయం సురక్షితం - టమార బైలాండ్‌(డైరెక్టర్‌, అంతర్జాతీయ విద్యార్థి విభాగం, యూనివర్సిటీ ఆఫ్‌ మిసోరీ - కేన్సస్‌ సిటీ)
కేన్సస్‌ సిటీ కాల్పుల ఘటన మిసోరీ నగరంపై, ముఖ్యంగా విశ్వవిద్యాలయంపై తీవ్ర ప్రభావం చూపింది. 2017 ఫాల్‌ సెషన్‌ ప్రవేశాలకు భారతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య 48 శాతం తగ్గడానికి ఈ కాల్పుల ఘటన ఒక కారణం. విదేశీ విద్యార్థులకు మా విశ్వ విద్యాలయం ఎప్పుడూ అండగా ఉంటుంది. ఏటా సాంస్కృతిక ఉత్సవం, కోర్సు ప్రారంభంలో యు.ఎం.కె.సి. అవగాహన శిబిరాలు నిర్వహిస్తాం. ఫిబ్రవరిలో అమెరికా ప్రభుత్వం కొన్ని దేశాలపై నిషేధం విధించినప్పుడు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. దాన్నీ విశ్వవిద్యాలయ అధికారులు ఎక్కడా అడ్డుకోలేదు. విద్యార్థులకు వీసా సమస్యలు వస్తే సహాయపడటం కోసం అటార్నీని కూడా నియమించాం. విదేశీ విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయం అన్ని విధాలుగా సురక్షితమైనది. ఎప్పటి మాదిరిగానే విదేశీ విద్యార్థులు మళ్లీ మా విశ్వవిద్యాలయం వైపు చూస్తారన్నది మా నమ్మకం.
వదంతులు నమ్మొద్దు - సాయి తేజస్విరెడ్డి (యూఎంకేసీ విద్యార్థిని)
హైదరాబాద్‌లో బి.టెక్‌ చేసి భవిష్యత్‌ పట్ల కొండంత ఆశతో అమెరికా వచ్చాను. ఇక్కడ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నాను. కాల్పుల సంఘటన తెలిసినప్పుడు చాలా భయపడ్డాను. విదేశీ విద్యార్థులంతా నాలాగే వణికిపోయారు. తర్వాత ఇక్కడివాళ్ల అండ చూశాక చాలా ధైర్యం వచ్చింది. ఇప్పుడు మళ్లీ మామూలుగా అయిపోయాం. కానీ అమెరికాలో పరిణామాల్ని గురించి, ఇక్కడ మన వారి భద్రత గురించి చాలా వదంతులు ప్రచారంలో ఉన్నాయి. అటువంటివి వింటున్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకూ అటువంటి ఆందోళనకర పరిణామాలేమీ మాకు ఎదురుకాలేదు.

అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై అక్కడ పర్యటించిన అరుగురు సభ్యుల పాత్రికేయుల బృందంలో ఈనాడు ప్రతినిధిగా సీనియర్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ ఎం. నాగేశ్వరరావు ఉన్నారు. ఆయ‌న అందించిన ప్రత్యేక క‌థ‌న‌మిది.

Posted on 17-06-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning