9 బ్యాంకులు: 3562 పీఓ పోస్టులు
ఉద్యోగ వ్యూహం

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ అధికారుల పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 9 బ్యాంకుల్లో మొత్తం 3562 పోస్టులను ప్రకటించారు. డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రకటనలో గమనించాల్సిన ప్రధాన విషయం- మెయిన్స్‌ పరీక్షలో సమూల మార్పు. గత సంవత్సరం నిర్వహించిన మెయిన్స్‌కు పూర్తి భిన్నంగా ఈ ఏడాది నిర్వహించబోయే పరీక్ష ఉంది. ఎస్‌బీఐ పీఓ మెయిన్స్‌ పరీక్ష తరహాలోనే ఈ పరీక్షనూ నిర్వహిస్తారు. ఈ పోస్టులకు ఎంపికవ్వటానికి ఏ తీరులో కృషి చేయాలో తెలుసుకుందాం!

రెండంచెల రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా పీఓ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మొదటి అంచెలో నిర్వహించే ప్రిలిమినరీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు రెండో అంచెలోని మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన నిర్ణీత అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెయిన్స్‌ పరీక్ష, ఇంటర్వ్యూల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

పరీక్షా విధానం
ప్రిలిమినరీలో మూడు విభాగాలుంటాయి. 100 ప్రశ్నలతో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కేటాయించిన మొత్తం సమయం 60 నిమిషాలు. మెయిన్స్‌లో మొత్తం అయిదు సబ్జెక్టులతో నాలుగు విభాగాలుంటాయి. విభాగాల వారీగా సమయాన్ని కేటాయించారు. మొత్తం 3 గంటలు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో డిస్క్రిప్టివ్‌ పేపర్‌కు అదనంగా 30 నిమిషాల వ్యవధి. అంటే మెయిన్స్‌ మొత్తానికి కేటాయించిన సమయం 3.30 గంటలు. అభ్యర్థులు ఈ విభాగాలన్నింటిలో విడివిడిగా ఉత్తీర్ణులవ్వాలి. ప్రతి తప్పు సమాధానానికీ ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగోవంతు కోత (రుణాత్మక మార్కు) విధిస్తారు.

ఉమ్మడి సబ్జెక్టులు
ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలు రెండింటిలోనూ కొన్ని సబ్జెక్టులు ఉమ్మడిగా ఉన్నాయి. ప్రిలిమినరీలో ఉన్న రీజనింగ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజీలు మెయిన్స్‌లో ఉన్నాయి. మెయిన్స్‌లో ఉన్న డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ చేయడానికి అరిథ్‌మెటిక్‌ అంశాలు, సింప్లిఫికేషన్స్‌ అవసరమవుతాయి. అవి ప్రిలిమినరీ పరీక్షలో ఉన్న క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో ఉంటాయి. అందువల్ల వాటిని కూడా ఉమ్మడి సబ్జెక్టుగానే పరిగణించాలి. కాబట్టి ప్రిలిమినరీలో ఉన్న సబ్జెక్టులన్నీ మెయిన్స్‌లోనూ ఉన్నట్లే. మెయిన్స్‌ పరీక్షలో ఆయా విభాగాలను నిర్ణీత వ్యవధిలోనే పూర్తిచేయాల్సి ఉంటుంది. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, రీజనింగ్‌లకు ఎక్కువ సమయం అవసరమవుతుంది. ఎవరు ఎక్కువ ప్రశ్నలు సాధించగలుగుతారో వారికే విజయావకాశాలు ఎక్కువ.

సబ్జెక్టులు- ప్రశ్నల సరళి
డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌/ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ప్రిలిమినరీలోని క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లోని ప్రశ్నలు, సింప్లిఫికేషన్స్‌, నంబర్‌ సిరీస్‌, డేటా సఫిషియన్సీ, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, వివిధ అరిథ్‌మెటిక్‌ అంశాల నుంచి వస్తాయి. మెయిన్స్‌లోని డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లోని ప్రశ్నలు, పట్టికలు, లైన్‌గ్రాఫ్‌లు, బార్‌ డయాగ్రమ్‌లు, పైచార్టులు, కేస్‌లెట్స్‌ నుంచి ఎక్కువగా ఉంటాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ ప్రశ్నలను సాధించడానికి పర్సంటేజీ, యావరేజ్‌, రేషియో- ప్రపోర్షన్‌, కాల్‌క్యులేషన్స్‌పై పట్టు ఉండాలి. అంతర సంబంధం ఉన్న రెండు లేదా అంతకన్నా ఎక్కువ గ్రాఫ్‌లను ఇచ్చినపుడు సమాచారాన్ని పట్టిక రూపంలోకి మార్చుకుంటే ప్రశ్నలను త్వరగా సాధించవచ్చు.
రీజనింగ్‌: మెయిన్స్‌ పరీక్షలోని ప్రశ్నలు హెచ్చు స్థాయిలో ఉంటాయి. అనలిటికల్‌ రీజనింగ్‌/ క్రిటికల్‌ రీజనింగ్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌లో ప్రశ్నల సంక్షిష్టతతోపాటు ప్రశ్నల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు రెండింటిలో ఈ అంశం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కోడింగ్‌-డీకోడింగ్‌, డైరెక్షన్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, వెన్‌ డయాగ్రమ్‌, సిలాజిజమ్‌, ఇన్‌పుట్‌- అవుట్‌పుట్‌, ఎలిజిబిలిటీ టెస్ట్‌, పజిల్‌ టెస్ట్‌, స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నలు ఉంటాయి.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: చాలా ముఖ్యమైన, ఎక్కువమంది విఫలమవుతున్న విభాగమిది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండింటితోపాటు మెయిన్స్‌ పరీక్షలో అదనంగా డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లోనూ ఈ సబ్జెక్టు ఉంది. గ్రామర్‌ బాగా చూసుకోవాలి. డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లోని ఎస్సే, లెటర్‌ రైటింగ్‌లను బాగా సాధన చేయాలి.
జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌: మెయిన్స్‌లో మాత్రమే ఉన్న ఈ విభాగంలో దాదాపు 80% ప్రశ్నలు పరీక్ష సమయానికి 5, 6 నెలల ముందు వరకు ఉన్న కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ఉంటాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సంబంధ విషయాలపైనే ప్రశ్నలు ఎక్కువ. భారత ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌, ఆర్థిక సంస్థలు, కేంద్రప్రభుత్వ పథకాలు, ఆర్‌బీఐ, స్టాక్‌ మార్కెట్‌, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ విషయాలు మొదలైనవాటి నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి. విషయాలన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి, కేవలం ప్రశ్నకు జవాబు అన్న రీతిలో కాకుండా పరిణామాలను విశ్లేషించేలా సన్నద్ధత ఉండాలి.
కంప్యూటర్‌ నాలెడ్జ్‌: ఇది మెయిన్స్‌లో రీజనింగ్‌తో కలిపి ఉన్న సబ్జెక్టు. జనరేషన్స్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌, హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, ఇంటర్నెట్‌, వైరస్‌-యాంటీ వైరస్‌, నెట్‌వర్కింగ్‌, డీబీఎంఎస్‌, ఈ రంగంలోని తాజా పరిణామాలు మొదలైనవి బాగా చూసుకోవాలి.

సందేహాలు- జవాబులు
* గత సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో పోస్టులున్నాయి. ఇదే సంఖ్యలో అంతిమంగా భర్తీ చేస్తారా?
జ: ఐబీపీఎస్‌ ద్వారా 20 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పోస్టులను భర్తీ చేస్తారు. పీఓ ప్రకటన విడుదలయ్యే సమయానికి కేవలం తొమ్మిది బ్యాంకులనుంచే ఖాళీల వివరాలు వెలువడ్డాయి. మిగిలిన 11 బ్యాంకుల్లో కూడా ఖాళీలు ఉండబోతున్నాయి కాబట్టి తుది ఫలితాలు వెలువడే సమయానికి ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. గతంలో జరిగిన నియామక ప్రక్రియల ద్వారా ఏటా దాదాపుగా 25000 వరకు ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీ జరుగుతున్నందువల్ల దాదాపు అదే సంఖ్యలో ఈ ఏడాది కూడా భర్తీ జరిగే అవకాశం ఉంది.
* ఐబీపీఎస్‌ పీఓ పరీక్షను ఎస్‌బీఐ పీఓ మాదిరిగానే నిర్వహిస్తున్నారు కాబట్టి, పరీక్ష సంక్లిష్టత కూడా హెచ్చుస్థాయిలో ఉంటుందా?
జ: తప్పకుండా. పీఓ పరీక్షకు ప్రతి సంవత్సరం పోటీ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా పరీక్ష సంక్లిష్టత కూడా ఎక్కువగా, ఎస్‌బీఐ పీఓ పరీక్ష స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది.
* ఎస్‌బీఐ పీఓ పరీక్షలో ప్రతిసారి నూతన తరహా ప్రశ్నలు వస్తుంటాయి. ఐబీపీఎస్‌ పీఓ పరీక్షలో కూడా అదే తరహాలో ప్రశ్నలుంటాయా?
జ: సాధారణంగా ఎస్‌బీఐ పీఓ పరీక్షలో మాత్రమే కొత్త తరహా ప్రశ్నలు ఉంటుంటాయి. అదే మాదిరి ప్రశ్నలు ఐబీపీఎస్‌లో ఆ తర్వాత వస్తుంటాయి. కాబట్టి ఈ పరీక్షలో నూతన తరహా ప్రశ్నలు ఉండకపోవచ్చు.
* ప్రిలిమినరీకి 45 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. మొదటిసారి పరీక్ష రాస్తున్నవారికి ఈ సమయం సరిపోతుందా?
జ: ప్రిలిమినరీలో కేవలం మూడు సబ్జెక్టులే ఉన్నాయి. కాబట్టి ఆ సమయానికి ఆ మూడింటినీ తేలికగానే పూర్తి చేయవచ్చు. ఆ తర్వాత సమయంలో మెయిన్స్‌ పరీక్షలో ఉన్న ఇతర సబ్జెక్టులు సన్నద్ధమవ్వొచ్చు.
* రోజుకు ఎన్ని గంటలు కేటాయించాలి?
జ: ఎన్ని గంటలు కేటాయించారనేది కాకుండా ఎంత బాగా సన్నద్ధమయ్యారనేది ముఖ్యం. రోజుకు కనీసం 8-10 గంటల సమయం కేటాయిస్తూ ఆ సమయంలో అన్ని సబ్జెక్టులు పూర్తయ్యేలా చూసుకోవాలి. అభ్యర్థులకు వీలైతే ఇంకా ఎక్కువ సమయం కూడా కేటాయించుకోవచ్చు.
* దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేసినవారికి పరీక్ష రాసే అవకాశం ఉందా?
జ: రెగ్యులర్‌/ దూరవిద్య డిగ్రీ పూర్తిచేసిన ఎవరికైనా ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది.

సరైన ప్రణాళిక, సాధన
అభ్యర్థులు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు రెండింటికీ కలిపి సన్నద్ధత ప్రారంభించాలి. మెయిన్స్‌కు సన్నద్ధమైతే ప్రిలిమ్స్‌ కూడా పూర్తవుతుంది. ప్రిలిమ్స్‌ జరిగే సమయానికే ఈ సన్నద్ధత పూర్తయ్యేలా చూసుకోవాలి. తదనుగుణంగా ప్రణాళిక వేసుకోవాలి. మొదటిసారి పరీక్ష రాస్తున్నవారు ముందుగా సబ్జెక్టులన్నింటిలోని అంశాల ప్రాథమిక భావనలు బాగా తెలుసుకోవాలి. వాటిపై వివిధ రకాల ప్రశ్నలను సాధన చేయాలి. తర్వాత పరీక్షలో ఉన్న ప్రకారం సమయాన్ని నిర్దేశించుకుని వివిధ మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. మెయిన్స్‌తో పోలిస్తే ప్రిలిమినరీకి చాలా తక్కువ సమయం ఉంటుంది. 60 నిమిషాల్లో 100 ప్రశ్నలు పూర్తిచేయాలి. అంటే సగటున ఒక ప్రశ్నను సాధించడానికి 36 సెకన్ల వ్యవధి మాత్రమే ఉంటుంది. అన్ని విభాగాల్లో విడివిడిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి విభాగంలో కనీస సంఖ్యలో ప్రశ్నలను సాధించాలి. అందువల్ల మొత్తం సమయాన్ని విభాగాలవారీగా విభజించుకుని ఆ సమయానికే కట్టుబడి ఉండాలి. దీని ప్రకారం ఇంగ్లిష్‌కు 15 నిమిషాలు, రీజనింగ్‌కు 20, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు 25 నిమిషాల చొప్పున సమయాన్ని నిర్దేశించుకుంటే ఉపయోగకరం.

కలల ఉద్యోగానికి మెలకువలు
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో ఎక్కువ మార్కులు సాధించాలంటే స్పీడ్‌ కాల్‌క్యులేషన్స్‌ ఉండాలి. పూర్వ ప్రశ్నపత్రాలను సాధన చేయటం మేలు చేస్తుంది.
* రీజనింగ్‌లో కోడింగ్‌-డీ కోడింగ్‌, పజిల్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌, సిలాజిజమ్‌, ఇన్‌పుట్‌- అవుట్‌పుట్‌, స్టేట్‌మెంట్‌- అసంప్షన్స్‌/ కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్‌ అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి.
* జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం సమకాలీన పరిణామాలపై అవగాహన ఉండాలి. ఎకానమీ విభాగానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌, వృద్ధిరేటు (జీడీపీ), ఎకానమీ సర్వే, స్టాక్‌ మార్కెట్‌ సూచికలు, సెబీ, ఆర్థిక రంగానికి సంబంధించిన సూచికలు ముఖ్యం. బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌లో బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించిన ముఖ్య నివేదికలు, నియామకాలు, కొత్త బ్యాంకులు, డిజిటల్‌ బ్యాంకింగ్‌ అంశాలను అధ్యయనం చేయాలి.
* ఇంగ్లిష్‌ విభాగం చాలా ముఖ్యమైనది. గ్రామర్‌పై పట్టు పెంచుకోవాలి. ఆంగ్ల దినపత్రికను ప్రతిరోజూ చదవటం చాలా ప్రయోజనకరం. సాధ్యమైనన్ని ప్రాక్టీస్‌ పేపర్లు సాధన చేయాలి. తమ కలల బ్యాంకు ఉద్యోగం సంపాదించటానికి అభ్యర్థులు వర్తమాన అంశాలపై అవగాహన పెంచుకోవటం చాలా అవసరమని గుర్తుంచుకోవాలి.

Posted on 21-08-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning