పారిశ్రామికోత్సాహం

* పరిశ్రమల స్థాపనకు ఉత్సాహంతో ముందుకొస్తున్న యువత
* ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న వైనం
* తెలంగాణలో టీఎస్‌ఐపాస్‌కు ఆదరణ

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఉన్నత విద్యావంతులు, యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే ధోరణి నుంచి తామే ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. ఎలాంటి అనుభవం లేకున్నా.. పారిశ్రామిక రంగంలోకి వచ్చి తమదైన ముద్ర వేస్తున్నారు. సర్వత్రా ప్రశంసలు పొందిన తెలంగాణ పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ విధానం (టీఎస్‌ఐపాస్‌) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఇలా వారు అందిపుచ్చుకుంటున్నారు.
విధానమే వరం.. దూసుకెళ్తొంది యువతరం.
రాష్ట్రంలో టీఎస్‌ఐపాస్‌ అమల్లోకి వచ్చిన తర్వాత 4 వేలకుపైగా కొత్త పరిశ్రమలు వచ్చాయి. ఇందులో 80 శాతానికిపైగా కొత్త పారిశ్రామికవేత్తల నేతృత్వమే కావడం విశేషం. టీఎస్‌ఐపాస్‌తో కొత్తగా పరిశ్రమలు నెలకొల్పిన వారిపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వారి అనుభవనాలపై అందిస్తున్న ప్రత్యేక కథనమిది. సత్వర, సరళీకృత అనుమతుల కోసం 2015 జూన్‌ 12న టీఎస్‌ఐపాస్‌ ప్రారంభమైంది. పలు దేశాల్లో అధ్యయనం చేసి.. పారిశ్రామిక వర్గాల మనోభావాలను తెలుసుకొని ప్రభుత్వం దీన్ని అమల్లోకి తెచ్చింది. ఇది కొత్తగా పరిశ్రమలు స్థాపించే వారిని విశేషంగా ఆకర్షిస్తోంది.
వారుండటం పారిశ్రామికవేత్తల అదృష్టం...
* మాది ఉమ్మడి కుటుంబం. 2004లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత వ్యాపారంలోకి వచ్చా. 2010లో ఐఎస్‌బీలో ఎంబీఏ చేశా. ఆ తర్వాత పారిశ్రామిక రంగంలో స్థిరపడాలనుకున్నా. వివిధ రంగాలను అధ్యయనం చేసి తయారీ రంగంలోని ప్యాకేజింగు పరిశ్రమను ఎంచుకున్నా. టీఎస్‌ఐపాస్‌లో అనుమతుల కోసం 2016 ఏప్రిల్‌లో దరఖాస్తు చేశాను. తొలుత కొంత ఇబ్బంది ఎదురైనా అధికారులు అన్ని విధాలా సహకరించి సత్వరమే అనుమతులు ఇప్పించారు. రూ.50 కోట్ల పెట్టుబడితో దీన్ని స్థాపించాం. ప్రస్తుతం 35 మందికి ఉపాధి కల్పిస్తున్నా. పూర్తిగా స్థిరపడితే నెలకు రూ.8 కోట్ల మేరకు టర్నోవర్‌ను సాధిస్తాం. దార్శనికత గల కేసీఆర్‌ సీఎంగా, ప్రగతిశీల దృక్పథం గల కేటీఆర్‌ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండడం పారిశ్రామికవేత్తల అదృష్టం. చిన్న, భారీ పరిశ్రమల మాదిరే మధ్యతరహా పరిశ్రమలకు మరిన్ని ప్రోత్సాహకాలివ్వాలి.
- రుద్రాక్ష్ అగ‌ర్వాల్‌, విజయానంద్ ప్యాకేజింగ్ కంపెనీ, షాద్‌న‌గ‌ర్‌.
ప్రోత్సాహకర విధానం..
- వై. వెంక‌ట్ రెడ్డి, జెనెసిస్ బ‌యోలాజిక‌ల్స్ ఎండీ, లాల్‌గుడిమ‌ల‌క్‌పేట‌.
నూతన పారిశ్రామిక విధానం ప్రోత్సాహకరంగా ఉంది. కొత్త వారూ ఈ రంగంలోకి రావడానికి అనుకూలతలు ఏర్పడ్డాయి. మాది ఆదిలాబాద్‌. పలు సంస్థల్లో పనిచేశాను. బయోటెక్‌ రంగంలో అనుభవం గడించిన తర్వాత సొంతంగా పరిశ్రమను స్థాపించాలనుకున్నా. టీఎస్‌ఐపాస్‌లో 2015 ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నా. 15 రోజుల్లోనే అన్ని అనుమతులు పొందాం. 2016 జులై 16న పరిశ్రమను ప్రారంభించాం. మా సంస్థ ఔషధ ఉత్పత్తులను దేశవిదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అమెరికా, సింగపూర్‌లకు ఇక్కడి నుంచి ఇన్సులిన్‌ పంపిస్తున్నాం. రూ.100 కోట్ల టర్నోవర్‌ గల ప్రాజెక్టు ద్వారా 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాం.
తొలి అనుమతి నేనే పొందా...
- బండారి వెంకటయ్య, పారిశ్రామికవేత్త, సిట్స్‌ కూలింగు సిస్టమ్స్‌, నాదర్‌గుల్‌ పారిశ్రామిక పార్కు.
టీఎస్‌ఐపాస్‌లో మొట్టమొదటగా అనుమతి పొందింది నేనే. ఓయూలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేశా. మాది వలసలకు పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లి. పేద కుటుంబం నుంచి వచ్చాను. మిత్రుల సాయంతో చదువుకొని కొన్ని సంస్థల్లో పనిచేశాను. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఆశాజనకంగా ఉండడంతో పరిశ్రమను స్థాపించాలని నిర్ణయించుకున్నా. శీతల యంత్రాల పరిశ్రమను స్థాపించి 60 మందికి ఉద్యోగాలు ఇచ్చా.
వ్యవసాయ అనుబంధంతో..
- ఎస్‌.సత్యనారాయణ, మేనేజింగ్‌ పాట్నర్‌, ఎస్‌ఎంఎస్‌9 ఆగ్రో ఆయిల్స్‌, యాదగర్‌పల్లి, మిర్యాలగూడ.
మాది మిర్యాలగూడ. రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను వ్యవసాయాధారిత పరిశ్రమను స్థాపించాలనుకున్నా. దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతి వచ్చింది. నిర్మాణాన్ని పూర్తి చేసి ఏడాదిలోనే ప్రారంభించాం. ప్రస్తుతం 50 మంది పనిచేస్తున్నారు. 100 మంది హమాలీలకు ఉపాధి కల్పించాం. మా ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది. పరిశ్రమల స్థాపన సమయంలో ఆర్థిక సాయం కోసం రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్‌ఎఫ్‌సీ) లాంటి వాటిని టీఎస్‌ఐఐసీతో అనుసంధానం చేయాలి.
కేంద్ర సంస్థలకు సరఫరా...
- గ‌ట్టు ఆనంద్ ఎండీ, బోటెక్ ఇండియా, ఆధిభట్ల‌.
మాది పెద్దపల్లి జిల్లా మంథని. నాన్న విశ్రాంత ఇంజినీరు. నేను నాసిక్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. చదువు పూర్తికాగానే ఓ సంస్థలో ఇంజినీరుగా చేరాను. సొంతంగా పరిశ్రమ స్థాపించాలనే లక్ష్యం ఉండేది. నా ఆలోచనలతోనే రంగారెడ్డి జిల్లాలోని నాదర్‌గుల్‌లో పరిశ్రమ నెలకొల్పా. దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లోనే అనుమతి వచ్చింది. డ్రిల్లింగు, ఎజెక్టర్‌, కట్టింగ్‌, బోరింగు టూల్స్‌ ఉత్పత్తి చేస్తున్నాం. రక్షణ శాఖ, నౌకాదళం, అణు ఇంధన సంస్థ వంటి వాటికి పరికరాలు సరఫరా చేస్తున్నాం. ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకారం లభించింది. మంచి టర్నోవర్‌ను సాధిస్తున్నాం. ప్రస్తుతం 100 మందికి ఉపాధి కల్పిస్తున్నాం.
రాయితీలు త్వరగా రావాలి..
కొత్త పారిశ్రామికవేత్తలకు రాయితీల విడుదలలో జాప్యం జరుగుతోంది. పెట్టుబడి రాయితీ, విద్యుత్‌ సబ్సిడీ, పావలావడ్డీ తదితర రకాల ప్రోత్సాహకాలు వెనువెంటనే అందాల్సి ఉంది. ఉత్పత్తి ప్రారంభమైన వెంటనే వాటిని విడుదల చేయాలి. ఈ మొత్తాలను నేరుగా పారిశ్రామికవేత్తల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అది అమలు కావడం లేదు. రాయితీల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.
ఎలక్ట్రానిక్స్‌ డిప్లొమాతో..
- బేగరి శంకర్‌, పారిశ్రామికవేత్త, మైక్రో కేబుల్స్‌, గాంధీనగర్‌, హైదరాబాద్‌.
మాది నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం కొడిచర్ల. హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా చేశాను. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని విడుదల చేసిన తర్వాత కేబుల్‌ అంకుర పరిశ్రమ కోసం దరఖాస్తు చేసుకున్నా. సత్వరమే అనుమతులొచ్చాయి. బ్యాంకు రుణం రూ.52 లక్షలు దొరికింది. దాంతో గాంధీనగర్‌ పారిశ్రామికవాడలో పరిశ్రమ స్థాపించాను. అనుభవం లేకున్నా అన్నీ నేర్చుకొని ముందుకు సాగుతున్నాను. మా వద్ద 30 మంది పనిచేస్తున్నారు.
కొత్త వాటికి వెన్నుదన్నుగా..
- ఇ.వెంకటనర్సింహారెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ.
రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు వస్తున్న వారిని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం. వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నాం. అనుమతులపరంగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. స్థలాల దుర్వినియోగం వంటివి ఎక్కడా లేవు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను పైకి తెచ్చేందుకు భూ కొనుగోలు చెల్లింపు మొత్తాలను తగ్గించాం. రాయితీల సత్వర విడుదల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

Posted on 23-07-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning