ఇంటర్‌ నుంచి..ఇంజినీరింగ్‌కి!

ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం తరగతులు త్వరలోనే మొదలవుతున్నాయి. వృత్తివిద్యాభ్యాసం వైపు ఉత్సాహంతో అడుగులు వేయబోతున్న విద్యార్థులు వేటిపై దృష్టి పెట్టాలి? భవితను ఉజ్వలంగా మలుచుకోవడానికి ఏ విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి?

ఇంటర్మీడియట్‌ వరకూ విద్యార్థి దశ ఒక రకంగా ఉంటుంది. ఇక్కడివరకూ ఇంటి దగ్గర తల్లిదండ్రులు, కళాశాలలో అధ్యాపకుల పర్యవేక్షణ, మార్గదర్శకత్వం పుష్కలంగా లభిస్తాయి. చదువులకు సంబంధించినంతవరకూ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవసరం, అవకాశాలు దాదాపుగా ఉండవనే చెప్పవచ్చు. మరోవిధంగా చెప్పాలంటే విద్యార్థులు ఈ దశవరకు పెద్దల కనుసన్నల్లోనూ, అదుపాజ్ఞల్లోనూ ఉంటారు. అయితే ఇంజినీరింగ్‌ స్థాయి దీనికి భిన్నం.
నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ కాలం అద్భుతమైన సమయం కాకపోవచ్చు కానీ, ఒక ప్రయోజనాత్మక కాలంగా చెప్పవచ్చు. వ్యక్తిత్వ వికాసం, మానసిక పరిపక్వత, జీవితాశయాల పట్ల, సమకాలీన పరిస్థితుల గురించి ఒక దృఢమైన అభిప్రాయం ఏర్పరచుకునే కాలం. మెరుగైన భవిష్యత్‌ నిర్ణయాలకు కావాల్సిన సామర్థ్యాలను పెంచుకునే అవకాశం కలిగించే సమయం. స్నేహితులూ, అధ్యాపకుల పట్ల ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాలల స్థాయికన్నా విభిన్న రీతిలో ప్రతిస్పందించడం నేర్చుకునే కాలం.
అందుకే ఇంజినీరింగ్‌ విద్యాభ్యాసం నిర్దిష్టమైన, స్పష్టమైన ప్రణాళికతో చేయవలసివుంటుంది. అయితే ఈ ప్రణాళిక కష్టంతోనో, భయంతోనో చేయడం కన్నా ఇష్టంతో, అవగాహనతో ఇంకా బాధ్యతను గుర్తెరిగి చేసుకోవడం అభిలషణీయం. మంచి భవిష్యత్తు కోసం నాణ్యమైన ఇంజినీరింగ్‌ డిగ్రీ అవసరం ఎంతో ఉంది. మొదటి సంవత్సరం నుంచే మెల్లగా అడుగులువేస్తూ క్రమంగా గతిని పెంచుకుంటూ ఉద్యోగాన్ని సాధించి పెట్టగలిగిన బీటెక్‌ డిగ్రీ కోసం ప్రయత్నించాలి; సాధించాలి.

ఏమిటి తేడాలు?
ఇంటర్మీడియట్‌, ఇంజినీరింగ్‌ స్థాయి చదువులకు మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాలు మొదట గ్రహించాలి.
* ఇంటర్మీడియట్‌ స్థాయి వరకు ప్రధానంగా ఇంటి దగ్గర తల్లిదండ్రులా, కళాశాలలో అధ్యాపకులా నిరంతర పర్యవేక్షణ, సహాయ సహకారాలు సమృద్ధిగా ఉంటాయి. దీనివల్ల సొంతంగా ఆలోచించవలసిన అవసరం కానీ, అవకాశం కానీ పెద్దగా కనిపించదు. అయితే ఇంజినీరింగ్‌లో సొంతంగా ఆలోచించడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనివార్యమవుతుంది.
* ఇంటర్మీడియట్‌లో పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాలు ముందస్తుగా తయారై ఉంటాయి. ముద్రిత పుస్తకాల నుంచి చదువుకోవడం, అభ్యాసం చేయడం ప్రధానం. సొంతంగా నోట్సు తయారు చేసుకోవడమనేది దాదాపుగా ఉండదనే అనుకోవచ్చు. అయితే ఇంజినీరింగ్‌లో ముందస్తుగా పాఠ్యపుస్తకాలు తయారు చేయడమనేది వీలు కాదు, దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. నిర్దేశిత పాఠ్యపుస్తకాల నుంచి అధ్యాపకులు పాఠాలు చెబితే విద్యార్థులు వాటి నుంచి సొంతంగా నోట్సు తయారు చేసుకోవడమనేది ఒక ముఖ్యమైన, అనివార్యమైన అలవాటుగా చేసుకోవాలి.
* ఇంటర్మీడియట్‌ పరీక్ష విధానం సంవత్సరం ప్రాతిపదికన ఉంటుంది. అందువల్ల అధ్యాపకులకూ, విద్యార్థులకు కూడా ఒకటి కంటే ఎక్కువసార్లు పునశ్చరణకు వీలుంటుంది. అయితే ఇటువంటి అవకాశం ఇంజినీరింగ్‌లో దాదాపుగా కష్టమనే చెప్పాలి.
* ఇంటర్మీడియట్‌లో విద్యార్థులు తెచ్చుకునే మార్కులు మొత్తం బోర్డు నిర్వహించే పరీక్షల ద్వారానే ఉంటాయి. అంతర్గత మార్కుల ప్రమేయం ఉండదు. ఇంజినీరింగ్‌లో ప్రతి సబ్జెక్టులోనూ 25% మార్కులు కళాశాల నిర్వహించే పరీక్షలకు కేటాయించారు. అంటే, ఇక్కడ విద్యార్థి ప్రతిభకు కళాశాల, విశ్వవిద్యాలయం సమష్టి బాధ్యత వహిస్తాయి.

సమన్వయ, సమష్టి కృషి
ఇంజినీరింగ్‌ అనేది కేవలం ఉద్యోగం సంపాదించిపెట్టే చదువు కాదు. పైగా ఇంజినీరింగ్‌ చేసినంత మాత్రాన ఉద్యోగం తనంతట తాను ముంగిట్లోకి రాదు. కష్టపడి ఇంజినీరింగ్‌కు సంబంధించిన వైజ్ఞానిక విలువలు, మేధ, తగిన పాళ్లలో మెలకువలు నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు ఉంటాయి. పైగా ఒక శాఖకు చెందిన ఇంజినీర్‌కు ఆ శాఖకు చెందిన పూర్తి విషయ జ్ఞానం ఉంటుందనే అభిప్రాయం కూడా తప్పే. ఉదాహరణకు- ఒక ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ జనరేటర్‌ను తయారు చేయగలడు అనుకోవడం ఒక భ్రమ.
ఇంజినీరింగ్‌ అనేది అంతరశాఖల సమన్వయ, సమీకృత సమష్టి సహకారాలతో కూడుకున్నది. ఒక ఇల్లు కట్టడానికి కేవలం సివిల్‌ ఇంజినీర్‌ ఉంటే సరిపోదు. ఇంటి నమూనాను తయారు చేయడానికి ఆర్కిటెక్చరల్‌ ఇంజినీర్‌, కట్టడానికి సివిల్‌ ఇంజినీర్‌, విద్యుత్‌ సరఫరాకు ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌, గృహోపకరణాల అవసరాలకు ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్‌ సేవలు అవసరమవుతాయి. ఒక ఇల్లు రూపొందాలంటే వివిధ శాఖల అవసరం ఎంతో ఉంటుంది. ఒక శాఖకు చెందిన ఇంజినీర్‌ కొన్ని అంశాల్లో మాత్రమే ప్రావీణ్యాన్ని పొందగలడు.
విజ్ఞాన శాస్త్రవేత్తలు చేసే ప్రయోగాలకు భౌతిక రూపకల్పన చేసి, ఆ వస్తువుకు వినిమయ విలువను తెచ్చిపెట్టేది ఇంజినీర్లు. అంటే వీళ్లు సామాజిక, జీవన నాణ్యతల, స్థితిగతుల దశా, దిశా నిర్దేశకులు. ఒక దేశ స్థూల ఆదాయ పురోగతికి వీరి సేవలు చాలా అవసరం.
ఇంజినీరు మనుగడ ఉద్యోగాల్లో కాకుండా దాని ద్వారా సమాజానికి, ప్రజలకు కలిగే ఉపయోగాలు నిర్ణయిస్తాయి.
బీటెక్‌ తరువాత ఏం చేస్తే బాగుంటుందనేది నిర్ణయించడానికి తగిన సమయం ఏది? బీటెక్‌ మొదటి సంవత్సరంలో ఉండగానే ఈ కసరత్తు చేస్తే మంచిదేనా? ఏ రంగంలో ఉద్యోగం చేయాలనేది ఇప్పుడే నిర్ణయించుకోవాలా? ఈ ప్రశ్నలకు సమాధానం అవసరమే అయినా బీటెక్‌ మొదటి సంవత్సరం ఇందుకు తగిన సమయం కాదు.

ప్రగతి సోపానాలు
కెరియర్‌ పట్ల ప్రణాళిక అనేది అంచెలంచెలుగా చేస్తే మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయి. ముందుగా బీటెక్‌ మొదటి సంవత్సరం ఎలా చదవాలనేది నిర్దేశించుకోవాలి. అంటే బీటెక్‌ మొదటి సంవత్సరంలో తొలి అడుగులు చక్కగా వేయడం అలవరచుకోవాలి.
1. అన్ని తరగతులకూ తప్పకుండా హాజరు కావాలి. తప్పనిసరి పరిస్థితుల్లో కళాశాలకు వెళ్లలేకపోతే ఆ మరుసటిరోజే స్నేహితులను అడిగి అధ్యాపకులు చెప్పిన పాఠాల గురించి తెలుసుకోవాలి; నోట్సు తయారు చేసుకోవాలి. అర్థం కాని విషయాన్ని తోటి విద్యార్థులనో, అధ్యాపకులనో అడిగి తెలుసుకోవాలి. బీటెక్‌ పరీక్షల్లో పాస్‌ అవ్వడానికి మాత్రమే పరిమితం కాకూడదు. తెలుసుకున్న విజ్ఞానాన్ని అనువర్తనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అంటే ప్రతి పాఠ్యాంశం తప్పకుండా అర్థం చేసుకోవాల్సిందే.
2. ప్రతి సబ్జెక్టులోనూ నోట్స్‌ తయారు చేసుకోవాలి. అధ్యాపకులు తరగతుల్లో వివరణ ఇస్తున్నప్పుడు త్వరగా నోట్స్‌ రాసుకోవాలి. ఇంటి దగ్గర ఆ పాఠాన్ని మననం చేసుకుని, పాఠ్యపుస్తకం నుంచి మేలైన నోట్సు తయారు చేసుకోవాలి. ఈ నోట్సును అధ్యాపకులకు చూపించి, వారి ఒప్పుకోలు తీసుకుంటే మరీ మంచిది. ఈ అభ్యాసం తప్పనిసరిగా అలవరచుకోవాలి.
3. ఇంచుమించు అన్ని విశ్వవిద్యాలయాల్లో బీటెక్‌ మొదటి సంవత్సరం నుంచే సెమిస్టర్‌ పద్ధతి ఉంటుంది. కాబట్టి సమయం తక్కువగా ఉంటుంది. సమయాన్ని చక్కగా వినియోగించుకోవడం అలవరచుకోవాలి. మొదటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం చదివితే రోజుకు రెండు లేదా మూడు గంటల సమయం సరిపోతుంది. ప్రతి సబ్జెక్టు చదవడానికి ఒక టైంటేబుల్‌ వేసుకోవాలి. వారంలో ప్రతి సబ్జెక్టు రెండుసార్లు చదివే విధంగా ఉండాలి. ఈ రెండు విడతల్లో మొదటి విడత కాలవ్యవధి ఎక్కువగానూ, రెండో విడత తక్కువగానూ చేసుకోవాలి. తక్కువ కాలం పునశ్చరణకు ఉపయోగించాలి. ఇలా చేస్తే ఆదివారాలు, సెలవుదినాలు కొంచెం తక్కువ చదివినా సరిపోతుంది. విశ్వాసం కుదిరితే అసలు చదవకపోయినా ఫర్వాలేదు.
4. టైంటేబుల్‌లో ఒక కఠినమైన సబ్జెక్టు, ఒక సులభమైన సబ్జెక్టు కలిపి వేసుకుంటే మంచిది. భారంగానూ అనిపించదు.
5. బీటెక్‌లో ఇంటర్మీడియట్‌ స్థాయిలో చదివిన సబ్జెక్టులే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మొదటి సంవత్సరం పాస్‌ కావడం పెద్ద కష్టమేమీ కాదు. కాస్త తెలివిగా వ్యవహరిస్తే సమయ వినిమయం చక్కగా చేసుకోవచ్చు. అదనపు సమయంలో వార్తాపత్రికలు, వార, మాస పత్రికలు, సాంకేతిక పత్రికలను చదవడం అలవాటు చేసుకుంటే మంచిది. ఇది అవసరం కూడా. ఈ పరిజ్ఞానం మూడో సంవత్సరంలో ఉపయోగపడుతుంది.
6. అసైన్‌మెంట్లు సొంతంగా చేయాలి. సాధారణంగా సెమిస్టర్‌ పరీక్షల్లో వచ్చే ప్రశ్నలనే అధ్యాపకులు కళాశాల పరీక్షల్లో ఇస్తారు కాబట్టి, విద్యార్థులు వాటికి ముందుగానే సొంత నోట్సు తయారు చేసుకుంటే మేలు. వీలైతే అసైన్‌మెంట్లను స్నేహితులతో కలిసి చేస్తే నాణ్యమైన సమాధానాలను తయారు చేసుకోవచ్చు.
7. ప్రయోగశాలలో ప్రయోగాలను వీలైనంతవరకు విడిగా, స్వతంత్రంగా చేయాలి. దీనివల్ల అధ్యాపకుల ద్వారా తరగతిలో నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అనువర్తనం చేసే నేర్పు అలవడుతుంది. ఇంజినీరింగ్‌లో సాంకేతిక విజ్ఞానానికి, మెలకువలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. ఒక మౌలిక సూత్రం ఎలా పనిచేస్తుందో తరగతిలో నేర్చుకుంటే, ఎలా పనిచేయించాలో ప్రయోగశాలలో నేర్చుకుంటారు. దీనికి అదనంగా ఇంజినీర్‌ తన తార్కిక, విశ్లేషక మేధను ఉపయోగించి ఎందుకు పనిచేయించాలి (ఉపయోగం), ఎప్పుడు పనిచేయించాలి (అవసరం) అనేది నేర్చుకుంటారు. ఈ నాలుగు కోణాల్లోనూ నేర్చుకున్నప్పుడే ఇంజినీరింగ్‌కు సార్థకత, ఇంజినీర్‌కు పరిపక్వత వచ్చినట్టు గ్రహించాలి.
‘ఒక చెట్టును నరకడానికి నాకు ఆరు గంటల సమయం ఇస్తే అందులో ఒక గంట సమయం గొడ్డలిని పదును చేయడానికి వినియోగిస్తాను’ అన్న అబ్రహాం లింకన్‌ మాటలు విద్యార్థికి స్ఫూర్తిదాయకం. సాంకేతిక ప్రామాణికతకు నైపుణ్యం, మెలకువలే కొలమానికం!
8. కళాశాలలో జరిగే సాంస్కృతిక ఇతర కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలి. వీటి వల్ల సమూహంలో మెలగటం, బృంద నిర్వహణ వంటి ఇంజినీర్లకు అత్యవసరమైన మెలకువలు సులభంగా అలవడతాయి.

Posted on 17-07-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning