సైబర్‌ భద్రతలో భారీ ఉద్యోగావకాశాలు

* 2025 నాటికి 10 లక్షల ఉద్యోగాలు
* పెద్దఎత్తున కంపెనీల పెట్టుబడులు
* ప్రత్యేక వ్యూహాలు, ప్రణాళికలు, బోర్డుల్లో చర్చలు
* ప్రతి మంత్రిత్వ శాఖలో సైబర్‌ సెక్యూరిటీ అధికారి
* ఈనాడు-ఇంటర్వ్యూలో డీఎస్‌సీఐ సీఈఓ రమా వేదశ్రీ

ఈనాడు - హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా సైబర్‌ దాడుల భయం పెరిగిపోతోంది. యాప్‌లు, మొబైల్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విస్తరిస్తుండడంతో సైబర్‌ భద్రత కీలకంగా మారింది. ఈ విభాగంలో కంపెనీలు, ప్రభుత్వం, సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ, నియంత్రణ సంస్థలు కలిసి పని చేస్తున్నాయని డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీఎస్‌సీఐ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) రమా వేదశ్రీ తెలిపారు. సైబర్‌ భద్రతపై నాస్‌కామ్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె ఇక్కడకు వచ్చారు. డేటా భద్రత, సైబర్‌ రక్షణ కోసం దాదాపు దశాబ్దం క్రితం డీఎస్‌సీఐను నాస్‌కామ్‌ ఏర్పాటు చేసింది. ఈ రంగంలో నైపుణ్యాల కొరత, ఉద్యోగ అవకాశాలు, సైబర్‌ భద్రతకు కంపెనీలు అనుసరిస్తున్న వ్యూహాలు మొదలైన వాటిపై ఆమె ‘ఈనాడు’తో ముచ్చటించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ..

* సైబర్‌ భద్రతలో ఉద్యోగావకాశాలు బాగా ఉన్నాయంటున్నారు. నిజమేనా
సైబర్‌ భద్రతలో ప్రభుత్వం, కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దేశీయ ఐటీ పరిశ్రమ ఇందుకోసం ప్రత్యేక ఉత్పత్తులు, సొల్యూషన్లపై దృష్టి కేంద్రీకరిస్తోంది. పెద్ద, పెద్ద ఐటీ కంపెనీలు అంతర్జాతీయంగా ఈ సేవలు అందిస్తున్నాయి. దేశ, అంతర్జాతీయ ఖాతాదారుల (కంపెనీలు) కోసం సెక్యూరిటీ కార్యకలాపాల కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. సైబర్‌ భద్రతా రంగంలో పెద్ద ఐటీ కంపెనీలు వేళ్లూనుకుంటే, ఈ విభాగంలో మరింత మంది నిపుణులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. సొంత అవసరాల కోసం వెల్స్‌ ఫార్గో, డాయిష్‌ బ్యాంకుల వంటి అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు సెక్యూరిటీ కార్యకలాపాలు, సొల్యూషన్లకు భారత్‌ను కేంద్రంగా భావిస్తున్నాయి. బ్యాంకింగ్‌, ఇంధనం వంటి రంగాల్లోని కంపెనీలు, సేవల వినియోగ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రతి మంత్రిత్వ శాఖకు ఒక ముఖ్య సమాచార భద్రతా అధికారి (సీఐఎస్‌ఓ) ఉండాలని ఇటీవల కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. దాదాపు అన్ని కంపెనీలు ఈ నియామకాలు జరిపాయి. ఈ విభాగంలో ఉద్యోగ అవకాశాలు అధికంగా లభిస్తాయి. నాస్‌కామ్‌ సైబర్‌ భద్రతా కార్యచరణ బృందం అంచనా ప్రకారం 2016 చివరి నాటికి 1.5 లక్షల మంది ఈ రంగ నిపుణులు ఉన్నారు. 2025 నాటికి 10 లక్షల మంది నిపుణులు ఈ రంగంలో పని చేయగలరని భావిస్తున్నాం.

* సైబర్‌ భద్రతా విభాగం వృద్ధిరేటు ఎలా ఉంది
దేశీయ సైబర్‌ భద్రతా పరిశ్రమ విలువ 4.2 బిలియన్‌ డాలర్లు. ఇందులో 1.6 బిలియన్‌ డాలర్లు దేశీయ విపణి నుంచి లభిస్తోంది. 2025 నాటికి ఇది 35 బిలియన్‌ డాలర్లకు (రూ.2.25 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా వేస్తున్నాం. అప్పటికి మొత్తం ఐటీ పరిశ్రమ ఆదాయంలో సైబర్‌ భద్రత వాటా 10 శాతానికి చేరొచ్చు.

* నైపుణ్యాల కొరతను ఏ విధంగా అధిగమించాలి
అధిక శాతం విద్యా సంస్థల్లో డిగ్రీ, పోస్ట్‌ గ్యాడ్యుయేషన్‌ స్థాయిల్లో సైబర్‌ భద్రతా నైపుణ్యాలు బోధించే కోర్సులు లేవు. నైపుణ్యాలను పెంచడానికి డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీఎస్‌సీఐ) కృషి చేస్తోంది. సెక్యూరిటీ కేంద్రం కార్యకలాపాల నిపుణులు, అప్లికేషన్‌ సెక్యూరిటీ ప్రత్యేక నిపుణులు, విశ్లేషణ నిపుణుడు వంటి కొత్త ఉద్యోగాలను ప్రవేశపెట్టింది. వీటికి విద్యార్హతలు, పాఠ్యాంశాలు మొదలైన వాటిని రూపొందించింది. వీటిని బోధించడానికి అధ్యాపకులకు శిక్షణ ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని అనేక విద్యా సంస్థలు ఈ కోర్సులు ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి.

* ఈ రంగంలో అంకుర కంపెనీల వ్యవస్థ ఎలా ఉంది
దాదాపు 100 ఉత్పత్తి (ప్రొడక్ట్‌), అంకుర కంపెనీల ఈ రంగంలో ఉన్నాయి. ఏడాదిలో సైబర్‌ భద్రతా రంగంలో ఉత్పత్తి, అంకుర కంపెనీలు రెట్టింపు అయ్యాయి. ఈ సంస్థలు ప్రధానంగా 10 విభాగాల్లో సైబర్‌ భద్రతకు అవసరమైన సొల్యూషన్లు అభివృద్ధి చేస్తున్నాయి. ఈ రంగంలోని అంకుర సంస్థలకు సిరీస్‌ ఎ, బి నిధులు లభిస్తున్నాయి. అనేక వెంచర్‌ కేపిటలిస్టులు సైబర్‌ భద్రతలోని అంకుర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.

* కార్పొరేట్‌ కంపెనీల్లో సైబర్‌ భద్రత వ్యూహాలు ఎలా ఉన్నాయ్‌
కీలక మౌలిక సదుపాయాల కంపెనీలన్నీ సైబర్‌ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. సైబర్‌ దాడుల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థలు, నిపుణులపై పెట్టుబడులు పెడుతున్నాయి. ముప్పును ముందుగానే కనిపెట్టడంపై (థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌) దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. అనేక పెద్ద కంపెనీల్లో బోర్డులు తరచూ సైబర్‌ భద్రత చర్యలు, వ్యూహం, రిస్క్‌ మొదలైన వాటిపై సమీక్షలు నిర్వహిస్తున్నాయి. చాలా కంపెనీలు సైబర్‌ దాడులు జరిగితే వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలను (ఎమర్జెనీ రెస్పాన్స్‌ ప్లాన్‌) తయారు చేసుకుంటున్నాయి.

* సైబర్‌ భద్రత పెంచడానికి డీఎస్‌సీఐ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది
నాస్‌కామ్‌తో కలిసి పూర్తి స్థాయి నైపుణ్యాలు అభివృద్ధి చేయడంపై డీఎస్‌సీఐ కృష్టి చేస్తోంది. నేషనల్‌ టెక్నాలజీ రిపాజిటరీపై పని చేస్తున్నాం. ఇది విద్యా సంస్థలు, పరిశ్రమ, ప్రభుత్వం వద్ద సైబర్‌ సెక్యూరిటీ పరంగా ఉన్న ప్రత్యేక సామర్థ్యాలను ఒక గొడుగు కిందకు తీసుకువస్తుంది. ప్రస్తుతం డిజిటల్‌ చెల్లింపుల భద్రత అలయన్స్‌, డిజిటల్‌ పేమెంట్లపై అవగాహన కార్యక్రమాలను ప్రాంతీయ భాషల్లో చేపడుతున్నాం.

* డిజిటల్‌ చెల్లింపుల భద్రత అలయన్స్‌ గురించి వివరిస్తారా
దేశంలో డిజిటల్‌ చెల్లింపులు వూపందుకుంటున్నాయి. ఇందులో బ్యాంకులు, ఫైనాన్స్‌ టెక్నాలజీ కంపెనీలు, ఐటీ కంపెనీలు, ఆర్‌బీఐ, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ వంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. భాగస్వాములను ఒక వేదిక పైకి తీసుకువచ్చి డిజిటల్‌ చెల్లింపులు, సైబర్‌ సెక్యూరిటీ అంశాలను సమీక్షించి ప్రభుత్వం, నియంత్రణ సంస్థల దృష్టికి తీసుకురావడం, నియంత్రణ, విధి విధానాలను తీసుకురావడం ఈ అలయన్స్‌ ఉద్దేశం. అలయన్స్‌ తొలి సమావేశం సెప్టెంబరులో జరిగే వీలుంది. డిజిటల్‌ చెల్లింపులు చేయాలంటే.. నమ్మకం, హామీ చాలా ముఖ్యం. డేటా రక్షణకు కఠిన నిబంధనలు ఉండాలి.

* బ్యాంకింగ్‌ రంగంలో సైబర్‌ భద్రత ఎలా ఉంది
బ్యాంకింగ్‌ రంగానికి రిస్క్‌ ఎక్కువ. అందుకే బ్యాంకులకు గత ఏడాదే రిజర్వు బ్యాంకు సైబర్‌ భద్రత నియమ నిబంధనలను నిర్దేశించింది. వాటిని అన్ని బ్యాంకులు పాటించాలి. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ తీసుకురావాలని భావిస్తున్నారు. ఏదైనా సైబర్‌ దాడి జరిగితే వెంటనే స్పందించడానికి ఇది వీలు కల్పిస్తుంది. చాలా బ్యాంకులు అత్యాధునిక సైబర్‌ సెక్యూరిటీ కార్యకలాపాల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి.

Posted on 10-08-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning