గేట్‌ స్కోరుకు పక్కా వ్యూహం!

ఉన్నత విద్యాభ్యాసానికీ, ఉద్యోగ సాధనకూ ఉపకరించే పోటీ పరీక్ష ‘గేట్‌’ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌). దీని ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబరు 1 నుంచి ఆరంభమైంది. ఫిబ్రవరి 2018లో నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థులు పకడ్బందీ వ్యూహం అనుసరిస్తే మంచి స్కోరు సాధించవచ్చు!

విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానానికి సూచిక లాంటిది ‘గేట్‌’ ఉత్తీర్ణత. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖల తరఫున ఐఐఎస్‌సీ (బెంగళూరు), ఏడు ఐఐటీల సంయుక్త ఆధ్వర్యంలో ఏటా గేట్‌ను నిర్వహిస్తుంటారు. ఈసారి ఐఐటీ గువాహటి నిర్వహిస్తోంది. ప్రశ్నపత్రం ఐఐటీల పేరు ప్రతిష్ఠలకు అనుగుణమైన స్థాయిలోనే ఉంటుంది. అందుకని ఈ పరీక్ష రాయదల్చుకున్న ప్రతి విద్యార్థీ ప్రణాళికాబద్ధంగా శ్రమించాల్సిందే!
ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఐటీలతో పాటు ఐఐఎస్‌సీ (బెంగళూరు), వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్‌/ఫార్మసీ విభాగాల్లో ఉన్నత విద్యాప్రవేశాలకు గేట్‌ స్కోరు తప్పనిసరి. కొన్ని ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు గేట్‌ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటారు. దీంతో గేట్‌ ప్రాముఖ్యం పెరిగింది.
గ్రూప్‌-ఏ స్థాయి పోస్టులైన సీనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఎస్‌ఎఫ్‌ఓ (టెలి), సీనియర్‌ రిసర్చ్‌ ఆఫీసర్‌ ఎస్‌ఆర్‌ఓ (క్రిప్టో), ఎస్‌ఆర్‌ఓ (ఎస్‌ అండ్‌ టీ) నియామకాలకు కూడా గేట్‌ స్కోరును ఆధారంగా తీసుకుంటున్నారు.
గేట్‌-2018ను మనదేశంలోనే కాకుండా బంగ్లాదేశ్‌, ఇథియోపియా, నేపాల్‌, సింగపూర్‌, శ్రీలంక, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌లలో కూడా నిర్వహిస్తున్నారు. ఈ దేశాల్లో పరీక్ష రాసే అభ్యర్థులు ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా సంబంధిత సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ పూర్తయి/చివరి సంవత్సరం చదువుతూవుండాలి.
ఆన్‌లైన్లో ఈ పరీక్షను 23 పేపర్లలో నిర్వహిస్తారు. అభ్యర్థి ఏదో ఒక పేపర్‌ను మాత్రమే ఎంచుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ
ఐఐఎస్‌సీ, ఏడు ఐఐటీల్లో ఏదో ఒక గేట్‌ జోనల్‌ వెబ్‌సైట్‌లోని గేట్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ (GOAPS) ఉపయోగించి దరఖాస్తు ఆన్‌లైన్లో నింపి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. వెబ్‌సైట్‌ లింకు: www.gate.iitg.ac.in
ముందుగా సరైన ఈ-మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌, GOAPS పాస్‌వర్డ్‌ ఇచ్చి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఒక ఈ-మెయిల్‌ ఐడీ ద్వారా ఒక అభ్యర్థి మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి వీలుంటుంది. గేటü కార్యాలయం నుంచి తదుపరి సమాచారం అంతా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఈ-మెయిల్‌కు పంపుతుంటారు.
దరఖాస్తులో ఎలాంటి తప్పిదాలూ లేకుండా చూసుకోవాలి. లేకపోతే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంది. అభ్యర్థులు తమ ఫొటో, సంతకం, సంబంధిత సర్టిఫికెట్లను (పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో) దరఖాస్తుతో పాటు తప్పకుండా అప్‌లోడ్‌ చేయాలి. ఆఫ్‌లైన్లో దరఖాస్తు పత్రం, సర్టిఫికెట్లను జోనల్‌ గేట్‌ కార్యాలయాలకు పంపాల్సిన అవసరం లేదు.
అడ్మిట్‌ కార్డును జోనల్‌ గేట్‌ వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సివుంటుంది. పోస్టు ద్వారా దీన్ని పంపించరు. పరీక్ష కేంద్రానికి అడ్మిట్‌ కార్డుతో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి.
పరీక్ష రుసుము
* స్త్రీలు, ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీలకు: రూ.750 * పురుషులకు (జనరల్‌, ఓబీసీ): రూ.1500. * విదేశాల్లో గేట్‌ రాయటానికి: అడిస్‌ అబాబా, కొలంబో, ఢాకా, ఖాట్మండు: 50 యుఎస్‌ డాలర్లు; దుబాయి, సింగపూర్‌: రూ.100 యుఎస్‌ డాలర్లు. * పరీక్ష రుసుమును నెట్‌ బ్యాంకింగ్‌/డెబిట్‌ కార్డు/ఈ-చలానా ద్వారా ఆన్‌లైన్లో మాత్రమే చెల్లించాలి.
విద్యార్హతలు
* ఆఖరి సంవత్సరం ఇంజినీరింగ్‌/, బీఆర్క్‌ చదువుతున్నవారూ, పూర్తయినవారూ అర్హులు. ఇంజినీరింగ్‌ మూడో ఏడాది విద్యార్థులు అనర్హులు.
* ఎంఎస్‌సీ/ ఎంసీఏ వీటికి సమానమైన కోర్సులు పూర్తయినవారూ, చివరి సంవత్సరం చదివేవారూ అర్హులు.
* ఇంజినీరింగ్‌ పూర్తయినవారు డిగ్రీ సర్టిఫికెట్‌/ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌తో దరఖాస్తు చేయాలి. కోర్సు చదువుతున్న విద్యార్థులకు ప్రిన్సిపల్‌ నుంచి పొందిన అనుమతి పత్రం సరిపోతుంది.
గమనించండి..
ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణ గడువు: అక్టోబరు 5, 2017
పరీక్ష కేంద్రం మార్చుకోవడానికి గడువు: నవంబరు 17, 2017
ఆన్‌లైన్లో అడ్మిట్‌ కార్డు ప్రింట్‌ తీసుకోవడానికి: జనవరి 5, 2018
గేట్‌-2018 తేదీలు: 3,4,10,11 ఫిబ్రవరి 2018
పరీక్షా ఫలితాల వెల్లడి: మార్చి 17, 2018
అన్నీ ముఖ్యమే!
* గేట్‌ స్కోరు పీజీ ప్రవేశానికి 3 సంవత్సరాలు, పీఎస్‌యూలకు 1 లేదా 2 సంవత్సరాలు చెల్లుబాటులో ఉంటుంది. * పూర్తి వివరాలు, సిలబస్‌లను గేట్‌ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. * ఆన్‌లైన్‌ పరీక్ష విధానంలో కంప్యూటర్‌ మౌస్‌ను ఉపయోగించి సరైన ఆప్షన్‌ గుర్తించాలి. * న్యూమరికల్‌ ప్రశ్నలకు ఆప్షన్లు ఇవ్వరు. ఈ ప్రశ్నలకు సమాధానాలు వర్చువల్‌ కీ బోర్డును ఉపయోగించి రాయాలి.
* ఆన్‌లైన్లో నిర్వహించడం వల్ల ప్రశ్నపత్రాలను వివిధ సెట్లుగా రూపకల్పన చేస్తున్నారు. కాబట్టి అధ్యాయాలతో సహా అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయకుండా అన్నిటిలో ప్రతి అధ్యాయాన్నీ చదవాలి.
వర్చువల్‌ కాల్‌క్యులేటర్‌
పరీక్ష కేంద్రంలోకి కాల్‌క్యులేటర్‌, మొబైల్స్‌ను అనుమతించరు. అభ్యర్థులకు ఆన్‌లైన్‌ వర్చువల్‌ కాల్‌క్యులేటర్‌ను అందుబాటులో ఉంచుతారు. కంప్యూటర్‌ మౌస్‌ను ఉపయోగించి ఈ కాల్‌క్యులేటర్‌ను వాడుకోవచ్చు. దీనిలో అన్నిరకాల ఫంక్షన్లు లేకపోవడం వల్ల దీనికి అనుగుణంగానే ప్రశ్నలు రూపొందించవచ్చు. ఇమాజినరీ ఫంక్షన్లు, హయ్యర్‌ ఆర్డర్‌ సమీకరణాలకు సంబంధించిన ప్రశ్నలు అడక్కపోవచ్చు.
గమనిక: న్యూమరికల్‌ సమాధాన ప్రశ్నలకు సమాధానాలు దగ్గర స్థాయిలో ఇవ్వవచ్చు. ఉదాహరణకు- సరైన సమాధానం 18.44 అనుకుందాం. 18.43 నుంచి 18.45 మధ్యలో సమాధానం రాసినా స్వీకరించి మార్కులు ఇస్తారు.
న్యూమరికల్‌ ప్రశ్నల ప్రాధాన్యం
గేట్‌-2017 ప్రశ్నపత్రాల ప్రకారం ...
* ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌: 43/100
* కంప్యూటర్‌ సైన్స్‌: 33/100
* మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 48/100
* ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: 38/100
* సివిల్‌ ఇంజినీరింగ్‌: 38/100
* ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌: 52/100
* ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌: 38/100
స్కోరు సాధిస్తే..?
ప్రత్యక్ష ఉపయోగాలు
* గేట్‌ స్కోరుతో మనదేశంలోని అన్ని ఉన్నతవిద్యాసంస్థల్లో పీజీ కోర్సులో ప్రవేశంతోపాటు నెలకు రూ.12,400 ఉపకార వేతనం కూడా లభిస్తుంది.
* ఈ స్కోరు పీహెచ్‌డీ ప్రవేశాలకూ ఉపయోగకరం. పైగా నెలకు రూ.28,000 ఉపకార వేతనం కూడా లభిస్తుంది.
* ఐఐఎస్‌సీ, ఐఐటీల్లో పీహెచ్‌డీ ప్రవేశం పొందినవారికి ఐదేళ్ళ పాటు నెలకు రూ.70,000 ఉపకారవేతనం అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
* ముంబయిలోని ఎన్‌ఐటీఐఈలో పీజీ డిప్లొమాల్లో ప్రవేశానికి ఈ స్కోరు ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రాంగణ నియామకాల్లో ఏటా సుమారు రూ.15.83 లక్షల జీతభత్యాలు లభ్యమవుతున్నాయి.
* గేట్‌ స్కోరు ఆధారంగా వివిధ ఐఐఎంలలో ఫెలో ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్స్‌ ఇస్తున్నారు.
* బాబా అటామిక్‌ రిసర్చ్‌ సెంటర్‌, డీఆర్‌డీఓ లాంటి పరిశోధన సంస్థలు కూడా తమ సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు గేట్‌ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.
* సింగపూర్‌లోని నాన్‌ యంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ ; జర్మనీలోని RWTH AACHEN, టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిచ్‌లు గేట్‌ స్కోరు ఆధారంగా ఎంఎస్‌, పీహెచ్‌డీ ప్రోగ్రాం అందిస్తున్నాయి.
పరోక్ష ఉపయోగాలు
* ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ స్టేజి-1 టెక్నికల్‌ పేపర్‌కు గేట్‌ సన్నద్ధత దృఢమైన పునాదిగా పనికొస్తుంది.
* ఇతర పోటీ పరీక్షల సన్నద్ధత సులభమవుతుంది.
* ప్రాంగణ నియామకాలకూ, ఇతర ప్రైవేటు సంస్థలు నిర్వహించే ఇంటర్వ్యూలకూ కూడా ఉపయోగకరం.
1.గేట్‌ సన్నద్ధతలో మొదటి అడుగు ఎలా ఉండాలి?
గేట్‌ సిలబస్‌ను వీలైనన్నిసార్లు పరిశీలించి, వివిధ అంశాలను అర్థం చేసుకోవాలి. గత మూడు సంవత్సరాల ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ఎలాంటి ప్రశ్నలు ఏ సబ్జెక్టుల నుంచి వస్తున్నాయో అవగతం చేసుకోవాలి. తమ స్థాయిని బట్టి కోచింగ్‌ లేదా సొంత తయారీలలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. సీనియర్లను లేదా విషయ పరిజ్ఞానం ఉన్నవారిని సంప్రదించి సమగ్రమైన మాదిరి ప్రశ్నపత్రాలను (మాక్‌ టెస్టులు) అందించే శిక్షణ సంస్థలను ఎంచుకోవాలి.
2.ఇప్పుడున్న ఐదు నెలల కాలంలో గేట్‌-2018లో ఉత్తమ ర్యాంకును సాధించగలరా?
తగిన ప్రణాళికను రూపొందించుకుని సక్రమంగా అమలు చేస్తే ఇది సాధ్యమే. ప్రణాళికలో మొదట గేటü సిలబస్‌ను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇందువల్ల వివిధ సబ్జెక్టులు- అంశాల్లో తన బలాలు, బలహీనతలు తెలుస్తాయి. ప్రాథమిక అంశాలను పునశ్చరణ (రివిజన్‌) చేశాక గత 20 ఏళ్ళ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీనివల్ల ఏయే అంశాల్లో ఎలాంటి ప్రశ్నలు పరీక్షలో అడుగుతున్నారో అవగాహన ఏర్పడుతుంది.
ప్రామాణిక పాఠ్యపుస్తకాలు లేదా కోచింగ్‌ మెటీరియల్‌ను ఉపయోగించి గేట్‌ పరంగా ముఖ్యమైన సబ్జెక్టుల్లో వీలైనన్ని న్యూమరికల్‌ ప్రశ్నలు సాధన చేయాలి. అలాగే ప్రాథమిక అంశాలను వీలైనన్నిసార్లు పునశ్చరణ చేసుకోవాలి. ఈ ఐదు నెలల వ్యవదిలో వీలైనన్ని ప్రశ్నలను సాధన చేయటానికి ఆన్‌లైన్‌ టెస్ట్‌ సిరీస్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.
రెండు విభాగాలు
గేట్‌ ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి.
విభాగం-1: జనరల్‌ ఆప్టిట్యూడ్‌: ఇందులో 10 ప్రశ్నలుంటాయి.
* 1- 5 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 1 మార్కు * 6- 10 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు.
ఈ విభాగంలోని 4 నుంచి 5 ప్రశ్నలు ఇంగ్లిష్‌ సంబంధితం (వెర్బల్‌ ఎబిలిటీ). మిగతా ప్రశ్నలు క్వాంటిటేటివ్‌కు సంబంధించినవి ఇవ్వొచ్చు.
విభాగం-2: (సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు): దీనిలో 55 ప్రశ్నలుంటాయి.
* 1-25 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు * 26-55 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు.
రుణాత్మక మార్కులతో జాగ్రత్త
గేట్‌లో ఒక తప్పు జవాబుకు 33.33 శాతం రుణాత్మక మార్కులుంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కులవాటికి 2/3 చొప్పున మార్కులు తగ్గిస్తారు. న్యూమరికల్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉండవు.
ప్రశ్నల సరళి
పరీక్షలో ప్రశ్నలు ఎలా ఉండాలో, ఏ సబ్జెక్టుకు ఎంత ప్రాధాన్యం ఉండాలో ఐఐటీల కోర్‌ కమిటీ నిర్ణయిస్తుంది.
గణితం: 10 నుంచి 15 శాతం మార్కులు. అయితే ఈ విభాగంలోని ప్రశ్నలు శుద్ధ గణితంలా ఉండవు. ఇంజినీరింగ్‌ అప్లికేషన్‌తో ఉంటాయి.
ముఖ్యమైన సూచన ఏమిటంటే... ప్రశ్నలు ఆయా రంగాల్లోని నూతన ఆవిష్కరణలను దృష్టిలో పెట్టుకుని ఉంటాయి. ఉదా: ఎలక్ట్రికల్‌ పేపర్లో పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ పేపర్లో డిజిటల్‌ కమ్యూనికేషన్‌, వీఎల్‌ఎస్‌ఐ విభాగాల్లో నిత్యం మార్పులు జరుగుతున్నాయి.
* ప్రతి పేపర్లో పదికి మించిన సబ్జెక్టులు. కానీ మొత్తం ప్రశ్నలు 65. ఏ సబ్జెక్టుకు ఎన్ని ప్రశ్నలు అనేది ఐఐటీలకు సవాలుగా మారింది. కాబట్టి ఐఐటీల ప్రొఫెసర్లు రెండు మూడు సబ్జెక్టుల విషయాలను కలిపి ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రతి పేపర్లో వివిధ సబ్జెక్టులను మిళితం చేస్తూ ప్రశ్నలు ఇస్తున్నారు.
విజయం సాధించాలంటే..
గేట్‌- 2018కు ఇంకా ఐదు నెలల కాలవ్యవధే ఉంది. ఇప్పటి నుంచి రోజూ కనీసం 8-10 గంటలు సాధనకు కేటాయించాలి. ప్రతి వారాంతం, నెలకోసారి చదివిన అంశాలను విశ్లేషించుకోవాలి. సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం.
* తొలిసారి సిద్ధమయ్యేటపుడు ప్రతి అధ్యాయానికీ సంబంధించిన ముఖ్య విషయాలను చిన్నచిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారుచేసుకోవాలి. పరీక్షకు ముందురోజుల్లో పునశ్చరణకు ఇది చాలా ఉపయోగం.
* ప్రామాణిక పాఠ్యపుస్తకాలను ఎంచుకోవడం ప్రధానం. అందుబాటులో ఉన్న సమయంలో ఏ అంశాలను చదివితే ఎక్కువ మార్కులు వస్తాయో నిర్ణయించుకోవాలి.
* గత ప్రశ్నపత్రాలనూ, ఆన్‌లైన్‌ నమూనా పేపర్లనూ తప్పనిసరిగా సాధన చేయాలి.
* ఇంజినీరింగ్‌, సివిల్‌ సర్వీసెస్‌ గత ప్రశ్నపత్రాల అధ్యయనం చాలా ప్రయోజనకరం. దీనివల్ల ఒక అంశాన్ని ఎన్ని విధాలుగా అడగటానికి అవకాశం ఉంటుందో తెలుస్తుంది.
* పరీక్షలో ప్రతి ప్రశ్నకూ సమాధానం రాయడం కష్టం. అందుకే మూడు గంటల వ్యవధిలో ఎన్ని ప్రశ్నలు, ఏ ప్రశ్నలు రాస్తే ఎక్కువ మార్కులు సాధించగలమనేది నిర్ణయించుకోవాలి.

Posted on 04-09-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning