మహన్... రోబో వీరుడు

* 101 జాతీయ ప్రదర్శనల్లో పురస్కారాలు

* ఇదీ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రతిభ

రోబో.. ఈ పేరు వినగానే అందరిలోనూ ఏదో తెలియని ఆసక్తి, అత్యుత్సాహం పొంగుకొస్తుంది. తనివితీరా చూసి ఆనందించాలన్న ఆతృత కలుగుతుంది. దాని సృష్టి వెనుకఉన్న ప్రతిభను పరిశీలిస్తే ఎంతో విజ్ఞానం దాగిఉంటుంది. వైవిధ్యమైన ఆలోచనలతో రూపుదిద్దుకున్న మరబొమ్మల కదలికలు ఎన్నెన్నో సంగతులను చెబుతుంటాయి. ఇంజినీరింగ్ చదువుతూనే తన మేధస్సుతో రోబోలను సృష్టించి ఇప్పటి వరకు ఇచ్చిన 102 జాతీయ ప్రదర్శనల్లో 101 పురస్కారాలను సొంతం చేసుకోవడం ఆషామాషీ విషయం కాదు. అలాంటి విజయాన్ని సొంతం చేసుకొని రోబో వీరుడుగా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కుక్కల మహన్ దూసుకుపోతున్నాడు. ఆయా ప్రదర్శనల్లో 80 ప్రథమ, 17 ద్వితీయ, 4 తృతీయ స్థానాలను సొంతం చేసుకుని ఔరా అనిపించాడు. తాజాగా జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు ముంబాయిలో జాతీయ స్థాయిలో జరిగిన 'ఐఐటీ ముంబాయి టెక్‌ఫెస్ట్' రోబోటిక్స్ ప్రదర్శనలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకొని అందరి మన్ననలు పొందాడు. హైదరాబాద్‌లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థి చేసిన రోబోలు, వినూత్న ప్రయోగాలతో సాధించిన విజయాలను తెలుసుకుందాం.
పురస్కారాల పంట..
2011 నవంబరులో హైదరాబాద్‌లో జాతీయ స్థాయిలో జరిగిన ప్రదర్శనలో ఫుట్‌బాల్ ఆడే విధంగా రోబోను తయారు చేసి అందర్నీ ఆకట్టుకుని ప్రథమ స్థానాన్ని సాధించాడు మహన్. 2012 ఆగస్టులో వరంగల్ ఎన్.ఐ.టి. ఆధ్వర్యంలో ఈ రోబోతో పాటు అత్యధిక వేగంతో వెళ్లే పడవను రూపొందించి రెండింటికీ ప్రథమ స్థానాలను కైవసం చేసుకున్నాడు. అక్టోబరులో కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్వంలో విజయవాడలో జరిగిన యుద్ధ రోబోకు ప్రథమ, అంతకుముందు మార్చిలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పోటీల్లో మర పడవకు తృతీయ స్థానాలు సొంతమయ్యాయి. డిసెంబరులో ఎస్ఆర్‌కే భీమవరం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో వేగంగా వెళ్లే రోబోకు ప్రథమ స్థానం దక్కింది. 2013 జనవరిలో ఐఐటీ హైదరాబాద్ ఆధ్వర్వంలో ప్రదర్శించిన పోలీసు రోబోకు ద్వితీయ, అక్టోబరులో జరిగిన ప్రదర్శనలో ఫుట్‌బాల్ రోబోకు ప్రథమ, ఇంటర్నల్ కాంబషన్(ఐసీ) కారుకు ద్వితీయ స్థానాలు లభించాయి. డిసెంబరులో ఎన్ఐటీ వరంగల్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో గోల్ఫ్ ఆడే రోబోకు ప్రథమ, ఆర్మ్‌రోబోకు ప్రథమ, ఫార్మలాకు తృతీయ స్థానాలు దక్కాయి. నాగపూర్ వీఎన్ఐటీ నిర్వహించిన ప్రదర్శనలో అగ్ని పర్వతం నుంచి వచ్చే లావాను ఆపే రోబోటిక్ ఆర్మ్ డిజైన్‌కు ప్రథమ స్థానం వచ్చింది. సముద్రంలో ఓడ మునిగిపోకుండా కాపాడే ఆక్వా రోబోకు ద్వితీయ స్థానం లభించింది. కాలికట్ ఎన్ఐటీ నిర్వహించిన ప్రదర్శనలో రాళ్లు, ఇసుకలో సులభంగా నడిచే రోబోకు ప్రథమ, స్పీడ్ బోట్‌కు ప్రథమ, రోబోటిక్ ఆర్మ్‌కు ద్వితీయ, ఫుట్‌బాల్ రోబోకు ద్వితీయ, రేసింగ్ రోబోకు తృతీయ బహుమతులు లభించాయి. గుంటూరు ఇంజినీరింగ్, హైదరాబాద్ మహత్మాగాంధీ ఐటీ కళాశాలల్లో ఫుట్‌బాల్ రోబోకు ప్రథమ స్థానాలు దక్కాయి. రోబోర్ట్(సి)కు సంబంధించి రోబో వర్చ్యుల్ ఓల్డ్ ఆన్‌లైన్ పరీక్షల్లో నూరు శాతం మార్కులు సాధించి 9 చిహ్నాలతో కూడిన రెండు ధ్రువీకరణ పత్రాలను సొంతం చేసుకున్నాడు. ఇందులో 15 చిహ్నాలు వస్తే రోబోర్ట్(సి) అనుమతి పత్రం లభిస్తుంది.
రక్షణకు దోహదపడాలని..
దేశ రక్షణకు ఉపయోగపడే విధంగా రోబోను ఆవిష్కరించాలన్నదే తన ధ్యేయమని మహన్ చెబుతున్నాడు. తాను చేసిన రోబోలు, ఇతర సాధనాలతో ఇప్పటి వరకు 102 ప్రదర్శనల్లో పాల్గొనగా, 101 బహుమతులు వచ్చాయన్నాడు. చిన్నప్పట్నించి రోబోలపై పెరిగిన ఆసక్తి ఇలా సాకారం చేసుకుంటున్నట్లు చెప్పాడు. బీటెక్ పూర్తి కాగానే రోబోటిక్స్ పేరు మీదుగా సంస్థను ఏర్పాటు చేసి ఔత్సాహిక విద్యార్థులకు ఇందులో అవగాహన కల్పించాలని ఉందన్నాడు. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ రోబోటిక్స్, ఎంబాడెడ్(సి)లో యూఎస్ఏలోని రోబోటిక్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ సంస్థలో అంతర్జాతీయ ధ్రువీకరణ పత్రం కోసం ప్రాజెక్టు నమూనాను అందజేశానని చెప్పాడు.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning