అమెరికా చదువా?.. చూద్దాంలే!

* ఉన్నతవిద్య కోసం అగ్రరాజ్యానికి వెళ్లే విద్యార్థుల్లో తగ్గుదల
* పిల్లల్ని పంపేందుకు ఆందోళనచెందుతున్న తల్లిదండ్రులు
* ప్రభావం చూపుతున్న ఆ దేశంలోని పరిణామాలు
* ధ్రువీకరిస్తున్న కన్సల్టెన్సీలు, ట్రావెల్ ఏజెన్సీలు
* అస్ట్రేలియా, కెనడాకు పెరుగుతున్న విద్యార్థులు

ఈనాడు, అమరావతి: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన పరిణామాలు చదువు కోసం అమెరికాకు వెళ్లాలనుకునే తెలుగు విద్యార్థులను గందరగోళంలో పడేస్తున్నాయి. కేన్సస్ కాల్పుల ఘటన.. ఓలెత్ నగరంలో చోటుచేసుకున్న కాల్పులు.. వీసాల జారీ కఠినతరమైందనే ప్రచారం.. విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. వెరసి అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. విదేశీ విద్యకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు రోజుకు ఐదారుగురు వస్తే వారిలో ముగ్గురు, నలుగురు తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారని కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి. కచ్చితంగా అమెరికాలోనే చదవాలకున్నవారు మాత్రం ధైర్యంగా వెళ్లిపోతుండగా.. కొందరు ఈ ప్రచారం కారణంగా ముందుకురావడం లేదంటున్నాయి. గతంలో అమెరికాకు వెళ్లే విద్యార్థులు అత్యధికంగా ఉండగా.. ఈసారి కొంచెం తగ్గినప్పటికీ ఇతర దేశాలతో పోల్చితే అగ్రస్థానం భారతీయులదే. కొందరు విద్యార్థులు ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా, యూరప్ వెళ్తున్నారు. గతంలో ఈ దేశాలకు వెళ్లేవారి సంఖ్య తక్కువగా ఉండగా ఈసారి కొంచెం పెరిగినట్లు విజయవాడ, గుంటూరుల్లోని ప్రముఖ ట్రావెల్స్ కంపెనీలు, కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం కేంద్రంగా ముఖ్యమైన కన్సల్టెన్సీలు దాదాపు 75వరకు ఉన్నాయి. ప్లస్‌టూ చదివినవారు కొందరు గ్రాడ్యుయేషన్ చదివేందుకు విదేశాలకు వెళ్లడం ప్రారంభమైందని గుంటూరులోని కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి. మంచి మార్కులు ఉన్నవారికి ఉపకారవేతనాలు రావడంతో కొందరు ఇటువైపు చూస్తున్నారని వెల్లడించారు.

వృద్ధిరేటు ఏడు శాతమే
స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్(ఎస్ఈవీపీ) పేరిట అమెరికా అంతర్గత భద్రత విభాగంలోని ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు(ఐసీఈ) నివేదికలు వెలువరిస్తుంది. తాజాగా 2017 మే 5వ తేదీనాటికి అమెరికాలోని విదేశీ విద్యార్థులపై విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల శాతం(వృద్ధి రేటు) తగ్గుతోంది. 2015 నవంబరు, 2016 నవంబరు మధ్య భారత్ విద్యార్థుల సంఖ్య వృద్ధిరేటు 14.1 శాతంగా నమోదైందని గత డిసెంబరులో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇదే అత్యధికమని స్పష్టం చేసింది. తాజాగా 2016 మే, 2017 మే నెల మధ్య మాత్రం వృద్ధిరేటు 7 శాతంగానే నమోదైంది. 2016 నవంబరు, 2017మే మధ్య కేవలం 116 మంది విద్యార్థులే పెరిగారు. గతంతో పోల్చితే ఇది తక్కువే.

పిల్లల తల్లిదండ్రుల్లో సందిగ్ధత..
అమెరికాలో పరిస్థితులు బాగానే ఉన్నాయని, వదంతులు నమ్మొద్దని అక్కడ చదువుతున్న విద్యార్థులు చెబుతున్నా.. ఇక్కడి నుంచి వెళ్లాలనుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు తమవారిని పంపించేందుకు పునరాలోచన చేస్తున్నారు. భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, పరిస్థితులు అన్ని చక్కబడ్డాయని తాము చెబుతున్నా విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించే లేకపోతున్నామని కన్సల్టెన్సీ నిర్వాహకులు వెల్లడిస్తున్నారు.

* అమెరికాలో చదువుకునేందుకు తమ ద్వారా ఏటా 30-50 మంది వరకు వెళ్లేవారని, ఈసారి ఆగస్టు సెషన్(ఫాల్)కు కేవలం ఐదుగుర్ని మాత్రమే పంపించామని దేశవ్యాప్తంగా వీసాలు, ట్రావెల్ టిక్కెట్లు, విద్యా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న రియా సంస్థకు చెందిన విజయవాడ రియా ఎడ్యుకేషన్ స్టడీ అబ్రాడ్ ప్రతినిధి స్వర్ణ పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన ఉందని, కొందరు వచ్చి వివరాలు అడిగిన తర్వాత వెళ్లడం మానుకుంటున్నారని తెలిపారు. అస్ట్రేలియా, కెనడాలకు విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. తమ సంస్థ నుంచి ఈ ఏడాది 50 మంది వరకు అస్ట్రేలియాకు వెళ్లారని, గతంలో ఇది 30 వరకు ఉండేదని వివరించారు. ఈసారి తమ సంస్థ నుంచి కెనడాకు సుమారుగా 15 మంది వెళ్లారన్నారు. స్వీడన్‌కు 15 మంది, జర్మనీకి 20 మందిని పంపించినట్లు వెల్లడించారు. విదేశాల్లోనే చదవాలి అనుకునేవారు ఇతర దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య యథాస్థాయికి వచ్చేందుకు కొంచెం సమయం పడుతుందని వెల్లడించారు.
* తమ కన్సల్టెన్సీ తరపున 150-200 వరకు విద్యార్థులను అమెరికాకు పంపేవాళ్లమని ఈసారి దాదాపు 50-60 శాతం తగ్గిందని విజయవాడలోని పెగాసిస్ కన్సల్టెన్సీ ప్రతినిధి మురళి తెలిపారు.
* విదేశీ విద్య కోసం టిక్కెట్ల బుకింగ్ వ్యాపారం సైతం తగ్గినట్లు దేశవ్యాప్తంగా బ్రాంచిలు కలిగి ఉన్న విజయవాడలోని అక్బర్ ట్రావెల్స్ ప్రతినిధి నరేంద్ర వెల్లడించారు. ఫాల్ సెషన్ వెళ్లేవారితో బిజీబిజీగా ఉండాల్సి ఉండగా.. టిక్కెట్ బుకింగ్‌లు అనుకున్నంత స్థాయిలో లేవని పేర్కొన్నారు. ఆగస్టు సెషన్‌కు తమ వద్ద నుంచి అమెరికాకు 20 వరకు టిక్కెట్లు బుక్కయ్యేవని, ప్రస్తుతం 12కి పడిపోయిందన్నారు. అస్ట్రేలియాకు 70 వరకు టిక్కెట్లు బుక్కయ్యాయని తెలిపారు. ఇటీవల జరిగిన తమ ట్రావెల్స్ సమీక్షా సమావేశంలోనూ దేశ వ్యాప్తంగా తమ బ్రాంచిల్లో 30-40 శాతం టిక్కెట్ల బుకింగ్ తగ్గడంపై చర్చకు వచ్చిందని, అమెరికా, ఇతర దేశాలకు చదువు కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గడమే దీనికి కారణమని వెల్లడైందని చెప్పారు.
* రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ బ్రాంచిలు కలిగిన అబ్రాడ్ కన్సల్టెన్సీ తరఫున రెండు సెషన్లకు కలిపి 445 మంది పంపించేవాళ్లమని ఈసారి 400లోపే వెళ్లారని ఆ సంస్థ ప్రతినిధి పార్థసారథి తెలిపారు. ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు నమ్మకం కలిగేందుకు కొంత సమయం పడుతుందన్నారు.
* ఇటలీ, జర్మనీలకు వెళ్లేవారు ఎక్కువగా మెకానికల్ ఇంజినీర్లు ఉంటున్నారని గుంటూరుకు చెందిన కన్సల్టెన్సీ ప్రతినిధి బిపిన్ పేర్కొన్నారు. అమెరికాకు వీసాల జారీ కొంచెం కఠినతరమైందని, సబ్జెక్టు ఉన్నవారికి తేలికగానే వస్తున్నాయని తెలిపారు.
* 90-95 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులకు యూరప్‌లోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఉచితంగా విద్యను అందిస్తుండడంతో గుంటూరులో జెమ్స్ అనే కన్సల్టెన్సీ ఈ దేశాలకు విద్యార్థులను పంపిస్తోంది.

Posted on 03-08-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning