ఉజ్వల భవితకు... ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌

ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు మంచిభవిష్యత్తును అందించే పోటీపరీక్షల్లో ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ఈఎస్‌ఈ) ప్రధానమైనది. యూపీఎస్‌సీ నిర్వహించే ఈ పరీక్షను ఐఈఎస్‌గా కూడా వ్యవహరిస్తుంటారు. సవ్యమైన అవగాహన పెంచుకుంటే గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్ల అమ్ములపొదిలో ఈ పరీక్ష బలమైన అస్త్రంగా మారుతుంది; మేటి భవితను అందిస్తుంది!

2017 నుంచి ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్షావిధానం పూర్తిగా మారింది. మారిన విధానంలో దీనిని మూడు విడతల్లో నిర్వహిస్తున్నారు. ఈఎస్‌ఈ-2018 ప్రకటన 27.09.2017న విడుదల కానుంది. ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌ పరీక్షను జనవరి 7, 2018న, మెయిన్స్‌ పరీక్షను జులై 1, 2018న నిర్వహించనున్నారు. స్టేజ్‌-1, 2ల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఉన్నతస్థాయి పరీక్షలుగా భావించే గేట్‌, ఈఎస్‌ఈల మధ్య గతంలో 5 నెలల వ్యవధి ఉండటం వల్ల ఈ రెండు పరీక్షలకు సన్నద్ధమవడం సులభంగా ఉండేది. కానీ 2017 నుంచి ఈఎస్‌ఈ విధానంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఈ రెండు పరీక్షలను సాధించాలంటే పటిష్టమైన ప్రణాళిక తప్పనిసరి అయింది. జాతీయస్థాయిలో వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ వంటి గ్రూప్‌-ఎ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ విభాగాల్లో ఈ పరీక్ష ఉంటుంది. రైల్వే, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌, మిలిటరీ ఇంజినీరింగ్‌, సెంట్రల్‌ వాటర్‌, సెంట్రల్‌ ఇంజినీరింగ్‌, నేవల్‌, సెంట్రల్‌ పవర్‌, టెలికాం, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీస్‌ వంటి విభాగాల్లో దీని ద్వారా నియామకాలు జరుగుతాయి. సమాజంలో గౌరవం, ఉద్యోగ భద్రత, పదోన్నతులు ఉంటాయి.

స్టేజ్‌-1 (ప్రిలిమినరీ)
ఇది ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. కాల్‌క్యులేటర్‌లను అనుమతించరు. రుణాత్మక మార్కులుంటాయి.
సివిల్‌ సర్వీసెస్‌ మాదిరిగా కాకుండా ఐఈఎస్‌ ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కులు మెయిన్స్‌ రాయడానికి అర్హతను సాధించిపెట్టడంతోపాటు తుది ఎంపికలోనూ తోడ్పడతాయి. తద్వారా ఉత్తమ ర్యాంకు సాధనకూ ఉపయోగకరం.

మొదటి పేపర్‌ (జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌):
పేపర్‌-1లో కూడా కనీస అర్హత మార్కులు సాధించాలి. కాబట్టి టెక్నికల్‌ సబ్జెక్టుతోపాటు ఈ జనరల్‌ స్టడీస్‌ కూడా చాలా కీలకం కానుంది. ఇప్పటినుంచే జనరల్‌ స్టడీస్‌పై తగిన శ్రద్ధవహించి సన్నద్ధమవడం ఎంతో మంచిది. జనరల్‌ స్టడీస్‌ అంటే హిస్టరీ, జాగ్రఫీ లాంటివి కాకుండా ఆ స్థానంలో ఇంజినీరింగ్‌కు సంబంధించిన అంశాలను చేర్చారు. పేపర్‌-1లోని 200 మార్కులు అంతిమంగా సాధించే ర్యాంకులో కీలకపాత్రను పోషిస్తాయి.

ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌ (లాజికల్‌ రీజనింగ్‌, అనలిటికల్‌ ఎబిలిటీ)
గత ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే ఇందులో నుంచి దాదాపు 12 మార్కులకు ప్రశ్నలు అడిగారు. ఇందులో ప్రాథమికాంశాలపైనే ఎక్కువ ప్రశ్నలను అడిగారు. అందుకని సులభంగా వీటికి సమాధానాలను రాయవచ్చు. అందుబాటులో ఉన్న వనరులతో సమయపాలనతో కూడిన సమర్థ సమాధానాన్ని రాబట్టడంలో ఇంజినీరు నైపుణ్యాలను దీనిలో పరీక్షిస్తారు.

అనలిటికల్‌ ఎబిలిటీ
ఇందులో విద్యార్థి ఆలోచనా సామర్థ్యం, సమాచార సేకరణ, సంక్లిష్ట సమస్యకు సరైన నిర్ణయం తీసుకోవడం లాంటివి ఉంటాయి. ఎబిలిటీ స్కిల్స్‌ ఉన్న ఇంజినీర్‌ క్లిష్టమైన పనులను కూడా సునాయాసంగా చేయగలడు. ఈ విభాగం నుంచి ఎక్కువ మార్కులు సాధించాలంటే ఇంటర్మీడియట్‌లోని జామెట్రీ, త్రికోణమితిలపై పట్టు సాధించాలి.

లాజికల్‌ రీజనింగ్‌
ఈ విభాగం నుంచి సిట్టింగ్‌ అరేంజ్‌మెంట్స్‌, నంబర్‌ సిరీస్‌, సరాసరి, రక్తసంబంధాలు, వెన్‌ డయాగ్రమ్స్‌, గడియారాలు, క్యాలెండరు, క్యూబ్స్‌ మొదలైనవి సాధన చేయాలి. ఇందులో స్టేట్‌మెంట్స్‌, ఆర్గ్యుమెంట్స్‌, కన్‌క్లూజన్స్‌ చాలా ముఖ్యం. ఈ అనలిటికల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌లపై మంచి పట్టు సాధిస్తే ఇతర ప్రభుత్వ పరీక్షలకూ ఉపయోగపడుతుంది.

పేపర్‌-2
ఈ పేపర్‌ తమ ఇంజినీరింగ్‌ కోర్‌ సబ్జెక్టుకు సంబంధించింది. ఇందులో 300 మార్కులకు 3 గంటల సమయాన్ని కేటాయించారు. విద్యార్థులు తమ కోర్‌ సబ్జెక్టులపై మంచి పట్టు సాధిస్తే ఈ పేపర్‌ సులభంగా రాయవచ్చు. పరీక్షలో ఉన్న సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన అంశాలను సాధన చేయాలి. అన్ని సబ్జెక్టుల్లోని అంశాల వెయిటేజీని దృష్టిలో ఉంచుకుని ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించుకోవాలి. కాల్‌క్యులేటర్‌ అనుమతి లేనందున మానవ మేధతో చేయగల ప్రశ్నలను అడగొచ్చనీ, ప్రశ్నలు కొంత సులభంగా ఉంటాయనీ అర్థమవుతుంది. ఈ పేపర్‌లో ఎక్కువ సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి. స్టేజ్‌-2లోని సిలబస్‌ పూర్తిగా పేపర్‌-2కు సంబంధించినదే కాబట్టి ఎంత ఎక్కువ సాధన చేస్తే స్టేజ్‌-2 సన్నద్ధత అంత సులభ మవుతుంది.

స్టేజ్‌-2 (మెయిన్స్‌)
ప్రిలిమినరీ పరీక్ష ద్వారా 1:6 లేదా 1:7 నిష్పత్తిలో మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రపెన్యూర్‌షిప్‌లో కొత్తగా 263 పోస్టులు జతకానున్నాయనే వార్త వినిపిస్తోంది. వీటి ఆధారంగా ఈ ఏడాది దాదాపుగా 625 ఖాళీలు ఉండవచ్చు. అంటే 3750 నుంచి 4375 మంది మాత్రమే మెయిన్స్‌ పరీక్షకు అర్హులు అవుతారు.

స్టేజ్‌-2 మొత్తం మార్కులు 600
స్టేజ్‌-1 + స్టేజ్‌-2 = 1100 మార్కులు
పై రెండు పేపర్లలో కనీస అర్హత మార్కులను నిర్ణయించే విచక్షణాధికారం యూపీఎస్‌సీకి ఉంటుంది. కన్వెన్షనల్‌ ప్రశ్నపత్రాలకు 600 మార్కులున్నాయి. కన్వెన్షనల్‌ ప్రశ్నలు డిజైన్‌ ఆధారితం, ఎక్కువ నిడివి ఉన్నవిగా ఉంటాయి. వీటిని చదవడంతోపాటు రాయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఈ రాతపరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత యూపీఎస్‌సీ కమిషన్‌ అర్హత పొందిన అభ్యర్థుల డిటేల్డ్‌ అప్లికేషన్‌ ఫారం (డీఏఎఫ్‌)ను ఆన్‌లైన్‌ ద్వారా పంపడానికి సమాచారం అందిస్తుంది.

స్టేజ్‌-1 లోని ఇంజినీరింగ్‌ సిలబస్‌ను రెండు పేపర్లుగా విభజించారు. ఈ పేపర్లు అభ్యర్థి కోర్‌ సబ్జెక్టులకు సంబంధించినవే. కొత్త విధానంలో మార్కులతోపాటు సమయం కూడా పెరిగింది. కాబట్టి అభ్యర్థుల నుంచి బేసిక్స్‌తోపాటు అడ్వాన్స్‌డ్‌ విషయాలపై పూర్తిస్థాయి అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు ఉండవచ్చు. కొత్తగా చేర్చిన కొన్ని సబ్జెక్టులు బీటెక్‌లో ఎలక్టివ్‌గా లేదా ఎంటెక్‌ ప్రథమ సంవత్సరంలో చదివే విషయాలున్నాయి. కానీ ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్రమబద్ధంగా, పటిష్ఠ ప్రణాళికతో నాలుగేళ్ల బీటెక్‌ సిలబస్‌ చదివితే సరిపోతుంది.

స్టేజ్‌-3: మౌఖిక పరీక్ష/ పర్సనాలిటీ టెస్ట్‌ (200 మార్కులు)
మెయిన్స్‌ ద్వారా 1:2.5 లేదా 1:3 నిష్పత్తిలో పర్సనాలిటీ టెస్ట్‌కు అర్హత సాధిస్తారు. దీనిలో అభ్యర్థి ఆలోచనా విధానాన్ని, శక్తి సామర్థ్యాలు, నీతి-నిజాయతీలను అంచనా వేస్తారు. ప్రస్తుతం రెండేళ్ల నుంచి ఈఎస్‌ఈ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు, హాబీలకు కొంత ప్రాముఖ్యమిస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. అభ్యర్థి ఉద్యోగం చేస్తున్నా, ఎంటెక్‌ చేస్తున్నా సంబంధిత విషయాల గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సామాజిక, వర్తమానాంశాల గురించి కూడా అడగవచ్చు. ప్రణాళిక ప్రకారం వెళితే మౌఖిక పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు.

అపోహ... అసలు నిజం
* ఉత్తర భారతదేశ విద్యార్థులే ఈ పరీక్షలో విజయం సాధిస్తారు
వాస్తవం కాదు. గత కొన్ని సంవత్సరాల నుంచి పరిశీలిస్తే మన తెలుగు వారు కూడా చాలామంది ఉత్తమ ర్యాంకులతో దీనిలో విజయం సాధిస్తున్నారు.

* ఇందులో నియమించే ఉద్యోగాలు పురుషులు మాత్రమే చేయగలరు
కొంతమంది విద్యార్థినుల్లో ఈ అపోహ ఉంది. కానీ ఇది అవాస్తవం. మహిళలు కూడా అదేస్థాయిలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గొప్ప స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

* ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రామాణిక కళాశాలల్లో చదివితే మాత్రమే ఈ పరీక్షను సాధించగలరు
ఈ అభిప్రాయం సత్యదూరం. ఈ పరీక్షలో గొప్ప ర్యాంకు సాధించిన ఎంతోమంది విద్యార్థులు సాధారణ కళాశాలలో చదివి ఉత్తీర్ణులైనవారే.

* ఇంజినీరింగ్‌లో తక్కువశాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఈ పరీక్షలో నెగ్గలేరు
బీటెక్‌/ బి.ఇ.లో సాధారణ ప్రతిభ చూపినవారు కూడా ఈ పరీక్షలో మంచి విజయం సాధించారు. ఇంజినీరింగ్‌ మార్కుల శాతం ఈ పరీక్షను చేధించడానికి ఎంతమాత్రం అడ్డుకాదని నిరూపించారు. ఉత్తీర్ణత శాతంతో సంబంధం లేకుండా ఇంజినీరింగ్‌ పాసైన ప్రతి ఒక్కరూ ఈ పరీక్ష రాయడానికి అర్హులే. కాబట్టి ఇంజినీరింగ్‌లో తక్కువ మార్కులు వచ్చినా, సాధారణ కళాశాలలో చదివినా ఏమాత్రం అధైర్యపడకుండా ఈఎస్‌ఈకి పోటీపడవచ్చు. సమయపాలనతో సాధన చేస్తే ఈ పరీక్షలో విజయం సాధించటం అసాధ్యమేమీ కాదు.

* ఈ పరీక్షకు పోటీ ఎక్కువ
ఈ అభిప్రాయంతో చాలామంది దరఖాస్తు చేయటానికి వెనకడుగు వేస్తారు. అయితే చాలామంది దరఖాస్తు చేసుకున్నా శ్రద్ధగా చదివి గట్టి పోటీ ఇచ్చే విద్యార్థులు చాలా తక్కువ. అందులోనూ దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య, పరీక్ష రాసేవారి సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది.

* ఈ పరీక్షలోని సిలబస్‌ చాలా ఎక్కువ
ఈ సందేహంతో చాలామంది ఓ ప్రయత్నం చేయడానికి కూడా భయపడుతుంటారు. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం నుంచే తగిన ప్రణాళికతో చదివితే సిలబస్‌ తక్కువే అనిపిస్తుంది,

* దీన్ని మొదటిసారి ఛేదించడం కష్టం
ఇది చాలామంది ఇంజినీరింగ్‌ విద్యార్థుల భావన. విజేతల గణాంకాలు పరిశీలిస్తే... మొదటి ప్రయత్నంలోనే ఈ పరీక్షను మంచి ర్యాంకుతో సాధించినవారు ఉన్నారని తెలుస్తుంది. సరైనదిశలో కృషి చేస్తే తొలిసారి ఛేదన సుసాధ్యమే.

* ఇంగ్లిష్‌ మాధ్యమంలో పరీక్ష ఉండటం అవరోధం
గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మాధ్యమంలో చదివినవారికి ఇంగ్లిష్‌ అంటే కొంత బెరుకు ఉండటం సహజం. ప్రస్తుతం మారిన ఈఎస్‌ఈ పరీక్ష ప్రకారం స్టేజ్‌-1లో ఉన్న పేపర్‌-1లో ఇంగ్లిష్‌ లేకపోవడంతో వీరికి ఈ పరీక్ష సాధన సులభతరమైంది.

* ఒక సబ్జెక్టుకు చాలా పుస్తకాలు చదవాలి
ఇది సరైన అభిప్రాయం కాదు. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో ప్రామాణిక పుస్తకం చాలు. ఈ ఒక్క పుస్తకాన్నే చాలాసార్లు పునశ్చరణ చేయడం ఉత్తమం.

* కేవలం నాలుగు ఇంజినీరింగ్‌ బ్రాంచీల్లోనే (సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌) నిర్వహించడం వల్ల ఇతర ఇంజినీరింగ్‌ బ్రాంచీ విద్యార్థులు ఈ పరీక్షకు అనర్హులు
ఇది అవాస్తవం. ఏ ఇంజినీరింగ్‌ బ్రాంచీ వారైనా పైన తెలిపిన నాలుగు బ్రాంచీల్లో ఏదైనా ఒకదానిలో పరీక్ష రాయవచ్చు.

* రోజుకు 16 నుంచి 18 గంటలు సాధన చేయగల సామర్థ్యం ఉన్నవారే ఈ పరీక్షను రాయగలరు
పరీక్ష వ్యవధిని దృష్టిలో ఉంచుకుని రోజుకు 8 నుంచి 9 గంటల వరకు సాధన చేసినా సరిపోతుంది. ఏకాగ్రతతో చదవటమే ముఖ్యం. గంటల లెక్క కాదు.

* ఉద్యోగులకు సమయాభావం వల్ల ఈ పరీక్షను ఛేేదించడం కష్టం
ఇలా భావించటం సరికాదు. మంచి ప్రణాళికతో కష్టపడితే ఈ పరీక్షను నెగ్గడం సులభమేనని చాలామంది విజయం సాధించి నిరూపించారు.


Posted on 31-07-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning