నైపుణ్యాల నగిషీ!

భారీ సంఖ్యలో ఉపాధి కల్పించే ఐటీ పరిశ్రమ... దానికి విరుద్ధంగా ఉద్యోగాలను కోల్పోయే స్థితినీ ఏర్పరుస్తుంది. సాంకేతికత, వ్యాపారాల్లో మార్పులే దీనికి కారణం. ఈ రంగంలో ఉన్నవారే కాకుండా, ఫ్రెషర్లు కూడా ఇది గమనించాలి. సరికొత్త అంశాలను నేర్చుకుని, అర్హతలకు పదును పెట్టుకోవడం అనివార్యం. ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించబోయే కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ/ఎలక్ట్రానిక్స్‌ విద్యార్థులు ఇందుకు అన్ని రకాలుగా సంసిద్ధం కావాలి!

వివిధ సర్వేల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 10 శాతం ఇంజినీరింగ్‌ విద్యార్థులు మాత్రమే ఉద్యోగాలకు అర్హులుగా ఉన్నారు. ప్రవేశ ద్వారం దగ్గరే ఈ అవరోధం ఉండగా, ఐటీ ఉద్యోగాల్లో చేరినవారికీ అడ్డంకులు సహజమే. సంస్థ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు మెరుగుపరుచుకోకపోతే వారు ఈ రంగంలో కొనసాగే పరిస్థితి ఉండదు.
పరిశ్రమ వృద్ధికి అనుగుణంగా నియామకాలూ పెరగడం వల్ల ఆ కొత్త ఉద్యోగాలకు అధిక నైపుణ్యాలు అవసరం. తమ డిగ్రీతో పాటు పరిశ్రమకు అవసరమైన వేర్వేరు కోర్సులను నైపుణ్యంతో నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు పరిశ్రమలో గిరాకీలో ఉన్న వృత్తివిద్యా కోర్సులతో పాటు తమ భావప్రకటన సామర్థ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. చŒదువుతుండగానే ఉద్యోగావకాశాలను మెరుగుపరుచుకోవాలంటే... కొన్ని పాటించాల్సివుంటుంది.
* పరిశ్రమకు అవసరమైన /గిరాకీకి తగిన టెక్నాలజీని ముందుగానే గ్రహించి దానికి అనుగుణమైన ఆప్షనల్‌ కోర్సును కళాశాలలో ఎంచుకోవాలి.
ఒకవేళ అలాంటి అవకాశం కళాశాలలో లేకపోతే? వేర్వేరు ప్రొఫెషనల్‌ శిక్షణ కేంద్రాల ద్వారా ప్రత్యేకంగానైనా నేర్చుకుని, ఆ టెక్నాలజీలో నైపుణ్యాన్ని అభివృద్ధిపరుచుకోవడం ముఖ్యం.
ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో చాలామంది తమ కళాశాలలో సరైన బోధనా సిబ్బంది లేక ఇబ్బందిపడుతున్నామని చెపుతుంటారు. నైపుణ్యాలను పెంచుకోవడం కోసం ఇంటర్నెట్‌ ద్వారా మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌ (మూక్‌) ఉన్నాయి. వాటిని మీ ఇంటి నుంచే యాక్సెస్‌ చేసి సరైన ఫ్యాకల్టీ లేని లోటును తీర్చుకోవచ్చు.
ఉదాహరణకుwww.meghsikshak.in సైట్‌ను ఉపయోగించి ఇంజినీరింగ్‌, వృత్తివిద్యా కోర్సులను ప్రముఖ సంస్థలైన ఐఐటీలూ, ఎన్‌ఐటీల ద్వారా, సీ-డేక్‌ ద్వారా నేర్చుకోవచ్చు. అంతే కాకుండా ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలైన ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్‌ల ద్వారా కూడా మీకు సంబంధించిన కోర్సులను చేయవచ్చు.
అయితే ఈ కోర్సులను చేసేముందు ఒక ఇంజినీరింగ్‌ విద్యార్థిగా ప్రాథమిక సూత్రం అనుసరించాలి. మీ కెరియర్‌ ఎలా ఉండాలనుకుంటున్నారో దానికి సంబంధించిన మౌలిక కోర్సులతో పాటు నైపుణ్యాన్ని పెంపొందించే అడ్వాన్స్‌డ్‌ కోర్సులను... అవి కూడా మీ బ్రాంచికి సంబంధించిన కోర్సులను మాత్రమే ఎంచుకోవాలి. లేదంటే అభ్యసించే విధానం రకరకాలుగా మారిపోయి దేనిలోనూ నైపుణ్యం లేకుండాపోవచ్చు.
ఉదాహరణకు... మెకానికల్‌ బ్రాంచి విద్యార్థి తనకు సంబంధించిన మౌలిక కోర్సులైన థెర్మో డైనమిక్స్‌, సాలిడ్‌ మెకానిక్స్‌, మెషిన్‌ డిజైన్‌, మాన్యుఫాక్చరింగ్‌ కోర్సులతో పాటు ఆటో కాడ్‌ (సీఏడీ/సీఏఈ) కోర్సులు చేస్తుంటారు. వాటితో పాటు త్రీ డీ ప్రింటింగ్‌, అప్లైడ్‌ ఎలక్ట్రో కెమిస్ట్రీ లాంటి కోర్సులు నేర్చుకుంటే మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో నైపుణ్యం పొందవచ్చు.
* మూక్‌ కోర్సులతో మీ పరీక్షల్లో మార్కులు బాగా రావొచ్చు. కానీ మార్కులు ఒక్కదానివల్లే మీకు ఉద్యోగం రావడం కష్టం. కోర్సులతో పాటు వాటిని నిజజీవితంలో అనుసంధానం చేయడం అంటే ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తే వచ్చే నైపుణ్యం ద్వారా ఉద్యోగార్హత పెరుగుతుంది.
* ఏదైనా ఇంజినీరింగ్‌ బ్రాంచిలో 4 సంవత్సరాల్లో పరిశ్రమకు అవసరమైనది సమకూరవచ్చు. కానీ అంతే వేగంగా సాంకేతికత మారుతుందని గ్రహించాలి. అందుకే వివిధ శిక్షణ కేంద్రాల్లో తాజా టెక్నాలజీల కోసం స్వల్పకాలిక కోర్సులు చేయడం ఉత్తమం. అవి కూడా ప్రాక్టికల్‌ ఆధారిత కోర్సులు ఎంచుకుంటే కావలసిన నైపుణ్యాలు దొరుకుతాయి.
* చుట్టుపక్కల మీ బ్రాంచికి సంబంధించిన నవీన ఉత్పత్తులను చూడండి. అలాంటివి చేయడానికి కావలసిన పరిజ్ఞానాన్ని సంపాదించండి. అవి మరింత వినూత్నంగా చేసే అవకాశాలను పరిశీలించండి. వాటి ద్వారా నైపుణ్యమే కాదు, అంకుర పరిశ్రమలతో (స్టార్టప్‌) పదిమందికి ఉపాధికి కూడా వీలవుతుంది. అంటే ప్రతి విషయాన్నీ ప్రయోగంగా చేయగలగాలి.
* ప్రాజెక్టుకు సంబంధించి ఒక బ్రాంచికి వివిధ బ్రాంచిల నైపుణ్యాలు అవసరమవుతాయి. ఆ కోర్సులను పూర్తిగా నేర్చుకోకపోయినా అవసరమైనవరకూ నేర్చుకుంటే మల్టీ డిసిప్లినరీ సామర్థ్యాలు పెరుగుతాయి.
* కంప్యూటర్‌, మొబైల్‌ సాంకేతికతతో అంతర్జాలం ద్వారా గ్లోబల్‌ నెట్‌వర్క్‌ చాలా చిన్నదైపోయింది. ఇప్పుడిది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. దానికి ఆంగ్లం ముఖ్యం కాబట్టి దానిపై పట్టు పెంచుకోవాలి. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ కోర్సుల ద్వారా ఇది సాధించవచ్చు.
అధునాతన టెక్నాలజీలు
1. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌
రోబోటిక్స్‌, డీప్‌ లెర్నింగ్‌, న్యూరల్‌ నెట్‌వర్క్స్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ వంటి టెక్నాలజీలను వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ సిస్టం మేనేజ్‌మెంట్‌ను అర్థం చేసుకుని, వాటంతట అవే నేర్చుకుని భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. ఈ సాంకేతికతలను నేర్చుకోవడానికి పార్‌లల్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్‌ అల్గారిథమ్‌లు, డేటా సెట్స్‌ మీద అవగాహన ఉండాలి. అంతేకాకుండా.. ఈ టెక్నాలజీ బ్యాంకింగ్‌లో కూడా అద్భుతంగా మోడల్‌గా పని చేస్తుంది
2. ఇంటెలిజెంట్‌ ఆప్స్‌ (అప్లికేషన్స్‌)
ఈ అప్లికేషన్లన్నీ వర్చువల్‌ ఆప్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తాయి. ఉదయపు నడకకు వెళ్లారనుకుంటే, ఎంతసేపు నడిచారు? ఎంత దూరం నడిచారు? అని చెప్పే ఆప్‌చూసే ఉంటారు కదా. ఇలాంటి ఇంటెలిజెంట్‌ ఆప్స్‌ జీవితంలోని ప్రతీ విషయంలోకి వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని ఆప్‌లు ఈ-మెయిల్స్‌లో మీ భావోద్వేగాల ప్రాధాన్యం ప్రకారం వాటిని చూపించేలా పనిచేస్తాయి. అయితే ఇవి ఆప్‌లా కాకుండా ప్రతి సాఫ్ట్‌వేర్‌ నుంచి ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్‌ (ఈఆర్‌పీ)లో అంతర్లీనంగా పనిచేయబోతున్నాయి.
3. ఇంటెలిజెంట్‌ థింగ్స్‌
వీటిని రోబోట్స్‌, డ్రోన్స్‌, అటానమస్‌ వెహికల్స్‌ కింద విభజించవచ్చు. ఇవన్నీ 2020కి డిజిటల్‌ వాణిజ్యంలో భారీ మార్కెటింగ్‌ భాగం చేజిక్కించుకోవచ్చు. ఇవి కూడా ఒకవిధంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీకి సపోర్ట్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ రూపంలో పనిచేస్తాయి.
4. వర్చువల్‌ రియాలిటీ, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ బేస్‌డ్‌ అప్లికేషన్స్‌
2020కి ఒకరికి ఒకరు ఇంటరాక్ట్‌ అయ్యే విధానానికి సాఫ్ట్‌వేర్‌ సిస్టం ఎన్విరాన్‌మెంట్‌ కోసం టెక్నాలజీ ఇది. ఉదా: ట్రైనింగ్‌ ఎన్విరాన్‌మెంట్‌, రిమోట్‌ ఎక్స్‌పీరియన్స్‌, వర్చువల్‌ వరల్డ్‌ని రూపొందించడానికి ఉపయోగం.
5. నెక్స్ట్‌ జెన్‌ మొబైల్‌ & స్మార్ట్‌ డివైజెస్‌
ఎంటర్‌ప్రైజ్‌ ఇకో సిస్టం కోసం అన్ని సంస్థలు పాత తరం టెక్నాలజీ నుంచి మొబైల్‌ టెక్నాలజీ వైపుకు మారుతున్నాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ సాంకేతికతలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
6. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ
ఇప్పటికే క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఎంతగా ఐటీ బిజినెస్‌లో ప్రభావం చూపుతుందో తెలిసిందే. ఈ వర్చువల్‌ బేస్‌డ్‌ టెక్నాలజీ మరికొన్ని సంవత్సరాలు బిగ్‌డేటాతో పాటు కొనసాగవచ్చు. బిగ్‌డేటా అనేది ప్రతీ బిజినెస్‌లో అంతర్గతంగా పని చేస్తుంది. ఎనలిటిక్స్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్స్‌కి డేటాసెత్స్‌గాతోపాటు కొత్త టెక్నాలజీలకు సాయపడుతుంది.
7. సెక్యూరిటీ ఇకో సిస్టం, ఆర్కిటెక్ట్‌ టెక్నాలజీ
సైబర్‌ సెక్యూరిటీ అనేది ప్రతి ఐటీ కమ్యూనికేషన్‌ డివైజ్‌కే కాకుండా వ్యక్తిగత భద్రత నుంచి దేశ భద్రత వరకు ఒక కీలకమైన అంశం. ప్రతి సంస్థా తమ భద్రత, గోప్యత కోసం బడ్జెట్‌ని కేటాయించడం వల్ల పది సంవత్సరాల వరకు ఈ టెక్నాలజీని ఎంచుకోవచ్చు.

- Ch.A.S. మూర్తి, జాయింట్ డైరెక్ట‌ర్‌, C-DAC

Posted on 24-07-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning