ఐటీలో ఐఓటీ విప్లవం

* పెద్ద ఎత్తున పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు
* సత్తా పెంచుకునే పనిలో వ్యాపార సంస్థలు

ఛాతిలో అసౌకర్యంగా ఉందని ఆస్పత్రికి వెళ్తే వెంటనే ఈసీజీ, ఎక్స్‌రే తీయించమంటారు. ఈ పరీక్షలు చేయించటం పెద్ద పని. తర్వాత నివేదికలు తీసుకొని మళ్లీ డాక్టర్‌ను కలవటానికి ఎంతో సమయం పడుతుంది. దీనికి బదులు ఈసీజీ, ఎక్స్‌రే తీయగానే వైద్యుడి టేబుల్‌ మీద ఉన్న కంప్యూటర్‌లో రోగి వివరాలు సహా అన్ని రిపోర్టులు అప్పటికప్పుడు కనిపించే సదుపాయం ఉంటే..., రోగికి వెనువెంటనే చికిత్స మొదలు పెట్టే వీలుంటే! ఎంతో విలువైన సమయాన్ని ఆదా చేసినట్లు అవుతుంది. ఇది జరగాలంటే ఈసీజీ, ఎక్స్‌రే మెషీన్లు, ఇతర వైద్య ఉపకరణాలు, డాక్టర్ల కంప్యూటర్లు... ఒకదానికొకటి అనుసంధానం అయిఉండాలి. వైద్య ఉపకరణాల తయారీలో అగ్రగామి సంస్థ అయిన ఫిలిప్స్‌ ఇప్పుడు ఈ పనిలోనే ఉంది. కేవలం ఆస్పత్రులకు వైద్య ఉపకరణాల సరఫరాతోనే తన పని పూర్తయిందని ఈ సంస్థ భావించటం లేదు. దీంతో పాటు ఆయా ఉపకరణాలను అనుసంధానించటం, అవి చేసే పనులను ఎప్పటికప్పుడు ఒక కేంద్రీకృత ప్రదేశంలో నివేదించటం, పర్యవేక్షణ... తదితర వ్యవహారాలకు అనువైన సాఫ్ట్‌వేర్‌ను, హార్డ్‌వేర్‌ ఉపకరణాలను ఆవిష్కరించే పనిలో నిమగ్నమై ఉంది. ఐటీలో తదుపరి తరం విప్లవంగా భావిస్తున్న ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ)తో ఇది సాధ్యమవుతోంది. ఇలా చేస్తోంది ఒక్క ఫిలిప్స్‌ మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వ్యాపార సంస్థలు ఐఓటీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే పనిలో తలమునకలుగా ఉన్నాయి. తద్వారా తమ సమర్థతను పెంపొందించుకోవటంతో పాటు వినియోగదార్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సంసిద్ధమవుతున్నాయి.

వస్తోంది ఐఓటీ విప్లవం...
ఒకదానికొకటి అనుసంధానం కాని పక్షంలో కంప్యూటర్‌ ఒక ఎలక్ట్రానిక్‌ టైప్‌ రైటర్‌ వంటిదే. ఇంటర్‌నెట్‌ ఆవిర్భావంతో కంప్యూటర్‌ రూపురేఖలు, వినియోగం, ప్రాధాన్యం గణనీయంగా మారిపోయాయి. పరస్పరం అనుసంధానం చేసిన కంప్యూటర్ల వ్యవస్థ ఆధారంగా ఎన్నో సేవలను నిపుణులు ఆవిష్కరించారు. దీనివల్ల వ్యక్తులు, వ్యాపార సంస్థలు విశేషంగా లాభపడే పరిస్థితి వచ్చింది. ప్రతి పనిలో కంప్యూటర్‌ అనేది ఒక తప్పనిసరి ఉపకరణంగా మారిపోయింది. ‘ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’ కు ఇంతకు మించిన ప్రాధాన్యం ఉందని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానం అయితే అది విప్లవాత్మకమైన మార్పు అవుతుంది. ఐటీలో దీన్ని తర్వాత తరం విప్లవంగా భావిస్తున్నారు.

సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం
‘ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’ ప్రభావంపై ఇటీవల ‘ద ఎకనామిస్ట్‌’‘ నిర్వహించిన ఎకనామిక్స్‌ ఇంటిలిజెన్స్‌ యూనిట్‌ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. దీని ప్రకారం...
* ఐఓటీ పరిజ్ఞానంపై వ్యాపార సంస్థలు పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రధానంగా ఆర్థిక సేవల రంగంలోని సంస్థలు ఈ నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తదుపరి స్థానాల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, తయారీ పరిశ్రమలు ఉన్నాయి.
* ఐటీ రంగంలో ఐఓటీ వినియోగం గత మూడేళ్లలో దాదాపు రెట్టింపు అయింది.
* పరిశోధనా సామర్థ్యం, సమాచారాన్ని విశ్లేషించే సత్తా (డేటా అనలిటిక్స్‌), నూతన వ్యాపార విధానాల రూపకల్పన పరిజ్ఞానం ఉన్న సంస్థలు ఈ కొత్త రంగంలో ఎక్కువ విజయాలు సాధించే అవకాశం ఉంది.
* ఐఓటీ విస్తరణలో వ్యయాలు ప్రధాన అవరోధం. దీనికి అనువైన సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు సమకూర్చుకోవటం ఎంతో ఖర్చుతో కూడుకున్న పనిగా వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి. సమాచార భద్రత కూడా ప్రధాన సమస్యగా కనిపిస్తోంది.
* ఐఓటీ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించే దిశగా వివిధ సంస్థలు విశేష పరిశోధనలు సాగిస్తున్నాయి. తత్ఫలితంగా ఆయా సంస్థల్లో పరిశోధనా కార్యకలాపాలకు అధికంగా నిధులు కేటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

వచ్చే మూడేళ్లలో ఎంతో మార్పు
సమీప భవిష్యత్తులో ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) గణనీయంగా విస్తరించనుందని అగ్రశ్రేణి కన్సల్టెన్సీ సేవల సంస్థ అయిన గార్టనర్‌ ఇటీవల ఒక నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం-
* ప్రపంచ వ్యాప్తంగా 2020 నాటికి 2,041 కోట్ల ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు పరస్పరం అనుసంధానం అవుతాయి. స్మార్ట్‌ టీవీలు, డిజిటల్‌ సెట్‌-టాప్‌ బాక్సులు, స్మార్ట్‌ ఎలక్ట్రిక్‌ మీటర్లు, సెక్యూరిటీ కెమేరాలు, ఆటోమోటివ్‌ సిస్టమ్‌లు, ఇతర ఉపకరణాలు... ఐఓటీ పరిజ్ఞానంతో ఒక దానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి.
* అప్పటికి ఐఓటీ సేవల మార్కెట్‌ విలువ అప్పటికి 2 ట్రిలియన్‌డాలర్లకు చేరుకుంటుంది.
* ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా, చైనా- దాని పరిసర దేశాలు ఐటీఓ ప్రగతిలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ మూడు ప్రాంతాల వాటా ప్రపంచ వ్యాప్త ఐఓటీ మొత్తం వ్యాపారంలో 67 శాతం ఉంటుంది.
* సాధారణ వినియోగదార్లతో పోల్చితే వ్యాపార సంస్థలు ఐఓటీ పరిజ్ఞానాన్ని విస్తృతం వినియోగిస్తాయి. దీనివల్ల వ్యాపార సంస్థల సమర్థత పెరగటంతో పాటు వ్యయాలు తగ్గుముఖం పడతాయి.

ఇవీ ఐఓటీ అప్లికేషన్లు...
* వేరువేరు సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫామ్‌లు, ఆపరేటింగ్‌ సిస్టమ్‌లు, టెక్నాలజీ కలిగి ఉన్న ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు ఐఓటీ అమల్లో భాగంగా పరస్పరం అనుసంథానం అవుతాయి. ఈ క్రమంలో భద్రత (ఐఓటీ సెక్యూరిటీ), అందుకు అనువైన అప్లికేషన్లకు గిరాకీ ఏర్పడుతోంది.
* ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు సేకరించే సమాచారాన్ని విశ్లేషించి దాన్ని వ్యాపార వ్యూహాల రూపకల్పనలో వినియోగించుకునేందుకు వీలు కల్పించే అనలిటిక్స్‌ కు విశేష ప్రాధాన్యం లభించనుంది. నూతన అనలిటిక్స్‌ టూల్స్‌, ఆల్గోరిథమ్స్‌ అవసరాలు పెరిగిపోతాయి.
* ఐఓటీలో పరస్పరం అనుసంథానం అయి ఉండే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల నిర్వహణ ప్రధానమైన అంశం. ఫర్మ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌, డయాగ్నసిస్‌, క్రాష్‌ అనాలసిస్‌- రిపోర్టింగ్‌, సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాలపై ఐఓటీ నిపుణులు దృష్టి సారించాల్సి వస్తుంది.
* ఐఓటీ పరిజ్ఞానం అమల్లో వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ ఎంతో ముఖ్యం. నెట్‌వర్క్‌ పరిధి, బ్యాటరీ సామర్థ్యం, బ్యాండ్‌విడ్త్‌, సాంద్రత, నిర్వహణ వ్యయాలు- పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు. తొలిదశలో తక్కువ శక్తి, స్వల్ప శ్రేణి నెట్‌వర్క్‌లకు ప్రాధాన్యం ఉంటుందని అంచనా.
* సంప్రదాయ ఓఎస్‌ (ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌) లైన విండోస్‌, ఐఓఎస్‌ ‘ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’ కోసం రూపొందించినవి కాదు. ఇవి కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్ల కోసం కనుగొన్నవి. వీటికి ఎంతో అధిక బ్యాటరీ సామర్థ్యం, ఎంతో అధిక శక్తి ఉన్న ప్రాసెససర్లు కావాలి. మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లలో మెమరీ సామర్థ్యం కూడా ఎక్కువ అవసరం. ఐఓటీ అవసరాలు వేరేవిధంగా ఉంటాయి. అందువల్ల కొత్త ఓఎస్‌లను రూపొందించాల్సిన అవసరం ఏర్పడుతుంది.
* కొన్ని ఐఓటీ అప్లికేషన్లు అత్యధిక సంఖ్యలో డేటాను ఎప్పటికప్పుడు (రియల్‌టైమ్‌) విశ్లేషిస్తుంటాయి. ఇటువంటి అవసరాల కోసం డిస్ట్రిబ్యూటెడ్‌ స్ట్రీమ్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ (డీఎస్‌సీపీ‘స్‌) అందుబాటులోకి వచ్చాయి.
* పలు రకాలైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఏకీకృతం చేసి ఒకే ఐఓటీ ఉత్పత్తిగా అందించాల్సిన అవసరం ఉన్నందున అందుకు అనువైన ఐఓటీ ప్లాట్‌ఫామ్‌లను ఆవిష్కరించాల్సి వస్తుంది. ఐఓటీ పరిజ్ఞానం అమల్లో ఇటువంటి ఆర్కిటెక్చర్‌ ఎంతో అవసరం.

ఐఓటీ నిపుణులకు గిరాకీ
ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటానికి ముందుకు వచ్చే సంస్థలు ముందుగా ఈ రంగంలో నిష్టాతులైన వారి సేవలు తీసుకుంటున్నాయి. వారి అనుభవాలను పరిగణలోకి తీసుకొని తమకు అనువైన రీతిలో ఐఓటీ ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. అంతేగా ఇప్పటికే దీన్ని అమలు చేసిన సంస్థల అనుభవాలను కూడా విశ్లేషిస్తున్నాయి. దీనివల్ల మున్ముందు ఐఓటీ నిపుణులకు విశేష గిరాకీ లభించనుందని స్పష్టమవుతోంది.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Posted on 29-07-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning