ప్రాంగణ నియామకాల మందగమనం

* వేచిచూసే ధోరణిలో కొన్ని ఐటీ కంపెనీలు
* తగ్గనున్న అభ్యర్థుల ఎంపికలు
* ఆరేడేళ్లుగా పెరగని వేతన ప్యాకేజీ
* ఆధునిక సాంకేతిక రంగాల్లో కొంత వృద్ధి

ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈసారి ప్రాంగణ నియామకాలు మందకొడిగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఎంపిక చేసుకునే కంపెనీలు ఇంకా రంగంలోకి దిగలేదు. మరికొన్ని వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నాయి. ఆటోమేషన్ ప్రభావం.. ప్రాజెక్టులు దక్కే పరిస్థితిపై ఇప్పటికీ అంచనాకు రాకపోవడంతో ప్రాంగణ నియామకాల సంఖ్య నిరుటిలాగే ఈ ఏడాదీ తగ్గనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని కంపెనీలు మాత్రం ఎంపికయ్యే ఉద్యోగుల సంఖ్య తగ్గదని పైకి చెబుతున్నా వాస్తవం అందుకు భిన్నంగా ఉంది.
ఏటా ఆగస్టు వచ్చిందంటే ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రాంగణ నియామకాల సందడి జోరుగా ఉండేది. ఈసారి అది నెమ్మదించింది. ప్రతిభావంతులైన వారిని ఎంపిక చేసుకునేందుకు పరిశ్రమలు పోటీపడుతుంటాయి. ఈసారి ఆ పోటీ పెద్దగా కనిపించడం లేదు. కొన్ని ఉత్పాదక సంస్థలు చేపడుతున్నా ఎంపిక చేసుకునే వారి సంఖ్య తగ్గినట్లు కళాశాలల ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులను తీసుకొనే కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితర పరిశ్రమలు సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి నియామకాలు ప్రారంభిస్తామని సమాచారం ఇచ్చినట్లు వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జేఎన్‌టీయూహెచ్, ఓయూ, మరికొన్ని అగ్రశ్రేణి ప్రైవేటు కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి. ఈసారి వాటి సంఖ్య తగ్గుతుందని ఇప్పటికే నాస్కామ్ అంచనా వేసింది. ప్రాంగణ నియామకాల సంఖ్య తగ్గితే ద్వితీయ శ్రేణి కళాశాలల్లో ఎంపికలపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది 150 మందిని ఎంపిక చేసుకున్న ఓ ప్రముఖ పరిశ్రమ ఈసారి ఇప్పటివరకు కేవలం 20 మందినే ఎంపిక చేసుకోనుంది. అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలిచ్చే కంపెనీలు కొన్ని ఈసారి ఎంపిక చేసుకొనే వారి సంఖ్య తగ్గవచ్చని సమాచారం ఇచ్చాయని ఎంవీఎస్ఆర్ కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి ప్రసన్నకుమార్ తెలిపారు. అమెరికా లాంటి దేశాల నుంచి ప్రాజెక్టుల రాకపై స్పష్టత లేదు. దానివల్ల ఎంత మంది ఉద్యోగులను నియమించుకోవాలనే దానిపై యాజమాన్యాల్లో అయోమయం నెలకొంది. దీంతో కంపెనీలు వేచిచూసే ధోరణిని అనుసరిస్తున్నాయి. 'ప్రస్తుతం పరిస్థితి' మందకొడిగానే ఉంది. నవంబరు, డిసెంబరు నాటికి ఊపందుకోవచ్చు. మూడేళ్ల క్రితం ఆగస్టులోనే ముమ్మరంగా ఎంపికలు ఉండేవి అని బీవీఆర్ఐటీ కళాశాల ప్రాంగణ నియామకాల విభాగం సంచాలకుడు సతీష్ చంద్ర తెలిపారు. ఆరేడు సంవత్సరాలుగా వేతన ప్యాకేజీలు పెరగడం లేదు. అత్యధిక సంఖ్యలో ఎంపిక చేసుకునే కంపెనీలు ఒక్కో అభ్యర్థికి వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి 3.50 లక్షల వరకు ఇస్తున్నాయి. ఆ వేతనం 2010 నుంచీ అదే స్థాయిలో ఉందని చెబుతున్నారు. రూ.10 వేలు, రూ.20 వేలు తప్ప పెరిగిందేమీ లేదని ప్రాంగణ నియామకాల అధికారులు పేర్కొంటున్నారు. తక్కువ సంఖ్యలో ఉద్యోగులను ఎంపిక చేసుకునే ఓ ప్రముఖ ఉత్పాదక సంస్థ ఇచ్చే వేతనం రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్యే కొనసాగుతోంది. డిజిటల్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, సోషల్ మీడియా తదితర ఆధునిక సాంకేతిక రంగాల్లో పనిచేసే కంపెనీలు మాత్రం ఈసారి 5-10 శాతం వేతనాలను పెంచుతున్నాయని నారాయణమ్మ కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి నరేంద్రబాబు తెలిపారు.

Posted on 19-08-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning