కృత్రిమ మేధ మంచిదే

* కోడింగ్‌ ప్రాధాన్యం తగ్గదు
* బాల మేధావి తన్మయ్‌ భక్షి

ఈనాడు - హైదరాబాద్ : సాధారణంగా ఆ వయసులో చదువు కంటే ఆటల మీదే పిల్లలు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వీడియో గేముల్లో మునిగిపోతారు. తన్మయ్‌ భక్షి మాత్రం కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ), కాగ్నిటివ్‌ కంప్యూటింగ్‌ వంటి క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాలపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేస్తూ.. ఐటీ రంగంలోని నిపుణులను, మేధావులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న బిగ్‌ డేటా అండ్‌ అనలిటిక్స్‌ సదస్సులో ఏఐపై భక్షి చేసిన ప్రసంగం హాజరైన అందరి ప్రసంశలను అందుకుంది. తన్మయ్‌ భక్షి (13) ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసు కలిగిన ఐబీఎం వాట్సన్‌ కోడర్‌. కాగ్నిటివ్‌ డెవలపర్‌. అల్గోరిథమిస్ట్‌, పుస్తక రచయిత, కీనోట్‌ స్పీకర్‌, యూట్యూబ్‌లో పిల్లలకు, ప్రారంభ ప్రోగ్రామర్లకు కోడింగ్‌పై అనేక సందేహాలను తీర్చడమేకాక.. మెళకువలు నేర్పుతున్నాడు. ఇందుకు ‘తన్మయ్‌ టీచెస్‌’ పేరుతో 2011లో యూట్యూబ్‌ వీడియోలను ప్రారంభించాడు. లక్ష మంది ఔత్సాహిక కోడర్లకు, ప్రారంభకులకుసాయం చేయాలన్నది ఈ బాల మేధావి లక్ష్యం. ‘ఐటేబుల్స్‌’ పేరుతో చిన్న పిల్లలు ఎక్కాలు నేర్చుకునేందుకు తన తొలి ఐఓఎస్‌ యాప్‌ను విడుదల చేశాడు. చిన్న పిల్లలు, ప్రారంభకుల కోసం ఐఓఎస్‌ యాప్‌ ప్రోగ్రామింగ్‌పై పుస్తకం రాశాడు. కెనడాలోని ఆంటారియోలో ఉంటున్న భక్షి సమయం లేక రెండేళ్లుగా ఇంటి వద్దే ఉండి చదువు కుంటున్నాడు. యూట్యూబ్‌కు ట్యుటోరియల్స్‌ తయారు చేయడం.. లేదా ఐబీఎం, యాపిల్‌ వంటి కంపెనీలు ఏర్పాటు చేసే సదస్సుల్లో ప్రసంగించడం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే నాస్‌కామ్‌ ఏర్పాటు చేసిన బిగ్‌ డేటా సదస్సులో ప్రసంగించాడు. కృత్రిమ మేధ తదుపరి తరం కంప్యూటింగ్‌ వ్యవస్థని చెబుతున్న తన్మయ్‌ ‘ఈనాడు’తో ఇష్టాగోష్టిలో వెల్లడించిన అంశాలు..
కంప్యూటర్‌పై ఆసక్తి.. అయిదేళ్ల వయసులో ప్రోగ్రామింగ్‌ చేశాను. తొమ్మిదేళ్లప్పుడు తొలియాప్‌ను యాప్‌స్టోర్‌లో విడుదల చేశాను. మొదట్లో ఫాక్స్‌ప్రో, విజువల్‌ బేసిక్‌ వంటి సరళ లాంగ్వేజీల్లో ప్రోగ్రామింగ్‌ ప్రయోగాలు చేసే వాడిని. చిన్నప్పుడు కంప్యూటర్‌పై నా పేరు చూడడం, ఏదైనా చేయగలదన్న భావన కంప్యూటర్‌పై నా ఆసక్తిని పెంచింది. వృత్తిరీత్యా ప్రోగ్రామరైన మా నాన్న నాలోని ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించారు. ఏఐ ప్లాట్‌ఫారమ్‌పై కొన్ని డాక్యుమెంట్లు నన్ను పురిగొల్పడంతో ప్రస్తుతం కృత్రిమ మేధపై కృషి చేస్తున్నాను.

బూ ప్రాజెక్టు పురోగతిపై..: పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమై.. ఏ మాత్రం ఉలుకు పలుకు లేని ఒక మహిళ తన భావాలను వ్యక్తం చేయడానికి కాగ్నిటివ్‌ సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా ఉపయోగపడుతుందో పరిశీలిస్తున్నాం. ఆ మహిళ బూ అని సైగ చేయడం తప్ప మరే విధంగా తన భావాలను వ్యక్తం చేయలేకపోతోంది. అందుకే ఈప్రాజెక్టుకు ఆ పేరు పెట్టాం. స్టీఫెన్‌ హాకింగ్‌ కనీసం కళ్లను కదపగలడు. ఆయన కంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ మహిళ ఉంది. ఆమె భావవ్యక్తీకరణ సామర్థ్యాలను పెంచడానికి కృషి చేస్తున్నాం. ఇందులో కాగ్నిటివ్‌ కంప్యూటింగ్‌, డీప్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌లను వినియోగించడం, కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మెదడు నుంచి వచ్చే ఈఈజీ తరంగాలను అధ్యయనం చేయడం ద్వారా ఆమె ఏం చెప్పాలనుకుంటుందో అర్థం చేసుకోవడం నా పని. దీనిపై 6-7 నెలల్లో ఒక ప్రొటోటైప్‌ సొల్యూషన్‌ను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇది విజయవంతమైతే.. ఇలాంటి వారికి ఎందరికో ఇది ఉపయోగపడుతుంది.

కోడింగ్‌ ప్రాధాన్యం తగ్గదు: కృత్రిమ మేధకు ఎంత మేధస్సు ఉందో ఇంకా పూర్తిగా రుజువు కాలేదు. ఏఐకి ప్రాచుర్యం పెరుగుతున్నప్పటికీ.. మానవ మేధకు పరిమితులు లేవు. కోడింగ్‌కు కూడా. అంతా కోడింగ్‌ మీద ఆధారపడి ఉంది. సరిగ్గా కోడింగ్‌ చేయగలిగితే ఎన్నో కొత్త ఆవిష్కరణలను తీసుకురావచ్చు. కోడింగ్‌కు తప్పక భవిష్యత్తు ఉంది.

నా లక్ష్యం..: వీలైనంత మందికి నాకున్న విజ్ఞానాన్ని పంచాలన్నదే నా లక్ష్యం. ఇదే నాకు స్పూర్తిదాయకంగా ఉంది. కనీసం లక్ష మంది ఔత్సాహిక ప్రారంభ కోడర్లు, పిల్లలకు కోడింగ్‌లో సాయం చేయాలని భావిస్తున్నాను. ఇప్పటికే 4,000 మంది అటువంటి వారు ఉన్నారు. కోడింగ్‌ను, కృత్రిమమేధను తదుపరి దశకు తీసుకువెళ్లాలని నా కోరిక. 15-20 సంవత్సరాలు వచ్చే నాటికి న్యూరల్‌ నెట్‌వర్క్‌లపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాను. కృత్రిమ మేధతో ఆరోగ్య సంరక్షణ, మానవ జీవితం, నైపుణ్యాలను మరింతగా పెంచాలన్నదే నా ప్రధాన లక్ష్యం.
కంపెనీ పెట్టాం.. కానీ: మా నాన్న తన్మయ్‌ భక్షి సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ పేరుతో ఇప్పటికే కంపెనీని రిజిస్టర్‌ చేయించారు. ప్రస్తుతానికి ఇది ఎటువంటి కార్యకలాపాలేమీ నిర్వహించడం లేదు.

భారత్‌ గురించి: సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రగామిగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. ఐబీఎం, గూగుల్‌ వంటి పెద్ద కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. పెట్టుబడులు పెడుతున్నాయి.

Posted on 24-06-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning