ఈ అయిదూ నేర్చుకుందాం!

నిరంతరం కొత్త పరిణామాలతో విలసిల్లే సాంకేతిక ప్రపంచం.. నేర్చుకునేవారికి గొప్ప వేదిక. కుతూహలం, ఆసక్తి ఇలాంటివారి లక్షణాలు. ప్రతీ సెమిస్టర్‌ పూర్తయ్యాక దొరికే సమయాన్ని విద్యార్థులు తన రెజ్యూమేకు అదనపు హంగులద్దే నైపుణ్యాల అభ్యాసానికి ఉపయోగించుకోవచ్చు.

ఈ రోజుల్లో గిరాకీ ఉన్న సాంకేతిక నైపుణ్యాలను అంతర్జాల సహాయంతో నేర్చు కోవచ్చు- ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే! నేర్చుకోవడానికి ‘సరైన సమయ’మంటూ ఉంటుందా? ఏమీ ఉండదు. ఆసక్తి ఉండాలే కానీ, ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఏదైనా అంకుర సంస్థను స్థాపించినవారినో, వ్యాపారవేత్తనో ఇదే ప్రశ్నను అడిగితే.. ‘నేనింకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఈ ప్రక్రియ ఎప్పటికీ ముగియదు’ అనే సమాధానం వినిపిస్తుంది. విద్యార్థులు అయితే తమకు మిగిలే ఖాళీ సమయాన్ని వినోదానికి మాత్రమే పరిమితం చేయకూడదు. కొత్త నైపుణ్యాల అవగాహనకూ, వాటిని నేర్చుకోవడానికీ వినియోగించాలి. వాటిలో ప్రముఖమైనవాటిని ఒకసారి చూద్దాం!

1 ఆండ్రాయిడ్‌
వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమలో ఆండ్రాయిడ్‌ ఆప్‌ డెవలప్‌మెంట్‌కు ఆదరణ ఎక్కువ. భారత్‌లో అంకుర పరిశ్రమల సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రతీ వ్యాపారానికి తమకంటూ ఆప్‌ ఉండటం తప్పనిసరి అయింది. బిలియన్‌కుపైగా ఉన్న ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు గూగుల్‌ ప్లే స్టోర్‌లో 1.8 మిలియన్‌ ఆప్‌లు ఉన్నాయంటేనే ఆండ్రాయిడ్‌ మన జీవితాల్లో ఎంతగా చొచ్చుకునిపోయిందో అర్థమవుతుంది. వాణిజ్య వ్యాపారాలన్నీ ఆండ్రాయిడ్‌ మార్కెటింగ్‌ మీద ఆధారపడుతున్నాయి కాబట్టి, ఆండ్రాయిడ్‌ డెవలప్‌మెంట్‌ను నేర్చుకున్నవారికి ఎంతో గిరాకీ ఉంటుంది.

2 ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ)
సాంకేతిక రంగంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. వాటికి ఐఓటీ ఓ చుక్కాని లాంటిది. దీంతో కార్పొరేట్‌ ప్రపంచం తమ వ్యాపారాలను సుదూర ప్రాంతాలకు విస్తరిస్తోంది. అంతులేని అప్లికేషన్ల సంభావ్యతే విద్యార్థులు ఐఓటీ నిపుణులుగా మారడానికి ప్రధాన కారణం అవుతోంది. ఎఫ్‌బీ స్టేటస్‌లు, ట్వీట్‌లకు స్పందించడం, హృదయ స్పందనలను పర్యవేక్షించడం, జిమ్‌లలో ఎన్‌ఎఫ్‌సీ పేమెంట్‌ చేయడం, నియంత్రణ చేయగల కార్లను ఉపయోగించడం మొదలైనవి చేసే పరికరాలను వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా తయారుచేయవచ్చు. ఐఓటీని ఇంటర్నెట్‌ భవిష్యత్తుగా అభివర్ణిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప సంస్థలు దీనిలో బిలియన్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నాయి. భారత్‌లోనూ ప్రభుత్వం స్మార్ట్‌ సిటీ (ఆకర్షక నగరాలు)లను అభివృద్ధిపరచడానికి నిర్ణయం తీసుకున్న క్రమంలో ఐఓటీ పరిజ్ఞానం విద్యార్థులకు మరింత మేలు చేకూరుస్తుంది.

3 సి/ సి++
ఇప్పటికీ సి++ తన ప్రాముఖ్యాన్ని కోల్పోలేదు. ఇది ఇప్పటికీ ప్రోగ్రామర్‌ అమ్ములపొదిలో విశ్వసనీయ బాణమే. ప్రోగ్రామర్స్‌ అందరూ ఒకవేళ ప్రత్యేకమైన దేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తే నిస్సందేహంగా సి/ సి++ వారి జాతీయ భాషవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి గుర్తింపు ఉంది. దీన్ని అనేక అప్లికేషన్లలో ఉపయోగిస్తున్నారు. ఫైనాన్స్‌ రంగంలో (బ్యాంకింగ్‌, ట్రేడింగ్‌), జీయూఐ ఆధారిత అప్లికేషన్లు, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌, గేమ్స్‌ల్లోనూ దీని ఉపయోగం ఉంది. ఈ నైపుణ్యాలను విద్యార్థులు తమ ఇంటినుంచే ఆర్జించుకోవచ్చు. యూట్యూబ్‌లో ట్యుటోరియళ్లు, ఈ-రిసోర్సులు వారికి ఇప్పుడు చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఆన్‌లైన్‌ శిక్షణ వేదికలైన internshala, udemy, coursera లాంటి వాటి నుంచీ శిక్షణ పొందవచ్చు. కోడింగ్‌ చాలెంజ్‌, హ్యాకథాన్‌ వంటి ఆన్‌లైన్‌ పోటీల్లో పాల్గొనడం ద్వారా ప్రయోగాత్మక పరిజ్ఞానాన్నీ పొందవచ్చు. ఎప్పుడూ పరిణామం చెందే సాంకేతిక ప్రపంచం గురించి తెలుసుకోవడానికి తరగతి గదికే పరిమితం కాకూడదు. సాంకేతిక రంగాన్ని అవగాహన చేసుకోవాలంటే ప్రయోగాత్మక జ్ఞానం తప్పనిసరి. పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా సొంతంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా కొత్త యాప్‌, వెబ్‌సైట్‌, గేమ్‌ల్లో ఏదో ఒకదానిని సృష్టించే ప్రయత్నం చేయండి.

4 వెబ్‌ డెవలప్‌మెంట్‌
గూగుల్‌ ఇండియా ప్రకారం 2017 చివరినాటికి దేశ ఆన్‌లైన్‌ షాపింగ్‌ వినియోగదారుల సంఖ్య 100 మిలియన్ల మైలురాయికి చేరుకుంటుందని అంచనా. ఈ-కామర్స్‌లో ఇంత విలక్షణమైన పెరుగుదల కనిపిస్తుండటంతో, సంస్థలు వెబ్‌ డెవలపర్స్‌ కోసం నిరంతరం చూస్తున్నాయి. కాబట్టి, విద్యార్థులు తమ ఆసక్తి, ఎంచుకున్న ప్రాజెక్టుల మేరకు ఫ్రంట్‌ ఎండ్‌/ బ్యాక్‌ ఎండ్‌ లేదా ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌ల్లో నైపుణ్యం సాధించవచ్చు. కొన్నిరకాల వ్యాపారాలకు హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, పీహెచ్‌పీ పరిజ్ఞానం కూడా కీలకమే. అంతేకాకుండా, ఫ్రీలాన్సింగ్‌పై ఆసక్తి ఉంటే, చాలా సంస్థలు ఫ్రీలాన్సర్లపై ఆసక్తి చూపుతున్నాయి కాబట్టి, వెబ్‌ డెవలప్‌మెంట్‌ వారికి చక్కని ఎంపిక.

5 పైథాన్‌
యూట్యూబులో ట్యుటోరియళ్లు, ఈ-రిసోర్సులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌ శిక్షణ వేదికలనుంచీ శిక్షణ పొందవచ్చు. కోడింగ్‌ చాలెంజ్‌, హ్యాకథాన్‌ వంటి ఆన్‌లైన్‌ పోటీల్లో పాల్గొనడం ప్రయోజనకరం. ‘ఐఓటీ, అనలిటిక్స్‌, హై ఎండ్‌ గేమ్స్‌ల్లో ఉమ్మడిగా కనిపించేదేంటి?’ అని అడిగితే- దానికి సమాధానం పైథాన్‌. దీన్ని నేర్చుకోవడం అంటే మాయాలోకపు బడిలో ప్రవేశం సంపాదించినట్టే. విద్యార్థి సూపర్‌ మారియో, హెల్పర్‌ రోబోట్స్‌, రిమోట్‌ కంట్రోల్‌ కార్లతో కూడిన తన సొంత వింత లోకాన్ని నిర్మించుకోవచ్చు. రాస్‌బెర్రీ పై లాంటి స్వతంత్ర పరికరాన్ని ఉపయోగించి నిరాసక్తికరమైన ప్రోగ్రామింగ్‌ ఉత్తేజభరితమైన, సరదా ప్రక్రియగా ఎలా రూపొందుతుందో గ్రహించవచ్చు. అంతేకాకుండా ఆర్థికపరమైన ప్రోత్సాహకాలనూ పొందవచ్చు. గూగుల్‌, యాహూ, ఐబీఎం లాంటి ఎన్నో పెద్ద సంస్థలు పైథాన్‌ను ఉపయోగిస్తున్నాయి.

Posted on 14-08-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning