రేపటి ఇంజినీర్లూ... ఇది మీ కోసమే!

ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించి, అందులో ఉన్న ఇబ్బడిముబ్బడి అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఎందరో విద్యార్థులు బీటెక్‌/బీఈలలో చేరారు. భావి ఇంజినీర్లు తమ నాలుగేళ్ళ కోర్సు ప్రయాణంలో కొన్ని ప్రణాళికలను వేసుకోవాలి. ఈ దిశలో మొదటి సంవత్సరంలో ఎలా చదవాలి, ఏయే అదనపు మెలకువలు నేర్చుకోవచ్చు? తెలుసుకుందాం!

ఇంజినీరింగ్‌ రంగం జన జీవన శైలి, జీవన స్థితిగతులపై ఎంతో ప్రభావం చూపుతుంది. శాస్త్రవేత్తల పరిశోధనలకు మెరుగులు దిద్ది తమ ప్రయోగాల ద్వారా ప్రజోపయోగకరమైన ఉత్పత్తులుగా మలచే ఇంజినీర్ల కృషి అనన్య సామాన్యం. ఇంజినీరింగ్‌ విద్య ఇతర వృత్తి విద్యలకన్నా విభిన్నమైనది. ఈ రంగంలో దేశ ఆర్థిక అభివృద్ధిని నిర్దేశించే బహుళ ప్రయోజనాల సంస్థలు, కర్మాగారాలు ఉండటం వల్ల ఒకే శాఖకు చెందిన, ఇంకా ఇతర శాఖలకు చెందిన ఇంజినీర్ల బృందం కలసి సేవలందించే అవసరం ఉంటుంది. అందుకే సమాజానికి ఎక్కువ ఇంజినీర్ల అవసరం ఉంటుంది. ఈ కారణాల వల్లనే వృత్తివిద్యలన్నిటిలోకీ ఇంజినీరింగ్‌ విద్యకు ఎక్కువ గిరాకీ!

కొత్త ఆవిష్కరణలూ, స్వయం నియంత్రిత పనిముట్ల రూపకల్పన ఇంజినీరింగ్‌లో ఒక వాడుక; వాటి తయారీ ఇంజినీర్లకు ఒక వేడుక. రోజురోజుకూ పెరుగుతున్న యంత్రీకరణ ఎన్నో ఉపయోగాలను ఇచ్చినా, ఇవి కొన్నిసార్లు కొత్తరకమైన ప్రమాదాలకు కూడా కారణమవుతుంటాయి. ఉదాహరణకు సైకిల్‌ మీద ప్రయాణంలో ప్రమాదం ఒకరు లేక ఇద్దరికే పరిమితం, సైకిల్‌ కన్నా ఎన్నోరెట్లు సౌలభ్యాన్నిచ్చే బస్సు ద్వారా ప్రమాదం కూడా కొన్ని రెట్లు ఎక్కువే. నూతన సాంకేతికతలు తెచ్చే కొత్తరకాల ప్రమాదాలను మునుముందే గుర్తించగలగడం, ప్రమాదం అనివార్యమైతే తగిన ముందస్తు జాగ్రత్తల సూచన, నివారణ, నియంత్రణ కూడా ఒక కొత్త ఉద్యోగ అవకాశమే. అందుకే ఇంజినీరింగ్‌ రంగం సృజనాత్మకత ఉన్నవారికి అంతులేని అవకాశాలను అందిస్తుంది.

మన దేశంలో ప్రతి సంవత్సరం 15 లక్షలకు పైగా ఇంజినీరింగ్‌ ముగించిన విద్యార్థు్థలు తయారవుతున్నారు. ఐతే నిపుణుల అంచనాల మేరకు దాదాపు 80 శాతం పైగా విద్యార్థులు తగిన మెలకువలూ, నైపుణ్యాలూ లేక ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. కోర్సు ముగించిన తరువాత ఎక్కువ శాతం మంది ఉద్యోగాలవైపే మొగ్గు చూపుతారు. అంటే నాలుగేళ్ళ ఇంజినీరింగ్‌ నలభై ఏళ్ళ భవితకు పునాది. కాబట్టి ఈ కోర్సు ద్వారా కేవలం ఉద్యోగానికో, కెరియర్‌కో కాకుండా జీవితానికి ప్రణాళిక చేసుకోవాలి.

ఈ మూడూ అవసరం
బీటెక్‌/ బీఈ డిగ్రీలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రధానంగా రెండు రకాల నైపుణ్యాల అవసరం ఉంటుంది. మొదటిది అభిజ్ఞా వికాస మెలకువలు (Cognitive Skills), రెండోది ప్రవర్తన మెలకువలు (Behavioural Skills). ఈ మూడూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి, అవసరమైతే వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడానికి కావాలి. విద్యార్థులు ఇంజినీరింగ్‌ చేసే సమయంలోనే సాంకేతిక పరంగానే కాకుండా వ్యక్తిత్వ పరంగా కూడా పూర్తిగా రూపాంతరం చెందడానికి అవసరమైన ఈ అన్ని మెలకువలూ నేర్చుకోవాలి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం, సరైన సమాధానాల అన్వేషణకు అవసరమైన కిటుకులు పెంపొందించుకోవాలి. ఇంతటి విశిష్టతలున్న ఇంజినీరింగ్‌లో మొదటి సంవత్సరం నుంచే ఉద్యోగ సంసిద్ధ్దత కోసం అడుగులు వెయ్యడం నేర్చుకోవాలి. తమ బాధ్యతను గుర్తెరిగి ఈ వృత్తిలో రాణించేవిధంగా అమరుకోవాలి. అంతర్జాలం ద్వారా లభించే వివిధ రకాలైన అపార విద్యా వనరులను సద్వినియోగం చేసుకోగల సామర్థ్యాలను పెంచుకోవాలి.

ఆరంభం నుంచీ ఒత్తిడి
దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో మొదటి సంవత్సరం నుంచే సెమిస్టర్‌ పద్ధతి అమలులోకి వచ్చింది. అంటే విద్యార్థికి మొదటినుంచే ఒత్తిడి ఉంటుందని అర్థం చేసుకోవాలి. పైగా క్రెడిట్ల ఆధారంగా డిటెన్షన్‌ పద్ధతి కూడా అమలులోకి వచ్చింది. విద్యార్థులు ఈ విధానాన్ని గురించి పూర్తి ఆకళింపు చేసుకోవాలి. అలసత్వం ప్రదర్శిస్తే భారీ మూల్యమే చెల్లించుకోవలసి వస్తుంది. ‘ఇంటర్మీడియట్‌ వరకు ఒత్తిడితో చదివాం కదా, ఈ కోర్సులో కాస్త వూపిరి పీల్చుకుందాం’ అనుకుంటే మాత్రం వూపిరి ఆడని పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి మొదటినుంచే జాగ్రత్త వహించడం చాలా అవసరం. కొత్త వాతావరణానికి ఎంత త్వరగా అలవాటు పడితే అంత మంచిది. మన ఆలోచనలకు అనుగుణంగా ఉన్న స్నేహితులతో, సీనియర్లతో పరిచయాలు చాలా మేలుచేస్తాయి. ఇందువల్ల లక్ష్య సాధనకు మార్గం సులువౌతుంది. వీలైనంతవరకు తరగతులకు గైర్హాజరు కాకుండా ఉండాలి. తప్పనిసరి పరిస్థితులలో తరగతులకు వెళ్లలేకపోతే స్నేహితులను అడిగి నోట్సు తయారు చేసుకోవాలి. ఇక్కడ స్నేహితులు, సీనియర్లు లేదాఅధ్యాపకులు చాలా సహాయపడతారు. అంతేకాకుండా హాజరును నిర్లక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్త వహించాలి.

ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌, డ్రాయింగ్‌, భౌతికశాస్త్రం కొంచెం కష్టమనిపిస్తాయి. వాటిపై జాగ్రత్త వహించాలి. బట్టీ పట్టి పరీక్షలను ఎదుర్కోవాలనుకోవడం అసలు మంచిది కాదు. సబ్జెక్టులను అర్థం చేసుకుని నోట్సు రాసుకుని చదువుకోవాలి. తరగతిలోనే అనుమానాల నివృత్తి చేసుకోవాలి. గైడ్ల జోలికి వెళ్లకూడదు. పరీక్షల్లో మార్కులు గమ్యం కాదు. వాటి సాధన ఒక లక్ష్యం మాత్రమే.

ఇదీ సరైన మార్గం
ఈ క్రింద సూచించినవిధంగా ఆచరిస్తే నాలుగేళ్ల బి.టెక్‌ కాలం నల్లేరుమీదబండి నడకగా అవుతుంది. భవిష్యత్తు పట్ల కూడా ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కోర్సు పూర్తిచేశాక ‘ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనగలను’ అన్న ఆత్మస్థైర్యంతో ఉద్యోగంలోకి అడుగుపెట్టవచ్చు. నాలుగు సంవత్సరాల విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం విద్యార్థుల లక్ష్యం కావాలి.
* ఇంజినీరింగ్‌ స్థాయిలో విద్యాబోధన పద్ధతులు ఇంటర్మీడియట్‌ స్థాయి కన్నా భిన్నంగా ఉంటాయి. విద్యార్థులు ఈ పద్ధతికి అతి త్వరగా మానసికంగా సంసిద్ధు్దలు కావడం ఎంతో అవసరం. ఇంటర్మీడియట్‌ వరకు ‘చంచా దాణా’ (స్పూన్‌ ఫీడింగ్‌) పద్ధతిలో, అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణలో చదువుకోవడం జరుగుతుంది. అధ్యాపకుల సహాయ సహకారాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ఐతే సాంకేతిక కోర్సులో అలా కాదు. అధ్యాపకులు తక్కువ సమయంలో ఎక్కువ లోతుగా చెప్పవలసి ఉంటుంది. అందువల్ల సమయాభావం దీనిలో పెద్ద సమస్య. విద్యార్థులు అధ్యాపకుల బోధనలకు సొంతంగా మెరుగులు దిద్దుకోవలసి ఉంటుంది. మొదటి సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ స్థాయి కన్నా ఎక్కువ లోతుగా చదువుకోవాలని అర్థం చేసుకోవాలి.
* అంతర్గత మార్కులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ప్రతి సబ్జెక్టులోను గరిష్ఠంగా 25 మార్కులకు ఈ పరీక్షలుంటాయి. వీటి మూల్యాంకనం పాఠాలు బోధించే అధ్యాపకులే చేస్తారు. బీటెక్‌ పరీక్షల్లో ప్రతిభ కాలేజీ, విశ్వవిద్యాలయాల సమష్టి బాధ్యత. విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్షలు మనం ఉత్తీర్ణులమో కాదో నిర్ణయిస్తే, అంతర్గత మార్కులు మన శ్రేణిని నిర్ణయిస్తాయి. ప్రతి సబ్జెక్టులోనూ రెండు సార్లు అంతర్గత పరీక్షలు నిర్వహించి వాటి సగటును గణించి, వచ్చిన మార్కులు విద్యార్థికి కేటాయిస్తారు. సెమిస్టర్‌ పద్ధతిలో పరీక్షల సమయం చాలా త్వరగా దగ్గర పడినట్టు అనిపిస్తుంది. అందువల్ల పరిస్థితులకు తమను తాము రూపాంతరీకరించుకునే మానసిక స్థితిని మార్చుకోవాలి.
* ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌, డ్రాయింగ్‌, భౌతికశాస్త్రం కొంచెం కష్టమనిపిస్తాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. బట్టీ పట్టి పరీక్షలను ఎదుర్కోవాలనుకోవడం కొరివితో తల గోక్కోవడం లాంటిది. ఈ పద్ధతి అసలు మంచిది కాదు. సబ్జెక్టులను అర్థం చేసుకుని నోట్సు రాసుకుని చదువుకోవాలి. తరగతిలోనే అనుమానాల నివృత్తి చేసుకోవాలి. స్వయం బాధ్యత తప్పనిసరి. మన చర్యలకు మనమే బాధ్యత వహించాలి. గైడ్ల జోలికి వెళ్లకూడదు. పరీక్షల్లో మార్కులు గమ్యం కాదు. అది ఒక లక్ష్యం మాత్రమే. సబ్జెక్టు పరిజ్ఞానం వృత్తిలో వినియోగించవలసివుంటుంది. గైడ్లు పరీక్షలు పాస్‌ అవ్వడానికీ, బహుశా కొన్ని అదనపు మార్కులకూ ఉపయోగపడతాయేమో కానీ, సబ్జెక్టుపై పట్టును మాత్రం ఇవ్వలేవు.
* డిటెన్షన్‌, క్రెడిట్ల గురించి అవగాహన పెంచుకోవాలి. విఫలమవ్వడానికి చదవకూడదు. ప్రతి అంశం మీద హేతుబద్ధమైన, స్థిరమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. ఒకే అంశాన్ని వివిధ కోణాల్లో నుంచి విశ్లేషించి సారాంశాన్ని గ్రహించాలి. అలాగే ఆ అంశాన్ని ఇతరులు ఎలా విశ్లేషిస్తున్నారో తెలుసుకోవాలి.
* తమకు అవసరమయ్యే లఘుకాల శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలి. నైపుణ్యాలు పెంచుకోవాలి.
* ఇంగ్లిషు భాషలో మంచి పునాదులు వేసుకోవాలి. మౌఖిక, లిఖిత భావ ప్రకటన మెలకువలు చాలా అవసరం.
కళాశాల నిర్వహించే సాంస్కృతిక, ఇతరత్రా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి. వీటివల్ల బృంద నిర్వణ సామర్థ్యం పెరుగుతుంది. ఈ ప్రశంసా పత్రాలు విదేశాలలో పైచదువులకు బాగా ఉపయోగడతాయి. ప్రయోగశాలలో ప్రయోగాలను వీలైనంతవరకు సొంతంగా చెయ్యడానికి ప్రయత్నించాలి. అనువర్తన జ్ఞానం ఇంజనీర్లకు పునాది.

ఈ అంశాలపై కూడా శ్రద్ధ వహిస్తే మంచిది.
1. ఎప్పటి పని అప్పటికి ముగించాలి.
2. పాఠ్యాంశాలకు సంబంధించిన నిర్దేశిత పుస్తకాలు, ఇతర పాఠ్య వనరులను సమకూర్చుకోవాలి.
3. తరగతిలో విన్న పాఠాలను అదేరోజు పునశ్చరణ చేసుకోవాలి. దీనివల్ల సబ్జెక్టులోని మౌలికాలపై మంచి పట్టు లభిస్తుంది.
4. గత సంవత్సరం ప్రశ్నపత్రాలకు సమాధానం తయారుచేసుకోవాలి.
5. ప్రతిరోజూ రెండు గంటల సమయాన్ని కేటాయించి చదువుకోవాలి. సెలవు రోజులలో ప్రాంగణ నియామకాలలో అడిగే ప్రశ్నలను అభ్యాసం చెయ్యాలి.
6. ఆంగ్ల వార్తా పత్రికలు చదివే అలవాటు ముఖ్యం. సమకాలీన సమస్యలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

Posted on 14-08-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning